Kavirayuni Kameswara Rao

Interviewed by
P S R Anjaneya Prasad
27/12/2011
Visakhapatnam

 

శ్రీ కవిరాయని కామేశ్వరరావు

  వీరు 15.7.1940 న జన్మించారు. స్వస్థలం విశాఖపట్టణం. తల్లిదండ్రులు శ్రీ కవిరాయని చినరామమూర్తి, శ్రీమతి సీతారావమ్మ. భార్య – శ్రీమతి రాధ. సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె, విద్య – M. Tech (Civil Engg.), M.Sc., ఉద్యోగం : Professor (Andhra University)

సేవాతత్పరత : అమ్మ, నాన్నగార్ల పరిపూర్ణ ప్రేమను పుష్కలంగా పొంది అందరింట ధాన్యాభిషేకం వంటి అన్ని సేవా కార్యక్రమాల్లో ఇష్టంగా పాల్గొనే సేవాతత్పరులు.

శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు 27-12-2011న విశాఖపట్టణంలో శ్రీ కవిరాయని కామేశ్వరరావుగారిని చేసిన
ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మీ కుటుంబ నేపధ్యాన్ని వివరించండి.

మాది శ్రీకాకుళంజిల్లా అచ్యుతాపురం గ్రామం. నేను Indiaలో M.Tech Civil Engineering చేశాను. Canada లో M.Sc., in Civil Engineering and structures చేసి Andhra University Professor గా చేసి retire అయ్యాను.

మొదటిసారి అమ్మని దర్శించిన వైనం ఎలాంటిది?

ఒకసారి శ్రీ గంటి వెంకట్రావు గారు మా ఇంటికి వచ్చారు. వారు ఇల్లు కట్టుకునేందుకు Plan ఇవ్వమని అడిగారు. మాటల సందర్భంలో ‘నేను ఎల్లుండి జిల్లెళ్ళమూడి వెడుతున్నాను. అక్కడ శ్రీ లలితాకోటినామ పారాయణ ఉంది. మీరూ వస్తారా?’ అని అడిగారు. ‘తప్పకుండా’ అన్నాను. 10-11-1979లో మొట్ట మొదటిసారి సకుటుంబంగా వెంకట్రావుగారితో జిల్లెళ్ళమూడి వెళ్ళాను.

అమ్మను చూడగానే కన్నీరు వరదలై ప్రవహించింది. నేను వర్ణించలేను; కన్నీరు ఎందుకు వస్తుందో తెలియదు. ఆ ఆనందం అనుభవైక వేద్యం. నా జేబులో ఉన్న 50 రూ.లు తీసి అమ్మ దగ్గర పెడుతూంటే “నాకెందుకు, నాన్నా! ఆఫీసులో ఇయ్యి. అక్కడ దేనికైనా ఉపయోగిస్తారు” అన్నది.

అమ్మ దర్శనానంతరం – మీలో కలిగిన మానసిక స్పందనను వివరించండి.

మొదటి దర్శనం తర్వాత తరచుగా అమ్మ దగ్గరకి వెళ్ళాలనే ఆకాంక్ష పెరిగింది. అమ్మ కృపవల్ల వెళ్ళగలిగాను. మొదట్లో నెలనెలా, తర్వాత 15 రోజుల కొకసారి, ఒక్కోసారి తిరిగొచ్చిన మర్నాడే మళ్ళీ బయలుదేరి వెళ్ళేవాడిని. అమ్మ ప్రక్కనున్న వారితో చెప్పేది. “రేపు మళ్ళీ కామేశ్వరరావు వస్తున్నాడురా” అని. ‘అదేమిటమ్మా! ఇవాళే కదా అతను వెళ్ళింది’ అని వారు అంటే, “లేదురా రేపు మళ్ళీ వస్తున్నాడు” అనేదిట. ఉదయం 5.00లకు బండి దిగినవాడిని రాత్రి గం. 10-00లకు బయలుదేరి మళ్ళీ వెళ్ళేవాడిని. ‘అమ్మా! నాకు చూడాలనిపించి వచ్చాను’ అంటే “లేదు, నాన్నా! నాకే నిన్ను చూడాలని పిలిపించుకున్నాను” అనేది ప్రేమమూర్తి అమ్మ. అమ్మ అనురాగమే వేరు. లోకంలో ఎందరిని చూడకపోయినా ఫర్వాలేదు. అమ్మని ఒకసారి చూస్తే ఇంక ఎవరినీ చూడనక్కరలేదు కూడా. అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు. అసలు అమ్మకు ‘అమ్మే’ సాటి. అమ్మకి సాటి ఎవరూ లేరు.

