Vithala Ramachandra Murthy

Interviewed by
Ravuri Prasad
10/01/2012
Hyderabad

 

శ్రీ విఠాల రామచంద్రమూర్తి

  వీరు 26-04-1946 న జన్మించారు. స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం తాలూకా ముసల్లపల్లి. తల్లిదండ్రులు శ్రీ విఠల సత్యనారాయణ, శ్రీమతి సీతమ్మ. భార్య – శ్రీమతి శేషారత్నం. సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. విద్య – M.A. (తెలుగు), ఉద్యోగం – ప్రిన్సిపాల్, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి.

సేవాతత్పరత : జిల్లెళ్ళమూడిలో జరిగే ఉత్సవాలు, పండుగలు, సేవా కార్యక్రమాల్లో తాము ముందు నిలచి విద్యార్థినీ విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అమ్మకు అనేక సంవత్సరాలు అత్యంత సన్నిహితంగా మెసిలారు. ‘అమ్మ’ తత్వానికి బీరు నిలువెత్తు దర్పణం.

శ్రీ రావూరి ప్రసాద్ 10-1-2012వ తేదీన హైదరాబాద్లో శ్రీ విఠాల రామచంద్రమూర్తిగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

అమ్మని మొదటిసారి ఎపుడు దర్శించారు? ఆనాటి మీ అనుభూతి ఏమిటి?

దిక్కాలాద్యనవచ్ఛిన్న అనంత చిన్మాత్రమూర్తయే |
స్వానుభూత్యేకమానాయ నమః శాన్తాయ తేజసే ॥

వాత్సల్యామృత వర్షిణి అమ్మ అరుణారుణచరణ కమలాలకు ప్రణామములు. నేను అమ్మను 1971 మే 2వ తేదీన మొదటిసారిగా దర్శించాను. అమ్మ దర్శనం చేసిన ఉత్తరక్షణం నుంచి ఇప్పటి వరకూ – ఎప్పటి వరకూ కూడా అమ్మ నా హృదయంలో పదిలంగా ఉన్నది – ఉంటున్నది – ఉండగలదు. నేను అమ్మను చూసినప్పటి నుంచి నాకు కావలసిన ప్రదేశం అమ్మ సన్నిధియేనని నిర్ణయించు కున్నాను. ఆనాడే అమ్మ అన్నది- “నాన్నా! నువ్వు ఈ ఊళ్ళో ఉద్యోగం చెయ్యవచ్చును కదా!” అని. ‘తప్పకుండా అమ్మా!’ అన్నాను. అప్పటికే జిల్లెళ్ళమూడిలో కాలేజి పెట్టాలనే proposal ఉంది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో M.A. చదువుతున్న కారణంగా 71లో రాలేకపోయాను. 71లో శ్రీరాధాకృష్ణశర్మగారు ప్రిన్సిపాల్గా వచ్చారు. నేను 72 లో లెక్చరర్గా వచ్చాను. మొదటిసారి అమ్మను చూసినపుడు- అమ్మ వాత్సల్యంతో నిండిన వ్యక్తి అనిపించింది. అమ్మలో ప్రతీదీ దివ్యమే. అంటే వర్ణనాతీతం. అమ్మ రూపం, అమ్మ నామం, అమ్మ వాక్యాలు అన్నీ విలక్షణంగానే ఉన్నాయి. అన్నీ అపురూపంగానే ఉన్నాయి. చాలాకాలం నుంచి మహాత్ముల సన్నిధిలో ఉండాలనే నా కోరిక అమ్మను చూడగానే సార్థకమైనదని అనుకున్నాను. అమ్మను చూచిన, ఆ ఆనందానుభూతిలో మకరందాన్ని బాగా త్రాగిన తుమ్మెదలా మత్తులోపడి ఉన్నట్టుగా పడిఉన్నా: అమ్మతో ఏ సంభాషణా చేయలేదు. అమ్మను మళ్ళీ మళ్ళీ చూడాలి అనేటటువంటి తీవ్రమైన కోరిక కలిగింది. అమ్మ అద్భుతావహమైనమూర్తి కదా! ఆ దివ్యమంగళస్వరూపాన్ని ఎప్పటికీ మరచిపోలేం. అది దివ్యమంగళ స్వరూపం అనే భావన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉండేదే.

మీ కన్న తల్లికీ ఈ అమ్మకీ తేడా ఏమిటి?

