Dr Pannala Radhakrishna Sarma

Interviewed by
Ravuri Prasad
07/02/2012
Hyderabad

 

డా॥ పన్నాల రాధాకృష్ణశర్మ

  వీరు 22-3-1982న కృష్ణాజిల్లా నరసాపురం గ్రామంలో జన్మించారు. కన్న తల్లిదండ్రులు శ్రీకానాదిభట్ల సూర్యనారాయణ, శ్రీమతి కోటమ్మ, దత్తత తల్లిదండ్రులు శ్రీ పన్నాల వెంకటసుబ్బయ్య, శ్రీమతి పున్నమ్మ. వీరి ధర్మపత్ని శ్రీమతి కాత్యాయని. సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె. విద్య M.A.P.hd., ఉద్యోగం- మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడిలో వ్యవస్థాపక ప్రిన్సిపాల్గా పనిచేశారు.

సేవాతత్పరత : అమ్మను గురించి అంబికా సుప్రభాతం – స్తవకదంబం, కరావలంబ స్తోత్రం, సహస్రనామస్తోత్రం, శృంగారలహరి, అశ్రులహరి, పావకప్రభ, పొగడపూలు మొదలైన రచనలు చేసి సాహిత్య ప్రసూనాలతో అమ్మను అర్చించారు. ‘విద్యావాచస్పతి’ అని అమ్మచే సన్మానింపబడిన కవి పండితులు. నవవిధభక్తి మార్గాల పరాత్పరి అమ్మను అర్చించుకున్న భాగ్యశాలి.

శ్రీ రావూరి ప్రసాద్ 07-02-2012న హైదరాబాద్ లో డా॥ పన్నాల రాధాకృష్ణశర్మగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మొదట మీరు అమ్మని దర్శించిన వైనాన్ని తెలుపండి.

మొదటిసారి మా అక్క – హనుమాయమ్మగారు అమ్మను గురించి నాతో చెప్పింది – ‘అమ్మ జగన్మాత – దర్శనం చేసుకో” అని. ఆ తర్వాత శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారి మేనత్త లలితాంబగారు కూడా అమ్మ గురించి చెప్పింది.

ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళివద్దామనిపించింది. బయలుదేరే ముందు రాత్రి తెల్లవారుఝామున ఒక కల వచ్చింది. ఆ కలలో నాటి జిల్లెళ్ళమూడి వాతావరణం అంతా కనబడింది. నేను 7వ మైలు దగ్గర బస్సు దిగాను. నా చుట్టూ నీళ్ళు – వరద. ‘ఇదేమిటి అమ్మా? నన్ను తీసుకువచ్చి ఈ సముద్రంలో పడవేశావు’ అని ‘అమ్మ’ ని నిందిస్తున్నాను. ఆ నీటిలోంచి అమ్మ లేచి నిల్చుంది తెల్లటి చీరెకట్టుకుని. “నాయనా! ఇది లోతేమీ లేదురా. చూడు” అన్నది. అంతవరకు గొంతువరకు లోతు ఉందనుకున్నవాడ్ని మోకాలి లోతు కూడా లేదనిపించింది. అంతలో మెలకువ- తెల్లవారింది. జిల్లెళ్ళమూడి బయలుదేరాను. అప్పటికే నేను హైస్కూల్లో సీనియర్ తెలుగు పండిట్గా పనిచేసేవాడిని; వివాహమైంది. అప్పటికి నా వయస్సు 29 ఏళ్ళు.