జిల్లెళ్ళమూడిలో వైజాగ్ గెస్ట్ హౌస్ నిర్మాణ నేపథ్యాన్ని చెప్పండి.

జిల్లెళ్ళమూడి వెళ్ళిన ప్రతిసారీ కాలకృత్యాలు తీర్చుకోవటానికి అనువైన వసతి లేక కష్టంగా ఉండేది. ‘అమ్మా! ఇక్కడ ఒక గది, టాయిలెట్స్ కట్టుకుంటాము’ అంటే “అలాగే నాన్నా!” అంది. ఉన్నట్టుండి ఒకనాడు గం. 12.00లకు “ఒరేయ్! నాన్నా! రండ్రర్రా! ఇక్కడ నేను శంకుస్థాపన చేస్తాను” అన్నది. అపుడు అమ్మ ‘శ్రీమాత’ భవనాని (Vizag Guest House) కి ఉన్నపళంగా గజేంద్రుని కోసం విష్ణుమూర్తి వచ్చినట్లు వచ్చి శంకుస్థాపన చేసింది. నెలలో అది పూర్తి అయింది. ఆ భవన నిర్మాణం పనులు జరిగినపుడు రోజూ రాత్రి ఒంటి గంట/రెండు గంటలు అయ్యేది. పనివాళ్ళు చేస్తుండేవాళ్ళు. వాళ్ళు ఎంత అడిగితే కూలి అంత ఇస్తామని అన్నాం. ఒక్కనాడూ బేరం ఆడలేదు. ఒకనాడు అమ్మదగ్గరికి వస్తే “నాన్నా! నీ విషయం నాకు నచ్చింది. నువ్వు పనివాళ్ళతో బేరం ఆడి కూలి తగ్గించలేదు. అది నాకు నచ్చింది” అన్నది. రాత్రి ఒంటిగంటవేళ పనివాళ్ళ కోసం అమ్మ అరటిపళ్ళ గెల, మజ్జిగ పంపేది. నెలరోజులలో స్లాబ్ వేశాం. ముందు 10 రోజులు సెలవు పెట్టి foundation work పూర్తి చేద్దామనుకున్నా. ఆ తర్వాత సెలవు పొడిగించి అక్కడే ఉండి slab work కూడా పూర్తి చేశా.

విశాఖపట్టణం సోదరులం అందరం కలిసి ఇలా ఉంటే బాగుంటుందని అనుకున్నాం. Slab అయిన తర్వాత శరభలింగంగారు, సత్యనారాయణగారు వచ్చి plumbing సంగతి, తలుపులు సంగతి దగ్గరుండి చేయించారు. అది వేసవికాలం. సామానులు కొనటం కోసం విజయవాడ వెళ్ళారు వారు. చల్లగా ఉంటుందని వాళ్ళు Golden Eagle బీర్ తాగారు. మర్నాడు జిల్లెళ్ళమూడి వచ్చిన తర్వాత అమ్మ సన్నిధిలో కూర్చుంటే, “నాన్నా! బంగారపు గ్రద్ద ఎక్కారురా!” అని అడిగింది. వీళ్ళకి మతిపోయింది. ‘Golden Eagle’ ని ‘బంగారపు గ్రద్ద’ గా తర్జుమా చేసింది అమ్మ. అంటే – అక్కడ, ఇక్కడ అనే కాదు, మన వెన్నంటి ఉంటుంది, మనల్ని నడిపించేదే అమ్మ అని బోధపడింది.

ఇక్కడ ఏమి చేసినా వృధాపోదు అన్న అమ్మ మాటకి అనుగుణంగా మీకేమైనా అనుభవాలున్నాయా?

