Yellapragada Suselamma

Interviewed by
Ravuri Prasad
12/01/2012
Hyderabad

 

శ్రీమతి యల్లాప్రగడ సుశీలమ్మ (సుశీలక్కయ్య)

  వీరి స్వగ్రామం గుంటూరు జిల్లా అడవులదీవి. జన్మస్థలం వల్లూరు. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు బసవరాజు, శ్రీమతి వరలక్ష్మి. భర్త యల్లాప్రగడ వెంకట లక్ష్మీనరసింహశర్మ. సంతానం – ఒక కుమారుడు. వయస్సు 86 సం.లు. 27-10-2013 తేదీన అమ్మలో ఐక్యమైనారు.

సేవాతత్పరత : భవబంధాల నుంచి విముక్తి కలిగించి మోక్షాన్ని ప్రసాదించే పరమేశ్వరిగా ‘అమ్మ’ని ఆరాధించారు. అభిషేకప్రియ అయిన అమ్మకు స్నానం చేయించటం, పాదాలకు పారాణి, నొసట బొట్టుపెట్టి, పసుపు కుంకుమలతో అమ్మకు పూజ చేసుకున్నారు. అన్నపూర్ణాలయ నిర్వహణకి పచ్చళ్ళు, ఊరగాయలు, పప్పులు, బియ్యం యథాశక్తి సమర్పించిన అందరింటి ఆదర్శ సహోదరి. మూర్తీభవించిన భక్తి, విశ్వాసం.

శ్రీ రావూరి ప్రసాద్ 12-01-2012న హైదరాబాదులో శ్రీమతి యల్లాప్రగడ సుశీలక్కయ్యను చేసిన ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

ముందుగా మీ కుటుంబ పరిచయం, మీ ఆరాధ్యదైవం, అమ్మ ప్రథమ దర్శనానుభూతి గురించి చెప్పండి?

నా భర్త శ్రీ యల్లాప్రగడ లక్ష్మీనరసింహశర్మగారు. మా అత్తవారిది అడవులదీవి; వారిది చాల పద్ధతి, కట్టుబాట్లు, గౌరవం, మర్యాద అన్నీ ఉన్న కుటుంబం. నాకు ఒక కుమారుడు పేరు మధుసూదనరావు. నాకు ఇరవై ఏళ్ళ ప్రాయంలో భర్త స్వర్గస్థులైనారు. నా బాధ నాది; అంతే. ఇతరుల వలన నాకు ఏ రకమైన ఇబ్బందీ లేదు. అత్తవారింట్లో అందరూ నన్ను ప్రేమగా చూచారు.

అమ్మ దగ్గరకి రాకముందు నా ఇష్టదైవం శ్రీరామ చంద్రమూర్తి. ఆయన తప్ప వేరే దైవం లేడని నా నమ్మకం. ఒకసారి శ్రీశైలం వెడుతున్నాను. రైలులో ఎవరో చెప్పుకుంటున్నారు జిల్లెళ్ళమూడి అమ్మ దేవత. ఆమె “కోడలిని కూతురుగా చూసుకోవడమే జ్ఞానం” అని చెపుతుంది- అని.

అమ్మ ప్రేరణ వల్లే నేను జిల్లెళ్ళమూడి వచ్చాను; నేను అనుకోవటం వల్లకాదు. ఒకనాటి స్వప్నంలో నాలోకి పెద్దగాలి ప్రవేశించింది. అది శక్తి అనుకున్నాను. దానిని తట్టుకోలేకపోవటం, మళ్ళీపడుకోవటం. కళ్ళుమూసుకుంటే మళ్ళీ ఆ గాలి ప్రవేశించటం, తట్టుకోలేకపోవటం- రెండు మూడుసార్లు అలా జరిగింది. అమ్మను చూడకముందు నేను ఏ సాధనలూ చేయలేదు. అందరినీ ఆదరించటం, ‘మానవ సేవే మాధవసేవ’ అనుకునేదాన్ని; పూజలు పునస్కారాల కంటే నాకు అదే ఇష్టం.

ఒకనాటి ఉదయం తెనాలి నుంచి మా ఆడపడుచు, మరిది, తోటికోడలు సీతారావమ్మగారు కబురు చేశారు – వారంతా వారం రోజులక్రితమే జిల్లెళ్ళమూడి వెళ్ళి వచ్చారట. మరలా వెడుతున్నారు. తప్పకుండా నేను రావాలి- అని. ఆరోజుల్లో ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే భయం. భర్త పోయిన తర్వాత నేనెక్కడికీ వెళ్ళలేదు. మా జీతగాడిని తీసుకుని తెనాలి చేరాను. మర్నాడు మేమంతా కలసి అమ్మ దగ్గరికి వెళ్ళాము. అది 1960 సంవత్సరము ఫాల్గుణమాసం. మామూలుగా నాకు మా ‘అమ్మ’ కంటే మా నాన్నగారంటే ఎక్కువ ఇష్టం. మా ఇంట్లో ఉన్న చీరె, రవికె – ధోవతి, ఉత్తరీయం, పసుపు కుంకుమ అన్నీ పొట్లాలు కట్టుకుని తీసుకు వెళ్ళాను. ఆరోజు ఆదివారం. జనం 200 దాకా ఉన్నారు. వెళ్ళగానే కాళ్ళు కడుక్కోవాలంటున్నారు అందరూ. కడగాల్సింది మనస్సు ఐతే కాళ్ళేమిటి? అనిపించింది నాకు. నేను కాళ్ళుకడుక్కోలేదు. అలాగే వెళ్ళి కూర్చున్నాను. లోపల అమ్మ స్నానం చేస్తోంది, పూజకు వస్తుందని మందిరంలో కూర్చోమన్నారు. సరేనని అందరం వెళ్ళి కూర్చున్నాం. అక్కడ అంతా అక్కయ్యా – అన్నయ్యా అని పిలుస్తూంటే చాల వింతగా ఉంది. ఇంతలో అమ్మ దర్శనానికి వచ్చింది. అమ్మను చూస్తూనే – ‘ఒక మహత్తరమైన శక్తిని లోపల పెట్టుకుని ఏమీ ఎరగనట్లు కూర్చున్నావా అమ్మా!’- అనే భావనతో నాకు కన్నీటిధారలు ప్రవహిస్తున్నాయి. తెల్ల చీరె కట్టుకుని చాలా సాదాగా ఉన్నది అమ్మ. అందరూ నమస్కారాలు చేసుకున్నారు. నేనూ కొబ్బరికాయకొట్టి నమస్కారం చేసుకున్నాను. తర్వాత అమ్మ తన గదిలోకి వెళ్ళి పడుకుంది. మరలా నేను లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాను. అమ్మ నాకు అభయహస్తం ఇచ్చినట్లుంది.