అమ్మ ప్రేమ కన్నతల్లి ప్రేమను మరపిస్తుంది. నేను చాలా సార్లు మా విద్యార్థులకు కూడా చెప్పాను – కన్నతల్లి ప్రేమ పరిమితంగా ఉంటుంది అమ్మ ప్రేమ అపరిమితమైనది. అమ్మ ప్రేమకు అవధులు లేవు – అపురూపమైన వ్యక్తి, అనంతమైన శక్తి అనేటటువంటి ఒక దృఢమైన నిశ్చయం నాకు. అది మారలేదు.

అమ్మ వాక్యాలు ఆచరణ సాధ్యాలా?

అమ్మ సాహిత్యాన్ని చదవటమే కాకుండా, ప్రత్యక్షంగా అమ్మ మాటలు విన్నాను. ఆ మాటల్ని మననం చేసుకుంటున్నాను అమ్మను చూసినప్పటి నుంచీ కూడా. అమ్మ మాటలు నిత్యసత్యాలు. అందరికీ ఆచరణ యోగ్యములే కానీ కష్టసాధ్యాలు. అమ్మ మాటల్లో ఉండేటటువంటి ఆ పూర్ణత్వం- అమ్మ వాత్సల్యంలో ఉండేటటువంటి అపరిమితత్వం నన్ను చాలా ఆకర్షించాయి. అవి ఎప్పుడూ మరపురావు. అమ్మ సన్నిధి అమ్మరూపంతో కనిపించినప్పటి లాగే ఇప్పుడూ కూడా ఉన్నది. అమ్మ స్పర్శ, అమ్మ దర్శనంకి లోటు లేదు నాకు ఇప్పటికీ.

‘అమ్మను గూర్చి’ అంతకు ముందు కొంతే తెలుసు. అమ్మను చూశాక ‘జ్ఞానశిఖరాగ్రాన ఉన్న దేవతామూర్తి అమ్మ’ అని భావించాను. అమ్మ మాటలే నా భావపరిధిని విస్తృతం చేశాయి. “సర్వసమ్మతమే నా మతం” అన్నది అమ్మ. మతం కొంతమందికి పరిమితం. సర్వసమ్మతం అన్నది సంపూర్ణం. ఈ సంపూర్ణత్వం అనేది నిండుదనం అనేది అమ్మ ప్రభావమే; నాకు మతభేదం గానీ కులభేదంగానీ లేదు. అది అమ్మ ప్రసాదం అనుకుంటున్నాను.

జన్మలు లేవు అన్న అమ్మ మాటకీ, సాంప్రదాయ జన్మ - కర్మ సిద్ధాంతానికి పొంతన లేదు కదా! దీనిపై మీ స్పందన ఏమిటి?

ఒకసారి అమ్మను ‘జన్మలు లేవు’ అనేటటువంటి మాట ఒకటి అంటున్నావు కదా నువ్వు. జన్మలు లేవు అనేది నీకు ఎప్పుడు అనిపించింది?’ అని అడిగాను. “నాన్నా! ఒకనాడు సముద్రానికి వెళ్ళాం. ఒక కెరటం వస్తోంది; ఆ కెరటం లోపలికి వెళుతోంది; మళ్ళీ ఇంకో కెరటం వస్తోంది. ఇందాక వెళ్ళిన కెరటమే మళ్ళీ రావటం లేదు. అందువల్ల – చైతన్యం అనే సముద్రం నుంచి ఈ జన్మలు వస్తున్నాయ్- వెళుతున్నాయ్; నేను జన్మలు లేవు అనటం లేదు. పునర్జన్మ లేదంటున్నాను. ఇదివరకు జన్మకి ఈ జన్మకి సంబంధం లేదు. కానీ జన్మలు ఉన్నాయి. ఎన్నో జన్మలు వస్తాయి. కెరటాలు వచ్చినట్లుగానే జన్మలు కూడా వస్తాయి. కానీ ప్రస్తుత జన్మకీ తర్వాత వచ్చే జన్మకీ సంబంధం లేదు. ఇది మహాచైతన్యంలో కలసిపోతుంది. మళ్ళీ మహాచైతన్యం నుంచే ఇంకొక రూపంలో వస్తుంది” అని వివరించింది అమ్మ.

సంప్రదాయబద్ధంగా జన్మ, కర్మ – సిద్ధాంత రీతి ఎలా ఉన్నా – అమ్మ చెప్పిన దానిని నేను పూర్తిగా విశ్వసించాను. జన్మకి కర్మ కారణం కాదని అమ్మ అన్నది. “జన్మలు ఇస్తే వస్తాయ్” అని – ఒక శక్తి ఇస్తే వస్తాయి అని. అనంతమైన శక్తి ఒకటి ఉంది. ఆ అనంతమైన శక్తి ఇస్తే వస్తాయి. మోక్షం అనేది కూడా అనంతమైన ఆశక్తి ఇస్తేనే వస్తుంది. “నీకు వచ్చే సిద్దులన్నీ కూడా అనంతమైన ఆశక్తి ప్రసాదాలే. మనం చేసే ప్రయత్నాలు కూడా ఆ శక్తి అనుగ్రహమే” అంటుంది అమ్మ.

