Ravuri Sesha Prabhavathi

Interviewed by
P S R Anjaneya Prasad
23/02/2012
Hyderabad

 

శ్రీమతి రావూరి శేష ప్రభావతి

ఈమె 21-03-1952న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా, బాపట్ల. తల్లిదండ్రులు శ్రీ కొమరవోలు గోపాలరావు, శ్రీమతి సరోజిని. – భర్త – శ్రీ రావూరి ప్రసాద్. సంతానం – ఇద్దరు కుమారులు. వీరికి నలుగురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు. విద్య – 10వ తరగతి.

సేవాతత్పరత : అమ్మ ప్రోత్సాహంతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక విధానం నేర్చుకొని హైమాలయంలో అర్బన చేసిన తొలి మహిళ. హైమవతీశ్వరి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందారు. స్త్రీలు కూడా వేదాలను అభ్యసించవచ్చని ఈమె ద్వారా ‘అమ్మ’ ఒక ఒరవడిని ప్రవేశపెట్టింది. తన తాత, తండ్రి, తాను, తన సంతానం ఇలా నాలుగుతరాలుగా అమ్మని సేవిస్తూ అనిర్వచనీయమైన ‘అమ్మ’ ఆశీస్సులను పొందుతూ ఆనందంగా జీవన యానాన్ని సాగిస్తున్న ‘అందరింటి’ సోదరి.

శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్, శ్రీ రావూరి ప్రసాద్ సంయుక్తంగా 23-02-2012వ తేదీన హైదరాబాదులో శ్రీమతి రావూరి శేషప్రభావతి గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మీ కుటుంబ నేపథ్యం వివరించండి.

మా నాన్నగారు శ్రీ కొమరవోలు గోపాలరావు, తల్లి శ్రీమతి సరోజిని. మేము ఐదుగురు అక్కచెల్లెళ్ళం; నాకు ఇద్దరు తమ్ముళ్ళు. మా తాతగారు ముక్తేశ్వరరావుగారు బాపట్లలో ఉండేవారు. అమ్మను గురించి వారు మానాన్నకి చెప్పారు. మేము కాకినాడలో ఉండేవాళ్ళం. బాపట్ల వచ్చి ఎడ్లబండి మీద జిల్లెళ్ళమూడి వచ్చేవాళ్ళం.

మా వారి పేరు శ్రీరావూరి ప్రసాద్. మాకు ఇద్దరు అబ్బాయిలు విజయ్, హైమాకర్.

మీరు అమ్మని దర్శించిన విధానం. అప్పటి అమ్మ సన్నిధి- ఆ జ్ఞాపకాల్ని మాతో పంచుకోండి.

జిల్లెళ్ళమూడి పల్లె ప్రాంతం కావటం చేత చాలా ఇష్టంగా ఉండేది. కాల్వగట్టు మీద సరదాగా వచ్చేవాళ్ళం. మా తమ్ముళ్ళు రవికి నామకరణం, సదాశివకి అక్షరాభ్యాసం చేసింది అమ్మ, అప్పుడు అమ్మతో అందరం ఫోటోలు కూడా తీయించుకున్నాం. ఆరోజుల్లో అమ్మ హైమాలయం దగ్గర పాకలో ఉండేది. ఆ పాక ఎదురుగా పెద్దమందిరం అని వుండేది. అక్కడ సంచులు పెట్టుకుని, చాపలు వేసుకుని పడుకునేవాళ్ళం. నేటి లాగా కుళాయి ద్వారా నీటి సరఫరా సౌకర్యం లేదు. వచ్చినవాళ్ళంతా ‘ఓంకారనది’ (నల్లమడ కాల్వ)కి వెళ్ళిస్నానాలు చేసేవారు. మా అమ్మ మా అందరినీ తీసుకుని వెళ్ళలేక అమ్మ స్నానం చేసిన నీళ్ళతో మాకు స్నానాలు చేయించేది. అపుడు నాకు ఎనిమిది ఏళ్ళు.

మీ నాన్నగారు సకుటుంబంగా జిల్లెళ్ళమూడి వచ్చి - అమ్మ సేవ చేసుకొన్న సందర్భం తెలుపండి.

