1972లో Andhra agitation వచ్చింది. ఎక్కడికీ కదిలే పరిస్థితి లేదు. 1973లో మాతృశ్రీ స్వర్ణోత్సవాల గురించి తెలిసింది. BGK శాస్త్రిగారు, గాత్రం కోటేశ్వరరావుగారు, తాడంకి రామదాసుగారు మొదలగు సోదరులం కలిసి ‘లక్షమందికి ఒకే పంక్తిలో భోజనం పెడతారట, మనకి చేతనైనది చేద్దాం’ అనుకున్నాం. అసలు ఇది ఎలా సంభవమో చూడాలని జిల్లెళ్ళమూడి చేరుకున్నాను. జిల్లెళ్ళమూడిలో అద్భుతమైన ఏర్పాట్లు – అన్నం, పులిహోర, సాంబారు, పెరుగు ఆహారపు రాశుల్ని చూసి నాకు మహదానందం కలిగింది. ఉదయం 10 గం.లకి భోజన పందిళ్ళన్నీ ఖాళీగానే ఉన్నాయి. గంట వ్యవధిలో పందిళ్ళు అన్ని నిండిపోయాయి. ఉ॥గం. 11.30లకి జీపులో అమ్మ వచ్చింది. ఒక పందిరిలో నేను వడ్డన చేస్తున్నాను. అమ్మ జీపు నేరుగా వచ్చి అక్కడ ఆగింది. నేను నీటి జగ్ క్రింద పెట్టి అమ్మకు నమస్కరించుకున్నా. అమ్మ నావైపు చూసింది. అమ్మ వదనమండలం ఊదారంగులో దీపిస్తోంది. ఆమె ఉజ్జ్వలమైన ఆధ్యాత్మిక ఉన్నతి పొందినదని అర్థమైంది. ఆ క్షణం నుంచి అమ్మకి నేను కింకరుణ్ణి అయ్యాను.
తర్వాత చాల సందర్భాల్లో జిల్లెళ్ళమూడి వచ్చాను. ఒకసారి అమ్మ దర్శనం ఇస్తోంది. నేను కన్ను ఆర్పకుండా అమ్మ వైపే చూస్తున్నాను. ‘అమ్మకు పూజ చేసుకోండి’ అన్నారు కొండముది రామకృష్ణ. అది నా అదృష్టం. భోజనాలు అయిన తర్వాత మేమంతా మళ్ళీ అమ్మ సన్నిధిలో కూర్చున్నాం. ‘అమ్మా! నిన్ను కాకినాడ రమ్మని ఆహ్వానించటానికి వచ్చామమ్మా’ అన్నారు మాతో ఉన్న గాత్రం కోటేశ్వరరావుగారు. అమ్మ, “నాన్నా! నేనే కబురు చేసి వద్దామనుకుంటున్నాను” అన్నది. మాకు మహదానందం కలిగింది. ఆ రాత్రి ఆరు బయట మంచం మీద అమ్మ కూర్చున్నది. మాలో ఒకరైన చోడిశెట్టి వీరభద్రరావుగారు సాధారణ కెమెరాతో ఫోటోలు తీస్తున్నారు. అక్కడే ఉన్న సోదరుడు లాలా (శ్రీ లక్కరాజు సత్యనారాయణ) ‘అమ్మా! వెలుతురు లేకుండా మామూలు కెమెరాతో ఫోటోలు వస్తాయా?’ అని అడిగాడు. అందుకు అమ్మ నవ్వుతూ “కావాలా?” అన్నది. కానీ, ఆరోజు ఆయన తీసిన ఫోటోలు అద్భుతంగా వచ్చాయి.
‘అమ్మా! నేను మాండుక్యం మీద కొంత కృషి చేశాను. దీనిని నువ్వు స్పృశిస్తే ప్రచురించాలనుకుంటున్నాను’ అని ఆ నా వ్రాతప్రతిని అమ్మ చేతిలో ఉంచాను. అమ్మ ఆ పుస్తకం తెరచి ఉపోద్ఘాతంలో కొన్ని వాక్యాలు చదివింది. “నాన్నా! దీంట్లో వారి వారి అభిప్రాయాల్ని చెప్పావు. నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగింది. ‘నువ్వే చెప్పాలమ్మా’ అన్నాను. “నాన్నా! గంజాయి మొక్క ఉంది, తులసి మొక్క ఉంది. ఈ రెండూ వేరంటావా?” అని అడిగింది. దాంతో నాకు అర్ధమై ‘అంతా ఆత్మేనమ్మా’ అన్నాను. మాండూక్యం చెప్పేది అదే అదే దీంట్లో వ్రాశావా, నాన్నా?” అన్నది. ‘అవునమ్మా’ అన్నాను. తర్వాత ఆ గ్రంథాన్ని అమ్మకే అంకితం ఇచ్చి అచ్చువేయించా.
0 Comments