నాతో చీరె పసుపు కుంకుమ తెచ్చుకున్నాను కదా! బయట కాసిని పూలు, గాజులు కొనుక్కున్నాను. అవన్నీ అమ్మకి ఇవ్వాలని – కానీ ధైర్యం లేక వణికిపోతున్నాను. అమ్మ నా వంకే చూస్తోంది; నేను ఆ తేజస్సును చూడలేక తలవంచుకొన్నాను. చివరికి అమ్మ దగ్గరకి వెళ్ళి నమస్కారం చేయబోతూ ‘ఆనాటి సీతమ్మ తల్లివా! మళ్ళీ ఇవాళ ఇలా వచ్చావా? అమ్మా’ అని దుఃఖపడ్డాను. అమ్మ నా వీపు రాస్తూ “ఇంక పూజ ఎందుకమ్మా? పూజ అయిపోయింది కదా!” అన్నది. లోపలి నుంచి పళ్ళెము, చెంబుతో నీళ్ళు తెప్పించింది. అమ్మ పాదాలు కడిగా, తీర్థం త్రాగా. ఏదో గుడ్డతో పాదాలు తుడవబోతే, కాదని నా పమిటి చెంగుతో తుడిపించుకున్నది. నేను వితంతువును కదా! కనుక కుంకుమ పొట్లం అందించి ‘బొట్టు పెట్టుకో అమ్మా’ అన్నాను. “నువ్వే పెట్టమ్మా. నువ్వు పెడితేనే నాకు బాగుంటుంది” అని నాచే పెట్టించుకుంది; “చూడమ్మా నువ్వు పెడితే నాకు ఎంత బాగున్నదో” అంది. అమ్మ పాదాలకు పసుపు రాసి కుంకంతో పారాణి పెట్టాను తన పాదాలు చూపించి ప్రక్కనున్న వాళ్ళతో “మీరు ఇంతమంది ఉన్నారు. నాకు మీరెవరన్నా పెడితే ఇంత బాగుంటుందా? ఎంత బాగుందో చూడండి”- అన్నది. చిన్న పూలమాల ఇవ్వబోతే “జడలో నువ్వు పెట్టమ్మా. నువ్వు పెడితేనే నాకు బాగుంటుంది.” అని పెట్టించుకున్నది. పటికబెల్లం ఇచ్చాను; నోటికి అద్దుకొని ఇచ్చింది. చీరె, రవిక ఇస్తే “నేను కట్టుకుని చూపిస్తానమ్మా. నువ్వు ఇచ్చింది నేనెందుకు కట్టుకోను.” అన్నది. ధోవతి, ఉత్తరీయం తీసి ‘నాన్నగారికి బట్టలమ్మా’ అన్నాను.

నాన్నగారు 4రోజుల క్రితం ఏదో ఊరు వెళ్ళి ఆరోజే వచ్చారట. కాసేపటికి నాన్నగారూ వచ్చి అమ్మ ప్రక్కన కూర్చున్నారు. నాన్నగారి పాదాలకి నమస్కరించి బట్టలు ఇచ్చాను. లేచి వెళ్ళి బట్టలు కట్టుకు వచ్చి చూపించారు. అమ్మ “లోపలికి వెళ్ళి స్నానం చేసి వస్తా కూర్చో” అన్నది. నాతోవచ్చిన మావాళ్ళంతా ‘వెడదాం ‘పద’ అని నన్ను తొందర చేస్తున్నారు. నేను అమ్మ మంచం ప్రక్కనే అలాగే కదలకుండా కూర్చున్నా. అమ్మ స్నానం చేసి, చీరెకట్టుకు వచ్చి చూపించింది. అమ్మకి గాజులిచ్చా. తీసుకుంది. మనస్సులో ‘నువ్వు అడవుల దీవి రావాలమ్మా!’ అని దణ్ణం పెట్టుకున్నా. భోజనాలు చేసి ప్రయాణమైనాము. అలా ‘నా మొదటి అనుభూతి’ చాలా గొప్పది. నాతోటికోడలు చేత నేను తెచ్చిన పసుపు కుంకుమ, పూలు – పళ్ళు, గాజులు – బట్టలు అమ్మకి పెట్టిద్దామనుకున్నాను. “నీకు ఆ శంక అక్కరలేదు. నువ్వే పెట్టు” అని నా చేత పెట్టించుకుని అమ్మ తాను ఆనందించింది. నన్ను ఆనందింపచేసింది. తిరుగు ప్రయాణంలో నా నుంచి కుంకం రాసులు రాసులుగా పడ్డట్టు, దారి పొడవునా గులాబీలు పడుతున్నట్టు- అనుభూతి కలిగింది.

తిరిగి అమ్మని మీరు ఎప్పుడు దర్శించారు? ఆనాటి జ్ఞాపకాలని మాతో పంచుకోండి?

ఇంటికి వెళ్ళాక నాకు లోగడ ఇష్టమైన రాముడిని ఎవరికో ఇచ్చేశా. నా మనస్సులో అమ్మ తప్ప మరెవ్వరూ లేరు. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళాలనీ ఏదో చూడాలనీ లేదు అప్పటికీ – ఇప్పటికీ. సంవత్సరం తర్వాత మళ్ళీ అమ్మదగ్గరకి రాగలిగాను. వస్తుంటే దారిలో ‘పొన్నూరు’లో అమ్మ కుమార్తె ‘హైమ’ కనిపించింది. నా దగ్గరకి వచ్చి చెయ్యి పట్టుకుని ‘రా అక్కయ్యా – కార్లో కూర్చుందువు గాని’ అని నన్ను కార్లో జిల్లెళ్ళమూడికి తీసుకు వచ్చింది. ‘హైమ’ను చూస్తే గొప్ప వ్యక్తి అనిపించింది. ఆరోజు అధరాపురపు శేషగిరిరావు అన్నయ్యకు బాగాలేదని కార్లో పొన్నూరు నుంచి వస్తున్నారు. మేమంతా ఆ కార్లో వచ్చాం. హైమ నన్ను జిల్లెళ్ళమూడి తీసుకు వచ్చి పందిట్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. నాతో వచ్చిన ముగ్గురు- మా అబ్బాయి మరికొందరు తర్వాత బస్సుల్లో వచ్చారు. నేను ఒక్కదానినే అలా కూర్చున్నాను; ఏమీ తోచటం లేదు. కాసేపట్లో నన్ను రమ్మని అమ్మ కబురు చేసింది. “నిన్ను రానిచ్చారా, అమ్మా!” అంటూ అమ్మ నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చింది. అక్కడ శేషగిరిరావు అన్నయ్య మంచం మీద పడుకుని ఉన్నారు. ఆయన చెయ్యి పట్టుకుని అమ్మ కూర్చొని ఉంది. నేను అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని చాలాసేపు అలా సేదదీరాను.

ఆ మర్నాడు అంతా అమ్మ మాతోనే గడిపింది. మా నలుగురికి అన్నం కలిపి ముద్దలు తినిపించింది. నాకెంతో ఆనందంగా ఉంది. అమ్మ దైవం అని నా దృష్టి. అమ్మ పక్కలో పడుకునే దాన్ని, అమ్మనుదుటి మీద ముద్దుపెట్టుకునే దాన్ని. ఆ అవకాశం అమ్మ యిచ్చిందే. అది అమ్మ దయ. నేను బాచంపీట వేసుకు కూర్చుంటే అమ్మ వచ్చి నా ఒళ్ళో కూర్చునేది. అన్ని తానులకు సంబంధించిన తాను కదా ‘అమ్మ’! స్నానాల గదిలోకి వెళ్ళి అమ్మకి స్నానం ఎలా చేయించాలో తెల్సుకున్నాను.

అమ్మ మీ చేత చేయించిన సేవలేమిటి?

ఒకసారి అమ్మ పెద్దకోడలు శేషు వాళ్ళింట్లో అమ్మ గంగాళంలోకి దిగి స్నానం చేస్తోంది. అపుడు అమ్మకి పసుపు కుంకం ఇచ్చా. పసుపు ముఖానికి రాసుకుని, మంగళ సూత్రాలకి పెట్టి బొట్టుపెట్టుకుని మిగిలినది గంగాళం నీళ్ళలో పోసింది. స్నానం అయింది. కొబ్బరికాయకొట్టా. హారతి ఇవ్వబోతే కర్పూరం వెలగలేదు. ఇంత గిన్నెలో ఆ కర్పూరం పెట్టి “ఎవరు తీసుకుంటారు? (దీనిని మున్ముందు నా విగ్రహ ప్రతిష్ఠకి అందించాలి” అన్నది. ‘నీదయ ఉంటే అట్లాగే నమ్మా- నా కియ్య’ మని ఆ ‘గిన్నె, కర్పూరం’ తీసుకున్నా. 20 ఏళ్ళు వాటిని భద్రపరిచా. గాజులు అమ్మకి దండగా కట్టి వేశా. నేనిచ్చిన ఖద్దరు చీరకట్టుకుని నాన్నగారి వాకిట్లో కూర్చున్నది. నాలుగైదు కిలోల కుంకంతో అమ్మకు పూజ చేశా. పెద్ద పళ్ళెంలో ఆ గాజులు బొత్తులుగా పెట్టింది. వాటిని ఆడ మగ తేడా లేకుండా అందరికీ ఇవ్వమంది. గోపాలన్నయ్యతో సహా అందరికీ బొట్టుపెట్టి ఇస్తే అంతా తీసుకున్నారు.

