Vajjha Lokaditya Mallikarjuna Vara Prasad

Interviewed by
I Hanuma Babu
04/01/2012
Jillellamudi

 

శ్రీ వఝ లోకాదిత్య మల్లికార్జున వరప్రసాద్ (మల్లు)

  వీరు రేపల్లె తాలూకా ధూళిపూడిలో అక్టోబరు, 1950న జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ వఝ శివరామయ్య, శ్రీమతి బాలాత్రిపురసుందరి. భార్య శ్రీమతి సీతామహాలక్ష్మి. సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె. విద్య 12th Class, ITl; ఉద్యోగం – విజయనగరం, పాలకొండ APSRTC Depotలలో పనిచేశారు. 6-5-2015వ తేదీన అమ్మలో ఐక్యమైనారు.

సేవాతత్పరత : చిన్నవయసులోనే అమ్మ ఒడిలోకి చేరి, దివ్య మాతృప్రేమకు పరవశించారు. ఆశ్చర్యకరమైన, అద్భుతమైన అనుభూతులను పొందారు. వీరికి ఉపనయనం, వివాహం అమ్మే చేసింది. జీవితం – జీవనం, కష్టం-సుఖం రెండూ అమ్మప్రసాదమే అని విశ్వసించారు. ఊపిరి విడిచే వరకు అందరింటి అభివృద్ధి కోసం – అమ్మ సేవాసంస్థలలో నిర్విరామంగా శ్రమించారు.

శ్రీ ఐ.హనుమబాబుగారు 04-01-2012న జిల్లెళ్ళమూడిలో మల్లు అన్నయ్య గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మీరు అమ్మని మొదటిసారి దర్శించిన జ్ఞాపకాల్ని మాకు చెప్పండి.

1960లో నా పదేళ్ళ వయస్సులో మా నాన్నగారు నన్ను జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనానికి పంపించారు. వచ్చి అమ్మకి నమస్కరించుకున్నాను. “నాన్నా! ఎట్లా ఉన్నాడురా మీ నాన్న?” అడిగింది అమ్మ. ‘నేను ఫలానా అని ఈమెకి కెట్లా తెలుసు? మా నాన్న ఎట్లా ఉన్నాడు? అని అడుగుతోందే ఈమె !’ అనుకున్నా. “నిన్నేరా నాన్నా!” అన్నది మళ్ళీ. ‘కులాసాగా ఉన్నారమ్మా’ అన్నాను. ప్రక్కనే ఉన్న అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య ‘ఎవరబ్బాయి?’ అని అడిగారు “మన శివరామయ్య కొడుకు” అన్నది అమ్మ. “నీ పేరేమిటి?’ అని అడిగారు ఆయన. “వాడి పేరు మల్లు” అమ్మే చెప్పింది నాపేరు కూడా. అప్పటి నుంచి నన్ను ‘మల్లు’ అనటం మొదలు పెట్టారు ‘అందరింట్లో’.

మొదటిసారి మా నాన్నగారు 1959 లో అమ్మ దగ్గరకు వచ్చారు. వారికి అమ్మ పట్ల ప్రగాఢ విశ్వాసం – అమ్మే దైవం. ఆనాటి కుమారస్వామి మందిరంలో బల్లమీద కుర్చీవేసి అమ్మను కూర్చోబెట్టారు. అమ్మ అన్నం కలిపి అందరికీ పెద్ద పెద్ద తిరుపతి లడ్డు అంత ముద్దలు పెడుతోంది. నాకు కూడా ఒక ముద్ద పెట్టింది. ‘ఈ ఊరిలో హోటల్ లేదు ఏదన్నా తిందామంటే. ఈ ముద్ద నాకు ఏం చాలుతుంది?’ అనుకున్నా. సగం ముద్ద తినేటప్పటికే నా పొట్ట నిండి పోయింది. ‘ఓహో! ఇదా అమ్మ మహత్యం’ అనుకున్నా. అన్నం పారవేయకూడదని ఎలాగోలా మిగిలిన ముద్ద తిన్నా. తర్వాత అమ్మ నన్ను పిలిచి “ఇంకొంచెం పెడతాను తిను, నాన్నా!” అంది. ‘ఇక నావల్లకాదమ్మా’ అన్నాను. అమ్మ పకపకా నవ్వింది. నమస్కరించుకుని బయటికి వచ్చా.

