Kavirayuni Radha

Interviewed by
P S R Anjaneya Prasad
27/12/2011
Visakhapatnam

 

శ్రీమతి కవిరాయని రాధ

  ఈమె 8-8-1947లో జన్మించారు. స్వస్థలం విశాఖపట్టణం. తల్లిదండ్రులు శ్రీ
నారాయణమూర్తి, శ్రీమతి రామలక్ష్మి. భర్త శ్రీ కవిరాయని కామేశ్వరరావు. సంతానం – ఒక కుమారుడు, ఒక కుమార్తె. విద్య – DHP (హోమియోపతి)

సేవాతత్పరత : సనాతన ధర్మం, సంప్రదాయం, మడి ఆచారం శాస్త్రాల పట్ల ఎనలేని గౌరవం. అమ్మనే ఆరాధ్యదైవంగా తన మనోమందిరంలో ప్రతిష్ఠించుకున్నారు. ఉచిత వైద్యసేవ నందిస్తున్నారు.

శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారు 27-12-2011న విశాఖపట్టణంలో శ్రీమతి కవిరాయని రాధగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మీ కుటుంబ నేపధ్యం ఎలాంటిది ?

నేను నాగపూర్ దగ్గర కాంప్టి అనే ఊరులో పుట్టాను. నా తల్లిదండ్రులు శ్రీ దూసి నారాయణమూర్తిగారు, శ్రీమతి రామలక్ష్మి. నా తండ్రి 1947లో రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. నాకు ఒక సోదరుడు, ఒక సోదరి. నేనే పెద్దదాన్ని. సోదరుడూ రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు, స్వర్గస్థులయ్యారు. మా అమ్మగారు నాగపూర్లో ఉన్నారు.

తొలిసారి అమ్మ దర్శనం - అనంతరం మీ అనుభూతి ఎలాంటిది?

మా వారు శ్రీకవిరాయని కామేశ్వరరావుగారు; వారు కెనడాలో ఉండేవారు. శ్రీ చక్రవర్తిగారి సోదరులు ప్రసన్నకుమార్ గారు. వారి పిల్లలు మా పిల్లలు కలిసి చదువుకునేవారు. వాళ్ళింట్లో అమ్మ ఫోటో చూశాను. ‘ఎవరీమె?’ అన్నాను. ‘జిల్లెళ్ళమూడి అమ్మ” అన్నారు. మా వారు కెనడా నుంచి వచ్చారు. ‘మనం జిల్లెళ్ళమూడి వెళదామా?’ అంటూండగా శ్రీ గంటి వెంకట్రావు అన్నయ్యగారు వచ్చి ‘లలితాకోటినామ పారాయణ, అందరం వెళదాం’ అన్నారు. అలా మొదటిసారి అమ్మ దగ్గరకి వెళ్ళాం. మొదటిసారి చూసినపుడు ‘ఈ అమ్మ ఏ లోకం నుంచైనా దిగి వచ్చిందా? స్వర్గాదిలోకాలుంటాయని అంటారే! ఈమె అవతారమా? ఎన్నో క్షేత్రాల్ని సందర్శించాము. కానీ ఇక్కడ అంతా ‘అమ్మ’, అన్నయ్య, అక్కయ్య అని అంటున్నారు! ఇదంతా నిజంగా ఒక కుటుంబమా?’ అంతా ఆశ్చర్యంగా అనిపించింది! ఇక్కడ అంతా అన్యోన్యంగా ఉంటారు. వసుంధరక్కయ్య ఎప్పుడూ వచ్చిన వాళ్ళకి కాఫీ, ఫలహారాలు అందిస్తూనే ఉంటుంది. అది చూసిన తర్వాత మన ఇంటికి ఎవరైనా వస్తే మంచి నీళ్ళిచ్చి కప్పు కాఫీ ఇవ్వాలి అని నేర్చుకున్నాను. జిల్లెళ్ళమూడి వెళ్ళి నేర్చుకోండి అని అందరికీ చెప్పేదాన్ని. అలా చాలామంది వెళ్ళి అమ్మను చూసి వచ్చారు. క్రమంగా అమ్మ దగ్గర కూర్చోవటం, చనువు పెరిగింది నాక్కూడా.