పూజచేసిన ఆ కుంకం అంతా పొట్లాలు కట్టి మా ‘మరిది ప్రసాద్’ పెళ్ళిలో మైసూర్ పాకంతో ఈ పొట్లాలు కలిపి అందరికీ పంచా. ఆనాటి కొబ్బరి చిప్ప అట్టిపెట్టినా ఉండదని నేను తినేశా. ఆనాడు అమ్మ ఇచ్చిన ‘అగ్గిపెట్టె కర్పూరం’ 20 ఏళ్ళు భద్రంగా ఉంచా. 1987 లో అమ్మ మహాసమాధి తర్వాత ‘అమ్మ’ విగ్రహ ప్రతిష్ఠకి తెచ్చి వాటిని అందించా. కర్పూరం రెండు గడ్డలు గుడ్డలో మూటకట్టి పెట్టెలో పెట్టిదాచాను. మామూలుగా అలా నిల్వపెడితే కర్పూరం ఉంటుందా? హరించుకుపోదూ! అమ్మ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన వెంటనే మా అబ్బాయి ‘మధు’ నన్ను గర్భగుడిలోకి తీసికెళ్ళాడు. అమ్మ విగ్రహం పెట్టగానే ఆ కర్పూరంతో ‘అమ్మ’ విగ్రహానికి మొదటిసారిగా హారతి నేనే ఇచ్చా. అదంతా అమ్మ నిర్ణయం – ప్రేరణలే. అలా చేస్తూ ఒణికిపోయాను. ఎందుకంటే మా ఇంట్లో ఎవరన్నా భోజనం చేసేటప్పుడు నేను కనబడితే అన్నం తినరు – భర్త పోయినా నాకు జుట్టు ఉంది అని. అట్లాంటిది యిందరు ‘వేదపండితుల’ నడుమ ఆ కోలాహలంలో అమ్మ విగ్రహానికి తొలిహారతి నేను ఇచ్చాను.

ఒకనాడు అమ్మవద్ద ప్రముఖ నృత్య కళాకారుడు శ్రీ సంపత్కుమార్ ‘జాలరి నృత్యప్రదర్శన’ అద్భుతంగా జరిగింది. తర్వాత అమ్మ దగ్గర ఎవరూ లేరని లోపలికి వెళ్ళాను. అక్కడ కిటికీలో అమ్మ పాదాలకి పెట్టి తీసిన గంధం ఉండలు ఉన్నాయి. నన్ను చూసి అమ్మ మూడు ఉండలు తీసి నా చేతిలో పెట్టింది. “బ్రహ్మ – విష్ణు – మహేశ్వరులమ్మా” అన్నది. వాటిని కళ్ళకి అద్దుకుని సృష్టికి మూలంనువ్వే కదా! అని నవ్వా, ఆ ఉండల్ని ఆరబెట్టి మా ఇంట్లో వెండి కుంకుమ భరిణెలో దాచిపెట్టా. అవి ఇప్పటికీ ఉన్నాయి.

ఒకసారి 100 కొబ్బరికాయలు, గుమ్మడి కాయంత కర్పూరం తెమ్మన్నది అమ్మ. ‘ప్రసాద్’ నాకు దైవికమైన కొడుకు. బాపట్ల నుంచి తను తెచ్చిపెట్టాడు. ఆరోజు ‘వసుంధర’ పెళ్ళి. కొన్నికాయలు మేడపైన కొట్టింది. కొన్ని మాచే కొట్టించింది. ప్రసాద్, మా అబ్బాయి మధు, నేనూ ముగ్గురం అమ్మకి పూజ చేసుకున్నాం. మేము పెట్టిన చీరె కట్టుకుంది. తర్వాత ‘వసుంధర’ వచ్చి పూజ చేసుకుంది. వసుంధర తలంబ్రాలు అమ్మ పాదాలపై పోసింది. అమ్మ తలంబ్రాలు వసుంధర తలమీద పోసింది. మా అబ్బాయి ఉపనయనం అయిన తర్వాత ఆరు రూపాయలు పెట్టి ఒక చీరెకొని; ఆ చీరె – వెండిగ్లాసు ప్రసాద్కి ఇచ్చి అమ్మకి పంపించాను.

ఆరోజు అమ్మ స్నానం చేసి కూర్చుని “నాకు కట్టుకోవడానికి చీరె లేదు- ‘మధు’ చీరెతెచ్చి ఉంటాడు. నాకు అది కావాలి” అన్నదట. అమ్మకి చీరె లేకపోవటం ఏమిటి? అంటే ఆప్రేరణా, క్రియ, దయ అమ్మదే. ఎప్పుడు ఏమి తెచ్చినా అమిత ప్రేమగా తీసుకునేది అమ్మ.

ఒకసారి బెల్లం బూంది చేయించమంది. అపుడు నా దగ్గర మూడు వందల రూపాయలుంటే ఆఫీస్ లో ఇచ్చా. పెద్ద పళ్ళెం నిండ బూంది వచ్చింది. దాన్ని అమ్మగదికి తెచ్చారు. అమ్మకి నివేదన చేసి కొబ్బరికాయకొట్టి హారతి ఇచ్చా. “భవతీ! భిక్షాందేహి!” అని మూడుసార్లు అడగమంది. విస్తరి తెచ్చుకున్నాను. మూడు సార్లుపెట్టింది.

మరోసారి బస్తా పసుపుకొమ్ములను పసుపు కొట్టించమంది. నాకు మా అత్తవారింట్లో అంతా భయమే. భయంతో ఉన్నా – నా చేత చేయించేది అమ్మ. మా వాళ్లలో విశేషమేమంటే- వాళ్ళ మనస్సులో ఏమి అనుకున్నా నాతో అమర్యాదగా ఒక్క మాట ఎప్పుడూ మాట్లాడలేదు. ఆవంశం లోని గొప్పతనం అది. పిండివంటలు చేయించి పంపేదాన్ని జిల్లెళ్ళమూడిలో అమ్మకి. అవి అమ్మకి నివేదన అయ్యే వరకు ఆ నూనె అట్టిపెట్టే దాన్ని. “సుశీల పంపింది” అని అమ్మ ఎంతో ఆనందంగా తీసుకుని అందరికీ పంచేది.

ఒకసారి అడవులదీవిలో దోసెలు పోసి జిల్లెళ్ళమూడిలో అమ్మకి పంపించా. మా తోటికోడలు సీతారావమ్మ గారే పోసింది. ఆవరణలో వారంతా కుప్పలు నూరుస్తున్నారు ఆసమయాన. వాటిని అమ్మ అమిత ఆనందంగా తీసుకుని వాళ్ళందరికీ పంచిపెట్టింది. మరొకసారి తోలు చెప్పులు కుట్టించి పంపించాను. ఇక్కడ పొలం పనులు చేసే పిల్లలు ఉంటారు కదా- వాళ్ళ కోసం అని. ఆ చెప్పుల్ని అమ్మ వాళ్ళకి సంతోషంగా ఇచ్చింది. ఆ మనస్సు ఇచ్చిందీ అమ్మే. మొదటి రోజునే – ‘కడగాల్సింది మనస్సును గానీ కాళ్ళని కాదని’ అనిపించిందీ అమ్మే. నాకు ఆ తెలివి ఏమీ లేదు.