కాలేజీకి ప్రిన్సిపాల్- అందరింటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం - ఈ రెంటినీ సమర్థవంతంగా ఎలా నిర్వహించగలిగారు?

“సాధ్యమైనదే సాధన” అని అమ్మ చెప్పిన మాట నాకు మంత్రం. అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలలో మనస్ఫూర్తిగా పాల్గొనేవాడ్ని. ఒక అధ్యాపకుడుగా కాలేజీలో పనిచేయడమే కాకుండా శ్రీ విశ్వజననీపరిషత్ కార్యక్రమాలన్నింటి లోనూ చాలా ఇష్టంతో పాల్గొనేవాడ్ని. స్వర్ణోత్సవం జరిగింది – లక్షమందికి ఒకే పంక్తిలో భోజనం పెట్టే భారీ ఉత్సవం. నేను, నా భార్య ఇష్టపడి చాలా శ్రమకోర్చి దాంట్లో పాల్గొన్నాం. అలాగే త్రోత్సవాల్లోనూ అపుడూ సుమారు 60 వేల మంది అమ్మ అన్న ప్రసాదం తీసుకున్నారు. అలా ఆయా ఉత్సవాల్లో పాల్గొనటం నిత్యకృత్యం.. ఆ కాలంలో జిల్లెళ్ళమూడి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండేది. జనం బాగా వచ్చేవారు. వచ్చినవారు అమ్మ దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి అన్నపూర్ణాలయంలో భోజనాలు; వాళ్ళకి వడ్డించడం, వాళ్ళని ఆదరించడం. ఇలాంటి కార్యక్రమాలన్నీ నాకు ఇష్టమైనవి, ఆ తృప్తి అమ్మ ప్రసాదమే. ఇష్టపడి చేస్తున్నాను కనుక కష్టమేమీ లేదు. 1977లో తుఫాను వచ్చినపుడు నేను – నాతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఎంతో సేవ చేశారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉన్నా లేకపోయినా నన్ను అనుసరించేవాళ్ళు.

నేను కాలేజి ప్రిన్సిపాల్గా శ్రీ విశ్వజననీ పరిషత్ సమావేశాలన్నింటికీ హాజరయ్యే వాడిని. వాళ్ళు చెప్పినా, చెప్పకపోయినా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడ్ని. ప్రత్యేకించి ఒక office bearer గా నేను లేను. Ex-officio member గా ప్రతి సమావేశానికి హాజరయ్యేవాడిని. వాళ్ళు కూడా నన్ను చాలా ఆదరంగా చూసుకునేవారు. విశ్వజననీ పరిషత్, విద్యాపరిషత్ అనే భేదం నాకు లేదు.

అమ్మ సమక్షంలో మీరు జరిపిన శుభకార్యాలేమైనా వున్నవా?

మా అబ్బాయి నామకరణం, మా అమ్మాయి పావని బారసాల అక్కడే జరిగాయి. ‘పావని’ అని అమ్మే పేరు పెట్టింది. అమ్మ అనురాగాన్ని పుష్కలంగా అనుభవించాను.

జిల్లెళ్ళమూడిలో మీ నిత్యకృత్యం ఏమిటి? అమ్మతో మీరు జరిపిన సంభాషణలు తెలపండి.

కొన్నేళ్ళు రోజూ సుప్రభాతానికి వెళ్ళాను. సుప్రభాతం తర్వాత అమ్మ దర్శనం చేసుకునేవాళ్ళం. అందరూ వెళ్ళిపోయేవారు; కానీ నేను అక్కడే గంట, గంటన్నర కూర్చునేవాడిని. సాయంకాలం కాలేజి అవగానే వెళ్ళేవాడిని, క్రిందికి వచ్చి భోజనం చేసి మళ్ళీ అమ్మ దగ్గరకి వెళ్ళి రాత్రి 11-12 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేవాడిని. ఇలా చాలా ఏళ్ళు నడిచింది. ఒకసారి అమ్మ పాదాలు ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాను. ‘ఇవి బ్రహ్మ కడిగిన పాదాలు కదా!’ అని అమ్మనడిగాను. “అవును నాన్నా!” అన్నది. “మీరంతా బ్రహ్మలు కదా! మీరు కడిగిన పాదాలు నాన్నా!” అని కూడా అంది. ‘ఇదంతా వైకుఠం చేస్తావా నువ్వు?, ఈ ఉన్నదే వైకుంఠం అని అనుకోమంటావా?’ అని అడిగాను. అమ్మ నవ్వింది.