అలా మొదట అమ్మను దర్శించుకున్నాను. అది ధనుర్మాసం. అమ్మ దధ్యోదనం ప్రసాదం పెట్టింది. అప్పటికి నేను ఇంకా స్నానం చేయలేదు. అయినా అమ్మ ఇచ్చింది కదా అని తిన్నాను. అప్పుడు అక్కడున్న సీతాపతి తాతగారింట్లోనే నా భోజనం, బస ఏర్పాటయింది. తిరుగు ప్రయాణంలో మరలా ఒకసారి అమ్మ దర్శనం చేసుకోవాలనిపించింది. అమ్మ తన పూరింట్లో లోపల గదిలో ఉంది. అమ్మతో ఒంటరిగా మాట్లాడాలని నా కోరిక. అమ్మని చూచిన నాకు దుఃఖం పెల్లుబికింది. కొంతసేపటికి తమాయించుకొని ‘త్వయిరక్షతి రక్షకైః కిం అన్యైః, త్వైచారక్షతి రక్షకైః కిం అన్యైః’ ఒక శ్లోక పాదాన్ని చదివాను. అమ్మా! నువ్వు రక్షించదలచుకుంటే ఇతర రక్షకులతో పనిలేదు. నువ్వు రక్షించదలచుకోబోతే ఎందరు రక్షకులున్నా ఉపయోగం లేదు’ అని అర్థం. “ఆ! అదే నీకు శ్రీరామ రక్ష” – అన్నది అమ్మ. ఆ తర్వాత ఒక పిచ్చిప్రశ్న వేశాను. ‘అమ్మా! Theory of evolution అని అంటారు. కదా! అంటే ఏమిటి?’ అని అడిగాను. “అదే నాయనా! Involution లోంచే Evolution వచ్చింది” అన్నది. నాకు బుఱ్ఱ తిరిగిపోయింది. Evolution అంటే తెలిసింది. కానీ Involution అంటే అర్థం తెలియదు. ఇంకా మాట్లాడితే పరువుపోతుందని నోరు మూసుకుని కూర్చున్నాను. మనసు చాల ప్రశాంతంగా ఉంది. తిరిగి ఇంటికి వచ్చేశా. ఆమె చాల గొప్పవ్యక్తి, మూర్తీభవించిన వాత్సల్యం అని అనిపించింది. ఈ అమ్మ మన సొంత అమ్మ. సొంత తల్లి కంటె ఆప్యాయత, ప్రేమ కలిగినది అనిపించింది. కన్నతల్లిని మించిన ప్రేమ ఆమె చూపిస్తోందనిపించింది. అందుకే మళ్లీ రావాలనిపించింది.

అమ్మను గూర్చి మీరు 'సంధ్యావందన'- 'సుప్రభాతాది' అనేక రచనలు చేశారు. అందుకు ప్రేరణ ఏమిటి?

డా॥ ప్రసాదరాయకులపతి రచించిన శివసాహస్ర, అంబికాసాహస్రి, ఐంద్రీసాహస్ర, త్రిశతి (3వందలశ్లోకాలు) సప్తశతి (7 వందల పద్యాలు) గ్రంధాలను అమ్మ నాకు ఇచ్చింది. చదివిన తర్వాత నేనూ ఏదో వ్రాయాలని అనుకున్నాను. అంతఃపూర్వం నేను వ్రాసిన చంద్రశేఖర శతకము, శివార్చన గ్రంథాలను అమ్మకు చూపించాను. తర్వాత ఒకనాడు అంధసోదరులు, కవి శ్రీ యార్లగడ్డ రాఘవయ్యగారు ‘మీరు అమ్మ సుప్రభాతాన్ని వ్రాయొచ్చుగదా!’ అన్నారు. అప్పట్లో ధారాళంగా కవిత్వం చెప్పే శక్తి నాలో లేదు. నాకేంచేత నవుతుందనుకున్నాను. ఒకరోజు ‘హరిదాసుగారు’ నివసించే పూరిపాకలో ఉన్నాను. అమ్మ సుప్రభాతం వ్రాద్దామనిపించింది. రాత్రి గుడ్డి దీపం వెలుగులో మొదలుపెట్టి 28 శ్లోకాలు వ్రాశాను. అమ్మకి చూపించాను. “సుప్రభాతమే కాదు, ప్రపత్తి, స్తోత్రం, మంగళాశాసనం అన్నీ వ్రాయాల్సిందే” అన్నది. వ్రాశాను. శ్రీరాముని గురించి లోగడ విన్న మాదిరిగా తెలుగులో పాటలు కూడా వ్రాశాను. అన్నీ వ్రాశాక “చాల బాగుంది” అన్నది. పాటల బాణీలు, Tunes నేనే ఏర్పరచాను; నాకు సంగీతం రాకపోయినా.

అప్పుడు నా జీతం తక్కువ అయినా వాటిని నేనే అచ్చువేయించాలను కున్నాను. అమ్మ అనుమతితో సోదరులు శ్రీ శిఖాకొల్లు వెంకటేశ్వర్లుగారు అచ్చువేయిస్తానన్నారు. ‘సరే’ అని వాటికి తాత్పర్యాలు వ్రాశాను. శ్రీ బృందావనం రంగాచార్యులు గారి పర్యవేక్షణలో అచ్చు వేయించారు.