మీ పుట్టింటి - మెట్టినింటి నేపథ్యాలు ఏమిటీ ?

నేను కాపురం చేసింది నాలుగేళ్ళే. మా వారుపోయిన తర్వాత జీవితం మీద విరక్తి పుట్టింది. ‘ఎట్లా తిని తిరుగుతున్నానా!’ అని ఏడుస్తూండే దాన్ని. అమ్మ దగ్గరకి వచ్చే దాకా ఎప్పుడూ దుఃఖపడేదాన్ని. ప్రతీరోజూ కలలో కనపడేవారు మావారు.

మా తండ్రిగారిది బాపట్ల దగ్గర వల్లూరు గ్రామం. మా నాన్న వల్లూరు బసవరాజు గారు, మా అమ్మ వరలక్ష్మమ్మ. మా అన్న వల్లూరు చలపతిరావు గారు. సీతారావమ్మ, సుబ్బాయమ్మ, అన్నపూర్ణమ్మ, భాగ్యమ్మ నా తోబుట్టువులు.

అమ్మ జరిపించిన మీ ఇంటి శుభకార్యాలు ఏమిటి?

మా అబ్బాయికి మాఅన్న కూతురునే చేసుకున్నాను. అది ఒక చిత్రమైన
కథ. పెళ్ళి ముందర అమ్మ నన్ను బెదర గొట్టింది- “ఏంటోనే ఆ పిల్లను చేసుకోవటం నాకు ఇష్టం లేదు” అన్నది. మా నాన్నగారు నాతో చెప్పారు ‘మీ అన్నయ్యకి ఆడపిల్లలు పుడితే కలుపుకోవమ్మా’ అని. అయినా అమ్మ మాటకి నేను ‘నీ ఇష్టం అమ్మా! నీ పాదాల దగ్గర పండుగలా చేసినా ఇష్టమే అన్నాను. “ఇష్టంలేదని చెప్పిరా, వాళ్ళకి పో!” అన్నది అమ్మ. అప్పుడు నేనూ, ప్రసాద్ గుంటూరు వెళ్ళి మా అన్నయ్యకి చెప్పాము. అది విని మా అన్నయ్య పోట్లాడేడు. మా వదినె ఏడ్చింది పాపం. తిరిగి వచ్చి అమ్మతో ‘చెప్పివచ్చానమ్మా నీ ఇష్టం’ అన్నాను. అమ్మ విని ఊరుకున్నది. కొన్నాళ్ళయ్యాక ” మీ నాన్న గారు చెప్పారన్నావు కదా! నేను చెపుతాను వాళ్ళకి, వచ్చి నిన్ను అడగమని” అన్నది అమ్మే. “ఆనాడు నాన్నగారు చెప్పారు – ‘ఇప్పుడు అమ్మ, నాన్నగారు అన్నీ చెప్పారు. నువ్వే కదా! వద్దని చెప్పొచ్చాను కదా నేను’ అన్నాను. “నేను చేస్తున్నాను కదా నా చేతుల మీదుగా ఈ పెళ్ళి, వాళ్ళే వచ్చి నిన్ను అడుగుతారు కదా!” అన్నది అమ్మ.

‘హైమ’ అన్నది – “మధు అన్నయ్యని ఎవరు చేసుకుంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు” అని. ఎందుకమ్మా ? అన్నాను. ‘అది అంతే అది అంతే’ అన్నది. తర్వాత ‘అమ్మ’ మా వాళ్ళచేత అడిగించింది. ‘డబ్బు ఎట్లా మరి?’ అనుకున్నాను. మీ ఆడబిడ్డ పెళ్ళి మీ మామగారు బ్రహ్మాండంగా చేశారట కదా! పాతికవేలు అడుగు” అన్నది అమ్మ. అడగటం నాకు భయం కదా! అడిగిచ్చా. ఐదువేలు ఇచ్చారు. “అది పెట్టి నీ అత్తవారి వైపు వాళ్ళకి నీ బట్టలు కొను” అన్నది ‘అమ్మ’. మా అన్నయ్య ఐదు వేలు కట్నం, ఐదువేలు పెళ్ళి ఖర్చులకు గాను మొత్తం పదివేలు- ఇంకా నాపుట్టింటి సొమ్ము ఉంటే అది కూడా ఇచ్చాడు.

మీ మామగారితో చెప్పు “పెళ్ళి జిల్లెళ్ళమూడిలో జరుగుతుంది. గుంటూరులో మీ అన్నయ్యగారింట్లో కాదు” అని అన్నది అమ్మ. ఆ మాటకి మా వాళ్ళు మొదట్లో ఇష్టపడలేదు. అడవుల దీవిలోనే అరిసెలు – పిండివంటలు చేసుకురమ్మన్నది నన్ను. ‘మేము చేసురావటం ఏమిటి? మేము మగపెళ్ళి వాళ్ళం కదా!’ అనుకున్నాను. “వచ్చేటప్పుడు మీ ఇంటిముందు కొత్త తాటాకులతో పెళ్ళిపందిరి వేసి, మీదేవతకు నివేదన పెట్టుకురా” అన్నది. నా మరిది ప్రసాద్ నాకు చాల అండగా ఉండేవాడు. 5 వేలు ప్రసాద్ కిచ్చి మా వాళ్ళందరికీ బట్టలు కొన్నా.

“నేను రెండు బస్సులు పంపిస్తా – ఇక్కడి నుంచి మీ ఇంటికి. నువ్వు ఊరికే వస్తే చాలు. నీకు కావలసిన వాళ్ళందరినీ ఎక్కించుకురా ఆ బస్సుల్లో. నీకు అదే కదా కావాల్సింది” అన్నది అమ్మ. రావటమే కదా అనుకొని వచ్చాము. పెళ్ళికూతురికి ఒక జాకెట్ గుడ్డ కూడా కొనలేదు; ఎవరికీ ఏమీ కొనలేదు. ఆ ఏడు పొలం మీద పంట ఆదాయం తొమ్మిది వందలు ఇచ్చారు. అది తీసుకువచ్చి అమ్మకి ఇచ్చాడు ప్రసాద్. “పత్రి శాయమ్మని మద్రాసు పంపించి చీరెలు తెప్పించుకుంటాను” అన్నది అమ్మ. ‘కంచి పట్టుచీరెలు’ తెప్పించింది. అదే మొదలు అమ్మకి కంచిపట్టు చీరెలు తెప్పించటం. “నేను ఎప్పుడేది కావాలో అది కట్టుకొస్తాను – నువ్వు నాకేమీ పెట్టనక్కరలేదు” అన్నది. ‘అమ్మ’ ఆవరణలోని వారందరికీ తానే బట్టలు తెప్పించి పెట్టింది. పట్టు చీరెలు విరజిమ్మింది. ఇప్పుడైతే అవి ఒక్కొక్కటి 25, 30 వేలు ఖరీదు చేస్తాయి. ” మా అబ్బాయి పెళ్ళి” అంటూ అమ్మే ఆవరణలోని వాళ్ళందరికీ బట్టలు పెట్టింది. అమ్మకి పుట్టిన రోజున పెట్టినవి, నాన్నగారికి పెట్టినవి బట్టలన్నీ తీయించి అందరికీ (పెట్టింది) పంచింది. మధుకి పెట్టే పాంటు, చొక్కాలను తన కాళ్ళకి చేతులకి తొడుక్కుని మరీ వాడికి పెట్టింది. రెండు మంగళ సూత్రాలు, నల్లపూసలు, మూడు వరసల గొలుసు, పెళ్ళికొడుకు- పెళ్ళి కూతుళ్ళకి ప్రధాన ఉంగరాలు, గజ్జెలు అన్నీ ‘అమ్మే’ పెట్టింది. కాళ్ళు కడిగే పళ్ళెం, వెండి చెంబు మాత్రం మా వదినె వాళ్ళు ఇచ్చారు.