నా 15వ ఏట జిల్లెళ్ళమూడిలో మా అక్క పెళ్ళి జరిగింది. అప్పటికి మేము కాకినాడలో ఉండేవాళ్ళం. మానాన్న వచ్చి ‘అమ్మ’తో మా అక్క పెళ్ళి గురించి మాట్లాడేవారు. “శేషు ఎట్లా ఉంది? శేషు ఆరోగ్యం బాగుందా?” అని నా గురించి అడిగేది అమ్మ. అప్పట్లోనే నాకు అనారోగ్యం మొదలైంది. తలనెప్పి బాల్యం నుంచీ ఉంది. కలలో సర్పాలు కనిపించేవి- నీరసం, శబ్దాలు వినలేకపోవటం, తలమీద ఎప్పుడూ బిందె బరువు మోస్తున్నట్లు ఉండటానికి తోడు నేను జిల్లెళ్ళమూడి వచ్చాక జ్వరం కూడా వస్తూండేది.

బాల్యం నుంచీ అమ్మ దైవం అనీ, ఒక ప్రత్యేకత గల వ్యక్తి అనీ నమ్మిక. రూపం, మాటలో ఆకర్షణ గోచరించేవి. ఒకసారి అమ్మ అనీ, మరొకసారి దైవం అనీ అనుకునేవాళ్ళం. మా నాన్న మారిన వుద్యోగరీత్యా Medical Representative గా నెలకి 20 రోజులు టూర్కు వెళ్ళేవారు; 10 రోజులు ఇంటివద్ద ఉండేవారు. కుటుంబం అంతా జిల్లెళ్ళమూడిలో ఉంటే ఆ 10 రోజులూ తనూ జిల్లెళ్ళమూడిలో ఉండవచ్చు. కుటుంబం అమ్మ సేవలో ఉంటుంది అని ముందుగా కుటుంబాన్ని జిల్లెళ్ళమూడికి తీసుకువచ్చారు. వారు కాకినాడలో ఉండేవారు. 19-5-68 తేదీన జిల్లెళ్ళమూడి వచ్చాం. ఆ సాయంకాలం అమ్మ గదిలోకి వెళ్ళా. అమ్మ నన్ను పలకరించింది. బీరువా పైన ఉన్న ఒకే ఒక్క హైమక్కయ్య చీరెను తీసి నాకు ఇచ్చింది. ఏప్రిల్లో హైమక్క శరీరత్యాగం చేసింది, మే 19న మేము జిల్లెళ్ళమూడి చేరాము.

మీ అనారోగ్యం గురించి 'అమ్మ'తో చెప్పారా? హైమాలయంలో మీరు చేసిన మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక నేపథ్యం ఎలాంటిది?

అమ్మకు అన్నీ తెలుసు. “అడిగిన వారికి అడిగినదే ఇస్తాను, అడగని వారికి అవసరమైనది ఇస్తాను” అన్నది అమ్మ. ఆ మాట నాకు బాగా నచ్చింది.

అందుకనే నేను అమ్మతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. నేను అనారోగ్యంగా ఉన్నానని అడగలేదు. మా అమ్మ ‘శేషుకి ఎక్కువగా కలలు వస్తున్నాయి. బాధపడుతోంది’ అని అమ్మతో అంది. “పెద్దగుడి (ప్రస్తుతం శ్రీ అనసూయేశ్వ రాలయం)కి వెళ్ళి నాగప్రతిష్ఠ చేస్తానని మ్రొక్కుకోమను” అని ‘అమ్మ’ చెబితే నేను వెళ్ళి మొక్కుకున్నాను. వెంటనే కలలో సర్పాలు రావటం తగ్గిపోయింది. ఆనాటికి ఆ ఆలయంలో ఏ ప్రతిష్ఠ జరగలేదు. తర్వాత ఎప్పుడో నా పెళ్ళి అయిన తర్వాత అమ్మ చెప్పినట్లుగా రావి చెట్టుక్రింద నాగ ప్రతిష్ఠ చేశాం. పెళ్ళికి ముందే అమ్మ నన్ను హైమాలయంలో పూజలు చెయ్యమన్నది; నాటి నుంచి క్రమంగా నాకు అనారోగ్యం తగ్గి ఆరోగ్యం చేకూరసాగింది. అందుకోసమే అమ్మ నాచేత హైమాలయంలో పూజలు చేయించి ఉండవచ్చు; కానీ అమ్మ నాకు ఆవిధంగా ఏమీ చెప్పలేదు. “రుద్రాభిషేకం చేయటం నేర్చుకో. స్త్రీలు మంత్రాలు చదువకూడదు అనేది పోవాలి – నిన్ను చూసి అందరూ చేయాలి చేస్తారు” అన్నది అమ్మ.