చిన్నతనాన కన్నతల్లి గోరుముద్దలు తినిపించటం జ్ఞాపకం లేదు. ఆ రుచి ఏంటో తెలియదు. ఈ తల్లి ముద్ద పెట్టింది. ఊహ తెలిసిన తర్వాత ‘అమ్మ’ చేతి గోరుముద్దలు తిన్నా, వయసు మీరిన వారికీ పెట్టింది – వాళ్ళూ పసివాళ్ళుగా కనిపించారు కాబట్టి. అమ్మను దర్శించుకోవటంలో ఎంత హాయి! అదే చాలు జీవితానికి. “నీకిచ్చింది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అనే అమ్మవాక్యం నాకు బాగా హత్తుకుంది క్రమేణా.

ఒకసారి “నాన్నా! నువ్వు ఎప్పుడూ పువ్వులుకానీ, పళ్ళుకానీ తెచ్చినట్లులేదురా, ఎందుకు?” అని అడిగింది అమ్మ. ‘అమ్మా! అవన్నీ తీసుకువచ్చి నీకు పూజ చేస్తూంటే నాకేదో నాటకం అనిపిస్తుందమ్మా. నలుగురిలో highlight అవడం కోసం చేసినట్లు అనిపిస్తుంది. అందుకని నీ కోసం తెచ్చిన పూలూ పళ్ళూ dais మీద ఫోటో దగ్గర పెట్టేసి వచ్చా’ అన్నా నాకు అమ్మ దైవం. అమ్మ పాదాలకు ఎన్నిసార్లు నమస్కారం చేసుకున్నా తనివి తీరదు.

అమ్మ వద్ద సేవాకార్యక్రమాలు అంటే నాకు ఇష్టం. తదనంతర కాలంలో ఒకసారి అమ్మ “కరెంటు పనులు చూడరా” అంది. MMC (Matrusri Medical Centre) కి వైరింగ్ నా చేతుల మీదుగా చేయించింది. నాకు అది ఎంతో ఆనందదాయకం.

అమ్మకి సర్వం తెలుసుననే మీ అనుభవం ఏమిటి ? అమ్మ ఇచ్చిన వరం ఏమిటి?

1966 లో పారిపోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నా మా అన్నయ్య గారి వివాహం నిశ్చయమైంది. మా నాన్నగారితో అమ్మ “ఒరేయ్. మల్లు ఉపనయనం కూడా చేద్దాం” అన్నది. ఆయన ‘అమ్మా! వాడు ఎక్కడున్నాడో అడ్రస్ తెలియదు. ఒడుగు ఎట్లా చెయ్యను?’ అని ఏడ్చారు. “వాడే వస్తాడు, నాన్నా! ఆ ఏర్పాట్లు చెయ్యి” అన్నది. బొంబాయిలో ఉన్న నాకు అమ్మ “రా!రా!రా!” అని పిలుస్తున్నట్లు అనిపించి, ఒక్క నిమిషం గూడ ఉండ లేక రైలులో రిజర్వేషన్ లేకపోయినా – రేపు ఒడుగు అనగా జిల్లెళ్ళమూడి చేరాను. అమ్మ ఉపనయనం చేసింది నాకు. అప్పుడే పోతుకూచి రవి నిర్యాణం చెందాడు. నా ఒడుగు, మా అన్నయ్య పెళ్ళి అన్నీ ఒకే కాలంలో జరిగాయి. ఇక్కడికి వచ్చాక అమ్మ “నాన్నా! బొంబొయిలో నువ్వు ఫలానా చోట పడుకున్నావు. ఇట్లా చేశావు కదా!” అని చెబుతూంటే ‘అమ్మా! ఇవన్నీ నీకెట్లా తెలుసు?’ అని అడిగా. “నేను చూశాను కదా, నాన్నా!” అన్నది. అంటే అమ్మ నా వెన్నంటే ఉన్నది, నాతోనే ఉన్నదనిపించింది.

