“తృప్తేముక్తి” అని అమ్మ చెప్పింది. అది అసాధారణమైనటువంటి వాక్యం. ఒక ఉదాత్తభావనని అలా సరళంగా సూటిగా చెప్పటం సామాన్యమైన విషయం కాదు. ఎవరికైతే అసాధారణ అఖండ జ్ఞాన సంపద ఉంటుందో వాళ్ళే ఎట్లాంటి వాళ్ళకైనా అర్ధం అయ్యేట్లు బోధించగలరని నా ఉద్దేశము.
నేను షిర్డీసాయిభక్తుడిని; వారి గ్రంథాలు చదువుతుంటాను. అమ్మ ఇంకా సరళీకృతం చేసి చెప్పింది. “తృప్తే ముక్తి” అనే అమ్మ వాక్యాన్ని ఎవరైనా వారి జీవితాల్లో ఒకసారి అన్వయించుకుని ఆలోచిస్తే ఒక స్పష్టత కలుగుతుంది. నాకైతే ఆ స్పష్టత వచ్చింది. అది కొంచెం విప్లవాత్మకమైనది.
‘అమ్మ ఏం చెప్పింది?’ అని అడిగి తెలుసుకుంటూ ఉంటాను. కఠినమైన క్లిష్టమైన భావాల్ని సైతం అమ్మ సులభంగా వివరిస్తుంది. నాకు ఏదైనా చిక్కుముడి సందర్భం ఎదురైతే అనిపిస్తుంది – ‘అమ్మ ఉంటే ఏమని చెప్పేదో”- అని. ఎవరైనా అమ్మ మాటలు వింటే వాటి ‘వైలక్షణ్యం – వైశిష్ట్యం’ తప్పక తెలుస్తుంది.
‘ద్వైతం – అద్వైతం – విశిష్టాద్వైతం’ అని మూడు పరమ తత్వాలు ఉన్నాయి కదా! అరటి పండును చూపించి ‘అద్వైతం’ అనీ, తొక్కని వేరుచేసి ‘ద్వైతం’ అనీ, ఒలిచి ‘విశిష్టాద్వైతం’ అనీ – ఆ మూడు లక్షణాలను వివరించటం చాలా గొప్ప విషయం. వాటిమీద చాలా మంది ఉద్గ్రంధాల్ని రచించారు. ఆ ఉదాహరణ నా బోటి వానికి చాల సులభంగా అర్థమౌతుంది. అందుకే ‘అమ్మ’ మూర్తీభవించిన జ్ఞానం. కనుకనే సూక్ష్మంగా చెపుతోంది. అదే అమ్మలో విశేషం. ఇలాంటివి గ్రంధాలు చదివితే వస్తాయా?
శాస్త్ర జన్యజ్ఞానం వేరు; తనను తాను తెలుసుకున్న అనుభవజ్ఞానం వేరు. ‘అద్వైతం అంటే ఏమిటమ్మా?’ అని అడిగితే “కూతురిని కోడలుని ఒకలా చూడటం” అన్నది. ఈ వివరణ అద్భుతం- ఆశ్చర్యకరం. నువ్వు ఎక్కడికో వెళ్ళనక్కరలేదు- నువ్వు చేసే ప్రతీదాంట్లో చూసుకో అని చెప్పడమో; ఎవరినీ కించపరచుకుండా చెప్పడమో; నిత్యజీవిత అంశాలను తీసుకుని చెప్పడమో. వాస్తవంగా కోడలు- కూతురు ఆ ఇద్దరిలో తేడా తప్పకుండా కనిపిస్తుంది. అది బహుశః మానవ స్వభావం కావచ్చు. అక్కడ మొదలుపెట్టి, దానిని అధిగమించటం ద్వారా ఇతరత్రా అన్నిచోట్లా అధిగమిస్తావు అని చెప్పడం. అమ్మ తన కడుపున పుట్టిన బిడ్డలకి వేరే బిడ్డలకి తేడా చూడలేదు. అట్టి మానసిక పరిణతి పొందటం గొప్ప సాధనే నా దృష్టిలో, ‘సమదృష్టి పండిత ‘లక్షణం’ అంటారు. అది చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళకే సాధ్యం. ఆ ఉన్నతస్థితిలో ఉన్న అమ్మకి భేదాలు కనిపించవు.
0 Comments