1963వ సంవత్సరంలో నాకు అప్పికట్ల బదిలీ అయింది. దరిమలా నేను వ్రాసిన స్తోత్రములకూర్పు (అంబికాస్తవకదంబం) “సాయంకాలం చదివితే బాగుంటుంది” అన్నది అమ్మ. అలా ‘సంధ్యావదనం’ (అంబికాస్తవకదంబం) వచ్చింది. శ్రీకాసురాధాకృష్ణరెడ్డి వాటికి వయోలిన్ మీద Tune చేస్తూ ‘బ్రహ్మాండంగా ఉన్నాయి’ అనేవాడు. అప్పికట్లలో ఉండగా తరచు జిల్లెళ్ళమూడి వెళ్ళేవాడిని. వెళ్ళినపుడు ఏదో ఒక స్తోత్రం వ్రాసుకుని వెళ్ళేవాడిని. ఆరోజుల్లో ‘శ్రీ మోతడక రామచంద్రయ్య’ గారు రచించిన ‘శ్రీమంజుల స్వర్ణ’ దండకాన్ని అందరూ చదివేవారు. ‘అమ్మా! దాంట్లో చాల తప్పులున్నాయి’ అన్నాను. “అయితే నువ్వు సంస్కృతంలో వ్రాయకూడదా?” అన్నది. ‘రాస్తానమ్మా’ అన్నాను. ఆ రాత్రికి రాత్రి ‘జయజయ జగదేక మాతః’ దండకం వ్రాశాను.

అమ్మతో మీరు చేసిన సంభాషణలు, మహిమాన్వితమైన 'అమ్మ' అనుగ్రహానుభవాలను మాతో పంచుకోండి.

అమ్మను చూస్తూ కూర్చోవటమే నాకు సంతోషం. ఏవో ప్రశ్నలు వేయటం, వాటికి సమాధానం రాబట్టుకోవటం మీద నాకు ఆసక్తిలేదు. కానీ మనస్సులో ఉండేది ‘అమ్మ దగ్గరకి వచ్చాను. కాబట్టి జీవన సార్థకత ‘ఏదన్నా ఏర్పాటుచేయాలి’ అని చాలాసార్లు అడిగాను. ఆరోజుల్లో తరచు వచ్చిపోతూండే వాడిని. అమ్మను వదిలి వెళ్ళాలంటే బాధ, దుఃఖం వచ్చేవి. ఏడుస్తూండేవాడిని. ఒకసారి నేను గుంటూరు నుంచి వస్తున్నాను. చివరి బస్సు; నేను నిద్రపోతున్నాను. బస్సు ఒక్కసారి కుదిపింది. ముందకుపడ్డాను. లోపల టైర్పెడతారు కదా, దానిమీద పడ్డాను. తమాషా ఏమిటంటే, నేను దానిమీద పడి ఉంటే తలపగిలిపోయేది- మేకులు అన్నీ ఉన్నాయి. ఎవరో కాలు అడ్డం పెట్టారు. ఆ కాలు మీద పడ్డాను. అందువలన నాకేం దెబ్బ తగలలేదు. అమ్మ అలా నన్ను కాపాడింది.

అప్పికట్ల బదిలీ అయిన తర్వాత నాకు జ్వరం వచ్చింది. నాలుగు రోజులు అయిపోయాయి. ఎంతకాలం అని ఉండగలను. Transit 6 రోజులే. ‘ఇదేమిటమ్మా నీ దగ్గరకి వద్దామనుకుంటే నాకు ఇలా అయింది’ అనుకున్నాను. రాత్రి కలలో అమ్మ తన వేలు నా నోట్లో పెట్టింది. దాంట్లోంచి ఏదో తియ్యని ద్రవపదార్థం వచ్చినట్లనిపించింది. మరుసటిరోజునే జ్వరం తగ్గిపోయింది. ఈ సంఘటనని ‘శృంగారలహరి’ లో ఒక శ్లోకంలో చెప్పాను.

సీనియర్ తెలుగు పండిట్గా అమ్మని దర్శించిన మీరు, మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి వ్యవస్థాపక ప్రిన్స్పాల్ అయిన వైనం ఎలాంటిది?