ఒకసారి ‘అమ్మా! నేను క్రిందికి వెళ్ళొస్తాను’ అంటే “ఏం, నాన్నా!” అంది. ‘ఆకలేస్తోందమ్మా, గజేంద్రమ్మ కొట్టుకుపోయి పప్పుండలు తినొస్తా’ అన్నాను. బ్రహ్మాండం శేషుకి కబురుచేసి ఒక గిన్నెలో చింతకాయపచ్చడి అన్నం తెప్పించింది. తన ఎడమ చేయిని నా భుజం మీద వేసి కుడిచేత్తో ఒక్కొక్క ముద్ద నా నోట్లో పెట్టింది. ఆ సమయంలో “ఒరేయ్, మల్లు ! ఏదన్నా కోరుకోరా” అన్నది. ‘అలా హఠాత్తుగా అడిగితే నేనేమీ చెప్పలేనమ్మా’ అన్నా. ప్రక్కనే ఉన్న వీరమాచనేని ప్రసాదరావుగారు ‘సాక్షాత్తు భగవంతుడు నిన్ను వరం కోరుకోమంటున్నాడు మల్లూ! వరం అడగకపోవటమేమిటి?’ అన్నారు. ‘అమ్మా! నీ మీద భక్తి విశ్వాసాలు పోకుండా చూడు’ అన్నాను. అప్పుడు వి.యమ్.ప్రసాదరావు గారు ‘అదేమిటి? కోటో రెండు కోట్లో కోరుకుంటాడనుకున్నాను’ అన్నారు. “వాడు కోరిన దాంట్లోనే అన్నీ ఉన్నాయి నాన్నా! వాడు నన్ను కట్టిపడేశాడు” అన్నది అమ్మ నా వెన్ను నిమురుతూ.

మీరు అమ్మ సన్నిధిలోనే ఉండిపోయే పరిస్థితులు ఎలా కలిగాయి?

మా నాన్నగారు పోయిన తర్వాత మా అన్నయ్య, నేను, మా తమ్ముడు అమ్మ దగ్గరకి వచ్చాం. “ఉండండి, నాన్నా!” అన్నది. నిద్ర చేశాం. మర్నాడు మాఅందరికీ ఆశీర్వచనం బట్టలు పెట్టింది. వాళ్ళిద్దరికీ బొట్టు పెట్టి నాకు పెట్టలేదు. ప్రయాణమైన వాళ్ళకి తప్పనిసరిగ బొట్టుపెడుతుంది అమ్మ. వాళ్ళతో పాటు ‘నేను కూడా వెళ్ళొస్తానమ్మా’ అని బయటికి వస్తూంటే అమ్మ “ఒరేయ్! నువ్వు ఎక్కడికిరా” అని, “వాడు రాడు, నాన్నా! మీరిద్దరూ వెళ్ళండి” అన్నది. తర్వాత నన్ను కూర్చోబెట్టి “నాన్నా! ఇక్కడ పనులు చూసుకుంటూ హాయిగా ఉండు” అన్నది. ‘అమ్మా! ఇది మంచి వాతావరణం కలుషితమైన మనిషిని నేను. ఇక్కడ ఉండతగిన మనిషిని కాను’ అన్నా. “నువ్వు చాలామంచివాడివి, నాన్నా! నువ్వు ఉండతగినవాడివి. ఉండాల్సిందే. నీకు నేను పెళ్ళి చేస్తాను” అన్నది కాదమ్మా! నేను ఉండలేను. ఉండను’ అన్నా. “నాకు చెప్పకుండా ఏడవమైలు దాకా వెళ్ళటానికి కూడా వీలులేదు” అని శాసించి అమ్మ నన్ను అక్కడే ఉంచింది.

మీకు సంబంధించిన శుభకార్యాలు ఏమైనా అమ్మ సమక్షంలో జరిగాయా?

