Pannala Kathyayani

Interviewed by
Ravuri Prasad
07/02/2012
Hyderabad

 

శ్రీమతి పన్నాల కాత్యాయని

  వీరు 17-04-1939 న కృష్ణాజిల్లా నందిగామలో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీకృష్ణమూర్తి, శ్రీమతి శ్యామలాంబ. భర్త డా॥ పన్నాల రాధాకృష్ణశర్మ. సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె, విద్య – S.S.L.C

సేవాతత్పరత : ‘అమ్మ’నే కన్న తల్లిగా ప్రేమించారు. అమ్మ పర్యటనల్లో పాల్గొని అమ్మకు సర్వదా తమ సేవల్ని అందించారు. అందరింటి అభివృద్ధికి అందరితో కలిసి శ్రమించారు. అమ్మనే కాక అందరింటి అన్నయ్యల్ని, అక్కయ్యల్ని ఆత్మబంధువులుగా ఆదరించి అభిమానించే మమతామృత మూర్తి.

శ్రీ రావూరి ప్రసాద్ 07-02-2012వ తేదీన హైదరాబాదులో శ్రీమతి పన్నాల కాత్యాయని గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

ముందుగా మీకుటుంబం గురించి తెలియచెప్పండి.

మేము నలుగురు అక్కచెల్లెళ్ళం; నలుగురు అన్నదమ్ములం. మా నాన్నగారి
పేరు కృష్ణమూర్తి, మా అమ్మపేరు శ్యామలాంబ. మొదటిసారి అమ్మను 1962 లో చూశాను. అమ్మని చూడకముందే ‘అమ్మ దేవత’ అని, ఆ విశేషాలన్నీ నాకు మా వారు చెప్పారు. తర్వాత అమ్మ దగ్గరికి రావటం – చూడటం, జరిగింది. అమ్మను చూడగానే దేవత అంటే ఇట్లా ఉంటుందా అనే భావం ఒకటి, ఏదో కొంత భయం అనిపించింది. ఆవరణలో ఉన్న అన్నయ్యలు – అక్కయ్యలు అందరూ ‘అక్కయ్యా!’ అని పిలవటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది వాళ్ళు అలా ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా చూడటం, అమ్మ కూడా నాతో చాలా చనువుగా మాట్లాడటం, ఆనందాన్ని కలిగించాయి. నా కన్నతల్లి నా పెళ్ళి అయిన సంవత్సరమే పోయింది. అమ్మ దగ్గరకి వచ్చిన తర్వాత నాకు ఆ లోటు తెలియలేదు.

మీరు అమ్మని దర్శించిన నాటి “అందరింటి” వాతావరణం ఎలా వుండేది?

ఆ రోజుల్లో అమ్మ ఇపుడు హైమాలయం వెనుక వున్న ఇంట్లో ఉండేది.

అమ్మ ఇంటికి ఎదురుగుండా చుట్టూ గోడలుండి పెద్దపాక లాగా ఉండేది. దాన్ని పెద్ద మందిరం అనేవారు. మేమంతా వచ్చి సామాన్లు అందులో పెట్టుకుని అమ్మ గదిలో ఉంటే చూసేవాళ్ళం. తర్వాత అమ్మకి స్నానం చేయించటానికి చెరువు నుంచి నీళ్ళు తీసుకొచ్చేవాళ్లం. అప్పట్లో మోటారు, పంపుల సౌకర్యం లేదు. పోతుకూచి విద్యాసాగర్ గారు బండి కట్టుకు వస్తే మేమంతా చెరువు నుంచి బిందెలు మోసి పీపాలో పోస్తే తెచ్చేవారాయన. అంతకుముందు మేము చెరువు నుంచి బిందెలుతో కూడా నీళ్ళు మోసి తెచ్చేవాళ్ళం. ‘నర్తనశాల’ సినిమా తీసిన కొత్తలో లక్ష్మీరాజ్యం, యస్. వరలక్ష్మీ వచ్చారు జిల్లెళ్ళమూడికి, కుమారి, మంగ, సావిత్రి, రమణ, నేను మేమంతా చెరువు నుంచి నీళ్ళు తీసుకురావటం చూచి ‘గోపికలు లాగ ఎంతో బాగుందమ్మా!’ అన్నారు వాళ్ళు. ప్రొద్దున్నే సుప్రభాతం చేయటం నీళ్ళుతేవటం, సాయంత్రం సంధ్యావందనం చేయటం. అందరిల్లు కట్టుబడికోసం ఇటుక బట్టీ వేశారు. పోతపోసిన ఇటుకల్ని నెత్తిన పెట్టుకు తీసుకొచ్చి పేర్చేవాళ్ళం.

