Rajupalepu Venkata Seshagirirao

Interviewed by
Ravuri Prasad
12/03/2012
Hyderabad

 

శ్రీ రాజుపాలెపు వెంకట శేషగిరిరావు

  ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రామంలో 08-11-1942 న వీరు జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ రాజుపాలెపు రామచంద్రరావు, శ్రీమతి సీతారత్నం. భార్య శ్రీమతి పద్మావతి. సంతానం- ఇద్దరు మగపిల్లలు. విద్య M.A.B.Ed; ఉద్యోగం-Professer in English. 07-06-2015 తేదీన పరాత్పరి అమ్మలో ఐక్యం అయినారు.

సేవాతత్పరత: బాల్యంలోనే అమ్మ సన్నిధి చేరి పుష్కలంగా దివ్య మాతృ ప్రేమని పొందారు. వీరి హృదయంలో అమ్మ సుప్రతిష్ఠిత అయింది. వీరికి అమ్మ 3 సార్లు ప్రాణదానం చేసింది. అమ్మ ప్రేమతో పాటు హైమక్క ప్రేమను పొందిన ధన్యులు. ‘రాగబంధం’ అనే స్వీయరచనలో అమ్మ మహనీయ తత్త్వాన్ని ఆవిష్కరించారు. తండ్రి రామచంద్రరావు గారి డైరీలలోని అమ్మ అలౌకిక మహిమాన్విత సంఘటనలు భావితరాలకై వీరు భద్రపరిచారు. అందులో కొన్ని ఇప్పటికే ప్రచురించబడ్డాయి.

శ్రీ రావూరి ప్రసాద్ చేసిన 12-3-2012 న హైదరాబాద్లో శ్రీ రాజుపాలెపు వెంకట శేషగిరిరావుగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

ముందుగా మీ కుటుంబ నేపధ్యాన్ని తెలుపుతూ మీ తల్లిదండ్రులు అమ్మని దర్శించిన సందర్భం వివరించండి.

1956లో మా తల్లిదండ్రులు జిల్లెళ్ళమూడి వచ్చారు. మా మాతామహలు శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావుగారు వేటపాలెంలో ‘సారస్వత నికేతనం’ అనే ప్రసిద్ధమైన గ్రంధాలయాన్ని స్థాపించారు. వారు అమ్మతో ‘అమ్మా! నేనే సాధనా చేయలేదమ్మా’ అంటే; “నాన్నా! నీకు ఏ సాధన అక్కరలేదు, నువ్వు కర్మయోగివి” అన్నది. మా అమ్మమ్మ శ్రీమతి లక్ష్మమ్మ ఎక్కడెక్కడి నుంచి గ్రంథాలయానికి వచ్చిన వారందరికీ ఏళ్ళ తరబడి సాదరంగా ఆతిధ్యం ఇచ్చేది; అన్నపూర్ణ వలె ఉండేది. ఆమె అమ్మను చూసినపుడు ‘బ్రోచేవారెవరురా’ అనే కీర్తన పాడింది. 1940లో డా॥ రంగారావు గారి వద్ద వైద్యం నిమిత్తం అమ్మ వేటపాలెం వచ్చి మా ఇంటికి వచ్చింది; తులసి కోట దగ్గర కూర్చొని పసుపు, కుంకుమలు తీసుకున్నది. ఆనాడే మా వారంతా అమ్మను దైవంగా భావించారు.

మొదట మీరెప్పుడు అమ్మని దర్శించారు? ఆనాటి మీ జ్ఞాపకాలు పంచుకోండి.

1958లో మా తల్లిదండ్రులు నన్ను, మా తమ్ముని జిల్లెళ్ళమూడి తీసుకువచ్చారు. అక్కడ గాఢమైన ప్రేమను పొందాం. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళం. 1970లో నా వివాహం జరిగింది. నాకు గ్రంధ పఠనంలో ఆసక్తి ఎక్కువ. మనస్సుకు తోచిన ఊహలు మాటలుగా వ్రాసి ‘గడ్డిపూలు’ అనే పేరుతో అమ్మకి పంపించాను. అమ్మ దానినే ‘రాగబంధం’ అన్నది. నేను ఆ గ్రంధాన్ని వ్రాయటానికి ప్రేరణ అమ్మ ఇచ్చినదే.

అమ్మ సన్నిధిలో మాట్లాడకుండా కూర్చోవటమే నాకు ఇష్టం, అలవాటు. అమ్మ మంచం మీద పడుకునేది. మేమంతా నేలపై- మట్టిగడ్డల్లో- తల అమ్మ మంచం వైపు పెట్టి కాళ్ళు చాచుకుని పడుకునేవాళ్ళం. అమ్మ కేంద్రం సూర్యుడు – మేమంతా సూర్యకిరణాల వలె. అమ్మనడిగితే సమాధానం వెంటనే చెప్పేది. ‘అత్రి’ అంటే ఎవరు?’ అని అడిగాను. “గుణాలకు అతీతుడు అత్రి” అన్నది. ‘హృదయం ఎక్కడుంటుంది ?’ అని అడిగితే “నాన్నా! హృదయం మోకాలులో ఉంది అంటాను. కాదంటారా? హృదయం స్పందనకు చిహ్నము, స్పందన శరీరమంతా ఉంటుంది కదా!” అన్నది. పోతనగారి పద్యాల ప్రసక్తి వచ్చినప్పుడు ‘అన్య స్త్రీలు ఎదురైనప్పుడు మాతృభావన చేసి మరులువాడు’ అనే సందర్భంలో “కాదు, నాన్నా! వేరే ఇంకొక భావం వస్తే కదా మాతృభావన చేయటానికి. అక్కడ సహజంగా ఉండేదే మాతృభావన” అన్నది.

'అమ్మే' మిమ్మల్ని కాపాడింది - అనుకొన్న అనుభవాలేమైనా వున్నవా?

1960లో నాకు, మా అమ్మగార్కి ఒకేసారి మశూచి సోకింది. స్పృహ తెలియకుండా వేర్వేరు గదుల్లో పడుకొని ఉన్నాం. నాకు గొంతు మీద ఇంకా కొన్ని చోట్ల పొక్కులు లేచాయి; బ్రతకటం కష్టం అన్నారు వైద్యులు. మా నాన్నగారు మా ముందు ధైర్యంగా ఉన్నా చాటున బాధపడేవారు. చిత్రంగా ఒకనాడు అక్కడ జిల్లెళ్ళమూడిలో అమ్మ గదిలో విపరీతంగా Small pox దుర్వాసన వచ్చిందిట. ఎవరూ కూర్చోలేక పోయారు. మర్నాటి ఉదయానికి మా శరీరం మీది పొక్కులు అన్నీ మాడిపోయి, బ్రతికాం. ఆ సమయంలో ‘హైమ’ అమ్మతో ‘అన్నయ్యను బ్రతికించు’ అని ప్రార్థించిందిట.