తొలి రోజుల్లో హైమాలయంలో భద్రాద్రి రామశాస్త్రిగారు అభిషేకాలూ, పూజలూ చేస్తుంటే నేను వారికి సహాయం చేస్తూండేదానిని. “అభిషేకం చేయటం నేర్చుకో” అన్నది అమ్మ. తాతగారు మొదట ‘కూడదు’ అన్నారు. కానీ మళ్ళీ ఆయనే నేర్పించారు. స్త్రీలు కూడా చేయవచ్చు అన్నారు. 20 రోజుల్లో మహాన్యాసంతో సహా రుద్రాభిషేకం చేయటం నేర్చుకున్నాను. ‘అమ్మ’ చాలా ఆనందించింది. నాకు 25 ఏళ్ళ వయస్సు నుండి 30 ఏళ్ళ వయస్సు వరకూ చేశాను. రుద్రాభిషేకంతో పాటు మంగళ గౌరీవ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు, దసరాపూజలు, హైమవతీ జనయిత్రీ వ్రతాలు జరుగుతూండేవి. హైమవతీ వ్రతం కార్తీక పౌర్ణమి నుంచి బహుళ షష్ఠి (హైమక్కయ్య జన్మదినము) వరకు 7 రోజులు చేస్తారు. ‘సావిత్రీ గౌరీ నోము’ అని ఉంది. ఒకచోట దేవుడ్ని పెట్టుకుని అందరూ వచ్చి పూజచేసుకుంటారు. అలాగే హైమక్కయ్యకి ఆవరణలోని పిల్లలందరి చేత చేయించాలి అని ‘అమ్మ’ ఉద్దేశ్యం.

హైమక్కతో మీ జ్ఞాపకాలని మాతో పంచుకోండి.

హైమక్కయ్య గురించి మానాన్న చెప్పేవారు- తనకి అనారోగ్యం అని. ‘నీ నిర్మల నీ నిశ్చల’ అనే పాట పాడేదట. నేనొకసారి వేసవి సెలవులకి వెళ్ళి జిల్లెళ్ళమూడిలో రెండు నెలలున్నాను. అపుడు హైమక్కయ్య నన్ను పలకరిస్తూండేది. అడవుల దీవి లలితక్కయ్య, హైమక్క నేను మొదటి ఒరవ దాకా వెళ్ళి నడిచి వస్తూండేవాళ్ళం – ఆనాటి సాయంకాలాలు. నా తలనెప్పి గురించి ‘హైమక్కయ్య’ అడిగేది. తనకీ తల నొప్పి వస్తూండేది. అమ్మ అనేది “హైమకీ తలనెప్పి ఉంది. అయినా శేషుకి తలనెప్పి అని హైమ బాధపడుతోంది” అని.

హైమాలయంలో మీ అనుభవాలు తెలపండి.

హైమక్కకి అమ్మ దైవత్వాన్నిచ్చింది. అక్కడ ఏదైనా సేవ, పూజ చేసుకుంటే కోరికలు సఫలమౌతాయి. నేను పూజలు మొదలుపెట్టాక హైమక్క కలలో కనిపించింది. హైమక్కకి బంగారం బొట్టు ఉండేది. నేను దండవేస్తుంటే దండకి చుట్టి ఉన్న చెమికీ బొట్టుకి తగిలింది. హైమక్కయ్య ముఖం చిట్లించి, బాధగా ఉన్నట్లు కనిపించింది. అపుడు నేను అనుకున్నాను – తన కేమీ ఇబ్బంది లేకుండా పూజాదికములు చక్కగా చేసుకోవాలి- అని. విగ్రహానికి చేస్తున్నాననిపించలేదు; నాకోసం హైమక్కయ్యకి చేస్తున్నానిపించింది. అది విగ్రహం కాదు, సశరీరంగా ఉన్నట్లు అనిపించేది. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒకరోజు హైమ ముఖం చాలా కళగానూ ప్రశాంతంగానూ ఉన్నదనీ, మరొకరోజు బాగా చిక్కినట్లు ఉన్నదని కొబ్బరికాయలు తెచ్చికొట్టి హారతులిచ్చేవారు. అంతటి మార్పు విగ్రహంలో తెలుస్తుండేది.

మీకూ - రావూరి ప్రసాదూ అమ్మ సమక్షంలో జరిగిన వివాహ నేపధ్యాన్ని వివరించండి ?