Guest House నిర్మాణ సమయంలోనే నా భార్యకి ఒంట్లో బాగాలేకపోతే పిల్లలతో పాటు వేసవి సెలవుల్లో ఏప్రియల్ నెలలో అందరం జిల్లెళ్ళమూడిలోనే ఉన్నాం. Slab పని అయిన తర్వాత నేను Vizag వచ్చేశాను. ఆ మర్నాడు Dasapalla Complex కి సంబంధించిన రాజుగారు నాకు కబురు పెట్టి ‘మా building 13 floors with revolving restaurant on top design చెయ్యాలి’ అన్నారు. సరేనని వెళ్ళా. Design చేసినందుకు 30 వేలు, నెలకి మూడువేలు visiting charges – రోజూ ప్రొద్దున పూట ఒకసారి visit చేయాలన్నారు. సరేనని ఒప్పుకున్నాను. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత నేను జిల్లెళ్ళమూడి వెళ్ళాను. వెళ్ళగానే అమ్మ అన్నది, “నాన్నా! రాజుగారు పిలిచారా?” అంది. ‘అవునమ్మా’ అన్నాను. “నీకు 30 వేలు ఇస్తామన్నారు కదరా!” అన్నది. ‘అవునమ్మా’ అన్నాను. “నెలకి మూడు వేలు కూడా ఇస్తామన్నారు కదా!” అన్నది. ‘అవునమ్మా’ అన్నాను. “ఇక్కడికి వచ్చిన ఏ trip వృధాకాదు, నాన్నా!” అన్నది. ఆ రోజు మొదలు ప్రతి trip లో కూడా ఏదో ఒక శుభము- అది మరచిపోలేనిది; మాటలలో చెప్పుకోలేనిది.

నేను ఇల్లు కట్టుకోవడానికి House loan కి LIC కి దరఖాస్తు చేశా. ‘మాష్టారూ! మీ జీతానికి 60 వేలు కన్నా రాదండి’ అన్నారు. అమ్మకి మా ఇంటి plan చూపించా. “నాన్నా! నీకు లక్షరూపాయలు ఇస్తారురా” అంది అమ్మ. నాకేమీ అర్థం కాలేదు – ఆ లక్షరూపాయలు ఇవ్వడం గురించి. “లేదు, నాన్నా! నీకు లక్షరూపాయలు ఇస్తారు” అన్నది. తర్వాత నేను మా Chartered Accountant దగ్గరకి వెళ్ళా. ‘మీ భార్య ఏం చేస్తారు?’ అని అడిగారు. ‘ఆమె హోమియో డాక్టర్’ అన్నాను. ‘సరే. ఆమె పేరిట కూడా return file చేద్దాం’ అన్నారు. అలాగే చేశాం. సరిగా అమ్మ అన్నట్లే 1 లక్ష LIC వారు మాకు loan sanction చేశారు. “అదే కాదురా. నీకు మీ university కూడా డబ్బు ఇస్తుంది” అన్నది అమ్మ. నేను University కి దరఖాస్తు చేస్తే ‘మాష్టారూ! మీరు ఇంతకుముందే scooter కోసం loan తీసుకున్నారు. ఇంకా కొంతబాకీ అదే ఉంది. అందుకని ఇవ్వటం కుదరదు’ అంటూనే ‘సరే. దరఖాస్తు ఇవ్వండి’ అన్నారు. ఇచ్చాను. ఒకనాడు నేను భోజనం చేస్తూంటే University నుంచి ఒకాయన వచ్చి ‘మాష్టారూ! మీ loan sanction అయింది; 25 వేలు. ఒక loan ఉండగా మరొక loan ఇవ్వడం university చరిత్రలో ఇదే మొదటిసారి ‘ అన్నారాయన.

అమ్మ చెప్పింది ఏదీ పొల్లుకాదు. అది అక్షర సత్యం. నేను కెనడా నుంచి రాగానే ‘అమ్మా! నేను Kuwait వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను’ అంటే “నీకు passport వచ్చినప్పుడు కదా, నాన్నా!” అన్నది. నా passport expire అయిపోతే extension కి దరఖాస్తు చేశాను. ‘మీకు కెనడాలో Extension ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఇవ్వరు’ అన్నారు.

అలౌకికంగా అమ్మ చేయించిన సేవలు - మీరు గమనించిన అమ్మ మహిమలు ఏమిటి?