అమ్మ ప్రమేయంతో జరిగిన మీ కుటుంబ మంచీ చెడూ కార్యక్రమాలు ఏమిటి?

మా రెండవ కుమారుడు రహికిరణ్ అన్నప్రాసన అమ్మ చేసింది. మా నాన్నగారు 1980లో వేటపాలెంలో తెల్లవారుఝామున పరమపదించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో రామకృష్ణ అన్నయ్యతో అమ్మ మంచిగంధం చెక్కలు దహన సంస్కారానికి పంపింది. జిల్లెళ్ళమూడి ఎవరు తెలియపరిచారో తెలియదు; నాకు అది ఆశ్చర్యకరం.

మీరు అమ్మతో ఆటలు ఆడారా ? ఆటలందు అమ్మకి గల ఆసక్తి ఆనందాలు ఎలాంటివి?

నేను అమ్మతో Carroms, table tennis, వైకుంఠపాళీ ఆడాను. వైకుంఠపాళీ అమ్మ, నేను, హైమ, మా నాన్నగారు కలిసి ఆడాం. అమ్మ నేరుగా వెళ్ళి పరమపదంలో తన స్వస్థలంలో కూర్చున్నది. తర్వాత హైమ, మా నాన్నగారు చేరుకున్నారు. ‘అన్నయ్యని కూడా పండించమ్మా’ అని అమ్మతో హైమ అంటూండేది. నేను పండలేదు. S.V. జోగారావుగారి ‘నేను కోరని ముక్తిని నాకిచ్చి ఎందుకు లేనిపోని నష్టానికి గురి అవుతావు’ పద్యం నా మనస్సులో మెదిలేది. అమ్మ “లడ్డుకావడంలో ఏమీ తియ్యదనం లేదు, నాన్నా! లడ్డు తినడంలో తియ్యదనం ఉంది” అనేది. అమ్మను చూస్తూండటంలో ఆనందం ఉంది కానీ, అమ్మలో ఐక్యమైపోతే అందులో ఏమి ఆనందముంది? నా గుండెకు అమ్మ తన పాదాన్ని తాకించి పడుకునేది. ‘అమ్మా! ఆ పాదాలు నా గుండె లోపలికి పొయ్యేట్టు చెయ్యమ్మా!’ అని కోరుకోలేకపోయాను. అప్పటికి అదే చాలుననుకున్నాను. అదే ఆటంకంగా నిలిచింది నేడు. పెద్దపెద్ద ఆటగాళ్ళతో Ball badminton పోటీలు ఆడించి, ఆనందించి, తర్వాత వాళ్ళందరికీ కొత్తబట్టలు పెట్టి ఆశీ:పూర్వకంగా పూలు చల్లి వాళ్ళ ఆనందంలో తానూ పాలు పంచుకునేది అమ్మ.

ఒకసారి అమ్మ సముద్రస్నానానికి చీరాల వెళ్ళింది. అక్కడ బెస్తవాళ్ళు అమ్మను ఎత్తుకుని, తమ చేతుల మీద పెట్టుకుని భుజాలమీద పెట్టుకొని కేరింతలు కొడుతూ స్నానం చేయిస్తూ ఆనందించారు. వాళ్ళతో అమ్మా ఆనందించేది. అమ్మ ఆనందం మనకీ ఆనందం.

హైమక్కతో గల మీ జ్ఞాపకాలు మాతో పంచుకోండి. విశ్వజనీనతను చాటిన అమ్మ హైమక్కయ్యనే దేవతగా ఎందుకు గుడిలో ప్రతిష్ఠించింది? హైమక్క ఆలయ ప్రవేశానంతరం మీకు గల అనుభవాలేమిటి?

నాకు అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. నేనూ, మా తమ్ముడు. ‘అన్నయ్యా!’ అని హైమ నన్ను పిలిచినప్పుడు ఆ స్పందన నా మీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. అప్పటి నుంచి హైమ ప్రేమను పూర్తిగా నేను నా జీవితంలో పొందాను. హైమ శరీరత్యాగం చేశాక అమ్మ, “నాన్నా! శేషూ! నేను నీలోనే ఉన్నాను. హైమను నీలో చూసుకుంటున్నాను” అన్నది. హైమ నన్ను అన్నవలె ఎక్కిరాల భరద్వాజను బిడ్డవలె చూసుకునేది. హైమ స్వభావం ఎంతో మృదువైనది; కుసుమం కంటె కోమలమైనది. ఒక బల్లిగుడ్డు క్రిందపడి పగిలినా, ఒక పూవు నలిగినా, బాధపడేది. హైమ గొంతులో రాజుబావ పాటలు వినే అదృష్టం నాకు దక్కింది; ఉదా: ‘ నీ నిర్మల నీ నిశ్చల విశాల హృదయంలో” అనే పాట. ఈ రోజుకి కూడా హైవం పాడినట్లు ఎవరూ పాడలేరు. చేతులూ, చేతివ్రేళ్ళూ నాజూకుగా, తన స్వభావానికి తగ్గట్టుగా సన్నగా పొడవుగా ఉండేవి.

హైమ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత విగ్రహ శిల్పి జయరాం దగ్గరకు నేను, భరద్వాజ వెళ్ళాం. హైమను భూగృహంలో అమ్మ ప్రతిష్ఠించినప్పుడు అక్కడ నేను, భరద్వాజ ఉన్నాం ఆ ప్రక్కన గోవిందరాజుల దత్తుగారు, అచ్యుతుని రామకృష్ణ శర్మగారు తదితరులు ఉన్నారు.

హైమ నాకు ఎంతో ప్రీతిపాత్రమైన చెల్లెలు. “జిల్లెళ్ళమూడిలో నేడు ఈ వేడుక జరుగుతోంది. అమ్మను ఉయ్యాల ఊపి, ఇప్పుడే వచ్చాను. కానీ ఏ వేడుక జరుగుతున్నా, ఏం చేస్తున్నా నువ్వులేవే ఇక్కడ – అమ్మను చూడటం లేదే అనే బాధ నన్ను వదిలి పెట్టడం లేదు. ఏం చేసేది, అన్నయ్యా ” అంటూ ప్రేమంగా నాకు ఉత్తరాలు వ్రాస్తూండేది. అదేవిధంగా ప్రేమను పంచిన ప్రేమమూర్తి, కారుణ్యమూర్తి హైమ. బ్రహ్మాండం రవి ‘హైమ’ను ‘చిన్మాత’ అనీ ‘చిన్నమ్మ’ అనీ ఎగతాళి చేస్తూండేవాడు. నువ్వు కూడా అమ్మవు అవుతావేమోననే ధ్వని అందులో ఉంది. ‘అమ్మా! నన్ను నీలోకి తీసుకో’ అనే ఎడతెరిపిలేని ప్రార్థన హైమను అమ్మలోకి తీసికెళ్ళింది. ఆ ప్రార్థన ఎంత బలీయంగా ఉందంటే, తను తట్టుకోలేక అమ్మ హైమను తనలోకి తీసుకుంది.