మా కుటుంబం జిల్లెళ్ళమూడి వెళ్ళిన కొత్త. ఆయన (శ్రీరావూరి ప్రసాద్) తో అంతకుముందు నాకు పరిచయంలేదు. మేము ఇద్దరం దండలతో ఉన్నట్టుగా నాకు కల వచ్చింది. కలలు బాగా నమ్మేదాన్ని. నేను నమ్మి ఆయనతో ‘మనిద్దరికీ వివాహం అవుతుంది’ అని చెప్పే దాన్ని. ఒకసారి రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్య ‘శేషుకి ఏదన్నా ఆధారం చూపెట్టాలి’ అన్నాడు అమ్మతో. అమ్మ “పెళ్ళి చేసుకుంటావా?” అని అడిగింది నన్ను. ఆయన్ని (రావూరి ప్రసాద్) చేసుకుంటానని నా నమ్మకం గురించి చెప్పా. ‘తనతో చనువుగా ఉంటాను. చేసుకుంటాను” అన్నాను అమ్మతో. అంతే కాని నీ ఇష్టం అమ్మా!’ అనలేదు. ఈ పెళ్ళి జరగదని నాతో ప్రసాద్ చెప్పేవారు. నిర్ణయమై ఉన్నదని అనుకునే దాన్ని- అనే దాన్ని. 1981 మే 5వ తేదీన ‘అమ్మ’ చేతులు మీదుగా మా వివాహం జరిగింది. 1985 జూన్ 12 న అమ్మ శరీరత్యాగం చేసింది కదా! 5-5-1985 ‘మా పెళ్ళిరోజున’ అమ్మ దగ్గరకి వెళ్ళాం దంపతులం. “ఏంటమ్మా?” అని అడిగింది అమ్మ. ‘మా పెళ్ళిరోజు’ అని చెప్పారాయన. “అరె! చీర ఇవ్వటం మరచిపోయానే” అని ఒక చీర తెప్పించి పెట్టింది. ‘అమ్మా! తనకి చీరెలు ఉన్నాయి’ అన్నారాయన. “ఒరేయ్, ముందు నువ్వు బయటికి వెళ్ళు” అని మరో రెండు చీరెలు తెప్పించి పెట్టింది. అప్పటి నుంచీ ఏలోటు లేకుండా ఉంది మా జీవితంలో.

జిల్లెళ్ళమూడిలోనే మేము కాపురం ఉండేవాళ్ళం. మా నాన్నగారి కుటుంబాన్నీ అమ్మే చూస్తుండేది. అందరి అవసరాల్నీ అమ్మే చూసేది. మా అబ్బాయి విజయ్ పుట్టినపుడు- నాకు అనారోగ్యం కదా! కానుపు కష్టం అవుతుందని – హైమక్కకి 1000 కొబ్బరికాయలు కొడతానని మా వారి బదులు ‘అమ్మే’ మొక్కుకున్నానన్నది. మా వివాహజీవితంలో కష్టాలున్నాయి, సుఖాలున్నాయి. కష్టాలే ఎక్కువ పడ్డామేమో! అయితే అసంతృప్తి మటుకు ఎప్పుడూ లేదు. దీనినిచ్చింది అమ్మ – దీనిని అనుభవిస్తున్నాం అనుకున్నాం.

నా చిన్నప్పటి నుంచీ ‘అమ్మ’ నేనంటే ఇష్టం. “ఓర్పు ఎక్కువ శేషుకి. నోరు తెరచి అడగదు” అని బాగా మెత్తని చీరెలుంటే పిలిచి ఇస్తూండేది. పెళ్ళికి పట్టు చీరె పెడుతూ “అమ్మా! నువ్వు కట్టుకోలేవని ఇవ్వాలనుకోలేదు. పెళ్ళికైనా పెద్ద చీరె ఉండాలని పెట్టానమ్మా మొయ్యలేవు కదా!” అన్నది. ఒకసారి ఢిల్లీ ఉషక్కయ్యకి ఎవరో నల్లచీర తెచ్చి ఇచ్చారు. జపాన్ జార్జెట్ చీరె. జిల్లెళ్ళమూడి వచ్చి మా ఇంట్లో స్నానం చేసి, అమ్మ వద్దకు ఆ చీర కట్టుకెళ్ళింది. “ఈ చీరె శేషుకి ఇయ్యి” అని చెప్పిందట అమ్మ. వెంటనే తను క్రిందికి వచ్చి ‘ఈ చీరె నిన్ను కట్టుకుని రమ్మంటోంది అమ్మ’ అని ఇచ్చింది. అమ్మ చెప్పింది కదా అని ఆ చీర కట్టుకుని వెళ్ళాను. ఆ రోజున కూర్చోబెట్టి నాతో చాలా హాయిగా మాట్లాడింది అమ్మ.