మా నాన్న పోయిన సంవత్సరము లోపే నాకు పెళ్ళి చేస్తానన్నది అమ్మ. నేనే ఇక్కడ పడి తింటున్నాను. నా భార్యని కూడా తీసుకు వచ్చి భారం వేయడం ఇష్టం లేదు. ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ‘ఇట్లా వెళ్ళిపోనియ్యమ్మా’ అన్నాను. “నీకేం ఫరవాలేదు రా, నాన్నా! నీ భార్యని పోషిస్తావు” అన్నది. నేను వెంటనే జిల్లెళ్ళమూడి ‘నాన్నగారి’ దగ్గరకి పరుగెత్తాను. సంవత్సరము లోపు నీకు పెళ్ళి ఎట్లా చేస్తుందిరా మీ అమ్మగారు?’ అని అమ్మతో- ‘వాళ్ళ నాన్న పోయిన సంవత్సరం లోపు ఎట్లా పెళ్ళి చేస్తావు?’ అని అడిగారు. తర్వాత అమ్మ నన్ను కోప్పడింది. “ఏరా! నేను చెపితే మళ్ళీ నాన్నగారి చేత చెప్పిస్తావా? నీ పెళ్ళి నేను చేస్తాను” అంది. సంవత్సరం తర్వాత గోదావరి జిల్లా పర్యటనకు అమ్మ నన్ను తనతో తీసుకు వెళ్ళింది. పాలకొల్లులో పెళ్ళిచూపులు. “పెళ్ళిచేసుకునేందుకు నీ అభిప్రాయం ఏమిటిరా?” అని అడిగింది. ‘అమ్మా! నేను పెళ్ళి వద్దన్నాను. నువ్వు చేస్తానన్నావు కాబట్టి కుంటి అయినా, గుడ్డి అయినా నువ్వు చెప్పిన అమ్మాయిని చేసుకుంటాను. నా మనస్సులో ఏముంది అంటే – నేను వాళ్ళింటికి వెడితే అన్నం పెట్టలేని కుటుంబం లోంచి వచ్చిన పిల్లనైతే చేసుకుంటానమ్మా’ అన్నాను. అమ్మ నా నోట అలా పలికించింది – అని తర్వాత తెలిసింది.

పురోహితుడు లేడు. బహిరంగ వేదిక మీద 1974 మే 5వ తేదీన అమ్మ నా పెళ్ళి చేసింది. తనే పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని చేసింది. తాళి కూడా తానే కట్టింది. రెండు ముడులు వేసి, “ఏం నాన్నా! తాళికట్టవేమిటిరా?” అని మూడవ ముడి తానే వేసి చివర పట్టుకోమంటే పట్టుకున్నాను. తన మెళ్ళో నల్లపూసల దండతీసి నా భార్య మెడలో వేసింది. అట్లా ఎవరైనా చెయ్యగలరా? అమ్మ ప్రేమకి అంతులేదు. ఈ సంఘటనలన్నీ నన్ను అమ్మ పాదాలకు బలంగా కట్టి పడేశాయి. మా అబ్బాయికి నామకరణం, అన్నప్రాశన, ఉపనయనం అన్నీ అమ్మే చేసింది.

మీకు అమ్మ ప్రసాదించిన మహిమాన్విత సన్నివేశాలు మాతో పంచుకోండి.

మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఒకనాడు అమ్మ “నాన్నా! మీ నాన్న రూపాన్నైతే చూపించలేను కానీ మీ నాన్న చూసుకున్నట్లుగా నిన్ను చూసుకుంటానురా, నీకు మాట ఇస్తున్నాను” అన్నది. ఒకనాడు రాత్రి నా గదిలో నిద్రపోతున్నా, ఒంటి గంట ప్రాంతంలో ‘నిన్ను అమ్మ పిలుస్తోంది’ అని పిలిచారు. ఎందుకో ఏమిటో తెలియక గాబరాగా అమ్మ వద్దకు పరుగెత్తా. “నాన్నా! కాళ్ళు పిసకరా” అంది. కాళ్ళు పిసుకుతున్నా. అమ్మ పాదాలా లేత తమలపాకుల్లా ఉంటాయి. నా చేతులా మొరటు. “ఇంకా గట్టిగా పిక్కలు మెలివేయి” అంటే రాను రాను మూడు నాలుగు నిమిషాలకు పూర్తిగా కాళ్ళంతా వెంట్రుకల మయం. మెలివేస్తుంటే మా నాన్నగారు కాళ్ళు పిసికేటప్పుడు ఎలా మాట్లాడుతారో అదే స్వరం ఆఁ ఆఁ ఆఁ పాదాలు – అక్కడ మోకాళ్ళు – అంటూ. దగ్గు వచ్చినపుడు మా నాన్నగారికి కాండ్రించి ఉమ్మివేయటం అలవాటు. అమ్మ అలా కాండ్రించి ఉమ్మి వేసినపుడు ‘నాన్నగారూ!’ అని పెద్దగా అరిచాను. అమ్మ తన కాలి బ్రొటనవేలితో ఒక్కసారి స్పృశించింది నన్ను. అపుడు ఏం జరిగిందో నాకు తెలిసింది ‘మా నాన్నగారిని చూపించింది అమ్మ’ – అని. ‘అమ్మా! రూపం చూపించలేను అన్నావు కానీ రూపాన్ని కూడా చూపించావు, అమ్మా!’ అన్నాను. “నువ్వు ఎప్పుడూ మీ నాన్న ధ్యాసలో ఉంటావురా! కాబట్టి నాన్నలా కనబడ్డాను. నేను చూపించిందేమీ లేదు” అని మాయ కప్పేసింది. ఏదీ తన మీద ఉంచుకోదు కదా!