ఆచారాల పట్ల మక్కువ గల మీరు అమ్మ సన్నిధిలో చేసిన పూజలు నోములేమైనా వున్నవా?

1981-82లో అమ్మ దగ్గర సంతోషిమాత ఉద్యాపన చేసుకోవాలని అనుకున్నాను. సామాగ్రి తీసుకెళ్ళాను. అమ్మ చాలా సంతోషించింది. ఒక బాబుని, ఆడపిల్లలు, చిన్న పిల్లల్ని నాకోసం పిలిపించింది. వాళ్ళకి బట్టలు పెట్టాను. ఆవుకి సెనగలు తినిపించాను. “నీకు తృప్తిగా ఉందా?” అని అడిగింది. అమ్మ. ‘చాల తృప్తిగా ఉందమ్మా’ అన్నాను. అమ్మకి చీరె పెట్టాను. ఉద్యాపన తర్వాత ఆ చీరెను మా అమ్మకి ప్రసాదంగా ఇచ్చింది.

నా చదువు వార్తా సేవాగ్రాం – మహాత్మాగాంధీ ఆశ్రమం ఉన్న గ్రామంలో హిందీలో ప్రారంభమైంది. తర్వాత ఉదయం BSc, సాయంకాలం DHP (Diploma in Homoeopathy and Biochemistry) చదివాను. మా కుటుంబంలో వంట వార్పూ, మడి- ఆచారం ఎక్కువ. ఆవు దూడలు వాటి సేవ. జిల్లెళ్ళమూడిలో అంతా లలితాసహస్రనామపారాయణ చకచకా చేసేవారు. నాకు తెలుగు రాదు. నా పిల్లల సహకారంతో హిందీలో వ్రాసుకున్నాను. మా వారితో నాకు మేనరికం. క్రమేణ తెలుగు పుస్తకం చూసి పారాయణ చేసేదాన్ని. ఇది అమ్మ ఇచ్చిన వరం. రోజూ లలిత చేసి కానీ అన్నం తినను అని నియమం పెట్టుకున్నా.

అమ్మే నాకు కన్నతల్లి, లలితాపరమేశ్వరి, కామేశ్వరి. ఏ గుడికి వెళ్ళినా అక్కడ అమ్మనే దర్శిస్తూంటాను.

అమ్మ సమక్షంలో ఏవైనా శుభకార్యాలు చేసుకొన్నారా? అమ్మ వాత్సల్యానుగ్రహం పొందిన వైనం వివరించండి.

మా అబ్బాయి ఉపనయనం అమ్మ సన్నిధిన చేశాం. మా వాళ్ళంతా వచ్చారు. నా సోదరి అమ్మకి తన కష్టాలన్నీ చెప్పుకుంది. “నేను నిన్ను చూస్తానమ్మా. నీకు పెళ్ళి కూడా చేస్తాను. నువ్వు ఇక్కడ ఉండు” అని ఆమెతో చెప్పింది అమ్మ. ఆమెకు నచ్చలేదు; వెళ్ళిపోయింది. నేను ఏదో విషయం మాట్లాడుతుంటే అమ్మ “ఇది నీ పుట్టిల్లు అనుకొని వస్తూండు” అన్నది. అదే ఖాయం అయిపోయింది. నా కన్నతల్లిని నేను 10 సంవత్సరాలుగా చూడలేదు. అమ్మలోనే ఆమెను చూస్తున్నాను. మా పుట్టిల్లు దూరమైపోయి అమ్మ దగ్గరకే తరచు వెళుతున్నాను.

నేను ఇంట్లో వాళ్ళకి ఇరుగు పొరుగు వారికి హోమియో మందులు ఇచ్చి సలహాలిస్తాను. అన్నపూర్ణాలయానికి యథాశక్తి విరాళాలిస్తాము. మా పిల్లలమీదా అమ్మ అనుగ్రహం చాలా ఉంది. వాళ్ళు వృద్ధిలోకి వచ్చారంటే అమ్మ దయే. వాళ్ళకి అమ్మ మీద భక్తి ఉందో లేదో తెలియదు కానీ, అమ్మకి మాత్రం వాళ్ళ మీద అనుగ్రహం చాలా ఎక్కువ. నేను అమ్మకి 16 ఫలాల నోము, కైలాస గౌరీదేవి నోము చేసుకున్నాను.