చీరలు పెట్టేటప్పుడు రంగులు ఎంపిక చేసి ఎవరికి ఏ చీర అందంగా ఉంటుందో అదే పెట్టేది అమ్మ. ‘వసుంధరక్కయ్య’ వాళ్ళకి లోపల నుంచి ఏ చీరతేవాలో వివరంగా చెప్పేది. హైమక్కయ్య పుట్టినరోజున హైమక్కయ్యకి ఎన్నిఏళ్ళో అంతమంది కన్యలకి చీరెలు పెట్టేవారు. ఆ చీరెలు తెచ్చి హైమక్కయ్య పాదాల చుట్టూ పేర్చారు. రామకృష్ణ అన్నయ్య అందిస్తున్నాడు – అమ్మ పెడుతోంది. నావంతు వచ్చింది. ఈ చీరెకాదు, ఆ చీర, ఆచీర అని ఏరి పెట్టింది. ఎవరికైనా అలాగే పెట్టేది. అమ్మ పెట్టిన చీరె అదే అచ్చంగా నిండుగా సరిపోతుందేమో వాళ్ళకి అన్నట్లు ఉండేది.

మీ తల్లిదండ్రులు ఈనాడు మన మధ్య లేరు. వారు అమ్మకి ఒనర్చిన సేవలు తెలియజేయండి.

మాది చాలా పెద్దకుటుంబం – ఏడుగురు పిల్లలు; పెళ్ళిళ్ళు కాలేదు, చదువులు పూర్తి కాలేదు. అప్పటికి ఓరియంటల్ కళాశాల కూడా పెట్టలేదు. మా ‘అక్క’ ఒక్కదానికే పెళ్ళి అయింది. అయినా కూడా మానాన్న పూర్తిగా అమ్మ మీద భారం వేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మా నాన్న కొన్నాళ్ళు ఉద్యోగం చేసి, సంస్థ పనుల్లో గోపాల్ అన్నయ్యకి తోడుగా ఉండేందుకు అమ్మకోరిన మీదట ఉద్యోగం వదలి గంపెడంత కుటుంబం పెట్టుకొని అమ్మ సన్నిధికి చేరారు. అంటే అమ్మయందు అంతగొప్ప నమ్మకం వారికి. ఏదన్నా – అమ్మే చూసుకోవాలని, అమ్మని ఏదీ అడిగే వారు కాదు, అమ్మకి ఏదీ చెప్పేవారు కాదు. అమ్మ ఎలా చెప్తే అలా నడచుకునేవారు. SVJP కార్యాలయంలో PMDS (permanent monthly deposit scheme), P.F.D.S (permanent Fixed deposit scheme) matrusri photo club, ఆలయాల్లో శుక్రవారం పూజలు (Friday Pooja Scheme) స్వయంగా నిర్వహించారు. ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడేవారు. కాబట్టి విదేశీయులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపేవారు.

రామకృష్ణ అన్నయ్య అమ్మ ప్రక్కనే ఉండి ఎట్లా కనిపెట్టుకుని ఉండేవాడో, అట్లాగే మా అమ్మ ‘కొమరవోలు సరోజిని’ వచ్చిన వాళ్ళని కనిపెట్టుకుని వాళ్ళ అవసరాలు, సౌకర్యాలు స్వయంగా చూసేది. పెళ్ళిళ్ళు జరిగితే పెళ్ళికూతుర్ని సిద్ధం చేయటం, వస్తువులు అందించటం, స్నానాలు చేసి పీటలు మీద కూర్చోవటం దగ్గరనుంచి అన్నీ దగ్గరుండి చేసి తిరిగి వెళ్ళే వరకూ వారిని కనిపెట్టుకుని ఉండేది. అమ్మ హైమక్కల జన్మదినోత్సవాల్లో బండిమీద విగ్రహాలు ఫోటోలు పెట్టి ఊరేగింపుగా నామం చేస్తూ ఆవరణలో వాళ్ళని అందరినీ కలుపుకొని నిర్వహించేది. హైమాలయంలో వ్రతాల, పూజల నిర్వహణ పని మా అమ్మదే- తోరాలుకి ఎన్ని పోగులుండాలి, ఏకథలుండాలి, ఏ నామావళి చదవాలి, ఏవిధంగా చేయాలో అంతా ‘అమ్మ’ మా అమ్మకి చెప్పి చేయించింది. హైమవతీ జనయిత్రీ వ్రతం ఫలానా తేదీన ప్రారంభమౌతుందని పొరుగూరు వాళ్ళకి మా అమ్మే ముందుగా ఉత్తరాలు వ్రాసేది.