అమ్మ అనుగ్రహాన్ని తల్లిగా, దైవంగా ప్రసాదిస్తుంది. ఒక సందర్భంలో “నాన్నా! నాకు చెప్పకుండా నువ్వు ఏడవమైలు దాకా కూడా వెళ్ళటానికి వీలులేదురా” అన్నది. సుబ్బారావు అన్నయ్య ఇటుకలు తయారు చేసే పరిశ్రమ ఒకటి పెట్టాడు. దాంట్లో నేను ఒక director ని. ‘మల్లూ! రేపు ఛైర్మన్ గారు వస్తారు. నువ్వు ప్రొద్దున్నే మొదటి బస్సుకి గుంటూరు వెళ్ళాలి. బాపట్లలో మొదటి బస్సు గం. 5లకు’ అని రాత్రి గం.9.00లకు చెప్పారు. నేను భోజనం చేసి గం.10.00ల ప్రాంతంలో అమ్మ దగ్గరకి వెళ్ళాను. అమ్మ గాఢ నిద్రలో ఉంది. చెప్పకుండా వెళ్ళొద్దు అన్నది కదా! అమ్మకి చెప్పకుండా వెడితే ఎట్లా? అవతల urgent. అపుడు రెండు కుంకుమ పొట్లాలు తెచ్చుకుని అమ్మ పాదాల బ్రొటన వ్రేళ్ళకి నెమ్మదిగా తాకించాను. అమ్మ ఉలిక్కిపడ్డది. లేచింది. “ఎవర్రా?” అన్నది. ‘నేను మల్లుని అమ్మా’ అని సంగతి చెప్పాను. బొట్టు పెట్టి “సరే. వెళ్ళిరా” అన్నది. 7వ మైలు దగ్గరకి వెళ్ళాను. బస్సుల్లేవు. రాత్రి గం. 12లు అయింది. ‘ఈ అర్థరాత్రి బాపట్ల ఎలా వెళ్ళగలను?’ అనే ఆలోచన వచ్చింది. పెద్దగా అమ్మ నామం చేస్తున్నాను. బాపట్ల నడచి పోదామని బయలుదేరాను. షుమారుగా జమ్ములపాలెం వచ్చేసరికి నా కుడికాలు ముందుకు పడలేదు. ఏమిటా అని చూస్తే – భయంకరమైన పాము రోడ్డుకి అడ్డంగా పోతోంది. దాని మీద నా అడుగుపడితే ఇంతే – ప్రాణం పోయేది. చెమటలు పట్టాయి. అంత చీకటిలో పాము ఎట్లా కనపడింది? అని ఆలోచించా. నా వెనుక నుంచి రెండు లైట్లు కనిపిస్తున్నాయి.