సాయంకాలం అయ్యేసరికి మాకు చాలా అలసటగా ఉండేది. కాసు రాధాకృష్ణ రెడ్డి అన్నయ్య ‘సంధ్యావందనంలో తను నామం చెప్పేవాడు – దాన్ని మేమంతా అనాలి. తను భక్తిభావంతో చాలా సేపు చెప్పేవాడు. మేము అలసటతో తొందరగా చెప్పేస్తే లేచిపోవచ్చుగదా! అనుకునేవాళ్ళం.

అట్లా అనుకోకూడదు ఇలా చెయ్యకూడదు అనే ఆంక్షలేవీ ఉండేవికాదు. ఒక ఇంట్లో అంతా కలిసి ఉంటే ఎలా ప్రవర్తించే వాళ్ళమో అలాగే ఉన్నాం. అమ్మ చెంత. అమ్మ కూడా మేము రాగానే మా కోసం స్నానం చేసేది. ఆ నీళ్ళు తీసుకెళ్ళి మేమందరం స్నానాలు చేసేవాళ్ళం. మా స్నానాలు కోసం అమ్మ స్నానం చేసేది. శేషయ్య గార్కి చెప్పి అన్నం తెప్పించి మా కందరికి ముద్దలు కలిపి తినిపించేది. మేమంతా ఏదో చాలా గొప్పవాళ్ళలా Feel అయ్యేవాళ్ళం. చాలా సంతోషంగా ఉండేది. మొదట్లో శని, ఆదివార్లో వచ్చేవాళ్ళం. తర్వాత సెలవులకి వచ్చేవాళ్ళం. ఆ ఉన్నన్నాళ్ళూ ఇట్లా పనులు చేసేదాన్ని. సున్నం గానుగవేసే వాళ్ళం. కుప్ప నూర్పిళ్ళకెళ్ళాం. వరినాట్ల కెళ్ళాం. ఒకసారి వరినాట్లకి వెడితే నల్లమడకాలువ (ఓంకారనది) బాగా పొంగి రాజ్యలక్ష్మమ్మగారు, సావిత్రి, ఝాన్సీ, నేను మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అందరం పెద్దగా అరిచాం. అప్పుడు సింగుపాలెం తాతయ్య (కొల్లి చినవెంకటరత్నం) ఒక కఱ్ఱ ఇచ్చి దాన్ని పట్టుకొని నీళ్ళల్లో కాళ్ళు ఒదిలేసెయ్యమన్నాడు. అలా మమ్మల్నందరినీ ఆయన ఒడ్డుకి చేర్చాడు. అయినా మేమంతా సంతోషంగానే ఉన్నాము కానీ భయపడలేదు, బాధపడలేదు. అది కష్టం అనిపించలేదు. అలా పనులు అందరితో కలిసి చేయటమనేది చాలా సంతోషంగా ఉండేది. ‘అక్కయ్యా అన్నయ్యా చెల్లెమ్మా’ అనుకుంటూ అంతా సరదాగా చేసే వాళ్ళం పనులు. ఇదేదో బాధ్యత అని కూడా చేసేవాళ్ళం కాదు. అలా చేయటం లోనే చాలా ఆనందం అనిపించేది. మాకు.