గుడిలో అర్చనలతో పాటు 'అందరింట' మీరు చేసిన సేవలేమిటి?

పిన్న వయస్సులోనే వెళ్ళాం కాబట్టి అన్నపూర్యాలయంలో వడ్డన చేసేవాళ్ళం. ఇప్పుడు అన్నపూర్ణాలయంలో (Dining tables, chairs వచ్చాయి.) వడ్డించటం తేలికగా ఉండొచ్చు. ఆ రోజుల్లో పంక్తులు నేల మీద ఎంత బారుగా ఉన్నా, అలా వంగి వడ్డిస్తూండేవాళ్ళం. మాకుటుంబ సభ్యులందరం ఎక్కువసేపు అఖండ నామంలో పాల్గొనేవాళ్ళం. సమాచార కేంద్రం (ఎంక్వైరీ ఆఫీస్)లో పనిచేశాను. యాత్రికుల పేరు, చిరునామా వ్రాసుకోవటం, వాళ్ళకి గదులు కేటాయించటం, చాపలు – బకెట్లు ఇచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు తిరిగి తీసుకోవడం. P.C.O. (public call office) లో ‘అందరి – నాన్నగారు’ ఒక్కరే ఉండి Phone calls స్వీకరించేవారు. వారికి సహాయంగా కొన్నాళ్ళు నన్ను ఉంచారు. అవసరానికి చెరువుకు నీళ్ళు తేవడానికి వెళ్లేదాన్ని. Publications లో పనిచేశాను, Stores లో పనిచేశాను. హైమాలయంలో అభిషేకాలు, పూజలు చేశాను. అయితే హైమాలయంలో అర్చనల తర్వాతనే నాఆరోగ్యం కుదుటపడింది.

మీ అమ్మకి - అందరమ్మకి తేడా ఏమిటంటారు?

‘అమ్మ’ కి ప్రేమ అందరి మీద ఉంటుంది. కన్నతల్లికి తన సంతానం మీద బంధుమిత్రుల మీద ఉంటుంది. ‘అమ్మ’ ప్రేమకి తేడా లేదు. అందరినీ ఒకేవిధంగా ప్రేమించింది. ‘ఎవరైనా నాకు ఉద్యోగం రాలేదు. కుటుంబం కష్టంగా ఉందమ్మా’ అంటే, “నాన్నా! నీకు ఉద్యోగం వచ్చేవరకూ కుటుంబాన్ని ఇక్కడ ఉంచు” – అనేది. ఎవరి అన్నం వాళ్ళది ఇక్కడ ఉందని ఆ కుటుంబాల్ని పోషించేది. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత కుటుంబాల్ని తీసుకువెళ్ళేవారు. చదువు పూర్తి అయి వివాహం అయ్యేదాకా ఆడపిల్లలు ఇక్కడ ఉండేవారు. నలభై రోజులు హైమాలయంలో ప్రదక్షిణాలు చేసుకుంటూనో, అన్నపూర్ణాలయంలో, అమ్మ గదిలో సేవ చేసుకుంటూనో ఉద్యోగం వచ్చే వరకు లేదా వివాహం అయ్యేవరకు అమ్మ దగ్గర ఉండేవాళ్ళు. ఇంక ఎవరి దగ్గరా అలా ఉండలేం కదా! వాళ్ళకి భారం అనుకుంటాం. కానీ ఇక్కడ ఎవరి పనీ, ఎవరి అన్నం వారికుంది అన్నప్పుడు వాళ్ళకీ అమ్మ సేవలో ఉన్నామనే సంతృప్తి ఉంటుంది; ఒక ప్రయోజనం చేకూరేది. అలా అందరినీ ‘అమ్మ’ దగ్గరకు తీసింది. ఎవరి మీదో ఆధారపడ్డాం అనే బాధ లేకుండా హాయిగా ఉండేవాళ్ళు. తర్వాత ఎక్కడో స్థిరపడ్డాక గుర్తుపెట్టుకుని మళ్ళీ వచ్చి శక్తి ఉన్నంతలో ఆఫీస్లో ఇచ్చేవాళ్ళు. అంతేకానీ డబ్బు ఇస్తేకానీ ఉండటానికి వీలులేదు అనేది లేదు ఇక్కడ.

