Vithala Sesha Ratnam

Interviewed by
Ravuri Prasad
10/01/2012
Hyderabad

 

శ్రీమతి విఠాల శేషారత్నం

  ఈమె 15-3-1955లో జన్మించారు. స్వస్థలం తూర్పుగోదావరిజిల్లా పొన్నమండ. తండ్రి శ్రీ పెండ్యాల సూర్యప్రకాశరావుగారు – తల్లి సీతమ్మ భర్త – శ్రీ విఠాల రామచంద్రమూర్తి, తోడబుట్టినవారు ఆరుగురు అన్నయ్యలు, ఒక చెల్లెలు. సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.

సేవాతత్పరత : 16 ఏళ్ళ వయస్సులోనే జిల్లెళ్ళమూడి కాపురానికి వచ్చి ప్రత్యక్షంగా అమ్మసేవలో, అమ్మ సన్నిధిలో జరిగే పూజలు ఉత్సవాలు పండుగలు సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా, ఇష్టంగా పాల్గొన్నారు. ‘అమ్మ’నే కన్నతల్లిగా, కనిపించే దైవంగా ఆరాధించే సచ్చరిత.

శ్రీ రావూరి ప్రసాద్ 10-1-2012న హైదరాబాద్లో శ్రీమతి విరాల శేషారత్నం గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

ముందుగా మీ కుటుంబం నేపథ్యం తెలియబర్చండి.

నా జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లా పొన్నమండ. నాకు ఆరుగురు అన్నయ్యలు, ఒక చెల్లెలు. నా 12వ ఏట మా అమ్మ పోయింది. 16వ ఏట వివాహం అయింది. మా వారు శ్రీ విఠాల రామచంద్రమూర్తిగారు. 16వ ఏటే, 1972 జూన్ నెలలో- జిల్లెళ్ళమూడి కాపురానికి వచ్చాను. గారాబంగా అన్నదమ్ముల మధ్య పెరిగాను. ఆధ్యాత్మికత – దైవం ఇట్లాంటి భావాలేమీ తెలియవు.

అమ్మని మొదటిసారిగా మీరు దర్శించిన వైనం ఎలాంటిది?

అమ్మను చూచినపుడు నాకు మళ్ళీ మా అమ్మ దగ్గరకే వచ్చాను అనిపించింది. మా వారు నన్ను చెయ్యి పట్టుకుని అమ్మ దగ్గరకి తీసుకువెళ్ళారు మొదటిసారి. ఆ సమయంలో కరెంటు లేదు – చీకటి; నాకు పరిచయం లేని చోటు. రామకృష్ణ అన్నయ్య అమ్మతో ‘అమ్మా! శేషుకి అమ్మ లేదమ్మా. తల్లిలేని పిల్ల’ అన్నాడు. వెంటనే అమ్మ “నాన్నా! ఇవాళ అంటే అన్నావు – ఇంకెప్పుడూ ఆ మాట అనకు. శేషుకి ‘నేనే’ అమ్మని” అన్నది.

ఆ తర్వాత కూడా చాలాసార్లు “నేను నీకు అమ్మని. నువ్వు నాకు హైమవు. అమ్మ లేదని ఎప్పుడూ నువ్వు అనుకోకమ్మా” అని చెప్పింది. ఇప్పటికీ ఆ భావమే ఉంది నాకు. తల్లిలేదన్న భావం నాకెప్పుడూ కలగలేదు. అమ్మే నాకు స్వంత తల్లి అనుకున్నా.

ఆనాటి జిల్లెళ్ళమూడి వాతావరణం మీకెలా అనిపించింది?

జిల్లెళ్ళమూడి వాతావరణం చాలా బాగుండేది. ఆరుగురు అన్నయ్యల్లో పుట్టి పెరగటంతో ఇక్కడా అన్నయ్యలూ అక్కయ్యలే కనుక నేనూ అందరింటిలో సభ్యురాలినే అనుకున్నాను. ఏదన్నా కార్యక్రమాలు జరిగితే, చిన్నపిల్లను కదా, ఉత్సాహంగా గెంతుకుంటూ వెళ్ళి పనులు చేసేదాన్ని, ఆడుకునేదాన్ని. అమ్మ కూడా ఆటలు ఆడించి మమ్మల్ని ఉత్సాహపరిచేది. అమ్మ ఏ పనిచేసినా ఇష్టంగా ఉండేది. మనస్సుకి – అమ్మ కనుక ఇలా చెయ్యగలిగింది అనిపించేది.