‘హైమని’ మా ఇంటి ఆడపడుచుగా భావించి వెండి కంచం- గ్లాసు కప్పు, ఇచ్చాం. నేనేమో అత్తగారు – వియ్యపురాలు – ‘హైమ ఆడబిడ్డ’. జిల్లెళ్ళమూడిలో మా అబ్బాయి పెళ్ళి చెయ్యటం మా మామగారికి ఇష్టంలేదు. మడి భోజనాలు అలవాటు వాళ్ళకి- ఇక్కడవేం లేవు. ఆ రోజుల్లో బెండపూడి రుక్మిణక్కయ్య ఉండేది. ఈ వేడుకలన్నీ చాలా ఆనందంగా సరదాగా చేసింది. బాపట్ల Arts college lecturer శ్రీ తూములూరి కృష్ణమూర్తి గార్ని పిలిపించి పెళ్ళి వరస పాటలు పాడించింది అమ్మ. పెళ్ళి కూతురుకి పెట్టాల్సినవి ప్రసాదిని, నన్ను పిలిచి అప్పగించింది అమ్మ. మా వదినె చాలా సరదా మనిషి. మరమరాలదండలు, పాపట బిళ్ళలు రకరకాలు పట్టుకొస్తే అవన్నీ వేయించుకుని అమ్మ కొరుక్కు తిన్నది. మాకు మహదానందంగా ఉంది. 16 రోజుల పండగ అయితే కానీ అమ్మ మమ్మల్ని జిల్లెళ్ళమూడి నుండి కదలనివ్వలేదు. అందరినీ అక్కడే అట్టిపెట్టింది.

పెళ్ళిలోనే మా ఆడబిడ్డకొడుకు తెనాలిలో చనిపోయినాడు. ఇక్కడేమో నా కొడుకు కోడలు గృహప్రవేశం అవుతున్నారు. అమ్మ నన్ను తెనాలి పంపించింది. ఇక్కడ పెళ్ళి పనులన్నీ అమ్మే చూసుకుంటోంది. పెళ్ళి చాలా అద్భుతంగా చేసింది అమ్మ. పెళ్ళి వంట శ్రీ గుంటూరు శేషయ్యగారు చేశారు.

ఒకసారి “హైమను చూస్తే ఏమనిపిస్తోంది నీకు?” అని అడిగింది అమ్మ. ‘బంగారు తల్లిలా ఉంది. చిన్న అమ్మవారులా అనిపిస్తోంది’ అన్నాను. అప్పగింతలు మొట్టమొదట అమ్మ నాన్నగార్లకి, తర్వాత హైమకి. ఆ తర్వాత మా అత్తింటివాళ్ళు ఆక్రమంలో జరిగాయి. పెళ్ళి అయి వచ్చేటప్పుడు మా కోడలికి వీణ ఇచ్చింది అమ్మ. పదహారు రోజుల పండుగ తర్వాత తిరుగుప్రయాణంలో బాపట్ల తంగిరాల కేశవశర్మ అన్నయ్య గారింటికి వచ్చాము. వారింట్లో మా అందరికీ పరమానందంగా విందుభోజనం పెట్టారాయన. మేము సరాసరి అడవులదీవి వెళ్ళాము. మా కోడలు బాపట్ల నుంచి తల్లిదండ్రులతో గుంటూరు వెళ్ళింది. సంవత్సరము తర్వాత వచ్చింది కాపురానికి; అప్పటికి మా మామగారు పోయారు. కోడలిని కాపురానికి తీసుకువెళ్ళటానికి ముందు ‘అమ్మ’ దగ్గరకి వచ్చి, తర్వాత అడవులదీవి తీసికెళ్ళాము. ఆనాటికి ‘హైమ’ లేదు – ఆలయప్రవేశం చేసింది. ‘హైమకోసం తెచ్చిన చీరె’ అమ్మ కట్టుకుంది. “ఇదుగో కట్టుకున్నాను. చూశావా?” అంది. నంబులు అన్నయ్య- కృష్ణవేణమ్మ అక్కయ్య మొ॥ అందరికీ బట్టలు పెట్టించింది. మా అన్నయ్య వదినె గుంటూరు నుంచి సారె, బట్టలు అన్నీ తెచ్చి ఇచ్చారు అమ్మకు.

మా కోడలు కాపురానికి వచ్చిన తర్వాత మేము తరచు అమ్మ దగ్గరకు వచ్చిపోతూ ఉండేవాళ్ళం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అమ్మ పిలిపించేది. నేను వెళ్ళిపోతూండే దాన్ని. నేను ఎప్పుడూ అమ్మకి స్నానం చేయించేదాన్ని. ఒకసారి “నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది?” అని అడిగింది అమ్మ. ‘నాకేమి తెలియదమ్మా. నువ్వు భగవంతుడివి. నిన్ను నమ్ముకుంటే కడతేరుస్తావను కుంటున్నాను’ అన్నాను. “వాకిట పండితులు వాదించుకుంటున్నారు. ఆ వాదనంతా ఈ సేవ కోసమేనమ్మా” అన్నది. మరోకసారి అమ్మకి స్నానం చేయిస్తున్నాను – అమ్మ నా ఒంటిమీద చెయ్యివేసి “అబ్బాయి సంగతి అంతా నేను చూసుకుంటాను – నువ్వేమీ దిగులు పడకు” అన్నది. క్షణం ఆగి “నిన్నూ చూసుకుంటాను” అంది.

మా కోడలికి పసుపు – కుంకుమ, పిల్లలకి పేర్లు పెట్టటం, అన్నప్రాశనలు, నామకరణాలు శుభకార్యాలు అన్నీ అమ్మే తన చేతిమీదుగా చేసింది. అడవుల దీవిలో మేమేమీ చేయలేదసలు. నాకు ఇద్దరు మనవరాళ్ళు శైలు, రజని; ఒక మనవడు సతీష్, 6-5-1985 తేదీన శైలు అక్కడే పెద్దమనిషి అయింది . 12-6-1985 తేదీన అమ్మ శరీరాన్ని విడిచిపెట్టింది. ఆనాడు అమ్మకి ఆరోగ్యం అసలు ఏమీ బాగుండ లేదు. అమ్మ తాను తుడుచుకునే గుడ్డ ఇచ్చి పంపించింది అందరినీ పట్టుకోమని. 11రోజులు చిమ్మిలి తొక్కించింది. 11 రోజులూ ఆవరణలోని అందరినీ పిలిచి పేరంటం పెట్టింది; అరటి పళ్ళు సెనగలు ఇప్పించింది. 11 వ రోజున ఆవరణలో అందరికీ మామిడి పళ్ళు అరిసెలు పెట్టించింది- ఇంటికొక చీరె చొప్పున ఆవరణలో అందరికీ పెట్టించింది.

సంస్థ పరంగా అమ్మ మీ చేత చెప్పి చేయించిన సేవలేమైనా ఉన్నవా?