అనారోగ్యంతో, బలహీనంగా ఉన్నా మీ చేత 'అమ్మ' అర్చనలు చేయించింది కదా! ఎలా చేయగలిగారు?

నేను హైమాలయంలో ఐదేళ్ళు అభిషేకాలు, పూజలు చేశాను; సాధారణంగా ఎవరితోనూ మాట్లాడే దాన్నికాదు. ఉదయాన్నే లేచి స్నానంచేసి గుడికి వెళ్ళేదాన్ని, రాత్రి అయ్యాక ఇంటికి వచ్చేదాన్ని. ఇంత అనారోగ్యంతో అలా చేశానంటే అలా ‘అమ్మ’ చేయించింది- అంతేకానీ నేను చేయటం కాదు. “శేషు చేస్తుంది, శేషు చేస్తుంది-” అని అమ్మ అందరితో అంటే, అమ్మా నువ్వు ‘చీపురు పుల్ల పెట్టి చేయించవా?’ అని అనే వారు ప్రక్కనున్న వాళ్ళు. నాకు ఆరోగ్యం కలగాలని అట్లా నా చేత చేయించింది ‘అమ్మ’. ఒకసారి మా తల్లిదండ్రులు నాజాతకం ఎవరికో చూపిస్తే ‘ఏమిటీ ఇలాంటి జాతకం తెచ్చారు? ఈ అమ్మాయి ఇంకా జీవించి ఉందా?’ అని అడిగారట. కనుకనే నన్ను తప్పించి మా చెల్లెలు మణికి ముందుగా పెళ్ళి చేశారు. ‘అమ్మ’ “శేషుకి ఆరోగ్యం వచ్చాక పెళ్ళి చేద్దాం. దానికి అనారోగ్యం అని తెలిసికూడా చేసుకునే వాళ్ళు వస్తే చేద్దాం. ఇప్పుడు తొందర లేదు” – అని అన్నది.

అమ్మ భర్త (నాన్న) గారి గురించి తెలుపండి.

అందరి నాన్నగారు చాలా నిరాడంబరంగా ఉండేవారు. (జిల్లెళ్ళమూడి నాన్నగారు అనే) తనకొక ప్రత్యేకత కోరుకోకుండా అందరితో కలిసి ఉండేవారు. హైమక్కపోయిన కొత్తలో మేము జిల్లెళ్ళమూడి వెళ్ళాము. పరికిణీ ఓణీ వేసుకుని నేను తిరుగుతూంటే “మా హైమలా ఉన్నావమ్మా” అని ప్రేమగా చూసేవారు నన్ను. అందరినీ అట్లాగే చూసేవారు.

అమ్మ సన్నిధిన జరిగిన మీ ఇంటి శుభకార్యాలేమిటి?

అమ్మని అమ్మగానే చూసేవాళ్ళం. దైవం అని తెలుసు. కానీ మధ్యలో తెరవేస్తూండేది అమ్మ. మాఇంట్లో శుభాశుభాలన్నీ అమ్మ చేతుల మీదుగానే జరిగాయి. మా అక్క పెళ్ళి, మణి పెళ్ళి, నా పెళ్ళి, కుసుమ పెళ్ళి అన్నీ అమ్మే చేసింది. సీమంతం చేసినా అమ్మే, నామకరణం చేసినా అమ్మే.మా పెద్ద అబ్బాయికి విజయదశమి రోజున పేరు పెడుతూ ‘విజయనరసింహ’ అన్నది. ‘నరసింహ’ అనేది మా మామగారి పేరు. మారెండవవాడు హైమక్క పుట్టినరోజున పుట్టాడు. కనుక ‘హైమాకర్’ అని వాడికి పేరు పెట్టింది.

అమ్మ కోపాన్ని చూశారా?