ఎవరైనా అనుకోవచ్చు- అమ్మ తన కుమార్తె కనుక హైమను దేవతగా కూర్చోబెట్టిందేమో అని. హైమలో రెండు మూడు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. ఒకటి – అందరిపట్ల సమానమైన బలీయమైన ప్రేమ భావన, వాత్సల్యం; అది మనుష్యులా, పశువులా, పక్షులా, క్రిమికీటకాదులా అనే వ్యత్యాసం లేదు. అమ్మ చెప్పిన సర్వత్రా మమకారమే మాధవత్వం- ఒక్క హైమకే వర్తిస్తుంది. సర్వత్రా మమకారం, అవ్యాజమైన ప్రేమ హైమలో మూర్తీభవించిన గుణం.

రెండవది – భరద్వాజతో పరిచయమైన తర్వాత సాధనాపరంగా తాను ఏమీ చేసుకోలేకపోతున్నాననే భావన హైమ మనస్సులో మొదలైంది. భరద్వాజని ‘బాబూ!’ అని కన్నబిడ్డలా లాలించింది; పాలించింది. భరద్వాజ కూడా హైమని కన్నతల్లి లాగే భావించాడు. తన బాల్యంలో కోల్పోయిన తల్లిప్రేమను హైమ ద్వారా పొందాడు. తను చేసే సాధనలూ, చేయాల్సిన సాధనల గురించి హైమకి చెబుతూండేవాడు. అది విన్న హైమలో తాను ఏమీ సాధన చేయలేకపోతున్నాననే బాధ మొదలైంది; అమ్మతో కూడా చాలా సార్లు ప్రస్తావించింది- ‘నేనేం చేయలేకపోతున్నాను; ఎందుకూ పనికిరాకుండా ఎందుకిలా నన్ను సృష్టించావు?” అని. అందుకు “నా ఇష్టం” అన్నది అమ్మ; అదే విధంగా చివరలో “హైమను నేనే కన్నాను. నేనే పెంచాను, నేనే చంపుకున్నాను, నేనే దైవత్వమిచ్చాను” అంటూ తన సంకల్పాన్ని వివరించింది.

హైమ శరీర త్యాగానికి ముందు Small pox రావటం ఒక నెపం. ఆ కారణంగా రక్తం నీరుగా మారింది. గుంటూరు తీసుకువెళ్ళారు. మేము తట్టుకోలేము అనుకున్నదేమో అమ్మ- మేము బస్సులో వెళ్ళాం. అమ్మ, వాళ్ళంతా కారులో వెళ్ళారు. మేము వెళ్ళి తిరిగి వచ్చేలోగా అంతా అయిపోయి, అమ్మా, వాళ్ళూ తిరిగి వచ్చారు. అంతకుముందు హైమ మంచం మీద పడుకుని ‘అమ్మా! ఓ అమ్మా!’ అనే రెండు పదాలతో ఎడతెరిపి లేని అమ్మ ధ్యాసతో అమ్మ నామంతో గడిపింది. చివరలో కారులో వెళ్ళేటప్పుడు కూడా ‘అమ్మా! నువ్వు తప్ప నాకు ఇంకేమీ కనిపించటం లేదమ్మా!’ అంటూనే అమ్మలో లయమైంది.

మరి దైవత్వాన్ని అందరికీ ఎందుకు పంచలేదు? అంటే అందరిలో అంత గాఢమైన ఆవేదన ఉంటే అందరికీ ప్రసాదిస్తుంది అని నా విశ్వాసం. ఒకసారి స్నానఘట్టంలో వివేకానందుడు రామకృష్ణ పరమహంసను ‘దేవుని ఎప్పుడు చూపిస్తావు?’ అని అడిగితే పరమహంస వివేకానందుని తల నీటిలో అదిమిపెట్టి ఉంచాడు. కాసేపటికి వదిలి ‘ఎలా ఉంది?’ అన్నాడు. ‘ఊపిరి అందలేదు. ఏమైపోతానో అనిపించింది’ అన్నాడు వివేకానందుడు. ‘నువ్వు లేకపోతే నేనుండలేను’ అనే గాఢమైన ప్రేమ నీకు ఉంటే నీకు భగవద్దర్శనం తప్పక అవుతుంది. ఏనాటికీ అందరికీ సమాధానం అదేనేమో!

హైమ ఆలయప్రవేశం చేశాక నేను రాజమండ్రిలో ఒక వివాహానికి వెళ్ళాను. ఒకషాపులో 3D కృష్ణుని బొమ్మ ఒకటి Presentation కోసం తీసుకున్నాను. అది చాలా బాగుందని చేతుల్లోకి తీసుకున్నాను. ‘చాల బాగుందన్నయ్యా, ఇదే తీసుకో’ అని ప్రక్కన ముత్యాలహారం వేసుకున్న ఒక అమ్మాయి అన్నది; ఆ అమ్మాయి మాటలు హైమ మాటల వలె ఉన్నాయి. ‘సరే’ అని డబ్బిచ్చి దానిని తీసుకున్నాను. ‘అరే! ఆ అమ్మాయిది హైమ గొంతులాగ ఉంది’ అని ఆ షాపు ఉన్న వీధి అంతా వెదికాను. అదే చివరిసారి హైమ గొంతు వినటం. ఇప్పటికీ హైమ ఉందనే నా విశ్వాసం.

మీరు గమనించిన మహిమాన్వితమైన 'అమ్మ' చర్యల్ని మాతో పంచుకోండి.

దివ్య మాతృప్రేమను అందరికీ అమ్మ ఆయాచితంగా పంచింది. ఆవకాయ అన్నం పెట్టేది. అది సంపెంగ, రోజా పూల వాసనలు వచ్చేవి. వట్టి వేళ్ళవాసనతో తియ్యగా ఉండటం, వెంటనే కారంగా ఉండటం చూశాం. పళ్ళెంలో అందరికి అన్నం కలిపేది. ఒక్కొక్క ముద్ద వాసన, రుచి ఒక్కొక్క రకంగా ఉండేది. ఇది మహిమ అంటే అమ్మ ఒప్పుకునేది కాదు. అమ్మ బిడ్డ రవి బాల్యంలో ఒకసారి తమాషాగా ఒకరాయి తెచ్చి అమ్మకి ఇచ్చి ‘ఇదుగో, దీనికి వాసన తెప్పించగలవా?’ అని అడిగితే, అమ్మ ఆ రాతిని పట్టుకుంది. దానికీ సువాసనలు వచ్చాయి. మహిమలు చేయాలని అమ్మ ఎప్పుడూ ప్రయత్నించలేదు; సహజంగా అవి జరిగేవి.