అన్నపూర్ణాలయానికి అవసరమైన బియ్యం, పచ్చళ్ళు వగైరాలు సమకూర్చమని అమ్మే మాచేత చెప్పి చేయించింది. ‘రాజీ’ పెళ్ళీ అంతే. ‘రాజి’ అంటే (Dr. K.S.N మూర్తి) సత్యం భార్య రాజ్యం. ఆ పిల్లను చూసి అమ్మే నిర్ణయించింది- బాగుంది అని. ఆ పిల్ల బంగారు తల్లి. వాళ్ళు ధనవంతులు కారు కానీ మనస్సు చాల గొప్పది. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి లేకపోయినా ఇంకొకళ్ళని చూసి సంతోషపడతారు. సుగుణ రాజ్యం చెల్లెలు. పన్నాల రాధాకృష్ణ శర్మగారితో సుగుణ సంగతి చెప్పాను – ‘వాళ్ళు లేని పిల్లలు కానీ, చాలా మంచి పిల్లలు – తెలివిగల వాళ్ళు. కాలేజీలో చేర్చుకోండి’ – అన్నాను. చేర్చుకున్నారు. తర్వాత అన్నారు – ‘నువ్వు చెప్పిన దాని కన్న చాల మంచివాళ్ళు’- అని. రాజ్యం పెళ్ళిలో మా అబ్బాయి చేత కూడా కొంత చేయించింది అమ్మ. వాళ్ళని మా ఇంటికి తీసుకెళ్ళటం, బట్టలు పెట్టటం, ఆషాఢపట్టీ పంపించటం అన్నీ అమ్మ మా చేత చేయించింది.

మీరు అమ్మతో సరదాగా గడిపిన సందర్భాలు ఏమైనా వున్నాయా?

తర్వాత మా మామగారు పోయినపుడు, నేను బాధల్లో ఉన్నపుడు అమ్మ నన్ను తన దగ్గర అట్టిపెట్టుకున్నది. అమ్మకి నేను చేసిన సేవ కేవలం స్నానం చేయించడం, ఒక్కొక్కప్పుడు జడవేయటం. అలాంటప్పుడు నాకెంతో ఆనందంగా ఉండేది. “అమ్మా! సుశీలక్కయ్యా! నీ చేతుల్లో సంస్కారం ఉంది. నూనె తీసుకురా!” అనేది. అప్పడప్పుడు సరదాగా నన్ను ‘అక్కయ్యా !’ అని పిలుస్తుండేది అమ్మ.

అమ్మ ఆఖరిసారిగా స్నానమాచరించిన సందర్భాన్ని చెప్పండి.

“నీకు స్నానం చేయించే ఓపిక లేకపోయినా నూనైనా రాయమ్మా అనేది అమ్మ. అమ్మ శరీరం చాలించే ముందు అంటే 12.6.1985 తేదీ సాయంత్రం 5 గంటలకి (కామేశ్వరమ్మ) అమ్మమ్మ స్నానం చేయించింది; ఆరాత్రి అమ్మ వెళ్ళిపోయింది. అంతకు ముందు ఆ మంచం దగ్గర కూర్చుంటే నా గడ్డం పుచ్చుకుని నా భుజం మీద చెయ్యివేసింది. ‘అమ్మమ్మ’ అన్ని నదుల్లో నీళ్ళు తెప్పించి; ఆ నీళ్ళతో స్నానం చేయించింది. అమ్మ లేచి వచ్చి కూర్చుని మామూలుగానే స్నానం చేసింది. ‘అమ్మకి ఒంట్లో బాగుండటం లేదు. ఎవ్వరూ లోపలికి రావద్దు’ – అని బోర్డు పెట్టారు. ఆరోజు సాయంకాలం ‘అమ్మ’ నన్ను పిలిపించి తనకు స్నానం చేయించటంలో నన్ను కూడా కలిపింది. అదే ‘అమ్మ’ చివరిస్నానం ఆ రాత్రికే అమ్మ భౌతికంగా మనకి దూరమైంది.

ఒకరోజు అమ్మ ఆరుస్నానాలు చేసింది. అవన్నీ పెద్దపెద్ద స్నానాలే. అమ్మకి స్నానం చేయిస్తూంటే నాకెంతో ఆనందంగా ఉండేది. భగవంతుడు కాకపోతే మామూలు మనిషి అలా అంతసేపు చెయ్యగలడా? “మనస్సుతో స్నానం చేయించాలి” అనేది అమ్మ. అమ్మకి స్నానమే బలమట. “స్నాన మప్పుడే నేను హాయిగా ఉండేది” అన్నది స్నానమే ఆహారంట | అమ్మకి. స్నానం చేసేముందు “సుశీలను తీసుకురండి” అనేది.

అమ్మకి మీరొనర్చిన ప్రత్యేక పూజలేమైనా వున్నవా?

ఒకసారి శ్రీఅనసూయేశ్వరాలయం గడప మీద కుర్చీవేశారు. కుర్చీలో అమ్మ కూర్చున్నది. అమ్మ పాదాలు గడప ఇవతల ఉన్నాయి. పుట్టి (13బస్తాలు) పువ్వులతో అమ్మకి పూజ చేసుకున్నాము.

జిల్లెళ్ళమూడిలోనే మీభర్త ఆబ్దికం పెడుతున్నారు కదా! అలా అక్కడే పెట్టటానికి కారణం ఏమిటి?

ఒకసారి దసరాలకు వచ్చాము. అమ్మ ఉండమన్నది. మర్నాడు ద్వాదశి. నాడు మావారి ఆబ్దికం. ఏకాదశినాడు హైమ నామ ఏకాహం చెయ్యమంది. “తద్దినం ఇక్కడ పెడదాం” అన్నది. ‘అమ్మా! నాకు భయం. ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఊరుకోరు’ అన్నా. “నీకేం ఫర్వాలేదు. విని సంతోషిస్తారు. ఇక్కడ పెడదాం” అన్నది అమ్మ. మమ్ము వెళ్ళనివ్వలేదు. ఆరోజు నా చేత స్నానం చేయించుకున్నది. నాకు ఒక నీలం రంగు పట్టుచీరె ఇచ్చింది. “ఇది నీ ఒంటిమీద చినిగిపోవాలి. నువ్వే కట్టుకోవాలి” అంది. కట్టుకుని అమ్మకి పూజ చేసుకున్నాను. ఆబ్దికానికి అన్ని ఏర్పాట్లు చేయించింది. అమ్మ స్నానం చేసి మేనాలో అన్నపూర్యాలయానికి వచ్చింది. నామం చేసుకుంటూ అందరూ అమ్మను అక్కడికి తీసుకొచ్చారు. దసరా పండగల్లో 16 రూపాయలు పెట్టి ఒక సిల్కుచీరె అమ్మకి పెట్టా. “చూశావా, నువ్వు ఇచ్చిన చీర ఇవాళ కట్టుకున్నాను” అన్నది. రామకృష్ణ అన్నయ్యని, గోపాల్ అన్నయ్యని ఇద్దరు భోక్తల్ని పెట్టింది. తనుముఖం మీద నిలువుగా అడ్డంగా బొట్టుపెట్టుకుంది. “నేను ఇవాళ అడవుల దీవి కరణంగారిని” అంది. అన్నీ మా అబ్బాయి మధుచేత వడ్డించుకున్నది. నాతో “నువ్వు పూజ చేసుకోవటమే నాకు ఇష్టం” అన్నది. అమ్మ మెడలో దండ వేసి, కొబ్బరికాయ కొట్టి హారతిచ్చాడు మధు; తర్వాత అమ్మకి ఔపోసన వేశాడు. చేసిన పదార్థాలన్నీ విస్తట్లో కుమ్మరించుకున్నది. కలిపి ముద్దలు చేసి ఆవరణలోని వారందరికీ పిలిచి పెట్టింది. అందరికీ సరిపోయింది. “ఇకపైన తద్దినం పెట్టనక్కరలేదు” అని చెప్పింది. మరుసటి సంవత్సరము ఆబ్దికానికి మా మామగారు అడవుల దీవి నుంచి మమ్మల్ని జిల్లెళ్ళమూడి రానివ్వలేదు. ఉన్నట్టుండి ఆనాడు మధుకి 104′ జ్వరం వచ్చింది. వాడు స్నానం చేయటానికి వీలు లేకపోయింది. చేసేది లేక వేరే మనిషిని పెట్టి ఆబ్దికం పెట్టించారు. అందరి భోజనాలు అయిపోయినాయి. ఆశ్చర్యం! వెంటనే వాడికి జ్వరం తగ్గింది; అప్పుడు మా మామగారు అనుకున్నారు- ‘ఇదేదో చిత్రంగా ఉందే’ అని. అప్పటి నుంచి ఏటా అడవులదీవిలో కాక – జిల్లెళ్ళమూడిలోనే మావారి తద్దినం పెట్టటం జరుగుతోంది.