కంచిలో జరిగిన ఒక విశేషం. 7వ మైలు దగ్గర Arch కడదామని అందరూ అమ్మ వద్ద ఆలోచన చేస్తున్నారు. అమ్మనామం ‘జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి’ కాంక్రీట్తోనో సిమెంటుతోనో పెడదామనుకుంటున్నారు. ‘అమ్మా! ఏదైనా ‘శిలాక్షరాలు’ అన్నారు. శిలతో ఉంటే బాగుంటుంది’ అన్నాను. “ఆ పని నువ్వు చూడు, నాన్నా!” అంది అమ్మ. అన్నానే కానీ ఆ పనిని ఎక్కడ ఏం చెయ్యాలో నాకు తెలియదు.

విశాఖపట్టణంలో నేను design చేసిన భవనానికి ఎవరో కంచి నుంచి వచ్చారని గ్రానైట్ పలకలు అతికారని నాకు గుర్తు. వెంటనే కంచి వెళ్ళాను. కామాక్షి అమ్మవారి దేవాలయంలో నిలబడి నమస్కరిస్తున్నాను. ఒకాయన వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు. ‘నమస్కారం; మాష్టారూ! మీరు గ్రానైట్ పలకల కోసం వచ్చారు కదా!’ అన్నారు. ‘అవును. మీరెవరు?’ అన్నాను. ‘నేను ఇక్కడ Electricity Board లో పనిచేస్తున్నానండీ. మీరు ఇక్కడి నుంచి 3 కి.మీ. దూరం వెడితే ఏరువాకం రోడ్డులో అమరేంద్రకుమార్ అనే ఒకతను ఉంటాడు. ఆయన మీకు సాయం చేస్తారు’ అన్నారాయన. అమ్మ పేరుకి మనల్ని నియమిస్తుంది; వెనుక ఉండి నడిపించేది మాత్రం అమ్మే. మనం కేవలం నిమిత్తమాత్రులం అనే దానికి ఇది పెద్ద ఉదాహరణ. ఆ విధంగా నేను రిక్షా ఎక్కి వెడుతున్నాను. నాకు ఎదురుగా ఒక నల్లటి కారు నన్ను దాటి వెళ్ళిపోయింది. నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను; ఆ driver కూడా వెనక్కి తిరిగి నన్ను చూస్తున్నాడు. అదేమిటో నాకు తెలియలేదు. నేను వాళ్ళింటికి చేరుకున్నాను. ‘ఏమమ్మా! అమరేంద్రకుమార్ గారు ఉన్నారా?’ అంటే ‘లేరండీ. ఇప్పుడే మద్రాసు వెళ్ళారు. నాలుగు రోజుల దాకా రారు’ అన్నారామె. సరేనని నేను సంచీ పట్టుకుని లేచి నిలబడ్డాను. ఈలోగా నాకు ఎదురుబడ్డ ఆకారు వెనక్కి తిరిగి వచ్చేసింది అక్కడికి. ‘మీరు ఇందాక రిక్షాలో వస్తున్నారు కదా! మిమ్మల్ని చూస్తే నాకు ఎందుకో నాకోసమే వస్తున్నారనిపించింది. అందుకని నేను వెంటనే తిరిగి ఇలా వచ్చేశాను’ అన్నారు. అది miracle. ఊపిరి తీయటం వదలటం ఎలాగైతే మనచేతిలో లేదో ఏపనైనా అంతే. ఆయన తన factory చూపించారు. ఎప్పటి నుంచో జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మని చూద్దామను కుంటున్నారట. వెంటనే నాతో బయలుదేరి వచ్చారు. దారి పొడవునా అమ్మను గురించి ముచ్చటించుకుంటూనే ఉన్నాం. ఆయన జిల్లెళ్ళమూడి వచ్చి అన్నీ చూశారు. అక్షరాలు చెక్కడానికి 30 వేలు అవుతుందన్నాడు. ‘3 నా అదృష్ట సంఖ్య. మూడు వేలు అడ్వాన్సు ఇస్తే బాగుండును’ అని అనుకున్నాడట తన మనసులో. మేమంతా గదిలో అమ్మకి నమస్కరించుకుంటున్నాం. “నాన్నా! అబ్బాయికి 3 వేలు ఇవ్వండిరా” అన్నది అమ్మ. ఆయన సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలందరికీ వివాహాలు కుదిరాయి. చాలా ఆనందపడ్డాడు.