ఒకసారి నేను అప్పికట్ల బయలుదేరబోతున్నాను. అమ్మ స్నానానికి వెళ్ళబోతుంది. ‘అమ్మా! వెళ్ళొస్తానమ్మా. ఏం చేస్తాను. ఉద్యోగం తప్పదు కదా!’ అన్నాను. “ఇక్కడ కాలేజి పెడితే ప్రిన్సిపాల్గా వస్తావా?” అని అడిగింది. ‘ఇక్కడ బడీలేదు – గుడీలేదు. కాలేజి పెట్టటం ఏమిటి? నేను ప్రిన్సిపాల్గా రావటం ఏమిటి? ఎందుకమ్మా ఎగతాళి చేస్తావు?’ – అన్నాను. నేను అప్పటికి M.A కూడా Pass కాలేదు. M.A. Pass కాని వానికి Lecturer కూడా ఇవ్వరు కదా! ‘అమ్మ’ నవ్వి ఊరుకుంది. తర్వాత M.A. Pass అయినాను. కరీంనగర్ జిల్లా ‘ధర్మపురి’ సంస్కృతకళాశాలలో Principal గా చేరాను. ఆ కాలేజి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. చోటులేక ఒక గుళ్ళో పెట్టుకున్నారు అది Night కాలేజి. ఇక్కడే కాలేజి పెడితే మన ‘అమ్మ’ దగ్గర కాలేజి పెట్టకూడదా? అన్ని సౌకర్యాలూ అక్కడ ఉన్నాయని అనిపించింది. నన్ను బాల్యంలో హైస్కూల్కి పంపిన వాళ్ళు లేరు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చదువుకున్నది సంస్కృతమే. వారాలు చేసుకుని చదువుకునేవాడిని. ‘అమ్మ’ సన్నిధిలో కాలేజి పెడదామని ఉత్తరం వ్రాశాను; నాకోసం అనేకాదు – విద్యాదానం చేసినట్లుగా ఉంటుందని. ఆ తర్వాత నేవెళ్ళినపుడు, అమ్మ దగ్గర ఈ ప్రస్తావన వచ్చింది. “తప్పకుండా పెట్టు, నాన్నా!” అని అమ్మ సంతోషించింది. అధరాపురపు శేషగిరిరావుగారు మొదటి Correspondent. ఆయన చనిపోయిన తర్వాత College permission order 38.grant – in- aid will not be sanctioned. It depends upon the budgetary position after 5 years అని. జిల్లెళ్ళమూడి college లో చేరమని ‘అమ్మ’ KBG కృష్ణమూర్తి గారిని నా వద్దకి పంపింది. ఈలోగా శ్రీ దివాకర్ల వేంకటావధాని గారు Allahabad university లో ‘dept- for south Indian languages’ అనే శాఖని పెడుతున్నారు. మీరు వెళ్ళి చేరండి, Professor అవుతారు – అని నాతో అన్నారు. ఇపుడు ఈ రెండింటిలో ఎక్కడికి వెళ్ళాలీ అని నేను సందిగ్ధంలో పడ్డాను. జిల్లెళ్ళమూడి ప్రిన్సిపాల్గా రావటానికి అప్పటికే చాలమంది సిద్ధమౌతున్నారు. అమ్మ అన్నది “వాడే రావాలి ఇక్కడికి” అని. “ఇక్కడ పాండిత్యం, ప్రతిభ ప్రధానం కాదు భక్తి. అది ఉన్నవాడు వాడు. వాడు వస్తే బాగుంటుంది” అని అమ్మ అన్నదని KBG కృష్ణమూర్తి గారు చెప్పారు. మా మామగారు వాళ్ళు ‘అక్కడ University లో పెద్ద ఉద్యోగం. ఇక్కడ 5 ఏళ్ళదాకా Grant ఏమీ రాదు. ఏం చూసి జిల్లెళ్ళమూడి పోతారు? మీకు తిండి తిప్పలు ఉండక్కర్లేదా?’ అన్నారు. రెండురోజులు మధనపడ్డాను. అలహాబాదు ఉద్యోగం నా గొప్పతనానికి సంబంధించినది, జిల్లెళ్ళమూడి ఉద్యోగం నా భక్తికి సంబంధించినది. కాబట్టి ఇక్కడ చేయడం ప్రధానం అనిపించింది. ధర్మపురిలో Resign చేసి జిల్లెళ్ళమూడిలో చేరాను.

కాలేజి నడుస్తోంది; బాగానే ఉంది. విరాళాలు అడగాలంటే చాల బాధగా ఉండేది. ప్రతివాడి దగ్గరకు పోయి ‘దేహి’ అని అడగాలి గదా! ‘అమ్మా! నువ్వేదో మోక్షమార్గాన్ని చూపిస్తావని నీ దగ్గరకు వచ్చాను. ఇదేమిటి! ఎక్కేగడప, దిగేగడప. వాళ్ళు నన్ను తిట్టుకొంటారు. నా ఖర్మ ఏమిటిది? కాలేజి అక్కరలేదు. ఎవరి నన్నా చూడమ్మా’ అన్నాను ఒకసారి. “అలా కాదు, నాన్నా! దానికో Time ఉంది. వచ్చినప్పుడు నీకు అన్నీ అనుకూలంగానే వస్తాయి” అన్నది అమ్మ.