హైమక్క మహా సమాధి సమయాన మీరెక్కడున్నారు ?

హైమ పోయేముందు నేను అడవులదీవికి ప్రయాణమై బయలు దేరబోతున్నాను. అమ్మ పాదాలు పట్టుకుని విపరీతంగా ఏడుస్తున్నా. అమ్మ “నువ్వు వెళ్ళొద్దు- వెడితే మళ్ళీ రాలేవు” అన్నది. ఆ తర్వాత “సరే వెళ్ళిరా” అన్నది. అమ్మ ఉండమన్నా నేను ఉండలేదు. ఆ తర్వాత హైమ పోయింది. నేను హైమను చివరిసారి చూడలేదు.

అమ్మ కోపాన్ని ఎపుడైనా చూచారా?

ఒకసారి మాకోడలు లలితకి అమ్మ ఒక చీరె ఇచ్చి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళి (పుట్టింటివాళ్ళచే) పెట్టించుకోమన్నది. నేనేం చేశానంటే అమ్మ ఇచ్చిన చీరేకదా అని కట్టుకుని అమ్మకే నమస్కారం చేయమన్నా. అపుడు “ఒకటి చెబితే ఒకటి చేస్తున్నావు” అని చికాకు పడ్డది.

'అమ్మ జీవితచరిత్ర' ఆసాంతం (ప్రచురణ కానిదికూడా) చదివారా?

‘అమ్మా! నువ్వు చాలా కాలం ఉండాలి’ అంటే అమ్మ అన్నది; “నువ్వు చెప్పేది ఎట్లా ఉందంటే- ఎటూ తీరిక చేసుకువచ్చావు కదా! నాలుగు రోజులు ఉండి వెళ్ళు – అన్నట్టుగా ఉంది” అంది. వాళ్ళు జగన్నాటకం రాసుకుని వస్తారు. దానికి బద్ధులై ఆడివెళ్ళిపోతారు. అమ్మ తన జీవిత చరిత్ర ఇచ్చింది నాకు – నన్ను, ప్రసాద్ను చదవమని. తర్వాత “చదివితే నీకే మనిపించింది?” అని అడిగింది. ‘నువ్వు దైవం అనిపించిందమ్మా. నాకంత బాధ కలగలేదు. మామూలు మనిషి పడే కష్టాలు కావు అవి’ అన్నాను.

అమ్మ శరీర త్యాగం చేసేముందు విపరీతంగా బాధపడ్డది – మనల్నందరిని వదిలిపెట్టి వెళ్ళలేకనో! ఏమో!

హైమక్కతో జ్ఞాపకాలు - ఆవిడకు చేసిన మీ సేవలు ఏమిటి?

ఒకసారి హైమ అడిగింది ‘నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుందక్కయ్యా”? అని. ‘తల్లి గొబ్బెమ్మ ప్రక్కన – పిల్లగొబ్బెమ్మవు అనిపిస్తుందమ్మా’ అన్నాను. ఆ తల్లే ఈ పిల్ల. స్నానానికొస్తే అదే మాదిరిగా ఉండేది. హైమ పాదాలకు నూనెరాయటం, వాటిని వేడినీళ్ళలో పెట్టటం చేసేదాన్ని. హైమకి స్నానం చేయించేదానిని. తలంటి పోసే దానిని. హైమ మామూలు వ్యక్తిగా అనిపించేదికాదు.

అమ్మని హైమని చూశాక ఇంకెవరినీ చూడాలనిపించేది కాదసలు. అంత ఆనందంగా ఉండేది. హైమ శరీర త్యాగం చేసిన రోజున నేను పిండివంట చేస్తున్నా మాయింట్లో. దాన్ని పంపించా అమ్మ దగ్గరకి. హైమ పోయిన చోట అవన్నీ చల్లించిందట అమ్మ. నాకేదో చికాకుగా విసుగుగా ఉన్నది; అయినా కూడా ఆవేళ చేశా.

మీరు అమ్మ నాన్నగార్లకి కలిపి పూజలు చేసిన నేపధ్యం ఎలాంటిది?

జిల్లెళ్ళమూడి ‘నాన్నగారు కూడా గొప్పవారనే అనిపిస్తుంది. వారు మా ఊరు వచ్చినపుడు కూడా ఆయనకి పూజచేసుకున్నాం.

మే 5 వతేదీ అమ్మ కళ్యాణ దినోత్సవం. ‘అమ్మా! సీతారాముల కళ్యాణం చేస్తాం కదా? నాన్నగారికి నీకు కూడా అలా పూజచేసుకోవాలని ఉందమ్మా’ అని అన్నాను. అంటే విని నవ్వి, “నాన్నగారిని అడగమ్మా” అన్నది.

‘నాన్నగారిని నేనడగనమ్మా. నాకు భయం’ అన్నాను. “ఏం భయం లేదమ్మా – అడుగు సంతోషపడతారు.” అంది. అమ్మ చెప్పిందని వెళ్ళి నెమ్మదిగా నాన్నగారిని అడిగాను. ‘ఏమిటమ్మా, నాకూ మీ అమ్మగారికీ పూజ చేయట మేమిటి?’ అన్నారు. ‘అదికాదు, నాన్నగారూ! చేసుకోవాలని ఉంది’ అన్నాను సరేనన్నారు. తర్వాత వచ్చి అమ్మకి చెప్పా. మే 5 కి అన్నీ తెప్పించుకున్నాం. మొట్టమొదటిసారి మధు, లలిత, ప్రసాద్ అన్నయ్య ‘అమ్మ -నాన్నగార్లకు’ పూజ చేసుకున్నారు. మా కోడలు లలిత ఇంటి దగ్గర నుంచి పెద్ద పెద్ద లడ్లు చేయించి తెచ్చింది. ఆ మొదటి పూజ రెడ్డి అన్నయ్య గారి గదిలో చేసుకున్నాం. వేదిక మీద ఒకసారి, మేడమీద వాత్సల్యాలయంలో ఒకసారి అట్లా నాలుగైదు సార్లు అమ్మ -నాన్నగార్లకు మే 5న కళ్యాణ దినోత్సవం పూజ చేసుకున్నాం.

అమ్మ సందేశం - మీరు ఆచరిస్తున్నారా?

అమ్మ చెప్పిన “నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అనే సందేశమే నాకు శిరోధార్యం. ” ఎవరు ఏది చేసినా, ఏ పనిచేసినా పూజే” అనేది అమ్మ.

అమ్మవాక్యాలు ఆచరణ సాధ్యాలేనా ? అమ్మని అమ్మగా ఇష్టపడతారా? దైవంగా ఇష్టపడతారా?