వెనక్కి తిరిగి చెయ్యి ఎత్తా ఆగింది. అది ఆర్టిసి బస్సు. ఎక్కి – బాపట్లకి టిక్కెట్టు ఇవ్వమన్నా. ‘టిక్కెట్టు ఇవ్వకూడదండీ. చెడిపోతే మరమ్మత్తు చేసుకు వస్తున్నాం. కూర్చోండి. బాపట్లలో దించుతాం’ అన్నారు. అందులో డ్రైవరు, కండక్టర్, నేను తప్ప మెకానిక్లు ఎవరూ లేరు. బాపట్ల రాగానే రైల్వే గేటు వేసి ఉంది. బస్సు ఆపాడు. ఆ ప్రక్కనే ఒక టీ కొట్టు ఉంది. ‘మూడు టీలు పెట్టు’ అన్నా – మర్యాద కోసం వాళ్ళకి టీ ఇప్పిద్దామని. ‘మూడు టీలు ఎవరికండీ?’ అని ప్రశ్నంచాడు కొట్టువాడు. నేను వెనక్కి తిరిగి చూస్తే బస్సులేదు, ఎవరూ లేరు. చాలా విచిత్రం అనిపించింది. గుంటూరు వెళ్ళి పని పూర్తి చేసుకుని జిల్లెళ్ళమూడి వచ్చా. “ఏం నాన్నా! హాయిగా వెళ్ళొచ్చావా?” అని అడిగింది అమ్మ. ‘అమ్మా! నువ్వు బస్సు రూపం ధరిస్తావని నాకు తెలియదమ్మా’ అన్నాను. “బస్సురూపం ధరించట మేమిటిరా?” అన్నది. విషయం అంతా చెప్పా. “ప్రక్కనుంచి వెళ్ళిపోయి ఉంటుంది, నాన్నా!” అన్నది. తాను దైవం అని మరో నిదర్శనం చూపింది.

'హైమక్క'ని గూర్చిన మీ జ్ఞాపకాలు తెలియజేయండి.

హైమక్కయ్యని నేను చూశాను. ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. మనిషి, మాట అమ్మ కన్నా మృదువు. ఒకసారి తాను తొట్టిస్నానం చేయవలసి వచ్చింది. నేను కూడా ఒక బిందె తీసుకొని చెరువు నుంచి నీళ్ళు తెచ్చాను. అలా నీళ్ళు తెచ్చి పోస్తూంటే అక్కయ్య నా బుగ్గలు పట్టుకుని ‘ఇంత చిన్నపిల్లవాడివి. నీ చేత కూడా నేను పనిచేయించుకుంటున్నాను చూడు’ అంటూ బాధపడింది.

అమ్మ భర్త (నాన్న)గారితో మీ అనుబంధం ఎలాంటిది? అమ్మతో ఏవైనా ప్రయాణాలు చేశారా?

నాకు అమ్మదేవుడు. అమ్మకి నాన్నగారు దేవుడు. కనుక నాన్నగారు మనకి దేవుడు. జిల్లెళ్ళమూడి నాన్నగారు చాలా హాయిగా ఉండేవారు. ‘ఒరేయ్! Badminton, Table Tennis ఆడదాం, రా! రా!’ అని పిలిచేవారు. అమ్మతో చైనీస్ చెక్కర్ ఆడేవాళ్ళం. గోదావరి, చిత్తూరు, కడప జిల్లాల పర్యటన సందర్భంగా అమ్మతో నేనూ వెళ్ళాను. అమ్మ గ్రంథాలు ఫోటోల విక్రయం నిర్వహించేవాడిని.

అమ్మ శరీరత్యాగం చేసిందని విన్న మీలో కలిగిన మానసిక స్పందన - జీవితంలో అమ్మ మీకు ప్రసాదించిన కష్టసుఖాలు ఎలాంటివి?

1985లో అమ్మ శరీర త్యాగం చేసినపుడు నాకు మానసిక స్తబ్ధత వచ్చింది. ఏడ్వలేను. అయ్యో! అమ్మ పోయిందే. నేను జిల్లెళ్ళమూడి వెళ్ళలేదు. APSRTC లో పనిచేస్తూండేవాడిని. అపుడు నన్ను RTC వారు Training కి ‘పూనా’ పంపిస్తున్నారు. వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది. అమ్మదేవుడని నమ్మావు కదా! అమ్మ దగ్గరకి వస్తే ఉద్యోగం ఎందుకు పోతుంది ? అని ఎవరైనా అడగవచ్చు.

మొదట్లో నాకు R&Bలో ఒక ఉద్యోగం వచ్చింది. అమ్మతో ‘ఇదిగో appointment order’ అన్నాను. “ఎంత ఇస్తారురా?” అన్నది. ‘వందో నూటయాభైయో ఇస్తారమ్మా’ అన్నాను. “నీకేం సరిపోతాయిరా, నాన్నా! అదేం చాలుతుంది రా” అన్నది; వెళ్ళలేదు.