మా అబ్బాయి అమెరికా వెడదామనుకున్నాడు. మద్రాసు వెళ్ళాడు. వీసాలో సమస్య వచ్చింది. ‘ఇప్పుడు ఇయ్యం’ అన్నారు. ‘నిరుత్సాహపడకురా’ అన్నారు. వాళ్ళ నాన్నగారు. తిరిగి రమ్మంటే మర్నాడు మళ్ళీ వెళ్ళారు office కి. ‘All right. you can go’ అన్నారు. ‘ఇది అమ్మదయకాకపోతే నీకు ఎలా వస్తుందిరా?’ అన్నారాయన మా వాడితో.

ఆచారాల పట్ల మక్కువగల మీకు ఏ పరిధులు లేక అందరినీ తన అక్కున చేర్చుకొనే అమ్మ తీరు ఎలా నచ్చింది ?

జాతకాల మీద నాకు పిచ్చి నమ్మకం. అమ్మ అడిగింది “నీకు జాతకాల మీద నమ్మకం ఉందా?” అని. ‘చాలా నమ్మకం ఉందమ్మా’ అన్నాను. ఇటు జాతకాల్ని నమ్ముతాను, అటు అమ్మ మాటల్ని ఆచరణలో పెట్టుకుంటాను.

ఒకసారి నేను జిల్లెళ్ళమూడిలో ఉండగా కడగా ఉన్నాను. అమ్మకి అలాంటి వేమీలేవని అందరూ అన్నారు. ‘అయ్యో! జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మదర్శనం చేసుకోలేకపోయాను’ అని బాధపడేవాళ్ళని ఆ సమయంలో కూడా అమ్మ అనుమతించింది. అమ్మ భగవంతుడు కదా! దేవాలయానికి ఆ సమయంలో మనం వెడుతున్నామా? లేదు కదా! మరి అమ్మ దగ్గరకి ఎలా వెళ్ళటం? అని నేను వాదించాను. అమ్మ కాబట్టి ఇక్కడ ఇలా జరుగుతోంది మరొక చోట జరుగదు. పుట్టినరోజు అనో పెళ్ళిరోజు అనో బిడ్డలు వస్తారు. అయ్యో! తెల్లవారితే వాళ్ళు వెళ్ళిపోతారు. కనుక – “రండర్రా! నాయనా!” అంటుంది అమ్మ. అది తప్పు కాదా! అంటే అమ్మ పిలిచింది కాబట్టి తప్పుకాకపోవచ్చు. ఆ విధంగా మనం అమ్మని ఇబ్బంది పెట్టటం గానే నేను భావిస్తాను. అమ్మ ఆ విధంగా అనుమతి నియ్యవచ్చు. అంతకన్న వాళ్ళు ఒక రోజు ఆగి స్నానం చేసి అమ్మకి పూజ చేసుకోచ్చును కదా! అని నేను అనుకుంటాను. మన ఇళ్ళల్లో దేవుని గదిలోకి వెడుతున్నామా? లేదే. కాబట్టి ఆచారానికి కూడా నేను ప్రాముఖ్యత నిస్తాను. నేను అక్కడ కడగా ఉన్నపుడు అమ్మ “రా అమ్మా!” అన్నది. ‘నేను రానమ్మా’ అన్నాను. “అయితే నువ్వు స్నానం చేసి వస్తావా?” అన్నది. నాలుగు రోజులుండి స్నానం చేసి అమ్మకి పూజ చేసుకున్నాను. అమ్మ ఎవరికి ఎలా కావాలో అలాగే అంగీకరించింది. అమ్మకి ఆచారము లేదు అనుకుంటారు. అమ్మకి ఆచారము ఉంది; అనాచారము ఎప్పుడూ లేదు; అమ్మ అనాచారం చెయ్యమని ఎప్పుడూ చెప్పలేదు. మనకి అనుకూలత లేదు కాబట్టి మనం అలా చేస్తున్నాం అని నేను గట్టిగా నమ్ముతాను.