అమ్మని అమ్మగా చూచారా? దైవంగా కూడానా?

అమ్మని ఎప్పుడూ అమ్మగానే చూశాను. శంఖం, చక్రం పట్టుకుని కిరీటం పెట్టుకుని ఏదో దేవతలా ఎప్పుడూ భావించలేదు. వేదిక మీద పూజలు చేయటం కానీ హాజరు కావటంకానీ చాలా తక్కువ. అమ్మకి స్నానం చేయించేదాన్ని. అప్పుడే కొబ్బరికాయ కొట్టే సమయంలో ‘అమ్మ దేవత’ అని కూడా మనస్సుకి అనిపించేది. అమ్మ కూడా మాతో చాలా సరదాగా ఛలోక్తులు విసురుతూ. నవ్వుతూ నవ్విస్తూ చనువుగా ఉండేది.

అమ్మ మీచే చేయించిన సాధనలేమైన వున్నవా? అమ్మ కోపం ఎలా వుంటుంది?

అమ్మ నాకు ఎప్పుడూ సాధన ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పలేదు. మా కోపాన్ని సంతోషాన్ని అమ్మ దగ్గర ప్రదర్శించాం కానీ అమ్మ ఎవరి మీదైనా కోపపడటం కానీ కోపంగా మాట్లాడటం కానీ చూడలేదు. మేము సంతోషంగా చెప్తే నవ్వేది. కోపంగా చెపితే విని ఊరుకునేది.

అమ్మ దుఃఖించిన సందర్భాన్ని చూచారా?

డా॥ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు. చనిపోయినప్పుడు వారి మృత కళేబరాన్ని జిల్లెళ్ళమూడి తీసుకు వచ్చారు. అమ్మ కార్యక్రమాలన్నీ చేసింది. వారిని తీసికెళ్ళారు. తర్వాత అమ్మ ‘హైమాలయానికి వచ్చింది. అక్కడి ‘అలంకార హైమ’ చేతులు పట్టుకుని “నువ్వులేవని ఈ అట్టముక్కల చేతులు పట్టుకుంటే కానీ నాకు తెలియటంలేదు” అని దుఃఖించింది.

మీ మనసుకి హత్తుకొన్న “అందరింటి" సోదరీసోదరుల ఆత్మీయతాను రాగాలు కొన్ని మాతో పంచుకోండి.

మనుషులు అన్నతర్వాత ఏవో కష్టాలు వస్తూనే ఉంటాయి. కాలేజి పనుల మీద మావారు ఆ ఊరూ, ఈ ఊరూ వెడుతూండేవారు. జిల్లెళ్ళమూడిలో ఉండటం చాలా తక్కువ. అప్పుడు మా అమ్మాయికి తడపర పోసి 106 జ్వరం వచ్చింది. నన్ను చూచి ‘నువ్వు ఎవరో నాకు తెలియటం లేదు’ అని మా అమ్మాయి అంటూంటే నాకు భయం వేసింది. వెంటనే వెళ్ళి ‘అమ్మా! ఇట్లా అంటోంది’ అని చెప్పా. అది సాయంత్రం 7,8 గంటల ప్రాంతం. నెల్లూరి డాక్టర్ గారి దగ్గర కాంపౌండర్ గా పనిచేసే కృష్ణమూర్తి గారు అక్కడ ఉన్నారు. అమ్మను చూడటానికి వచ్చారాయన. రాత్రి 9 గంటల రైలులో నెల్లూరు ప్రయాణమౌతున్నారు. నేను చెప్పగానే అమ్మ “కృష్ణమూర్తి గారితో కలిసి నెల్లూరు డాక్టర్ యస్.వి. సుబ్బారావుగారింటికి వెళ్ళు. నీతో వసుంధరను తోడిచ్చి పంపిస్తాను” అంది. నేను, నా ఇద్దరు పిల్లల్ని తీసుకుని వసుంధరతో కలిసి కృష్ణమూర్తిగారితో తెల్లవారు ఝామున 3 గంటలకు నెల్లూరు చేరుకున్నా. డాక్టర్ గారి వాళ్ళ వాకిట్లో దిగాం. డాక్టర్ గారికి ముందుగా తెలియదు మేము వస్తున్నట్లు. తలుపు తీశారాయన. ఇట్లా అని చెప్పగానే ఆయన A.C. Room లో మా అమ్మాయిని పడుకోబెట్టారు. తెల్లవారిన తర్వాత కానీ దానికి జ్వరం తగ్గలేదు. ఆయన ఎంతో ఆపేక్షగా మా అమ్మాయికి మందులిచ్చారు. మా అందరికీ రాచమర్యాదలు. అంతప్రేమగా గౌరవంగా చూశారు. మా అమ్మాయికి మూడురోజులలో తగ్గిపోయింది. ‘ఇక మేము వెడతాం, అన్నయ్యా!’ అని అంటే ఆయన ‘మీరెట్లా వెడతారు. ఇంకో వారం రోజుల్లో అమ్మ పుట్టినరోజు వస్తోంది కదా! ఈవారం రోజులు ఉండండి. మాతోపాటు కార్లో వద్దురుగాని’ అని మమ్మల్ని కదలనివ్వలేదు. అట్లాగే 10 రోజులూ వారింట్లో ఉండి వారితో కలిసి జిల్లెళ్ళమూడి చేరాం.