అమ్మ భర్తగారితో మీ అనుబంధం గురించి తెలియబర్చండి.

అమ్మ భర్త శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు – నాన్నగారు – భోళాశంకరుడు. నా తోటి చాలా ప్రేమగా ఉండేవారు. కొంతకాలం ఆవరణవాసులు, విద్యార్థులు – కాలేజి సిబ్బంది అందరూ ‘అన్నపూర్ణాలయం’లో భోజనం చేసేవారు. నాన్నగారి ప్రక్కనే నేను కూర్చుని భోజనం చేయటం ఒక అలవాటు పగలు, రాత్రి కూడా. వారు నిరాడంబర చక్రవర్తి.

“సృష్టి నాది - అనాది” అన్న అమ్మ సృష్టినంతటినీ ఏవిధంగా భావన చేసి ఆచరణలో చూపింది?

అమ్మ ఈ సృష్టి నంతటినీ దివ్యంగా భావించింది. గ్రామస్తుల్ని అందరినీ స తీసుకువచ్చి ఆవరణలోని అక్కయ్యలతో వాళ్ళ పాదాలకు పసుపురాయించి, పువ్వులిచ్చి విందుభోజనం పెట్టింది. తర్వాత ఊళ్ళో ఉన్న పశువులన్నింటినీ ఒక చోట చేర్పించి వాటికి మంచి దాణా తెప్పించి వాటికీ విందు చేసింది. ‘సమసమాజదేవతా సమారాధన’ అనే శీర్షికలో వివరించాను పత్రికలో ఆ సందర్భాల్ని. ఒకసారి ఆవరణలో ఒక కోతి చనిపోయింది. నేను గ్రామంతరం వెళ్ళివచ్చాను. ఏదో సన్నిహిత వ్యక్తి చనిపోయినట్టుగా “నాన్నా! కోతి చనిపోయింది” అని చెప్పింది. ‘ఇది అంత important విషయమా?’ అని ఆక్షణంలో అనిపించినా, తర్వాత ఆ కోతిని సాగనంపడానికి భాస్కర్ అన్నయ్యకి చెప్పి తాను తుడుచుకునేటటువంటి గుడ్డ, పువ్వులు ఇచ్చి ఆ కోతికి బొట్టు పెట్టి పంపించింది. అంటే తన కన్నబిడ్డను ఎట్లా చూసిందో పశుపక్ష్యాదులనూ అమ్మ అట్లా చూడటం చాలా విశేషమైన విషయం. “ఈ సృష్టి అనాది – నాది” అన్నది. చాలా విశేషమైన వ్యక్తిత్వం అమ్మది.

అమ్మకంటూ ప్రత్యేకమైన ఫిలాసఫీ ఏదైనా ఉందంటారా?

సంస్థ నిర్వహణలో చాలా ఇబ్బందులుంటాయి. వాటి మూలంగా చాలా గంటలు అమ్మ తోటి Personal talks అని జరిగేవి. ఇది లేకుండా ఉంటే బాగుండేది అనుకునేవాడ్ని. అమ్మ కొన్ని వ్యక్తిత్వాల్ని మార్చవచ్చు కదా! – అని అనుకునేవాడ్ని. అమ్మని అడగలేదు. అమ్మ “స్వభావం మారదు, భావం మారుతుంది” అన్నది. జీవితానికి కావలసిన అన్ని మాటల్ని అమ్మ చెప్పేసింది. అవే సమాధానాలు. అమ్మని directగా అడగాల్సిన అవసరం లేకుండా. అమ్మ సంభాషణలలోనూ, అమ్మ వాక్యాలలోనూ అవి మనకి అడుగడుగునా కనిపిస్తాయి. అందరికీ ఉపయోగిస్తాయి.

ప్రేమ సిద్ధాంతమే అమ్మ philosophy – విశ్వమానవప్రేమ. ‘నీ తర్వాత ఈ సంస్థ ఎలా ఉంటుంది?” అంటే “అన్ని సంస్థలూ ఎలా ఉన్నాయో ఇదీ అలాగే ఉంటుంది, నాన్నా!” అంది – అంత నిర్మమత ఆమెకు.