ఏడాదికే నాకు తల బొప్పి కట్టింది. ప్రతినెలా జీతాలు ఇవ్వటం కష్టమై పోయేది. నాకు చాల బాధ అనిపించి, ‘ఎందుకు ఇది – ప్రారంభంలోనే తీసేస్తే బాగుంటుంది -అనిపించి అందరికీ Notice లు పంపించాం- The very existence of the college is thretened due to financial problems అని. ఒకరోజున అమ్మ దగ్గరికి వెళ్ళాను. అక్కడ రామకృష్ణగారు కూర్చుని ఉన్నారు. ఆయనతో “ఓరేయ్ వీడు కాలేజి మూసేస్తాడట రా! మూసేయటానికేనా కాలేజి పెట్టింది?” అన్నది అమ్మ. ‘అవునమ్మా! ఇది ఎన్నాళ్ళు నడుస్తుంది? Grant అదీ లేకుండా పోయె. నాకు చాలాకష్టంగా ఉంది’ అన్నాను. అప్పుడు రామకృష్ణగారు ‘మాష్టారూ! మీకు ఎంతకావాలి నెలకు? నాకు ఒక వారంరోజులు ముందు చెప్పండి. నేను ఆ సొమ్ము ఏర్పాటు చేస్తా. అమ్మకు కాలేజి తీసేయటం ఇష్టం లేదు’ అన్నారు.

ఆశ్చర్యం. తర్వాత ఒకటిన్నర సంవత్సరములకే Grant – In- aid వచ్చింది కాలేజీ స్థాపించిన తేదీ నుంచి. దానిలో ఐదువేలు తీసి స్వర్ణోత్సవ నిధికి విరాళంగా ఇచ్చాం. నాటి వరకు కళాశాల విరాళాల మీదే ఆధారపడింది.

మీరేమైనా అమ్మను కోరుకొన్నారా?

చాలాకాలం నాకు సంతానం లేదు. జిల్లెళ్ళమూడి వచ్చాక పెద్దపిల్లవాడు పుట్టాడు. వాడికి నాలుగేళ్ళు వచ్చాకపోయాడు. ఒకసారి వాడు మేడ మీద నుంచి పడ్డాడు. నా భార్య కాత్యాయని ఒళ్ళు తెలియకుండా పడిపోయింది. మెల్లగా పట్టుకుని క్రిందికి దిగాం. అప్పుడే వాడు పోవాల్సింది- ఎందుకో బ్రతికాడు. ‘అమ్మా! నీ అనుగ్రహం వలన బ్రతికాడు’ అని ఈమె ఉత్తరం కూడా వ్రాసింది. ఆనాటి మాతృశ్రీ పత్రికలో కూడా వేశారు దాన్ని.

ఆ తర్వాత టీకాలు వేయించాము; ధనుర్వాతం వచ్చిపోయాడు. “వాడు ఎక్కడికి పోయాడు? నా దగ్గరకే వచ్చాడు” అంటూ ఓదార్చింది అమ్మ మమ్మల్ని. ఆ షాక్ నుంచి కోలుకోవటానికి నాలుగైదు నెలలు పట్టింది. ‘ఈయన మీద అమ్మ అనుగ్రహం పోయింది. ఇక జిల్లెళ్ళమూడి రాడు’ అని చాలమంది అనుకున్నారు. కానీ దానికీ దీనికీ సంబంధం లేదు. ఒకప్పుడు అమ్మను ఒకటి కోరాను. ‘ఎన్ని కష్టాలు వచ్చినా నీ మీద విశ్వాసం సడలకుండా చూడు’ అని.

“అది అంత తేలికకాదు, నాన్నా! దానికి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఇదీ అందులో భాగమే” అన్నది అమ్మ.

ఇటు కాలేజీ ప్రిన్సిపాల్గా అటు S.V.J.P. కార్యవర్గసభ్యునిగా ఈ రెంటికీ ఎలా న్యాయంచేకూర్చారు?