జిల్లెళ్ళమూడిలో ఒకసారి అమ్మ నా చెయ్యిపట్టుకొని పచార్లు చేస్తూ “నాన్నా! మీ అమ్మ ఎక్కడ ఉందిరా?” అని అడిగింది. ‘ఉందమ్మా కోయంబత్తూరులో ఉంది. పెద్దదైపోయింది’ అన్నాను. “అవును. నాన్నా ! నిజంగానే పెద్దదై పోయిందిరా” అన్నది. ఆ మాట అన్న 6 నెలలు కాలేదు, మా అమ్మగారు కాలం చేసింది. మా అమ్మ అప్పుడు ఖరత్పూర్ అవతల మా సోదరుని దగ్గర ఉంది. ఒక రోజున మా ఇంట్లో boiler సామాగ్రి ఏదో నిప్పురవ్వ పడి అంటుకుంది. ఇదేదో దుఃశ్శకునం అనుకున్నాం. మధ్యాహ్నం నేను కాలేజీ నుంచి వచ్చి భోజనం చేస్తూంటే తద్దినం అన్నం వాసన వచ్చింది నాకు. 3 గంటలకు మా అమ్మ పోయినట్లు టెలిఫోన్ వచ్చింది. ఆ సంగతి అమ్మ 6 నెలల ముందే చెప్పింది. రాబోయే వాటిని అమ్మ ఆ విధంగా సూచిస్తుంది.

అమ్మని మీరు కోరిన కోర్కెలేమైనా వున్నవా ? అమ్మను చూచిన తర్వాత మీలో కలిగిన మార్పులేమిటి?

నేను అమ్మను అడిగాను ‘అమ్మా! నిన్ను నేను తలచుకున్నప్పుడు నా కళ్ళవెంట నీళ్ళురావాలి’ అని. అది నిజమైంది. నేను ఎవరితోనైనా అమ్మ ప్రస్తావన చేసినపుడు అప్రయత్నంగా నా కంట నీళ్ళు వస్తాయి. ఇది అమ్మ నా కిచ్చిన వరం. అమ్మకి నేను సదాకృతజ్ఞుడను.

నేను అమ్మ దగ్గరకి వెళ్ళక పూర్వం దేవాలయాలకి పోయేవాడిని. శనివారం వెంకటరమణమూర్తి గుడికి తప్పకుండా వెళ్ళేవాళ్ళం. ఆచార్యుల వారికి మా కుటుంబసభ్యుల పేర్లు గోత్రం అన్నీ కంఠస్థం … ఒక వారం వెళ్ళకపోతే ‘ఎందుకు రాలేదు, కామేశ్వరరావుగారూ!’ అనేవారు. అమ్మను చూసిన తర్వాత మరొక గుడికి వెళ్ళాలనే ఆలోచన లేదు.

కెనడాలో ఉన్నపుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకటేశ్వరస్వామికి కళ్యాణం చేయిద్దామనుకున్నాను. అమ్మను చూసిన తర్వాత నేను అనవసరంగా మొక్కుకున్నానేమోననిపించింది. అమ్మ చేసే అన్నప్రసాదవితరణ కార్యక్రమాన్ని మించినది లేదు. మన ఇంటికి వస్తే మనం పెట్టలేము ప్రతిరోజు. అలాంటిది ఎప్పుడొచ్చినా ఎంతమంది వచ్చినా అంతమందికి అన్నం పెట్టడమనేది మానవమాత్రులకి సాధ్యం కాదు. మొక్కుకున్నాం కాబట్టి అక్కడ కళ్యాణం చేశాం. ఆ తర్వాత నేను తిరుపతి పోలేదు. వెళ్ళాలని ఆలోచన కూడా లేదు. ఇపుడు అమ్మ తప్ప ఇంకొక ఆలోచనే లేదు.

అమ్మ చెంత మీరు చేసుకొన్న శుభకార్యాలేమిటి?