జిల్లెళ్ళమూడిలో రవి వాళ్ళ గృహప్రవేశం సందర్భంగా నేను ఫోటోలు తీస్తున్నాను. అమ్మ చాల casual గా పొయ్యి మీద బాగా కుతకుత ఉడుకుతున్న పాయసం గిన్నెలో చెయ్యిపెట్టి శుభ్రంగా కలియబెట్టి, ఆ తర్వాత ఆ చేతిని బాగా కాలిపోతున్న ఆ ఇత్తడి గిన్నె అంచులకు వ్రాసి, ఉడికినట్టు చెప్పి, అందరికీ పెట్టడం చూశాను. అదే మనకైతే చెక్కులు ఊడిపోయేవి.

ఒకసారి అమ్మ శిరస్సుపై కాపడం పెడుతున్నారు. ఆ వేడికి వెంట్రుకలు చిటపటమంటున్నాయి. చర్మం మనకైతే కుతకుత ఉడికేదేమో! అమ్మ మాత్రం కసుగంద లేదు. ఇలాంటివి అనేకం జరిగాయి. ప్రస్తుతం అన్నపూర్ణాలయం ఉన్నచోట లోగడ పొలాలు ఉండేవి. అమ్మ అక్కడ మంచం మీద పడుకున్నది. మేమంతా మంచం చుట్టూ ఆ మట్టిగడ్డల్లోనే పడుకున్నాము. ఒక రాత్రివేళ మెలకువ వచ్చి చూశాను. మంచం మీద అమ్మ లేదు. నల్లమడవాగు (ఓంకారనది) వైపు ఎంతో దురాన ఉన్న అమ్మ కొన్ని సెకన్లలోనే మంచం దగ్గర దాకా వచ్చింది. ఆ తర్వాత ప్రస్తుతం ఆలయాలు ఉన్నవైపుకి వెళ్ళింది. అలా 1లేక 1/2 సెకన్ల కాలంలో అంత దూరాన్నించి రావటం అసాధ్యం. గాలిలో తేలిపోతున్నట్టు అమ్మ రావటం నేను చూశా ! అనేక అద్భుతాలు జరిగేవి. అవి అమ్మకి సర్వ సాధారణం; మనకి విశేషం – అద్భుతం.

ప్రకృతి శక్తుల మీద అమ్మకి అధికారం ఉన్నది అనటానికి అనేక ఉదాహరణలున్నాయి. ఆగమంటే వర్షం ఆగిపోయేది. ప్రచండ వాయువు వీస్తుంటే ఒక్క అమ్మ మాటతో అది మెల్లగా మారటం చూశాం. ఎంతో దూరాన మంటలు ఉంటే అమ్మ “పంచాగ్ని మధ్యాన ఉన్నట్టున్నది” అనేది.

ఒకసారి దక్షిణాది యాత్రలకి వెళ్ళాను. ఒకచోట ఒక అమ్మవారి విగ్రహం, కాళి, దుర్గ…. ఏదో.. అక్కడ ఆచారం ఏమిటంటే ఎవరైనా కోరికతో ఒక చిన్న వెన్నముద్దను అమ్మవారి వైపు విసిరితే అది ఆ విగ్రహానికి అతుక్కుంటే కోరిక నెరవేరుతుంది అని. ‘నాలోపలా బయటా నా అణువణువునా అమ్మను చూసే భాగ్యం నాకు కలగాలి’- అనే కోరికతో ఒక వెన్నముద్ద విసిరాను. అది అమ్మవారి మీదే కాదు, ఎటుపోయిందో ఎవరికీ తెలియదు, మాయమైంది. కానీ మా పిల్లల గురించి ఏవో కోరికలతో వెన్నముద్ద విసిరితే ఆమె స్వీకరించింది.

‘నీ కోరికకు అమ్మలగన్న అమ్మ Permission ఇవ్వాలి, నేనెవరు Sanction చేయటానికి?’ అన్నట్టుగా ఉంది ఈ సంఘటన. ఆ ముద్ద నేరుగా పోయిపోయి అమ్మనే చేరుకుందో! ఏమో!

అమ్మ కోపం ఎలా వుంటుంది?

అమ్మకోపం – ఎదుటివారిని దూషించే విధంగా ఉండేది కాదు. ‘ఇట్లా కాదు’ అన్నట్లుగా ఉండేది. అమ్మ కోపంగా మాట్లాడనక్కర్లేదు. నవరాత్రులలో పూజలు చేసేవాళ్ళం. కాసేపు అమ్మ వంక చూస్తే బాగానే ఉండేది; చాల సంతోషంగా ఉండేది. కాని ఒక్క క్షణం అమ్మ మన వైపు చూస్తే, ఎంతో కోపంగా చూస్తున్నట్టు ఆ తేజస్సును భరించలేమన్నట్టు భయపడి ఎవరికి వాళ్ళే తలదించుకునేవారు. ఎందుకూ అనేది తెలియదు. “ఇవాళ వద్దని చెప్పాను కదా!”, “ఇంత కారంగా ఉంటే వాడు తినలేడు” – అంతవరకే అమ్మ కోపం.

అమ్మ దుఃఖించటం చూచారా?

అనేక సందర్భాల్లో అమ్మ దుఃఖించటం చూశాను. “వాళ్ళ మంచితనమే, నన్ను ఏడిపిస్తుంది” అనేది అమ్మ. హైమ పోయినపుడే అమ్మ దుఃఖించిందనేకాదు; మంచివాడైనా చెడ్డవాడైనా బాధపడుతున్నాడంటే అమ్మ బాధ పడుతుండేది. బాధలనే పూజాద్రవ్యాలుగా భావించిన సహన దేవత అమ్మ.

అమ్మ భర్త (నాన్నగారు) గురించి తెల్పండి.

అమ్మ పతిదేవులు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు. నాన్నగారికి
ఆటలన్నా నాటకాలన్నా ఇష్టం. నాన్నగార్కి నాటకాలు వేసి చూపించాము. వారు Badminton ఆడేవారు. అనసూయేశ్వరాలయం పైన మూత బండలు వేసిన తర్వాత అమ్మ, నాన్నగారు ఆలయంపైన గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి పూలు పసుపు కుంకం వెదజల్లేవారు. ఆ సందర్భాల్లో నాన్నగారు అమ్మ పాదాల మీద పూలువేయటం నేను గమనించాను.

అమ్మ పెద్ద కుమారుడు సుబ్బారావు అన్నయ్యతో మీ అనుబంధం?

అమ్మ పెద్ద కుమారుడు సుబ్బారావు అన్నయ్య కొన్ని సంవత్సరాలు చీరాలలో మాఇంట్లోనే ఉండి SSLC పరీక్ష, PUC చదవటం జరిగింది. రవి చిన్న తరగతులు, హైస్కూల్ విద్యాభ్యాసం చీరాలలో జరిగింది. బామ్మగారితో సహా ఆకుటుంబంతో మాకు అనుబంధం ఉంది.