విశ్వజననీ పరిషత్ కార్యవర్గ సభ్యునిగ నా పాత్ర నామ మాత్రమే. అమ్మ స్వర్ణోత్సవాల్లో అనేకచోట్ల తిరిగి ఉపన్యాసాలు ఇచ్చాను. అంతే. నాకు సంబంధం విద్యాపరిషత్ తోనే. ఆ పరిపాలన; నిధులు, విరాళాల సేకరణ అంతా నేనే చేసేవాడిని. కొద్దిరోజుల్లోనే అన్ని కాలేజీల కంటే ఇది మంచి కాలేజి అని గుర్తింపు వచ్చింది. జాతీయ, రాష్ట్రీయ పోటీల్లో విద్యార్థులు గణనీయమైన ప్రతిభను ప్రదర్శించారు.

'ప్రతీదానికో టైమ్ ఉంది. అది వచ్చినపుడు నీకు అన్ని అనుకూలంగా ఉంటాయి' అని అమ్మ మీతో అన్నమాట కనుకూలంగా మీ జీవితంలో అనుకూలించినవేమిటి?

అమ్మ మాటలు నాకు తర్వాత అనుభవంలోకి వచ్చాయి; అది తిరుపతి వెళ్ళటంతో మొదలైంది. కాలేజీని Post graduate center చేసి University చేయాలని కోరిక ఉండేది నాకు. దాని కోసమే నేను Ph.D. చేయాల్సివచ్చింది. శ్రీరాముని పాత్రమీద ‘శ్రీరామ శీలాను శీలనం’ అని సంస్కృతంలో చేశాను. అమ్మతో చెప్పాను. “చెయ్యి, నాన్నా!” అంది. రికార్డు స్థాయిలో- 4 నెలల్లో Ph.D. వచ్చింది.

తిరుపతి నుంచి వచ్చాక Pondicherry వెళ్ళాను. సాధనాపరంగా తిరుపతి లోనే మొదలైంది. Bhagavatham critical Research centre లో 5 ఏళ్ళు పనిచేశా- మూడు స్కంధాలకి వ్యాఖ్యానం వ్రాశా.

హైమక్కతో మీ జ్ఞాపకాలు మాతోపంచుకోండి.

అందరి యెడల హైమ చాల ప్రేమగా ఉండేది. ‘మీరంతా కవులు, అన్నయ్యా! అమ్మను పొగడుతారు. నా కదిలేదు కదా! అనేది’. ‘ఏమీ అక్కరలేదమ్మా. అమ్మ గర్భవాసాన పుట్టిన బిడ్డవు నువ్వు. అదే నీ గొప్పదనం’ అనేవాణ్ణి.

అమ్మ దుఃఖించిన సందర్భం ఏమైనా చూశారా?

ఒకసారి నేను తిరుపతి ఏదో Training కి వెళ్ళి తిరిగి వస్తూ వస్తూ ఏదో పూలూ, పళ్ళూ తెచ్చాను. ఆరోజు అమ్మ అత్తగారు కనకమ్మ బామ్మ పోయింది. దహనం చేయటానికి తీసుకు వచ్చారు. దారిలో వస్తూ వస్తూ అమ్మ శ్మశానంలో ఉందంటే అక్కడికి వెళ్ళాను. శుభాశుభాల గురించి ఆలోచన లేదు. అమ్మ ఎక్కడుంటే అక్కడే పూజ చేశాను. అప్పుడు అమ్మ, “నాన్నా! అత్తయ్య పోయిందిరా” అని ఏడ్చింది. నేను అమ్మ దగ్గరగా కూర్చున్నాను. ‘ఏమిటీ? అమ్మ కూడా ఏడుస్తోంది’. అనిపించింది- ‘మానవ రూపం ధరించి వచ్చింది కదా! ఈ నాటకం కూడా సాగాలేమో’ అనిపించింది.

ఎక్కడేమి జరిగినా 'అమ్మ'కి అన్నీ తెలుస్తాయా?

ఒక సందర్భంలో నేనే అమ్మని అడిగాను ‘నీకు అన్నీ తెలుస్తాయా?’ అని. “అన్నీ తెలుస్తాయి. ఈ గోడ నీకు అడ్డం ఉంది. గోడ అవతల ఏముందో నీకు తెలియదు. నాకు తెలుస్తుంది, నాకు గోడలు అడ్డుకావుగా!” అన్నది.

అమ్మ జన్మలు లేవందని అంటారు - దీనిపై మీ స్పందన?