డాక్టర్గారితో మాకేమీ ప్రత్యేకించి సంబంధం ఏమీలేదు. కేవలం అమ్మ బంధమే. అమ్మ సరే. అందరినీ ప్రేమిస్తుంది. అది అమ్మకి సహజం. డాక్టర్ గారు జిల్లెళ్ళమూడి వచ్చేవారు. కానీ జిల్లెళ్ళమూడి నుంచి వచ్చిన వాళ్ళని ఎంతోప్రేమగా చూడటం నా మనస్సుకి బాగా హత్తుకుంది.

అలాగే గుంటూరులో శ్రీ నాదెండ్ల లక్ష్మణరావు గారు, భ్రమరాంబక్కయ్య ఉండేవాళ్ళు. మా అమ్మాయికే మళ్ళీ ఏదో సుస్తీచేసి ప్రతీనెలా అక్కడ జనరల్ ఆస్పత్రిలో డాక్టర్కి చూపించాల్సొచ్చేది. నేను మా అమ్మాయిని తీసికొని వెళ్ళి ఆ రాత్రి వాళ్ళింట్లో పడుకుని మర్నాడు డాక్టర్ గారికి చూపించి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేదాన్ని. వాళ్ళకి నేను వస్తాననీ ముందుగా చెప్పేదాన్ని కాదు. వాళ్ళూ రావద్దనీ అనలేదు. వెళ్ళినపుడల్లా ‘అక్కయ్యా, అక్కయ్యా’ అంటూ వాళ్ళూ ఎంతో ప్రేమగా చూసేవారు. కేవలం ఇది ఒక ఉదాహరణ. అలా ఎంతమందో నాకు సహాయం చేశారు- గోపాలన్నయ్య కొడుకు లక్ష్మీప్రసాద్, (లక్కరాజు సత్యనారాయణ) లాల, కుమారి….. ఎందరో. నేను పిల్లల్ని పెట్టుకుని బాపట్లలో ఒంటరిగా చదివించేదాన్ని. వీరంతా అలా సంతోషం, అభిమానాలతో సహాయం చేయకపోతే – నేను ఈ మాత్రం అలా నెగ్గుకు వచ్చేదాన్ని కాదు దీనంతటికి కారణం అమ్మ దగ్గర పెరగటం- అందరితో అమ్మ ఏర్పరచిన అనుబంధం. లేకపోతే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం. ఎవరికి ఎవరమో! ఎవరిని ఏబాధవచ్చినా అడగాలంటే ఎంతో మొహమాటంగా ఉంటుంది. అడిగినా వీలైతే వస్తారు – లేకపోతే లేదు. ఎవరి సమస్యలు వాళ్ళవి. జిల్లెళ్ళమూడి సోదరీ సోదరులు అంతప్రేమగా ఉండేవాళ్ళు.