అమ్మ చేత బ్రహ్మోపదేశం పొందవచ్చని మా అబ్బాయికి ఉపనయనం జిల్లెళ్ళమూడిలో చేశాం. ఆ సందర్భంగా ఒక అద్భుత సంఘటన జరిగింది. మా ఇలవేలుపు కామేశ్వరి. దానికి ఏడుగురు ముత్తైదువులు, పోతరాజు వీళ్ళంతా ఉండాలి. 5 మానికల బియ్యం, నానబోసి పిండి దంచాలి. అందుకోసం బాపట్ల వెళ్ళి మడిగా దంపెడి వాళ్ళను కూడా మాట్లాడుకున్నాం. కానీ మర్నాడు వాళ్ళు ఎప్పటికీ రాలేదు. ‘నేను దంపుతాను. రండి’ అని కొండముది రామకృష్ణ అన్నయ్య మడిగట్టుకొని ఒక రోకలి పట్టుకున్నాడు. హనుమబాబు మరొక రోకలి పట్టుకున్నారు. అరగంట కాలేదు. మొత్తం పిండి అంతా వచ్చేసింది. ఆశ్చర్యం. పదిమంది దంచితే 5 గంటలు పడుతుంది. అమ్మకి చీరె పెట్టుకున్నాం. అమ్మ అన్నది “నాన్నా! నువ్వు పెట్టిన చీరె కట్టుకున్నానురా. చూడు” అని. అంతకంటే ఆనందం మరొకటి ఉండదు మనకు. ఏ దేవతకో ఎక్కడో పెడితే వాళ్ళు స్వీకరించారో లేదో తెలియదు. కానీ మన కళ్ళముందు కదిలే దైవం అమ్మ.

'మాతృశ్రీ స్టడీ సర్కిల్' విశాఖపట్టణశాఖ సేవా కార్యక్రమాలేమిటి?

ధాన్యాభిషేకం విరాళాలు సేకరణ, స్టడీ సర్కిల్ నిర్వహణ మొదలైన కార్యక్రమాల్లో మా విశాఖపట్టణ సోదరులందరం కలిసి ఆలోచించుకుంటాం ఎలా చేస్తే బాగుంటుందని దానిని ఆచరిస్తాం.

“అన్నపూర్ణాలయం నా గుండె” అని చెప్పింది అమ్మ. ధాన్యాభిషేకం విశాఖపట్టణం సోదరీ సోదరుల స్వంతపూజ అనుకుంటాం. అమ్మ అట్లా చేసింది; మేము చెయ్యగలిగినంత చేస్తాం.

'అమ్మ వత్రోత్సవ' సందర్భంగా అమ్మ ప్రేరణ తో మీరు చేసిన సేవ లేమిటి?

ఒకసారి అమ్మ సన్నిధిలో ఉన్నాను. “అమ్మా! షష్టిపూర్తికి నీకు కాలిపట్టీలు చేయించాలని ఉంది” అన్నా. “అలాగే, నాన్నా!” అన్నది అమ్మ. ‘అమ్మ కాలిపట్టీలు ఇస్తే ఆ మోడల్ చేయిస్తాను’ అన్నాను రామకృష్ణ అన్నయ్యతో. అన్నయ్య అన్నాడు. ‘అమ్మ పట్టీలు ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదండి. తీసి ఇస్తాను’ అని నాకు ఇచ్చాడు.

అది నా అదృష్టం. నేను ఒక భవనానికి design చేసా. దానికి piles అని వేస్తారు. ఒక కాంట్రాక్టర్ని పిలిచి స్నేహధర్మంగా పని అప్పగించా. పనిపూర్తి అయిన తర్వాత అన్నాడు “మీరు నాకు పని అప్పగించినందుకు pile ఒకటికి 100రూ.లు ఇస్తామండి. 108 piles వేశాం. ఇదిగో 10,800 రూ.లు” అని ఆ సొమ్ము ఇచ్చాడు. అమ్మకి 60 ఏళ్ళు; 60 గ్రాముల బంగారం వచ్చింది. సరిగ్గా ఆ సొమ్ముతో. కంసాలి వద్దకు పోయి అమ్మ పట్టీ చూపించి ‘మీరు ఇట్లాంటివి చేయాలి’ అని చెప్పా. అతను మహదానందపడి పట్టీలు చేశాడు. అమ్మ 60వ జన్మదినోత్సవం నాడు నా స్వహస్తాలతో వాటిని అమ్మ పాదాలకు ధరింపజేశాను. అది నా అదృష్టం. అపుడు నా జీతం రూ.350లు. నేను చేయించగలను అనుకోలేదు. ఆ ఆలోచనరావటం, ఆ విధంగా డబ్బు సమకూరటం నా అదృష్టం. అమ్మ కృప.