సుబ్బారావు అన్నయ్య పెళ్ళి సందర్భంగా ఒకే తాను లోంచి సుబ్బారావుకి, రవికి, నాకు, నా తమ్ముడికి 4 ప్యాంటుగుడ్డలు, 4 షర్టుగుడ్డలు తీయించి, కుట్టించింది అమ్మ. మా కుటుంబం అందరినీ ఒకే రకంగా చూచింది అమ్మ.

మీ తండ్రి కీ||శే|| రామచంద్రరావుగారికి అమ్మ పై వున్న విశ్వాసం గురించి తెలుపండి?

నా వివాహం సందర్భంలో మా తండ్రిగారు అమ్మకి ఫోటో చూపించారు. ‘నీ కోడలా!’ అని Green signal ఇచ్చింది.

ఒకసారి మా నాన్నగారి కాలులో ముల్లు గుచ్చుకున్నది; జపాన్ తుమ్మ ముల్లు. Septicఅయింది. డా|| నారపరాజు శ్రీధరరావు గారి దగ్గరకు వెళ్ళారు. ముల్లే కాదు; Septic అయిన భాగాన్ని కూడా తీసేస్తానన్నారు. మత్తుమందు ఇవ్వకుండానే డాక్టర్గారు ఆ భాగాన్ని కట్ చేసి తీసివేసి కత్తితో ఆ భాగాన్ని కెలకటం మొదలుపెట్టారు. ఆ బాధకు తట్టుకోలేక మానాన్నగారు ‘అయ్యా!’ ‘అబ్బా!’ అంటున్నారు. డాక్టర్ గారు ‘ఇందాకటి నుంచి నీ గాయాన్ని శుభ్రం చేస్తున్నాను. నువ్వు ఒక్కసారి కూడా ‘అమ్మా!’ అనవేమిటి?’ అని అడిగారు. ‘అమ్మా!’ అని పిలిచేది ఇందుకోసం కాదు- అన్నారు మా నాన్నగారు. ‘బాధల కోసం భౌతికమైన అవసరాల కోసం అమ్మను ప్రార్థించటం కాదు, కోరవలసింది వేరే ఉంది, అది అమ్మే ప్రసాదిస్తుంది’ – అనేది వారి ప్రగాఢ విశ్వాసం.

మా నాన్నగారు ‘A Comparative Study of World Religions’ అనే గ్రంధం వ్రాశారు. వేటపాలెం గ్రంధాలయంలోను, ఇతరత్రా చదివిన ఆధ్యాత్మిక గ్రంధాల సారాన్ని ఆకళింపు చేసికొని అమ్మ వాక్యాలను ఆ వెలుగులో చూస్తూ, సమన్వయం చేసుకుంటూ వ్రాసిన గ్రంధం అది. ఆ గ్రంథం కొద్దికాలంలో వెలుగులోకి వస్తుందనే అనుకుంటున్నాను.

అమ్మ వాక్యాలు ఆచరణ సాధ్యాలా? వాటినెలా అర్థం చేసుకోవాలి? ఎలా ఆచరించాలి?

అమ్మ మాటలు అంత తేలికగా అర్థమయ్యేవి కావు. సాధారణంగా అన్నట్టుగానే ఉంటుంది. ఆ మాట విరుపులో భావం మారిపోతుంది. అది ఒకవైపు. రెండవది- కాలం గడిచిన కొద్దీ అనుభవం పెరిగిన కొద్దీ అందులో క్రొత్త క్రొత్త అర్థాలు స్ఫురిస్తాయి. ఉదా: 1985 జనవరిలో డైరీ అమ్మ చేతికి ఇస్తే అమ్మ వ్రాసింది- “నాన్నా! శేషూ! నేను నీలోనే ఉన్నాను” – అని. దీనిని నేను భరోసా అనుకున్నాను; ‘ఫరవాలేదు- నీకేమీ భయం లేదు’- అని. అమ్మ నాలో ఉన్నప్పుడు నా హృదయాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి?

అమ్మ చెప్పిన దానిని ఆచరిద్దాం అనుకుంటాం కానీ అంత తేలిక కాదు. “కూతురిని కోడలిని ఒకేలా చూడటం అద్వైతం” అంది. అది ఎవరికి సాధ్యం? అమ్మ దగ్గర అందరూ అన్నయ్యలూ, అక్కయ్యలూ. ఇంతకంటే గొప్పగా సామ్యవాదాన్ని ఎవరు చూపగలరు ఆచరణలో?

అమ్మ మాటలు చాలా తేలికగా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ అవి అంతతేలికగా అర్థమయ్యేవి కావు. చూడటానికి, వినటానికి బాగానే ఉంటాయి. వాటిని గురించి అప్పుడు మనల్ని అమ్మ ఆలోచించనివ్వదు. అమ్మ మాట్లాడేటప్పుడు- ఎందరో విజ్ఞులు, పండితులు- చాలా మంచి ప్రశ్న వేసేవారు. వింటున్న మాలాంటివాళ్ళు ‘అద్భుతం- అమ్మ ఏంచెబుతుందో చూద్దాం’ అని ఎదురు చూస్తూండే వాళ్ళం. ఈ లోపల ఎవరో ప్రక్కనున్న వాళ్ళకి అమ్మ అలా బుద్ధి పుట్టిస్తుందేమో! తెలియదు. ‘అమ్మా! దీని అర్థం ఇదే కదా!’ అని వ్యాఖ్యానం చెప్పేవారు. అమ్మ ఒక నవ్వు నవ్వి “ఆ! అంతే” అనేది. అది కాదేమో, అమ్మ ఏం చెపుతుందోనని ఎదురు చూసేవాళ్ళందరం నిరాశ పొందేవాళ్ళం.

అమ్మ వాక్యాలు వినగానే సులభంగా అర్థమైనట్లు ఉంటాయి. అర్థమైనట్లుగా అనిపించిన ఆ వాక్యాల్ని ఒకటికి రెండుసార్లు మననం చేసిన కొద్దీ అందులో భిన్న భిన్నమైన అర్థాలు స్ఫురిస్తూంటాయి. ఇంకా లోతుకి వెళ్ళిన కొద్దీ సాంఘికపరంగా, వ్యక్తిపరంగా, వేదాంతపరంగా ఆలోచిస్తే, ఒక్కొక్క కోణం లోంచి ఒక్కొక్కరకమైన అవగాహన మనకి ఏర్పడుతూంటుంది. ఇది prismatic అన్న మాట. ఒక పట్టకంలోంచి ఒక తెలుపురంగు కాంతి కిరణము ప్రసరించినపుడు ఏడు రంగులుగా విడిపోయినట్లుగానే, ఆ ఏడురంగులు అమ్మ వాక్యాల్లో ప్రతిఫలిస్తాయి. కావున వీటి అవగాహన చాలా లోతుగా ఉండాలి. ఎంతవరకు సమాజానికి వ్యక్తులకు ఉపయోగిస్తాయి – అనేది రెండవ అంశం.