అమ్మ యందు ఇంతగా ప్రేమ, భక్తి, అనురక్తి కల మీరు కుటుంబ సహితంగా అక్కడనించి వచ్చారు. దీన్ని మీరెలా భావిస్తారు?

నేను 1993లో జిల్లెళ్ళమూడి నుంచి బయటకి వచ్చాను. ఈ రావటం కూడా అప్పుడు బాధ అనిపించినా, అది అమ్మపరంగా వచ్చింది కాదు; నా విశ్వాసాన్ని చెదరగొట్టేదీ కాదు. అమ్మ పట్ల విశ్వాసం అలాగే చెదరకుండా ఉంది. ఆ భావనకి అడ్డు ఏమీ లేదు. ఇలాంటి పరిణామాలన్నీ సహజం అనే నిశ్చయానికి వచ్చాను.

అమ్మని దైవంగానా - లేక అవతారమూర్తిగా అంగీకరిస్తారా?

దైవాన్ని మనం చూడలేదు. అవతారం గురించి వినటమే కానీ తెలియదు. కానీ అమ్మది ఆ అవతారాలన్నింటి కంటే విలక్షణమైన అవతారం అనీ, అమ్మ మాటలు – చేతలు – ఆలోచనలు అన్నీ కూడా నిండుదనం తోటి పరిపూర్ణంగా ఉంటాయి అనే నా విశ్వాసం.

అమ్మతో ఎపుడైనా ప్రయాణాలు చేశారా?

అమ్మతో నేను ప్రయాణం చేశాను. అమ్మ వాత్సల్యయాత్ర చేసినపుడు నేను Head Quarters లో ఉండటం అవసరమనే దృష్టితో వెళ్ళలేదు. అయితే గుంటూరు వెళ్ళాను – దివిసీమ ఉప్పెన వచ్చినపుడు బందరు వెళ్ళాను. అవన్నీ ఆనంద దాయకమైన విషయాలే.

మీరొనర్చిన సాహితీ సేవలేమిటి? అమ్మతో మీ కుటుంబ సభ్యుల అనుబంధం ఎలాంటిది?

అమ్మ చెప్పింది, అమ్మ చేసింది భూమికగా ‘మాతృశ్రీ’ పత్రికలో ‘ప్రేమ కంటె ధర్మం గొప్పది’, ‘తోచిందే చెయ్యగలంగానీ చెప్పింది చేయలేం’ వంటి అమ్మ సూక్తుల వివరణగా కొన్ని వ్యాసాలు వ్రాశాను. ఐదారు నెలలు ‘మాతృశ్రీ’ మాసపత్రిక సంపాదకీయాలు కూడా వ్రాశాను.

నా భార్య నాకంటె సన్నిహితంగా అమ్మతో వ్యవహరించింది. ఇప్పుడు కూడా తనకు అమ్మ పట్ల చెక్కు చెదరని విశ్వాసం ఉంది. నా సంతానానికి కూడా అమ్మపట్ల భక్తికి లోటు లేదు.

ప్రిన్సిపాల్గా అమ్మ తత్త్వాన్ని కాలేజీ విద్యార్థులకు తెలిపే ప్రయత్నం చేశారా?

అమ్మ సన్నిధిలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, సంస్కృత పాఠశాల విద్యాసంస్థలు వచ్చాయి. ఈ విద్యా సంస్థల్లో చదువుకునే పిల్లలు చాలా భాగం పేదవాళ్ళు. ఇంటి దగ్గర ఆర్థిక స్తోమత లేనివాళ్ళు. ఇక్కడ ఉచిత వసతి భోజన సౌకర్యం ఉందని వచ్చేవారు. కానీ ఇక్కడ వాళ్ళ నెలా చూడాలి అనే దాంట్లో అమ్మ చాలా సలహాలనిచ్చేది. ఆ పిల్లలకి అమ్మ ప్రేమను తెలియజేయాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజూ prayer లో ‘ముచ్చటగా మూడు నిమిషాలు’ అనే కార్యక్రమాన్ని నడిపాం. ప్రతీ ఆదివారం ఒక క్లాసు విద్యార్థుల్ని నేనే అమ్మ దర్శనానికి తీసుకువెళ్ళేవాడిని. వాళ్ళు అమ్మని రకరకాల ప్రశ్నలు వేసేవాళ్ళు; అమ్మ సమాధానాలు చెప్పేది. వాటిని record కూడా చేశాము. ఆ పిల్లలకి అమ్మ మీద అపారమైన భక్తి ఏర్పడింది. వాళ్ళు రావడం ఎలా వచ్చినా, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి అమ్మ మీద అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళు దేశం అంతా ఉన్నారు. శిక్ష అంటే క్రమశిక్షణలో పెట్టడం. ‘అమ్మ పెట్టిన కాలేజిలో మనం చదివాం. మనం ఇంత తింటున్నాం. తల్లిదండ్రులకి పెడుతున్నాం. ఉత్తమపౌరులుగా ఉండాలి. అక్కడ క్రమశిక్షణ, విశ్వమానవప్రేమ సిద్ధాంతతత్వం, సోదరతత్వం అందరికీ అందించాలి’అనే భావంతో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా ఇంకా పెద్ద పెద్ద కార్యాలయాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. చాలామంది Ph.Dలు చేశారు. జిల్లెళ్ళమూడి జీవితాన్ని గురించి, అమ్మ దర్శనాన్ని గురించి, సంస్థలో జరిగే కార్యక్రమాల గురించి ఉత్తమ అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళ అభ్యాసకాలం సార్థకమైంది-అనిపిస్తుంది నాకు. విద్యార్థులకు నేర్పడం అంటే మనం నేర్చుకోవటం.