కొన్నేళ్ళ తర్వాత “నువ్వు వెళ్ళి హాయిగా ఉద్యోగం చేసుకోరా” అన్నది అమ్మ. ‘సరేనమ్మా’ అని బయటికి వచ్చేశాను. ఉద్యోగం నిమిత్తం అమ్మ అప్పుడు బయటికి ఎందుకు పంపలేదో ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటోందో అర్థం కాలేదు.

బాపట్ల బస్టాండులో నిలుచున్నా. నా స్నేహితుడు వచ్చి ‘ఏమిటిరా ఇక్కడ నుంచున్నావు?’ అని అడిగాడు. ‘ఎటువెళ్ళాలో తెలియక నిల్చున్నాను’ అన్నాను. వంద రూపాయలు జేబులో పెట్టి ‘విశాఖపట్టణం వచ్చే సెయ్యి’ అన్నాడు. ‘సరే’ అన్నాను. మర్నాడు విశాఖపట్టణం వెళ్ళగా తాత్కాలికంగా APSRTC లో ఉద్యోగం వేయించాడు. ఆ కాలంలో నేను పడ్డ బాధలు ఏనాడూ అమ్మతో చెప్పలేదు. “ఒరేయ్, చిక్కిపోతున్నావురా” అని అమ్మ ఏడ్వటం, ‘ఔనమ్మా’ అని నేను ఏడ్వటం. నా భార్య ఒకే చీరెతో ఉండి ‘రాత్రిపూట ఉతుక్కుని ప్రొద్దున పూట కట్టుకునేది. అమ్మనే నమ్మాం. ఆమే చేయాలి ఏం చేసినా. ఎందుకు చేస్తుందో తెలియదు. సంవత్సరము అయిన తర్వాత ఉద్యోగం నుంచి నన్ను తీసేశారు. ఎన్నో ఇబ్బందులు పడ్డాము. APSRTC చరిత్రలో మూడున్నర సంవత్సరాల కాలంలో ఎవరికీ promotion రాలేదు. అమ్మ కరుణతో నాకే వచ్చింది. తాను ‘అమ్మ’ ననుకున్నది కనుక దుఃఖించింది; జగన్మాత కనుక అతి తక్కువ కాలంలో promotion ఇవ్వగలిగింది. అటు ‘అమ్మ – ఇటు జగన్మాత’ అని నా భావం.

అమ్మ ఎప్పుడూ మంచే చేస్తుంది. తిండి లేక బాధపడ్డా కానీ లేదనుకోలా. రెండు మూడు రోజులు మంచినీళ్ళు త్రాగి బ్రతికిన సందర్భాలున్నాయి. అయినా ‘ఏమిటి అమ్మ ఇట్లా చేస్తోంది ?’ అని అనిపించలేదు ఏనాడూ.

నేను ఎప్పుడూ అమ్మ సేవాకార్యక్రమాలంటే ఇష్టపడతా – పూజలకంటే తత్త్వాధ్యయనం కంటె. సేవాకార్యక్రమాలు చేసిన వాళ్ళకి ఎక్కువగా అమ్మ ప్రాధాన్యత నిచ్చి బాగా పైకి తీసుకువచ్చింది అనేది నా అనుభవం, నమ్మకం. వాళ్ళూ వాళ్ళ పిల్లలూ వృద్ధిలోకి వచ్చారు. అందుకు ఉదాహరణ నేనే. నాకు ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. మా అల్లుడు inverters వ్యాపారం చేసుకుంటున్నారు, హాయిగా ఉన్నారు. మా అబ్బాయి B.Com degree కంపార్ట్మెంటల్గా ఉత్తీర్ణుడైనాడు. GE కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అది అమ్మ కృప. వారంరోజులు interview చేశారు. అమ్మ ఏం మాయకప్పిందో తెలియదు. G.E.లో ఉద్యోగం రావటం చాలా కష్టం. వాడికి పెళ్ళి అయింది, ఇల్లు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు – Bank loan పెట్టి. అప్పు ఎలా తీర్చాలి అని బాధపడుతూంటే IBM లో Asst Managerగా 53 వేల రూపాయిలు జీతం పై ఉద్యోగం వచ్చింది. బెంగుళూరులో ఏడాది పనిచేస్తే కానీ హైదరాబాద్ బదిలీ చేయమన్నారు. కానీ నాలుగు నెలలలోనే హైదరాబాద్ transfer చేశారు. ఇది పూర్తిగా అమ్మ అనుగ్రహమే.