అమ్మ వాక్యాలు వ్యక్తి తనను తాను ఉద్దరించుకోవటానికి పనికొస్తాయి; సమాజం అంతా శాంతిగా సుభిక్షంగా ఉండటానికి ఉపయోగిస్తాయి. ఉదా: “సర్వత్రా మమకారం మాధవత్వం” అన్నది. సర్వత్రా అంటే- కేవలం మన కుటుంబం వరకేనా, చుట్టూ ఉండే సంఘం వరకేనా, పశుపక్ష్యాదులన్నిటితో కూడిన విస్తృతమైన ప్రపంచంతోటా; ప్రతి అణువుపైనా! ఇవన్నీ నాకు కావాలి అనుకోవటం మాధవత్వం ఎట్లా అవుతుంది? దైవత్వానికి గుర్తుగా ఎవరైనా వద్దు అనేది మముక్షుత్వం అనుకుంటారేమోగానీ, కావాలి అనుకునేది ముముక్షుత్వం అని ఎవరూ అనుకోరే. మరి అమ్మ ఇట్లా చెప్పింది ఎంతవరకు సబబు? ముందు ఆ ఆలోచన వచ్చిన తర్వాత- సర్వత్రా మమకారం అంటే నాది అనుకోవటమా, నేను అనుకోవటమా? ‘కారం’ అనే పదానికి వేరే అర్థం కూడా ఉంది అనుకోవచ్చు. అలా మనకి తెలియని లోతుల్లోకి కాలు పెడుతున్నట్టు అనిపిస్తుంది.

అమ్మ వాక్యాలు ఆచరణలో అంత తేలిక కాదు. ‘కూతురుని కోడలిని ఒకేలా’ చూడమంది. అదే మంత తేలికైన సాధన కాదు. చేస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. గొప్పమార్పు, సాధన లోతుకు వెడితే ఏ వాక్యమైనా తీసికొంటే- ఉపనిషత్తులు చివరిదాకా, లలితా సహస్రనామాలకో విస్తృతమైన వ్యాఖానాలు చదివితే తప్ప కొంచెం కూడా అవగాహన కాదు. ‘మనస్సు’ అని ఒక మాట అన్నది అనుకుందాం. ఆ మనస్సు కుండే 10 లక్షణాలు వెదుకుతూ ఏ ఐతరేయ ఉపనిషత్తు దాకానో వెళ్ళితే తప్ప- ఈ మనస్సు అన్న అమ్మ మాటలో ఇది దీనికి సరిపడుతుంది అని మనకు అవగాహన కాదు. అమ్మ వాక్యాల పదాల విరుపుగానీ వాటిలోని లోతుగానీ మనకి అంత తేలికగా అర్థం కావు.

“ఈ కలిలో నాకు ఆకలిలేదు” అన్నది. కలి, ఆకలి అనేటటువంటివి బాగా ప్రాస కుదిరింది అని ఆనందపడటం ఒక ఎత్తు. ఇంకొంచెం ముందుకు వెళ్ళామనుకొనండి. ఈ కలిలో అంటే ఈ కలికాలం గడిచేంతవరకు అమ్మ ఏ ఆహారమూ తీసుకోలేదు అని సమన్వయం పరచుకోవటం రెండవది. ‘ఈకలిలో’- అంటే ఇంతకు ముందు ఎన్ని కలియుగాలు జరిగినయ్, అన్ని కలియుగాల్లో అమ్మ ఉన్నదా? ఆ కలియుగంలో ఉన్న ఆ తత్వానికి ఈ తత్వానికీ మార్పు ఉన్నదా? – అన్నప్పుడు – ఆది నుంచి అనాది వరకు (నేను ఆదెమ్మనని చెప్పింది కదా అమ్మ) – ఆదియైన కాలం నుంచి ఇప్పటిదాకా చూస్తే; ఇప్పుడు మాత్రమే ఈ వాతావరణంలో ప్రస్తుతకాలంలో నేను ఆహారం తీసుకోవటం లేదు. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం- ‘నాకు’ అంటోంది అమ్మ. కేవలం పరిమితరూపంలో ఉన్న అనసూయమ్మకా? పరమాత్మతత్త్వమైన అమ్మకా? అన్నిటికి ఆధారభూతమైన ఆ చైతన్యమూర్తికా? ‘ఆకలి’ ఉండటం ఏమిటి? ఇక్కడ ఆకలి అంటే అర్థం ఏమిటి? ఇట్లా మనం తరచిన కొద్దీ, విశ్లేషిస్తున్న కొద్దీ, లోతుకు వెళుతున్న కొద్దీ ఆ వాక్యంలో ఉన్న అవగాహన లోతు కొంచెంగా అర్థమౌతుంది అమ్మ అనుగ్రహిస్తే.

'సాధ్యమైనదే సాధన' అనే అమ్మ చేయిస్తున్న సాధన ఏమిటి ?

కాసు రాధాకృష్ణ రెడ్డి వంటివారు అమ్మనామం చేస్తూ నాదయోగిగా తరించారు. కొందరు సేవలు చేస్తూ ఆనందం పొందుతున్నారు- సున్నం గానుగ వేస్తూ… అలా. మనుష్యులే కాదు, పశుపక్ష్యాదులు సైతం సాధకులే; తపస్సు చేసేవి. అది పిల్లికావచ్చు, కుక్క కావచ్చు. పరిమితులు లేని తత్త్వం అమ్మది. రాజుబావ ‘సైకిల్ పై పోతూ ఫెడల్ తొక్కుతూ, ఆ శబ్దంలో గడియారం తలక్రింద పెట్టుకుని ఆ టిక్ టిక్ శబ్దంలో ‘అమ్మా’ ‘అమ్మా’ అంటూ క్రమేణా రక్తప్రసరణ, హృదయస్పందనతో అనుసంధానం చేస్తూ సాధన చేశారు.

‘ఇదీ సాధన; ఇట్లాగే చెయ్యమని’ అమ్మ ఎవరికీ నిర్దేశించలేదు. ‘నేను అమ్మను, మీరు బిడ్డలు’ అన్నపుడు సంపూర్ణశరణాగతి. నేను అమ్మను – అన్నపుడు నీకు ఇంకొక ఆలోచన రావటానికి అవకాశం లేదు. నీకేది కావాల్సినా అడగాల్సింది నన్ను; ఇవ్వాల్సింది నేను. అందులోనే నిబిడీకృతమైంది.

‘గురుర్ర్బహ్మా, గురుర్విష్ణుః….’ శ్లోకాన్ని చెప్పి, మంత్రం, మంతార్థం చెప్పి అమ్మ ఉపదేశించింది. మంత్రోపదేశం చేసింది ఎవరు? గురువే కదా! గురువు పరబ్రహ్మ కదా! అంటే అమ్మే. అమ్మే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే అమ్మ దైవం అని అంగీకరించినట్లే కదా!

ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెబుతున్నపుడు ఆ తరగతిలో వారి కుమారుడు ఉన్నా, ఆ సమయంలో వెళ్ళి ‘నాన్నా!’ అని దగ్గరకి వెళ్ళి తీసుకునే అవకాశం లేదు. ఇవతలకు వచ్చాక ఎత్తుకుంటాడు, బుజ్జగిస్తాడు రెండు పాత్రలు. ఇటు అమ్మ, అటు గురువు, దైవం. అమ్మగా ఉన్నపుడు ఎవరిలో తప్పు కనిపించదు. అందరినీ బుజ్జగిస్తుంది, లాలిస్తుంది, సంతోషపెట్టి అందులో తానూ సంతోషపడుతుంది.

“ఇక్కడికి రావటం వృధా కాదు, నాన్నా!” అంది అమ్మ. అంటే అక్కడికి వెళ్ళిన వారందరి జీవితాలు పరిపుష్టం అయ్యాయి, పరిపూర్ణమైన సుగతిని పొందాయి- అన్నమాట. రెండవ పాత్ర దైవం పాత్ర- ఆ దైవాన్ని ఆయా వ్యక్తులు ఎలా అర్థం చేసుకున్నారు? వారి జీవితాల్లోకి ఎలా ఆహ్వానించారు? అనేది ఆయా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. సింగుపాలెం రాఘవయ్యగారు అమ్మలో కృష్ణుని చూస్తే, ఇంకొకరు రామునిగా, శక్తిగా చూస్తే వైకుంఠ ఏకాదశినాడు అమ్మ శ్రీరంగనాథునిగా దర్శనం ఇస్తే ఆ దైవరూపాల్ని మనస్సులో నింపుకున్నటువంటి వాళ్ళు లేదా ఆయా రూపాలు మాత్రమే దైవాలు అనుకునే వాళ్ళు ఆవిధంగా భావించారు. అమ్మ ఒక సింధువు; మనం తీసుకువెళ్ళి ముంచి తెచ్చుకుందామనేది ఒక చిన్న ఉద్ధరిణె. ఆ ఉద్దరిణెలో మనకి వచ్చే నీళ్ళు ఎంత? అగాధమైన సముద్రమెంత?

అమ్మ అందరికీ చేతుల్లో అన్నం పెట్టేది. అందరూ ఒక చెయ్యి పడితే, నేను దోసిలి పట్టేవాణ్ణి. రామకృష్ణ అన్నయ్య ‘ఇప్పుడెలా తింటావు నువ్వు?’ అని ఎగతాళి చేస్తుంటే “తినాల్సింది అట్లాగే” అనేది అమ్మ. అన్నాన్ని ముద్దలుగా కాకుండా అలాగే తినేవాణ్ణి. అమ్మ పెట్టిన ప్రసాదం నీకు ఇష్టమా? అమ్మ మాటలు ఇష్టమా? అని అంటే రెండూ ఇష్టమే అంటాను. మాతృమూర్తి అమ్మ అది ఒక భాగం. దైవంగా 3 సార్లు నా ప్రాణం కాపాడింది అమ్మ. ప్రపంచం అంతా కలలు కనే కుల మత వర్గ విచక్షణ లేని సమాజాన్ని- ఆచరణ సాధ్యం అని- చేసి చూపించిన సామ్యవాదీ అమ్మే. ఆ విధంగా చూస్తే నాకు చాల సంతోషంగా ఉంటుంది.

‘గురువు’గా అమ్మ కొన్ని సందర్భాలలో “ఇలా జరుగుతాయి” “ఇలా జరగవు” అని చెప్పింది. ఉదా: మాకు ఒక చిన్న ఎలిమెంటరీ స్కూలు ఉండేది. మా నాన్నగారు పరమపదించిన తర్వాత మేనేజిమెంట్ మా అమ్మగార్కి ఇస్తామని అప్పట్లో D.E.O గారు నన్ను పిలిచి చెప్పారు. నేను జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మతో ఈ విషయం చెప్పాను. “అదంత సులభంగా అయ్యే పనికాదు, నాన్నా!” అన్నది. అమ్మ మాటే నిజమైంది. అమ్మ చెప్పినట్టుగా మాకు రాకుండానే పోయింది ఆ స్కూలు.

జిల్లెళ్ళమూడిలో తమాషా నేను గమనించిందేమిటంటే- ‘నేను చాలా గొప్పవాడిని- ఇదంతా నా మూలంగానే నడుస్తున్నది’- అనేది ఎవరికైనా వచ్చిందంటే ఆ మరుక్షణం అతడు అక్కడ ఉండడు; ఎక్కడ ఉంటాడో! జిల్లెళ్ళమూడికి ఎంత దూరంగా ఉంటే అమ్మకి అంత దగ్గరగా ఉన్నట్లు Inverse philosophy నా మనస్సులో ఉండేది.
కాలక్రమేణా మరపు వస్తోందేమో! మరపు అంటే ఎక్కడైతే మనకు ఏకాగ్రం కావాలో అక్కడ ఏకాగ్రం కాకుండా మరలా ఇంకొక మార్గంలో లౌకికమైన మార్గంలో వెడుతోందేమో అని భయం.

రాశీభూతమైన సహనం అమ్మ. ఇంత సహనం ఎందుకు అమ్మకు? అనిపించేది. ఎన్నో సందర్భాలలో అమ్మ బాధపడటం చూసి, మనస్సులో బాధ అనిపించి, ఎందుకు అమ్మ కావాలని ఇవన్నీ కోరి తెచ్చుకోవటం; ఏర్పరచటం అని బాధపడేవాణ్ణి.

ఇంతగా అమ్మని అధ్యయనం చేసిన మీరు - అమ్మని దర్శించాలని అనుకొనేవారికి ఇచ్చే సలహా ఏదైనా ఉందా?

గాంధీమహాత్ముడు అస్తమించినపుడు ప్రపంచమంతా అన్నది “ఇలాంటి
వ్యక్తి భూమి మీద నడయాడేడు అంటే ముందుతరాల వాళ్ళు నమ్మటం కష్టం” అని. మరి భవిష్యత్ తరాలవాళ్ళు అమ్మను నేటి వరకు చూడని వాళ్ళు 50/100 ఏళ్ళ తర్వాత అమ్మను ఏ విధంగా దర్శించబోతారు- అనేది ప్రశ్నార్థకమే. కానీ ఈ ప్రశ్నకి సమాధానం అమ్మ తన జీవితంలోని కొన్ని సంఘటనల ద్వారా తెలియపరిచింది. కొంత మందికి – అమ్మ తన దగ్గరికి రాలేని వాళ్ళకి ముందుగా దర్శనాన్ని ప్రసాదించింది. గోవిందరాజుల దత్తుగారు వస్తే – “నాకు నువ్వు ఇంతకుముందే తెలుసు, నిన్ను పలానా చోట చాలాకాలం క్రితం చూశాను” అంది. కాని ఆ నాటికి అమ్మ అనసూయగా జన్మించలేదు. Gorden westerlund లాంటి వాళ్ళు ఎక్కడో Americaలో ఉండి, ఇక్కడ అమ్మ ఏ రకమైన చీరె కట్టుకున్నదీ ఎవరితో ఎలా మాట్లాడుతున్నదీ దర్శించారు. కావున దూరం, కాలం రెండూ అనేవి అమ్మను దర్శించటానికి అవరోధాలు కావు. ఇది జీవితంలోని ఒక సంఘటన. ఇక భవిష్యత్ తరాల వాళ్ళు అమ్మను గురించి తెలిసివచ్చినా తెలియకవచ్చినా వాళ్ళమీద అమ్మ అనుగ్రహ ప్రసారం ఎలా ఉంటుందో!