అమ్మ చెప్పింది “ఈ పిల్లలకి ఏదైనా జబ్బు చేస్తే గబుక్కున వాళ్ళ తల్లిదండ్రులను పిలవటం కాదు, నాన్నా! మనందరం ఉన్నాం కదా! వాళ్ళకి వైద్య సదుపాయం కలిగించండి. వారానికి ఒకసారి వాళ్ళందరికీ నలుగు పెట్టి స్నానం చేయించండి. Parental care మనం తీసుకోవాలి. ఆ తల్లిదండ్రులను పిలిపించడం కాదు మనం parents గా ప్రవర్తించాలి. వాళ్ళకి ‘స్వంత – ఇంట్లో ఉండి చదువుకుంటున్నాం’ అనే భావన కలిగించాలి” – అని. తదనుగుణంగానే అక్కడ ఆచరణ ఉండేది. వాళ్ళకి అపుడు సేవా కార్యక్రమాల్లో ఆసక్తిలేకపోయినా ‘ఆ క్రమశిక్షణవల్ల మేము ఇంతవాళ్ళం అయ్యాము’ అని ఫోన్లు చేస్తూంటారు- వ్యాసాలు వ్రాస్తుంటారు. ఆ కళాశాల దేశంలో ఉన్న కళాశాలల్లా ఉండకుండా వాళ్ళ శీలశిక్షణకి, విద్యాభ్యాసంతో పాటు పరిసరాల నుంచి, పరిస్థితుల నుంచి నేర్చుకోవటానికి అనుకూల పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. అందుకే అమ్మ అక్కడ కాలేజీ పెట్టిందేమో!

అమ్మ మాటల అంతరార్థాన్ని ఎలా ఆచరణలో పెట్టాలని భావిస్తారు? జిల్లెళ్ళమూడి పవిత్రత వివరించండి.

అమ్మ “నేను నేనైన నేను” అని చెప్పింది. ఇందులో మూడు ‘నేను’లు ఉన్నాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? మొదట ‘నేను’ ‘అమ్మా! నువ్వు ఎవరివి – రాజరాజేశ్వరివా, లక్ష్మివా, పార్వతివా?’ అని అడిగితే అమ్మ ‘నేను’ అనే, ‘నేను’; రెండవ ‘నేను’ నేనైన బ్రహ్మాండం అనసూయ అయిన ‘నేను’; మూడవ ‘నేను’ అన్ని నేనులకు ఆధారమైనటువంటి పెద్ద ‘నేను’; అహం బ్రహ్మస్మిలోని బ్రహ్మ పదార్థం అయిన నేను. అదే అమ్మ.