అమ్మ భర్త (నాన్న) గారి గురించి మీ అనుభవాల్ని తెలుపండి.

1980లో అమ్మకి తీవ్ర అస్వస్థత చేసి హైదరాబాద్లో రాజగోపాలాచారి గారింట్లో ఉన్నపుడు నాన్నగారు గబగబా నా దగ్గరకి వచ్చి ‘కామేశ్వరరావు గారూ! నాకింక బెంగలేదండీ’ అన్నారు. ‘అదేంటండీ, నాన్నగారూ!’ అన్నాను. ‘ఏం లేదు. మీ అమ్మగారు నాకు వరం ఇచ్చింది’ అన్నారు. ‘ఏమి వరం?’ అన్నాను. ‘నేను మీ అమ్మగారిని అడిగాను తనకంటే ముందుగా నన్ను తీసికొని వెళ్ళిపొమ్మని. అలాగేనని నాకు వరమిచ్చింది. అందుకని నాకింక హాయిగా ఉంది’ అన్నారు. అమ్మకి తీవ్ర అస్వస్థత చేస్తే ఆయన చాల కంగారుపడ్డారు. నాన్నగారికి నేనంటే ఎంతో చనువు, అభిమానం, ఎంతో వాత్సల్యం. కేశవశర్మగారు అపుడు మాతో అమ్మ దగ్గర కూర్చొని లలితాసహస్రనామస్తోత్రం చేస్తున్నారు. ‘స్వభావమధురా’ అనే నామం దగ్గరకి వచ్చేటప్పటికి “చాలా చక్కటి నామం, నాన్నా!” అన్నది అమ్మ.

'అమ్మ తత్త్వాన్ని' రెండు మాటలలో చెప్పండి.

ప్రేమకి అనురాగానికి ఒక ఆకారం వస్తే ఎలా ఉంటుందీ అంటే అదే అమ్మ. అమ్మని అర్థం చేసుకోవటం అంటే ప్రేమని అర్థం చేసుకోవటం. ఎదుటివాని బాధల్ని గుర్తించి సాయపడగలిగిన వాడికి అమ్మతత్వం అర్థమవుతుంది. అమ్మతో అనుబంధం లేకుండా ఏదీ జరిగే ప్రసక్తి లేదు. అమ్మ నామమే నాకు మంత్రం. దానినే నిరంతరం జపిస్తాను. నిద్రలో కూడా లలితా సహస్రనామాలు చదువుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి.

అమ్మ కుమారుడు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య గారి గురించి మీ స్పందన?

శ్రీ రవి అన్నయ్య ఏది చేసినా నిస్స్వార్థంగా చేస్తారు. సంస్థ సేవలో ఆయనకు ఆయనే సాటి. ఆయన అమ్మకుమారుడనే కాదు – వ్యక్తిగతంగా కూడా ఒక కడిగిన ముత్యం.

'అందరింటి' సోదరీసోదరులలో మీరు గమనించిన ప్రత్యేకత లేమిటి?

అమ్మని దర్శించిన వారు ఏ దేవీ దేవతల్ని ఏ క్షేత్రాల్లో దర్శించినా అమ్మగానే చూస్తారు. వాళ్ళు ‘ఆవు’ composition లాంటివాళ్ళు. ఒక విద్యార్థిని teacher ‘నువ్వు చేసిన ప్రయాణం గురించి వ్రాయి’ అని అడిగితే – ‘నేను బండి ఎక్కాను. అది టకటక వెడుతోంది. ఇంతలో నాకు ‘ఆవు’ కనపడింది’ అని. ఆ తర్వాత ఆవు గురించి చిలవలు పలవలు అల్లుతాడు. అమ్మబిడ్డలం మనం నలుగురం కలిసి మాట్లాడితే ‘అమ్మ’ ప్రసంగం తీసుకురావటం, ఇక తన్మయత్వం చెందటం తప్ప ఇంకొకటి చేతకాదు మనకి. మనకి అమ్మ composition తప్ప వేరొక composition రాదు. ‘ఇదీ అమ్మ కృపే’ మరి.

0 Comments
error: Content is protected !!