అమ్మ మాటల్ని అందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారని నేను ఇప్పటికీ అనుకోవటం లేదు. పునర్జన్మల విషయంలో ఒకసారి చర్చ జరిగింది. అమ్మ పునర్జన్మలు లేవంటున్నది అని అన్నారు కదా! అంటే ‘ఏ దృష్టితో అన్నది!’ అని పట్టించుకోకుండా అమ్మ జన్మలు లేవన్నది అని ప్రచారం చేశారు. నేను అడిగాను. “శరీరం వదలిపెట్టి మళ్ళీ కొత్త శరీరం ధరించటమే పునర్జన్మ అంటే నాకు ఆక్షేపణ లేదు-” అన్నది అమ్మ. ‘నాకు కూడా అంతే’ అన్నాను. ఆత్మకెప్పుడూ చావులేదు. అది నిజమే. కానీ ఆత్మప్రారబ్ధవశాన ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. దానినే మనం పునర్జన్మ అంటున్నాం.

అమ్మ వాక్యాలు ఆచరణ సాధ్యాలా?

అమ్మ వాక్యాలు ఆచరణలో చాలా కష్టం. “కూతురుని కోడలిని ఒకలా చూడటం అద్వైతం” అన్నది. ఎంతమంది చూస్తున్నారు? మాటలు చెప్పటం వేరు, అనుసరించటం వేరు ఆధ్యాత్మికంగా. ఆచరణలోకి వచ్చేటప్పటికి దాదాపుగా అందరూ బోర్లపడ్డ వాళ్ళే; నేనేమీ మినహాయింపు కాదు. నాడు అమ్మ చెప్పిన మాటలు నేడు జీవితంలో అనుభవంలోకి వస్తున్నాయి. నేను ‘రమణమహర్షుల’ 13, 14 గ్రంథాలు అనువాదం చేశాను. ‘స్వామి రామదాసు’ గ్రంథాలు 13, 14 వ్రాశాను. దాదాపు మొత్తం 40 – 50 పుస్తకాలు చేశాను.

'అమ్మ' మాటలకీ- 'శ్రీ రమణమహర్షుల' బోధలకీ వ్యత్యాసం ఏమిటి?

అమ్మ మాటలకి మహర్షిబోధలకి ఎక్కడా నాకు తేడా అనిపించలేదు. “నేను నేనైన నేను” అనేది అమ్మ చెప్పిన మహావాక్యం.

‘నేను, నేను అంటున్నావు; ఆ నేను ఎక్కడి నుంచి వచ్చిందో చూడు’ అంటారు మహర్షి. రెండూ ఒకే రకంగా ఉంటాయి. “ఎంత వెదికినా అది కానిది నాకు కనిపించలేదు” అన్నది అమ్మ. అది అంటే బ్రహ్మ పదార్థం. ‘భ్రమ తీరితే అంతా బ్రహ్మమే’ అని అంటారు. వారిద్దరూ చెప్పే మాటలలో తేడా కానీ భావం ఒకటే.

అమ్మకంటూ ఒక ఫిలాసఫీ ఉందా? ఉంటే అది ఏమిటి?

అమ్మకి ప్రత్యేకమైన Philosophy ఉందని మనం అనుకోవటం తప్ప ప్రాచీనులు చెప్పిన దానికి – ముఖ్యంగా శంకరభగవత్పాదులు చెప్పిన అద్వైత సిద్ధాంతానికి సరిగ్గా సరిపోతుంది. అడిగేవాళ్ళని బట్టి సందర్భాన్ని బట్టి వేరే విధంగా కనిపించవచ్చును. Basic గా అమ్మది అద్వైత సిద్ధాంతము. అందుకే అమ్మను వేరే ప్రశ్నలేవీ అడగలేదు. అమ్మను మహర్షిని చూసిన తర్వాత ‘సర్వమూ చైతన్యమయమే, శక్తిమయమే’ అనే దాని మీద పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు 32,000 శ్లోకాల్లో ఉన్న యోగవాశిష్టాన్ని తెలుగులో వ్రాస్తున్నాను. ‘Static aspect is brahman, dynamic aspect is sakti’ అని నా సిద్ధాంతం. శ్రీ లలితా సహస్రనామస్తోత్రం అనేది బ్రహ్మ విద్య అని నా నమ్మకం. శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో కూడా దీని ప్రభావం ఉంది; దానికి భాష్యంలా అద్భుతంగా ఉంటుంది.

'అపరశంకరా' అంటూ అమ్మ మిమ్మల్ని సమ్మానించిన సందర్భం ఎలాంటిది?