అమ్మ “రూపం పరిమితం, శక్తి అనంతం” అన్నది. ఈ వాక్యం సృష్టిలోని ప్రతి వ్యక్తికి ప్రతివస్తువుకి అన్వయించునట్లుగానే అమ్మకి కూడా అన్వయిస్తుంది. అమ్మ పరిమితమైన రూపంలో ఉన్నప్పటికీ ఆమె శక్తి అనంతంగా వ్యాపించి ఉన్నది. Gorden Westerlund అనే ఆయన అమ్మను చూడలేదు. కానీ ‘అమ్మను నేను చూశాను’ అంటారు; ఎక్కడో అమెరికాలో ఉన్నారు. ‘Garden of Flowers’ అని అమ్మను గురించి English లో Poetry వ్రాశారు. మంత్రాయి అనే ఆయన జిల్లెళ్ళమూడిలో పొలం దున్నేవాడట. అతడు పొలం దున్నుతూంటే నాగలిమీద అమ్మ కనిపించేదట. ఎట్లా కనిపించేది? అమ్మ ఏ చీర కట్టుకుందో పని అయ్యాక ఇంటికొచ్చి చూస్తే అమ్మ అక్కడ కనిపించిన చీరతోనే ఇక్కడ కనిపించేదట. ఈ శక్తి మంత్రాయిదీను, Gorden Westerlund దీ కాదు కదా! అమ్మదే అది. అందువల్ల పరిమితమైన రూపంలో ఉన్నా పరిమితమైన కాలంలో ఉన్నా అమ్మ శక్తి అనంతంగా అన్నికాలాలకి అన్ని దేశాలకి వ్యాపించి ఉంటుంది – విత్తనంబు మట్టి వృక్షంబునకు నెంత? అన్నట్లుగా.

అమ్మ మాటలన్నీ మంత్రాలే. మంత్రం అంటే మననం చేసుకునే కొద్దీ మనల్ని అది రక్షిస్తుంది. మన దుఃఖాల్ని పోగొడుతుంది. భవభూతి అనే కవి సంస్కృతంలో ‘ఉత్తరరామచరిత్ర’ అని ఒక నాటకం వ్రాశారు. ఆయన సీతాదేవి మాటల్ని వర్ణిస్తూ –

మానస్య జీవకుసుమస్య వికాసనాని సంతర్పణాని సకలేంద్రియమోహనాని।
ఏతానితే సువచనాని సరోరుహాక్షి కర్ణామృతాని మనసశ్చ రసాయనాని॥

అన్నారు. అంటే ‘సీతాదేవి మాటలు వాడిపోయిన జీవన కుసుమాన్ని వికసింప జేస్తాయి, అన్ని ఇంద్రియాలకి సమ్మోహనశక్తిని ప్రసాదిస్తాయి, వీనుల విందుగా ఉంటాయి, మనస్సుకి మంచి బలవర్థక ఔషధం (Tonic) వంటివి అని. అలా అమ్మ మాటలు మనకి మంచి Tonic గా పనిచేస్తాయి. జీవితంలో వివిధ సందర్భాలలో ఉండేటటువంటి సంఘటనల్లో మనం సుఖదుఃఖాల్ని అను భవిస్తూంటాం. అలాంటప్పుడు అమ్మ మాటల్ని తలచుకుంటే ఆ మాటల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొంది ధైర్యం వస్తుంది. ఒకసారి అమ్మ “నా చరిత్ర చదివితే ఏం వస్తుంది నాన్నా!” అంటే ‘అమ్మా! నీ చరిత్ర చదివితే ధైర్యం వస్తుంది’ అన్నాను. అమ్మ మాటలన్నీ స్వీయ అనుభవసారమే.