మీ పిల్లల గురించి, మీపై అమ్మ ప్రేమాశీస్సుల ప్రభావం గురించి తెలియబర్చండి.

మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మా అబ్బాయి పేరు శేఖర్; U.S.A లో ఉన్నాడు. మా అమ్మాయి శైలజ ఇక్కడే ఉంది. మా అబ్బాయికి ముగ్గురు మగపిల్లలు ప్రణవ్, వరుణ్, ఋషి, మా అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు శ్రేయ, స్నిగ్ధ. అంతా బాగానే ఉన్నారు.

అమ్మ అంటే ప్రేమ, ఆపేక్ష. మన మనస్సుకి ఏదైనా కష్టం కలిగితే అమ్మతో చెప్పుకోవచ్చు. ముందు మాకు ఒక బాబు పుట్టిపోయాడు. ఆ బాధ తట్టుకుని మళ్ళీ జీవితం గడపాలి అంటే అమ్మ ఒడిలోనే అలా సేదతీరాన్నేను.

అమ్మ వాక్యాలు ఆచరణసాధ్యాలా? అమ్మ ఫిలాసఫీ ఏమిటి?

అమ్మ అన్నీ తేలికైన పదాలతో చెప్పేది. “నమ్మకమే భగవంతుడు” – విసనకర్రను పెట్టినా భగవంతుడౌతాడు అన్నట్టుగా ఇలా చాలా చెప్పింది. వాటిని జీవితంలో అన్వయించుకోవటం తోనే సరిపోతుంది.

అమ్మకి ప్రత్యేకమైన Philosophy ఏమిటి? వచ్చిన వాళ్ళందరికీ సరిగా భోజనాలు పెట్టారా పెట్టలేదా అని అమ్మ ఎప్పుడూ ఆలోచించటమే నాకు తెలుసు.

అమ్మతో ప్రయాణించారా? అమ్మ మహాసమాధి తర్వాత జిల్లెళ్ళమూడిని దర్శించారా?

నేను అమ్మతో చాలాసార్లు ప్రయాణం చేశాను. అమ్మ కార్లోనే కూర్చొని వెళ్ళేదాన్ని. నాకో ప్రత్యేకత అని కాదు. అమ్మకి స్నానం చేయించడానికి వెళ్ళేదాన్ని. ఎప్పుడు ఎక్కడకు వెళ్ళినా అమ్మ నన్ను రమ్మని పిలిచేది. అమ్మ నా విషయంలో చాలా ప్రేమగా చనువుగా ఉన్నది. అమ్మ ఆలయప్రవేశం చేసిన తర్వాత నేను జిల్లెళ్ళమూడి వెళ్ళాను. ఆలయంలో కంటే మేడమీద అమ్మ మసిలిన ప్రదేశమే నాకు సంతోషంగా ఉంది. అమ్మ గదిని అమ్మ ఉన్నపుడు ఎలా ఉందో అలాగే ఇప్పుడు కూడా maintain చేయాలని అన్నాను. అట్లాలేదని – చూస్తే చాలా బాధగా ఉందని చెప్పాను నిర్వాహకులతో.

ఈనాడు 'అందరింటి' సోదరీ సోదరులతో మీ అనుబంధం ఎలా వుంది?

జిల్లెళ్ళమూడి వాళ్ళు ఎవరొచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది. నా అన్నదమ్ములకంటే కూడా – వాళ్ళు వచ్చారంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇప్పటికి కూడా వాళ్ళు నన్ను అలాగే చూస్తారు. అమ్మే అలా ఒక ఆత్మీయత, ప్రేమ, అభిమానాలు అందరిలో ప్రోది చేసింది.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!