నేను ‘శృంగారలహరి’ వ్రాయటానికి అమ్మే కారణం. గుంటూరు నుంచి ఒకరు వస్తే “నీకు ‘సౌందర్యలహరి’ పుస్తకం దొరికితే ఒకటి వాడికి ఇవ్వు” అన్నది అమ్మ- ఆయన మరుసటిరోజున తెచ్చి ఇచ్చారు. అద్భుతంగా ఉంది. నేను కూడా ఇట్లా వ్రాయాలి అనిపించింది. ఆయన 100 శ్లోకాలు వ్రాస్తే, నేను 120 శ్లోకాలు వ్రాశాను. అప్పికట్ల నుంచి వస్తూ కొన్ని శ్లోకాలు వ్రాసి అమ్మకు వినిపించేవాడిని. “ఓరేయ్! అపరశంకరా” అన్నది. ‘నువ్వు నా మీద ప్రేమతో అన్నావు కానీ ఆయన కాలిగోటికి కూడా పోలను.’ అన్నాను అమ్మతో. నా అల్లరి “శృంగారలహరీ” అన్నది అమ్మ. అక్కడ యార్లగడ్డ రాఘవయ్యగారు ఉన్నారు. “మీ పుస్తకానికి అమ్మ పేరు పెట్టింది.” అన్నారు. శృంగం ఇయర్తీతి శృంగార:- శృంగారం అంటే అధిక ప్రాధాన్యం కలది. సమస్త సృష్టికి మూలమైన దేదైతే ఉన్నదో అది.

'అంతా అదే' అన్న అమ్మ వాక్యానికి మీ వ్యాఖ్య ఏమిటి?

అమ్మ చెప్పిన ‘సర్వం బ్రహ్మమయం’ అనే భావన నాలో దృఢపడింది. లోగడ అమ్మ చెప్పింది. “నీకా సమయం వస్తుంది; అపుడు నువ్వు దాంట్లో ఉంటావు” అని. అది ఇప్పుడు వచ్చిందనుకుంటాను. లలితా సహస్రనామాల్లో ఒక మాట ఉంది. ‘చిచ్ఛక్తిశ్చేతనా రూపా జడశక్తిర్ణడాత్మికా’ అని. She is the embodiment of it. అమ్మ మానవ రూపంలో వచ్చింది; కానీ సమస్త సృష్టిచైతన్యం. అమ్మ చిచ్ఛక్తి స్వరూపం. సూర్యుని, సూర్యుని వేడిమిని వేరు చేయగలమా? మనలో ఈశ్వరుడు కూడా అట్లాగే ఉన్నాడు. ‘చిత్’ అంటే స్త్రీలింగమౌతుంది; ‘చేతనః’ అంటే పుంలింగం అవుతుంది. ‘చైతన్యం’ అంటే నపుంసకలింగం అవుతుంది. కానీ తత్త్వం ఒకటే. అమ్మ అమ్మగా ఉన్నా, అయ్యగా రమణ మహర్షిగా ఉన్నా తత్త్వం ఒకటే అని నా కనిపిస్తుంది. దానితోటే ఇపుడు నేను జీవిస్తున్నాను.

అమ్మ మాటల్ని అమ్మ తత్త్వాన్ని ఎలా సమన్వయ పర్చుకోవాలంటారు?

అమ్మ చెప్పిన మాటల్ని కనుక జాగ్రత్తగా మననం చేసుకోగలిగితే మంచిది. నా సర్వస్తోత్రాలలో ఆమెను ఒక దేవతలాగా వర్ణించాను; అట్లా చూడాలి. ఆ స్తోత్రాలు చదువుకోవాలి. అమ్మతత్త్వాన్ని అర్థం చేసుకుంటే సమస్తము ఈశ్వరతత్త్వమే అని తెలుస్తుంది. ఎవరైనా చేయాల్సింది అదే. మా అమ్మాయి పెళ్ళి, మా అబ్బాయి ఉద్యోగం అనో రకరకాల కోరికలు కోరవచ్చు. నాకు మొదటినుంచి ఆ రకమైన కోరికలు లేవు. ఇప్పుడు అదే నాకు జీవితంలో అనుభవం అవుతోంది.

అమ్మ సూక్తులలోని అంతరార్థాన్ని ఇతర శాస్త్రాలతో కూడా సమన్వయం చేసుకుంటే మనకు విశేష జ్ఞానం కలుగుతుందని నా విశ్వాసం.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!