“నీకిచ్చింది తృప్తిగా తిని ఇతరులకి ఆదరంగా పెట్టుకో – అన్నీ భగవంతుడే చేస్తున్నాడనుకో- ఇదే సుఖపడే మార్గం” అని చెప్పింది అమ్మ. సూత్రాలలో దళసార్ధక్యం అంటాం – అంటే అల్పాక్షరాలుగా ఉంటాయి అనల్పార్ధాన్ని ఇస్తాయి. ఇక్కడ – ‘నీవు’ అంటే after all. నీ కంటే తెలివైన వాళ్ళు, నీ కంటే డబ్బున్నవాళ్ళు నువ్వు పొందేటటువంటి సుఖాన్ని పొందకపోవచ్చు. నువ్వు ఒక పనిముట్టువి. ‘నీకు ఇచ్చింది’ – ఇది నేనే సంపాదించాను, నేనేదో ప్రయోజకుడ్ని గొప్పవాడ్ని అనుకుంటావు. అది నిజం కాదు. నీకు ఎవరో ఇస్తేనే వచ్చింది. నీకు ఇచ్చిందే అది; నువ్వు తెచ్చుకున్నదీ, నీ ప్రయోజకత్వం వలన సాధించుకున్నదీ కాదు. ఎందువల్ల? అంటే అది అందరికీ రావటం లేదు. అందువల్ల ‘నీకు ఇచ్చింది’. ‘తృప్తిగా తిని’ ఇచ్చిన దానిని తింటున్నాం గానీ తృప్తిగా తినటం లేదు. ‘అది లేదు – ఇది లేదు’ అనుకుంటూ అసంతృప్తి గానే ఉంటున్నాం. అలా కాదు. తృప్తిగా తిని అంటే అనుభవించి – ఇక్కడ Fullstop పెట్టేస్తున్నాం. తృప్తిగా తిని comma పెట్టి, ‘ఇతరులకు ఆదరంగా పెట్టుకో’ అని ఇంకొక మూడు మాటలు ఉన్నాయి. ‘ఇతరులు’ యదార్థంగా ఇతరులనేవారు ఎవరున్నారు? సత్యం ప్రకారం, తత్త్వం ప్రకారం చూసినట్లయితే ఇతరులు లేరు. ప్రపంచమంతా మనకి దర్పణం లాంటిది. మనమే నిండి ఉన్నాం ప్రపంచం అంతా. ‘యద్భావం తద్భవతి’; ‘భావోయం భావనా మాత్రం’. ఈ ప్రపంచంలో ఇతరులనే వాళ్ళు ఎవరూ లేరు. అందుచేత ‘ఇతరులకు’ అనేది మనం వ్యావహారికంగా మాట్లాడే మాటే గానీ వాళ్ళు ఇతరులు కాదు; నువ్వే. ‘ఇతరులకు ఆదరంగా పెట్టుకో” ‘ఆదరంగా’ – వాళ్ళకేదో సహాయం చేస్తున్నాను; నా సంపదను కొంత వాళ్ళకి ఇస్తున్నాను; దానం చేస్తున్నాను అనే భావాలు లేకుండా నీ కన్నబిడ్డలకి పెట్టినట్లుగా ‘పెట్టుకో’. పెట్టటం కాదు – ‘పెట్టుకో’; పెట్టుకోవటం నీ కోసం, వాళ్ళ కోసం కాదు. నువ్వు వాళ్ళకి చేసేది సేవే కానీ దానం కాదు అనే – భావన కలిగి ఉండాలి.

అన్నపూర్ణాలయంలో అన్నం తినటానికి ఎవరు అర్హులు అంటే “dress/ address బట్టి కాదు; ఆకలే అర్హత. ఆకలితో ఉన్నవాళ్ళకి ఆదరంగా అన్నం పెట్టండి” అన్నది అమ్మ. ఒకసారి అమ్మ సన్నిధిలో ‘గాయత్రీయాగం’ చేశారు. అందులో పాల్గొనటానికి ఎవరు అర్హులు ? అంటే “ఆసక్తే అర్హత” అన్నది అమ్మ. మడిగా ఉన్నవాళ్ళకి ఒక యజ్ఞకుండం, మామూలు వాళ్ళందరికీ ఒక యజ్ఞకుండం ఏర్పాటు చేయించింది. నాబోటి వాళ్ళందరూ మామూలు యజ్ఞకుండం దగ్గరకే వెళ్ళాం ఆ ఆనందాన్ని అనుభవించాం.

అమ్మ అందరినీ తన మాటలతోటి చేతలతోటి స్పర్శతోటి అనుగ్రహించింది. అమ్మ హస్తపాదస్పర్శతో జిల్లెళ్ళమూడి పవిత్రమైన క్షేత్రం. అక్కడ పంచభూతాలు కూడా అమ్మ ఉచ్ఛ్వాసనిశ్వాసలతో పవిత్రమైనవే.

భావి తరాలకి అమ్మనుగురించి మీరేమి తెలియజేయాలనుకొంటున్నారు?

అమ్మ అపురూపమైన వ్యక్తి- అనంతమైన శక్తి. అన్నపూర్ణాలయ స్థాపన నిర్వహణ అనేదే అమ్మ అనంత శక్తికి నిదర్శనం. అక్కడ నిధులుండి ఆ కార్యక్రమం ప్రారంభించలేదు. “నిధులు కాదు, నాన్నా! ప్రతినిధులు ముఖ్యం” అన్నది అమ్మ. ఏ సంస్థకైనా commitment చాలా ప్రధానమని చెప్పింది. “కమిటీలు కాదు నాన్నా – కమిట్మెంట్ కావాలి” అన్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ సమాజానికైనా అన్ని కాలాల్లోనూ ఉపయోగించేటటువంటి వాక్యం. “కట్టుబడే పెట్టుబడి – దేనికైనా సరే” అన్నది అమ్మ.

‘సర్వత్రా అనురాగం’ అనేది శక్తి వంచన లేకుండా ఎంత పెంచుకోగలిగితే అంత సుఖశాంతులతో ఉంటాం.

“అమ్మ నామరూపాలకు మంగళం – అమ్మ పాదపద్మాలకు ప్రణామాలు”.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!