అమ్మ వాక్యాలన్నీ ఆచరణ సాధ్యాలు కావు. “తృప్తే ముక్తి”, “కూతురిని కోడలిని ఒకేలా చూడటం” అనేవి అమ్మకి సరిపోయాయి. మనకి ఎట్లా? అమ్మని అమ్మగా చూస్తున్నా, దైవంలాగా చూస్తున్నా – అమ్మ కన్నా దైవంగానే ఎక్కువగా చూస్తున్నా. అపుడు అమ్మగా వచ్చింది; ఇపుడు అమ్మ (గుడిలో) దేవుడై కూర్చుంది. అదే తేడా అప్పటికీ – ఇప్పటికీ. అప్పుడేమైనా స్వతంత్రంగా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే వినేది. ఇప్పుడు వేరు కదా! అంతా భక్తి శ్రద్ధలతోనే చెయ్యాలి.

మిమ్మల్ని కన్నతల్లికి - ఈ అమ్మకీ తేడా ఏమిటి?

ఈ అమ్మప్రేమ వేరు, మామూలు అమ్మ (కన్నతల్లి) ప్రేమ వేరు. చాలా తేడా ఉంది. ఈ అమ్మ ఇహం పరం అన్నీ కూడా చూస్తుంది. మామూలు అమ్మకి అంతశక్తి లేదు.

అమ్మ శరీర త్యాగం చేసినపుడు నాకు చాల గందరగోళంగా ఉంది. ఆమె ఇష్టం. మనదేముంది? బాధపెడితే పడతాం. అమ్మ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నది. ఎప్పుడూ కనిపెట్టే ఉంటుంది.

అమ్మకీ, హైమక్కకీ శరీరంతో వుండగా సేవలొనర్చిన మీకు ఈనాడు వారు గుళ్ళల్లో ఆరాధ్యమూర్తులుగా నిత్య నీరాజనాలందుకోవటం చూస్తే ఏమనిపిస్తుంది?

ఒకసారి అమ్మ “హైమాలయంలో హైమను చూస్తే నీకేమనిపిస్తుంది?” అంటే ‘ఆ హైమను చూసిన తృప్తి ఇక్కడ కలగదమ్మా’ అన్నాను. “ఆమాట నిజమేగా” అన్నది అమ్మ. ఆనాడు అమ్మను చూసి, నేడు విగ్రహాన్ని చూస్తామనుకోండి, మామూలుగా అమ్మని చూసిన ఆనందం ఇక్కడ (గుడిలో) ఎట్లా కలుగుతుంది? పరమ భక్తులకే అది సాధ్యమవుతుంది.

అమ్మని దర్శించాక - ఏమైనా పుణ్యక్షేత్రాలు దర్శించారా?

ఒకసారి అమ్మతో ‘నిన్ను చూశాక నాకు ఇంకెక్కడికీ వెళ్ళాలనిలేదమ్మా!! అన్నాను. “చాలు” అన్నది; చాల సంతోషపడ్డది. అమ్మ తన రెండు పాదాలు నా తలమీద పెట్టి నీళ్ళు పోసింది. అది సర్వనదీ తీర్థాలలో స్నానం చేసినట్లే – దేనికీ కొదవలేదసలు. ఎక్కడికీ వెళ్ళాలనిలేదు. ఒక క్షేత్రాన్ని తక్కువగా అంచనా వేయను. నాకు తృప్తి అయింది ఇక్కడే.

ఒకసారి తిరుపతి వెళ్ళాను. మెట్లు ఎక్కలేననుకొని దణ్ణం పెట్టుకుని మెల్లిగా ఎక్కుతున్నాను. నాకంతశక్తి ఉండేది కాదు. మధ్యలో ఒక సాధువు కనబడి ‘నువ్వు ఎక్కుతావు. వెళ్ళమ్మా’ అన్నాడు. కొండపైకి వెళ్ళాక మూడుసార్లు దేవుడి దర్శనం అయింది చాలా హాయిగా ఆరోజు. నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మను చూసిన తృప్తి కలగదు. ‘వెళ్ళు. పో, ఇది జిల్లెళ్ళమూడి కాదు. పో’ అన్నట్టు ఉంటుంది. మనసుకి ఆ తర్వాత మరెక్కడికి మళ్ళీ వెళ్ళలేదు అంతే.

ఇంకా మీరు మాతో పంచుకోదగ్గ విషయాలుంటే చెప్పండి.

అమ్మ కుమారుడు రవి పెళ్ళి అయింది. అందరూ వెళ్ళిపోబోతున్నారు. అమ్మ నన్ను వెళ్ళనీయకుండా తనమంచం ప్రక్కనే కూర్చోబెట్టుకుంది. కదలనివ్వదు. కడుపులో ఆకలి మండిపోతున్నది. తర్వాత అన్నపూర్ణాలయంలో మజ్జిగ త్రాగి వెళ్ళమంది. సరే త్రాగి ఇంటికి వెళ్ళా. మా మనవరాలు, మధు కూతురు – హైమకి తడపర పోసి ఉన్నది. ఆ పిల్లనీ రవి పెళ్ళికి తీసుకువచ్చాం. తడపర పోసిన పిల్లను పెళ్ళికి తీసుకురాకూడదు. అయినా తీసుకు వచ్చాం. బ్రహ్మాండం సుబ్బారావు అన్నయ్య వాళ్ళింట్లోనే పడుకోబెట్టాం. తిరిగి ఇంటికి తీసుకువెళ్ళే సరికి దానికేమీ బాగుండలేదు. మర్నాడు మా ఇంటికి అమ్మ వస్తానన్నది. రేపల్లె వెళ్ళి కావలసిన సామాన్లు తెచ్చుకున్నాం. ఇంటికెళ్ళాం. పిల్లకేమీ బాగుండలేదు. ఆ పిల్లకి హైమ పేరు పెట్టుకున్నాం. నేను, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఆ పిల్లకి రోజూ నమస్కారం చేసుకునేవాళ్ళం. నేను హైమ అనుకునే చూసేదాన్ని. మా లలిత కూడా చాలా శ్రద్ధగా చూసేది. ఆరోజు మా అబ్బాయి నమస్కారం చేసుకుని భోజనానికి వెళ్ళాడు. ఇంతలో ఆ పిల్ల చనిపోయింది. పోయిన తర్వాత ఆ పిల్లని ముందర దొడ్లోనే పెట్టాం. ఆవరణలో అట్టిపెడితే ఊరుకోరు కదా ఎవరూ!

ఆ రాత్రికే అమ్మ మాఇంటికి వచ్చింది. మా అందరి చేత కుంకం అవీ ఆ పిల్లమీద చల్లించింది. తనే కర్పూరం వెలిగించి అక్కడ పెట్టింది. ఒక గొప్ప వ్యక్తి చనిపోయినట్లు, అక్కడేదో కట్టించమంది. జిల్లెళ్ళమూడి నుంచి మొక్క తెచ్చి పెట్టమంది. మేము చేసిన ఆ పనిని అప్పటికీ ఇప్పటికీ ఎవరూ ఆక్షేపించలేదు. ఆ పిల్లను ఎత్తుకుని బజారులో నడిచి వెళ్ళి అంతిమసంస్కారాలు చేసే ధైర్యం నాకు లేదు. అలా కాకుండా నా దైవం నాచేత అట్లా చేయించింది.

ఒకసారి అమ్మ “నువ్వు చాలా అదృష్టవంతురాలివికదూ?” అన్నది. ‘అవునమ్మా! అటు భర్తపోవడం ఎంత దరిద్రమో – నా బిడ్డతో నీ దగ్గరకి చేరటం అంత అదృష్టం’ అన్నాను.

అమ్మ పాదుకలు, కేశములు, నఖములు, కళ్ళెవేసిన ఇసుక అన్నీ పరమ పవిత్రములే – అన్నీ ఇప్పటికీ భద్రంగా మా ఇంట్లో ఉన్నాయి.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!