అమ్మ ఒక మాట అన్నది, “ఒకరోజు వస్తుంది- జిల్లెళ్ళమూడికి మీరంతా అవకాశం ఉన్నపుడే వచ్చిపోతూ ఉండండి – లేకపోతే ఏడవమైలు దగ్గర నుంచే నమస్కారం పెట్టుకు పోవాల్సి వస్తుందేమో!” అని.

ఈరోజున జిల్లెళ్ళమూడి వెళ్ళటానికి కార్లు ఉన్నాయి. లోపలి వరకు వెడుతున్నాం. హాయిగా అమ్మ ఆలయాల్ని చూస్తున్నాం, వస్తున్నాం; కానీ ఈ పరిస్థితి ఎప్పుడూ ఇట్లాగే ఉంటుందని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే 50 ఏళ్ళ క్రితం మనం వెళ్ళిన రోజు జిల్లెళ్ళమూడి ఈ విధంగా లేదు. కాలిబాటన వెళ్ళేవాళ్ళం; ప్రక్కన జపాన్ తుమ్మచెట్లు ఉండేవి. అప్పట్లో వెళ్ళిన వాళ్ళు వాటిని భావన చేసిన తీరు- 7 వ మైలు దగ్గర అడుగు పెట్టగానే అది ప్రవేశ ఆవరణ అనీ, మొదటి ఒరవ మొదటి ఆవరణ అనీ, రెండవ ఒరకు రెండవ ఆవరణ అనీ, ఆవరణలోకి ప్రవేశిస్తూంటే మూడవ ఆవరణ అనీ అట్లా ఆవరణలతో ప్రాకారాలతో కూడిన గొప్పక్షేత్రం అని గొప్పగా భావించారు.

రెండవది – ఆ వచ్చేవాళ్ళకి అమ్మ తెలిసో తెలియకో ఫోటో చూసో వచ్చి ఉండవచ్చు. వాళ్ళకి స్పందన ఏవిధంగా కలుగుతుందో మనం ఊహించలేము. మరొక సంగతి- అమ్మ దగ్గర 50 ఏళ్ళు ఉన్నా, ‘పాయసమ్మున దర్వికి రుచి తెలియ పని ఏమి కరుణామయి?’- అన్నట్లు; వ్యక్తిగతంగా నేను 50 ఏళ్ళుగా జిల్లెళ్ళమూడి వెళ్ళి వస్తున్నా- నేను పొందింది ఏమిటి? అని ప్రశ్నించుకుంటే, భౌతికంగా ఇదిగో ఈ ఇల్లు, కారు ఉన్నాయి. పిల్లలు జీవితాల్లో స్థిరపడ్డారు – ఇదంతా అమ్మ ప్రసాదం అనేది భౌతికమైనది. లోలోపలికి తొంగి చూసుకుంటే ఇక్కడ నేనేమి పొందాను? అనేది వేరే దృక్పథం.

భౌతికతకి – ఆధ్యాత్మికతకి నడుమ ఒక గోడను అమ్మ ఏనాడూ కట్టలేదు. ఇది వ్యక్తి యొక్క సర్వతోముఖమైన మార్పు అనేది కడపటి లక్ష్యం. బిడ్డ ఆకలి తెలిసి పెడుతుంది అమ్మ. కనుక వాళ్ళ వాళ్ళకి అర్హమైనది ఏది కావాలో, ఏది వాడికి ఇస్తే అభ్యున్నతి కలుగుతుందో దానిని వాళ్ళందరికీ అమ్మ తప్పక ఇస్తుంది. కడపటి ఫలితాంశం- వ్యక్తి ఉన్నతునిలా పదిమందికి ఉపయోగపడేలా వ్యక్తిలో మార్పురావడం. ఈ మార్పు అమ్మ తన సంకల్పమాత్రాన ఒక్క క్షణంలో ఇవ్వవచ్చు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసినా పొందలేని భాగ్యం అయాచితంగా కేవలం అమ్మ అనుగ్రహం వలన కలుగుతుంది.

కృష్ణావతారం ఉంది. కృష్ణుడు ఒక గొల్లపిల్లవానిలా సంచరించాడు. గోపబాలురంతా ఆయనతో కలిసి ఆడుకుంటూ ఉంటే దానిని బ్రహ్మాది దేవతలంతా చూసి ‘వీళ్ళదెంత భాగ్యం? మేము దేవతలం కావటం వలన ఈ ఆనందం కోల్పోయాము కదా! మనిషిగా పుట్టి ఉంటే ఆపరమాత్మతో ఆడుకునే వాళ్ళం కదా!’ – అని బాధ, అసూయ చెందారని భాగవతం చదివాం. మనందరం ఆ గోపబాలురలాగ ఆ భాగ్యాన్ని పొందాం; అనుభవించాం. కనుక మనం వాళ్ళకంటే వందల వేల రెట్లు భాగ్యం, పుణ్యం చేసుకుంటేనే అమ్మ వద్దకు వచ్చాం.

ఇక భవిష్యత్ తరాలవాళ్ళు, అమ్మ భౌతికంగా లేకపోయినా, వచ్చారంటే వాళ్ళకి అమ్మ అనుగ్రహం ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటేనే వస్తారు. అలా వచ్చినపుడు అమ్మ ఎవరిని ఏ విధంగా అనుగ్రహిస్తుంది అనేది చెప్పటం మనకి సాధ్యం కాదు. భౌతికంగా అమ్మను చూసి కన్నీరు కార్చిన వాళ్ళు ఎంతమందో, అమ్మ విగ్రహాన్ని చూసి స్పందించి కన్నీళ్ళు కార్చేవాళ్ళూ అంతేమంది ఉన్నారు.

మీ జీవితంపై అమ్మ ప్రభావం ఏ మేర వుంది?

నా చదువు, ఉద్యోగం, స్థితి, పొందిన పదవులు, నా జీవితం- అంతా
అమ్మ ప్రసాదమే. ఇన్నిటికీ అమ్మే కారణం. నా వివాహం. ఈ పిల్లలు – జీవనం జీవితం- అంతా అమ్మ అనుగ్రహమే.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!