అమ్మకు సన్నిహితంగా ఉంటూ మీరు చేసిన సేవలేమైనా ఉన్నవా?

అమ్మకి స్నానం చేయించేదాన్ని. అమ్మ కోడళ్ళు వైదేహి, శేషు సుశీలక్కయ్య, నేను – అలా నీళ్ళు పోసే వాళ్ళు ఇద్దరు- నీళ్ళు అందించే వాళ్ళు ఇద్దరు చొప్పున ఉండేవాళ్ళం. ఆ సమయంలో కూడా అమ్మ సరదాగా ఛలోక్తిగా మాట్లాడేది – మంచి చెడ్డలు, కష్టసుఖాలు అన్నీ తెలుసుకునేది. “అబ్బాయి ఏమంటున్నాడు?” అనేది. ‘ఏమంటారు? నువ్వు చెప్పినదే కదా!’ అనే దాన్ని. నేను అమ్మాయి, ఆయన అబ్బాయి అమ్మకు. ఒక్కోసారి అమ్మకి నీళ్ళు పోస్తూంటే గోడమీద నీడలు పడేవి. వాటిలో రామాయణ మహాభారత చిత్రాల (shadow pictures) ను చూపిస్తూండేది అమ్మ. అమ్మ చెప్పిన తర్వాత అర్థమయ్యేవి, వాస్తవం కదా! అనిపించేవి. అమ్మకి నేను నీళ్ళు పోసింది సుమారు నెల రోజులే. ఆ కాస్త సమయంలో గొప్ప అనుభూతుల్ని ఇచ్చింది.

అమ్మలో ఎప్పుడైనా మీరు 'విశ్వజనీనతత్వాన్ని' దర్శించారా?

మా పిల్లల్ని అమ్మ తన మనవళ్ళతో సమానంగా చూసేది. అమ్మ మనవలు అంటే – సుబ్బారావు అన్నయ్య – రవి అన్నయ్య పిల్లలు. వాళ్ళకీ మా పిల్లలకీ నెల, రెండు నెలలు తేడా – సమవయస్కులు. పళ్ళు ప్రసాదాలు ఏం పెట్టినా వాళ్ళతో సమానంగానే. వాళ్ళు అమ్మని ‘మా బామ్మ – మా బామ్మ’ అంటే, మా పిల్లలు కూడా ‘మా బామ్మ కూడా’ అని పోట్లాడేవాళ్ళు. మా పాప పావని అమ్మకి దణ్ణం పెట్టుకుని ‘నాకు ఓ ఆపిల్ పండు తే’ అనేది అమ్మతో! ఆ పండుకోసం అది అక్కడకు వెళ్ళేది.

మీరేదైనా సాధనాపరంగా చేశారా? అమ్మ వాక్యాలు ఆచరణ సాధ్యాలేనా?

నేను కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే అమ్మ తప్పక కనిపిస్తుంది ఇప్పటికీ. ఏ రంగుచీరెలో కనిపించాలనుకుంటే ఆ రంగులో, ఎలా కావాలనుకుంటే- ఏ భావంతో చేస్తానో అది వ్యక్తం అవుతుంది. అమ్మను దర్శించుకున్నాను పాదాలను స్పృశించాను అనే అనుభూతి కలుగుతుంటుంది.

ఆ రోజులలో కూడా అమ్మను చూడాలని అనుకునేదాన్ని. ఏమీ అడగాలనుకునేదాన్ని కాదు. అమ్మని నేను అడగటం ఎందుకు? అమ్మ కదా! తనే చూస్తుంది ఏం కావాలో అనే భావనలో ఉండేదాన్ని. అమ్మ వాక్యాలన్నింటినీ నేను ఆచరించాలనే ప్రయత్నం చేస్తాను. కొన్ని సాధ్యం, కొన్ని అసాధ్యం. జీవితం కదా!

నిరంతరం జిల్లెళ్ళమూడిలో జరిగే కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం ఏమిటి ?