అమ్మని అమ్మగా ఇష్టపడతారా లేక దైవంగానా? ఏ ప్రభావం మీపై ఎక్కువగా ఉంది?

మా నాన్నగారు పోయిన తర్వాత మాసికాలు హైదరాబాద్లో మా అన్నయ్య గారింట్లో పెట్టాము. అక్కడికి వెళ్ళలేనపుడు కొబ్బరికాయ కొట్టుకోమన్నది అమ్మ నన్ను, ఒకసారి బంద్-బస్సులు, రైళ్ళు లేవు. హైదరాబాద్ వెళ్ళలేకపోయాను. ఉదయం స్నానం చేసి కొబ్బరికాయ తీసుకుని అమ్మ దగ్గరకి వెళ్ళాను. ‘అమ్మ చాలా కోపంగా ఉన్నది, ఇపుడు దర్శనం ఇవ్వడు’ అన్నారు. ‘తర్వాత నాకు కబురు చేయండి, కొబ్బరికాయ కొట్టుకుంటాను అన్నం తినకుండా’ అని చెప్పి క్రిందకి వచ్చేశాను. ఆ రోజులలో నేను పూలకొట్టు నిర్వహించేవాడిని. పనిలోపడి, అమ్మ దర్శనం ఇస్తున్న సంగతి తెలియక భోజనం చేసి వచ్చి కూర్చున్నాను. తర్వాత కొంతసేపటికి ‘మల్లూ ! అమ్మ దర్శనం ఇస్తోంది. రా! కొబ్బరికాయ కొట్టుకో” అని కబురు చేశారు నాకు. చాలా కోపం, బాధ, కష్టం కలిగి నేను రానన్నాను. ‘అమ్మ రమ్మనమంటోంది’ అన్నారు. ‘నేను అమ్మ దగ్గరకు రాను. నేను మణులు అడగలా, మాణిక్యాలు అడగలా. కొబ్బరికాయ కొట్టుకుంటానని అడిగా. ఆ కోరిక కూడా తీర్చలేదు అమ్మ. నేను రాను’ అన్నాను పౌరుషంగా. ఆ రోజంతా వెళ్ళలేదు. మర్నాడు సంధ్యావందనం సమయంలో పైకి వెళ్ళా. అప్పటి దాకా దర్శనం ఇచ్చి అమ్మ లోపలికి వెళ్ళింది. ‘నాకు దర్శనం ఇవ్వటం కూడా ఆమెకి ఇష్టం లేదు కాబోలు’ అనుకుని ‘నేను కావాలనుకుంటే ఆమెను క్రిందికి రమ్మనమను’ అని పెద్దమాట అనుకుంటూ క్రిందికి వచ్చేశా.

రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అమ్మ క్రిందికి వచ్చింది. లుంగీ, బనీను ఇదే జిల్లెళ్ళమూడిలో నా వేషం. అమ్మ నన్ను కారు దగ్గరకి పిలిచింది. ‘ఏంటమ్మా’ అన్నాను. “కారు ఎక్కరా” అన్నది. ‘ఎక్కడికి?’ అన్నా. “ఎక్కరా” అన్నది. నేను ఎక్కనన్నా. “కారు ఎక్కు” అని గట్టిగా అంది. కారెక్కాను. బాపట్ల, గుంటూరు దాటి విజయవాడ చేరాం – రైల్వేకాలనీ వద్దకు. రాత్రి గం.12.15ల సమయం. అమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత అరగంటకి “మల్లును పిలవండి” అన్నది. లోపలికి వెళ్ళా. “తారీఖు ప్రకారం మీ నాన్నపోయిన రోజు ఇవాళ రా! ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకో!” అన్నది. కొబ్బరికాయ కొట్టించుకుని, పులిహోర తినిపించింది. అదీ తల్లిప్రేమ అంటే. నా కోరిక తీర్చటం కోసం క్రిందికి దిగివచ్చింది. అది నా మనస్సును పిండిన అనుభవం. తల్లి స్వభావానికి అంతటి మహాశక్తి ఉంది. అన్నిటి కంటే అమ్మలోని మాతృప్రేమే నాపై ఎక్కువ ప్రభావాన్ని చూపింది.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!