చిన్నప్పటినుంచీ నా మీద నాకు నిరాసక్తి ఉండేది. ‘ఎందుకీ బతుకు’? అనిపించి ఒకసారి (ఓంకారనది) నల్లమడ వాగులోకి వెళ్ళిపడ్డాను. తిరిగి వచ్చా. అప్పుడు దానిలో అంతగా నీళ్ళులేవు. ఎప్పుడూ తలనెప్పి, జ్వరం. దాంతో చనిపోవాలి అనుకున్నా గానీ అందుకు ఆ వాగు నిండా నీళ్ళుండాలి. అని తెలియదు. నీళ్ళలో తడిసి ఇంటికి వచ్చాను. ‘అమ్మ’ కీ విషయం మా అమ్మ వెళ్ళి చెప్పింది. అప్పుడు అమ్మ నన్ను కోప్పడింది – “కొట్టుకుపోలేదా, తిరిగొచ్చేశావు? నేనే తోసేస్తాను పద” అంది. ఆ తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నా అనారోగ్యం కానీ ఆర్థిక పరిస్థితి గానీ పట్టించుకోలా. అన్నీ అమ్మే చూసుకుంటుంది – అనుకునే దాన్ని. ఎన్నో కష్టాలు పడ్డాను. ఏమిటీ కష్టాలు అని నొచ్చుకున్నాను- విరక్తి చెందాను. కానీ అమ్మ మీద విరక్తి చెందలేదు. మనకున్నదిది- మనకి ఉంటే వచ్చేదే కదా అనిపించేది. అంతేకాని అమ్మ ఇలా చేసింది అనేది లేదు.

ఈనాడు మీ కుటుంబ స్థితి ఎలా వుంది?

మా అబ్బాయిలకీ వివాహాలు అయినయ్. ఉద్యోగాలు చేస్తున్నారు. కోడళ్ళూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అందరం హాయిగా ఉన్నాం. ఏమీ ఇబ్బందులు లేవు. అమ్మ సన్నిధిలో ఎక్కువకాలం ఉన్నందున జీవితంలో ‘తృప్తి’ అనేది ఉన్నది. ఒకరిని ఒక మాట అనాలని అనిపించదు. ఒకరు నాకన్నా బాగున్నారని ఈర్ష్య పడను- ఆ మనస్సు ఇచ్చింది అమ్మ. మనకున్నది చాలు అనిపిస్తుంది. మనకున్నదే ఇంకొకళ్ళకి పెట్టకుందాం. ఈ మనస్సు జిల్లెళ్ళమూడి సోదరీసోదరులందరిలో ఉంది. జిల్లెళ్ళమూడి వాళ్ళని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది.

అమ్మతో ప్రయాణం చేయడం, ఆటలు ఆడటం వంటి అనుభవాలు ఉన్నాయా?

పర్యటనలో అమ్మతో నేను నెల్లూరు, తెనాలి వెళ్ళాను. ఆనందించాను. అమ్మతో కారెమ్స్ ఆడాను. “నాకేం ఆడటం రాదు – నువ్వన్నా సరిగ్గా ఆడమ్మా” అనేది అమ్మ. ‘నిజమే – అమ్మకేం వస్తుంది’- అనుకునేదాన్ని.

ఆలయ ప్రవేశం తర్వాత అమ్మ మీకిచ్చిన అనుభూతులు ఏమిటి ?

అమ్మ ఆలయ ప్రవేశం చేశాక – మనస్సుకి ఏది తోస్తే అది నిజం అవుతోంది. దసరాల్లో పూజలు చేసిన తర్వాత ఒకసారి అమ్మ తెల్లచీరె కట్టుకుని, నగలు పెట్టుకుని ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చినట్లు నమస్కారం చేస్తే స్పర్శ కూడా నాకు అనుభూతమైంది.

అమ్మని దర్శించాలనే క్రొత్తవారికి మీరిచ్చే సూచనలు - సలహాలు ఏమింటి ?

అమ్మ వద్దకి ఎవరికి సమయం వస్తే వారు వెడతారని నా ఉద్దేశం; మనం చెప్పనక్కరలేదు. అమ్మే పిలిపించుకుంటుంది. మనం చెప్పినా కూడా వాళ్ళ సమయం వస్తేనే వెళ్ళగలరు. ‘ ‘అమ్మ’ని తెలుసుకోగలరు. నమ్మకమూ కలుగుతుంది. మనల్ని ఎవరు రప్పించుకున్నారో. అందరినీ వాళ్ళే రప్పించుకుంటారని నా విశ్వాసం.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!