జిల్లెళ్ళమూడిలో సామూహికంగా పూజలు చేసేవాళ్ళం అందరం. మా వారు గం.7 కి కాలేజికి వెళ్ళటం గం.12 లకి రావటం. ఇంటికి వచ్చేటప్పటికి వేళకి అన్నం పెట్టడం విషయంలో ఆలస్యం అయ్యేది. ఆయన వైఖరి చూస్తే కోపం వచ్చినట్లు తెలిసేది. నేను అమ్మతో – ‘అమ్మా! నాకు అందరితో కలిసి పూజలు చేసుకోవాలని ఉంది. కానీ కుదరటం లేదు – ఈయనకి అన్నీ వేళకి కావాలి’ అంటే అమ్మ, “అబ్బాయికి చేసుకోవడమే నీకు పూజమ్మా. అబ్బాయిని చూసుకుంటే నీవు అన్ని పూజలూ చేసినట్లే. చేసి బాధపడవద్దు. చేయకుండా సంతోషంగా ఉండు” అంది. ఇప్పటికీ నాకు అదే ముఖ్యం. అది అయిన తర్వాత నాకు సాధ్యం అయితే వీలైతే కాస్సేపు దేవుడి దగ్గర కూర్చుంటాను. నాకు దేవుడు అంటే అమ్మే.

అందరింటిలో మీరు చేసిన సేవలు - అమ్మ మీ చేత చెప్పి చేయించిన సేవలేమైనా వున్నవా?

కాలేజీ విద్యార్థులు జబ్బుపడితే వాళ్ళకి పథ్యం అవీ చేసిపెట్టమనేవారాయన. నాకు పెళ్ళి కాకముందు వంట వార్పూ పనులేవీరావు. పెళ్ళి అయిన తర్వాత నేర్చుకోవటమే. కాబట్టి వాళ్ళకి సంతృప్తికరంగా చేసి పెట్టగలనా – అనుకునేదాన్ని. ఎలా చేశానో తెలియదు. ఇపుడు వాళ్ళు కనిపించి ‘అమ్మగారూ! మీరు ఆరోజు ఫలానాది చేసిపెట్టారు’ అని చెపుతూంటే ‘ఓహో! అలా చేశానా!’ అనుకుంటాను. ఇప్పుడు నాకు అయితే గుర్తులేదు. ఎవరికైనా ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేయాల్సి వస్తే ఆ రోజులలో “శేషుకి చెప్పండి” అనేది అమ్మ – మా ఇంట్లో ఏర్పాటు చేసేవాళ్ళం. “వచ్చిన వాళ్ళకి అన్నం, బట్టలు పెట్టుకోవటం – వాళ్ళని ఆదరంగా చూడటం అనేది నేర్పటం కోసమే నేను నీ చేత చేయిస్తున్నాను” అని రెండు మూడు సందర్భాల్లో అమ్మ నాతో చెప్పింది. అందువలన ఇప్పటికీ ఎవరైనా వస్తే అన్నం బట్టలు పెట్టుకోకపోతే ఏదో తప్పు చేసినట్లు భావిస్తాము.

అమ్మ కోపాన్ని చూచారా?

జిల్లెళ్ళమూడిలో రాచకొండ నరసింహమూర్తిగారు కాన్సర్తో పోయారు. ఆయన జబ్బుగా ఉన్న రోజుల్లో ఒకరోజు అమ్మతో ఇలా అన్నాను. ‘అమ్మా! నరసింహమూర్తి గారు పోతే (ఆయన భార్య) శారదాంబగారు తట్టుకోలేదమ్మా’ అని. పడుకున్న అమ్మ ఒక్క ఉదుటన లేచి కూర్చుని “నువ్వు శాశ్వతమా? నేను శాశ్వతమా? బ్రతికి ఉండటానికి – అందరూ పోయేవాళ్ళే. ఆమెకూ అదే అలవాటు అవుతుంది” అంది. అమ్మ ఆ మాట అన్న కొద్ది కాలానికే ఆయన శరీరం చాలించారు. అమ్మకి అంతకోపం వస్తుంది అనే సంగతి నాకు తెలియదు.

'అమ్మ' పెట్టుపోతలెలా వుంటాయి?

అమ్మ పెట్టింది ప్రసాదం అనుకునేదాన్ని. నాకు తక్కువ పెట్టింది – వాళ్ళకి ఎక్కువ పెట్టింది అనే భావం నాకు ఎప్పుడూ లేదు. అమ్మ చేతి మీద తీసుకోవటమే ప్రసాదం అనుకున్నా..

ఎంతోకాలం అమ్మ సన్నిధిన వున్నారు. తర్వాత అక్కడ నుంచి సకుటుంబంగా వచ్చారు. నిర్మించుకొన్న ఇంటిని కూడా అమ్మివేశారు. ఈ సంఘటనలు మీ నమ్మకాన్ని ప్రభావితం చేయలేదా?

జిల్లెళ్ళమూడి నుంచి 20 ఏళ్ళ తర్వాత మేము బయటికి వచ్చేశాం. మేము అక్కడ ఉండే కంటే బయటికి వస్తేనే ఇబ్బందుల నుంచి తట్టుకోగలమనే ఉద్దేశంతో అమ్మ మమ్మల్ని బయటికి పంపించింది అనుకుంటా – ఇప్పటికీ. బయటికి వచ్చాము కనుకనే పిల్లలకి చదువులు, పెళ్ళిళ్ళు అయ్యి, ఆయన ఒక చోట నైనా స్థిరంగా ఉద్యోగం చేసుకోవటం ఒక పద్ధతిలో నడుస్తోంది. అయితే అమ్మతో సంబంధం పోలేదు. జిల్లెళ్ళమూడి గ్రామంకి రాకపోకలు తగ్గవచ్చు కానీ అమ్మని వేరేవిధంగా అనుకోలేదు.

మేము జిల్లెళ్ళమూడిలో మంచి ఇల్లు కట్టుకున్నాం. కట్టుకోవటానికి పూర్తి ప్రేరణ అమ్మదే. అక్కడి పరిస్థితులవల్లా, ఆరోగ్యరీత్యా, వైద్యసౌకర్యాల కోసమూ, పిల్లలు దూరంగా ఉంటున్నారనీ ఆ ఇల్లు అమ్మేశాం. మేము ఇక్కడ ఉండి ఇల్లు అక్కడ వదిలేస్తే పాడైపోతుంది కదా! అనేది ఒక కారణం.

నాకు ఊహ తెలిసి పెళ్ళి అయిన కొద్ది రోజులకే జిల్లెళ్ళమూడి వచ్చేశాను. ఆధ్యాత్మిక చింతన, దైవం, అనే ఏ విధమైన భావాలు లేవు. పుస్తకాలు చదువుకోవడం, పరీక్షలు వ్రాయడం అదే – ఆయన పెరిగిన వాతావరణం మావారు ఒక స్వామీజీ దగ్గర పెరిగారు. ఆ స్వామిజీ దగ్గర కూడా ‘అమ్మ’ దగ్గరి వాతావరణమే ఉండేది ఎక్కువగా.

మీరు అమ్మలో మాతృత్వాన్ని ఇష్టపడతారా? దైవత్వాన్ని ఇష్టపడతారా?

అమ్మ దైవం. ఒక రాయికి మొక్కుతున్నాం; దైవం అంటున్నాం. అక్కడ ఏముందో మనకి తెలియదు. అలా మొక్కుకున్నపుడు మనకి కొన్ని పనులు అవుతున్నాయి. అయినపుడు దేవుడు అంటున్నాం. కానపుడు దేవుడు నన్ను చూడలేదు, నాకు కలిసి రాలేదు అనుకుంటున్నాం. సజీవమూర్తిగా ఉన్న అమ్మని దైవం అనుకోవడంలో తప్పేముంది? అమ్మని ప్రార్థిస్తున్నాం – ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఈ మధ్య – మూడేళ్ళ క్రితం మా చిన్నమ్మాయికి అమ్మ దర్శనం చేయిద్దాం అని జిల్లెళ్ళమూడి వెళ్ళాం. అమ్మకి నేను మొక్కుకున్నా ‘దానికొక బాబు లేక పాప పుడితే మళ్ళీ నీ దగ్గరికి వస్తామమ్మా’ అని. తిరిగి వచ్చిన తర్వాత అది మళ్ళీ గర్భవతి అయింది వెంటనే. ఆస్ట్రేలియాలో పాప పుట్టింది. ఏడాదికే వెళ్ళి అమ్మ దర్శనం చేయించి తీసుకొచ్చాం. మరి అమ్మే ఇచ్చింది అనుకుంటున్నాం.

అమ్మ – హైమ – ఏ గుడిలో మొక్కినా ఆ ఫలితం నాకు నా పిల్లలకూ ఇద్దరికీ కనిపించింది. అమ్మ దైవం. నిజానికి నేను కోరుకోనవసరం లేకుండానే ఇంట్లో పనులు బయటి పనులు అన్నీ జరిగాయి; మానసికంగా నేను బాధపడవలసిన అవసరం నాకు ఎప్పుడూ కలగలేదు అమ్మ అనుగ్రహంతో.

మీ అనుభవాలతో అమ్మని గూర్చి మీ సూచనలు- సలహాలు ఏమైనా వున్నవా?

అమ్మని – అమ్మ వాక్యాలని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని తట్టుకోగల ధైర్యం వస్తుందనేది నా అభిప్రాయం.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!