అమ్మ అనుగ్రహాశీస్సులు మీపై వర్షించిన సంఘటనలు సందర్భాలు ఏమైనా వుంటే తెలియపర్చండి.

ఒకసారి నా ఆరోగ్యం చాలా పాడైపోయింది. నేనింక బ్రతకనేమో అనుకున్నాను. అమ్మ నామమే చేసుకుంటున్నాను. అర్థరాత్రి గోడమీద మాయింట్లో అమ్మ కనపడింది. నా వేదన ఇలా విన్నవించుకున్నాను. ‘అమ్మా! నేను బ్రతకనేమో! నీ దగ్గరకి రాలేనేమో! పిల్లలు చదువుల్లోనే ఉన్నారు. ఇలా మంచాన పడ్డాను. లేవగలనా, లేదా? ఆయాసం బాగా ఉంటోంది’ అంటూ అలాగే ఎలాగైనా అమ్మ దర్శనం చేసుకొని నా బాధ చెప్పుకోవాలని జిల్లెళ్ళమూడి బయలుదేరాం. నా పర్సు నేను పట్టుకోలేకపోయాను. మా వారే సంచులు మోసుకొచ్చారు. తెల్లవారితే కొత్త సంవత్సరం – అమ్మ వద్ద జనం పుట్టలు, పుట్టలు. ఇంతలో ఎవరో వచ్చి అడిగారు. ‘రాధక్కయ్య ఎవరు?’ అని. నేనే అన్నాను. ‘అమ్మ మీకు కాఫీ పంపించింది’ అని వేడి కాఫీ అందించారు. నేను కాఫీ తాగను; టీ అలవాటు. అయినా అమ్మ పంపింది ప్రసాదం అని త్రాగా. పైగా అంతమందిలో నా కోసం పంపింది. ఆ తర్వాత అమ్మ మేడ పైకి వెళ్ళా. “ఏమమ్మా! ఇంతదూరం ప్రయాణం చేసి మెట్లక్కి వచ్చావా! సరే. ఇక్కడే నా మంచం దగ్గర పడుకో” అన్నది. అప్పటికే కొంచెం ఆయాసం తగ్గింది. తర్వాత నా రూమ్ కొచ్చేశాను.

పిల్లలకి వేసవిసెలవులు. మావారు జిల్లెళ్ళమూడిలో ‘శ్రీమాతా’ భవన నిర్మాణ పనుల్లో ఉన్నారు. ‘అమ్మా ! నేను ఇక్కడ ఉండవచ్చా?’ అని అడిగాను. “తల్లిని అడగకూడదు. బిడ్డలు ఉంటానంటే నేను కాదంటానా? నా దగ్గర పిల్లలుంటేనే నాకు ముచ్చట. తప్పకుండా ఉండవచ్చు” అన్నది. అలాగే పిల్లలతో ఉండిపోయాను అమ్మ వద్ద.

ఆరోజులలో ఒకనాడు “నీకు ఒంట్లో బాగా లేదు కదా! నువ్వు నేను చెప్పిన మందు తీసుకుంటావా?” అని అడిగింది అమ్మ. ‘తప్పకుండా తీసుకుంటానమ్మా; తగ్గాలేకానీ’ అన్నాను. “దేశవాళీ కోడిగుడ్లు అమ్ముతారు. నువ్వు మందులా రోజూ ఒకటి నోట్లో వేసుకో” అన్నది. ‘అమ్మో! ఇదా మందు? అది మాత్రం వేసుకోను. బ్రాహ్మణులు వేసుకోవటం ఏమిటి?’ అన్నాను. మావారు వచ్చాక కూర్చోబెట్టి “ఇది మందులవల్ల తగ్గేది కాదు. ఇదిగో చూడు. దీనికి నరాలన్నీ పొంగిపోయాయి. ఇంజక్షన్స్ అన్నీ అయిపోయాయి. రోజూ ఒక దేశవాళీ గుడ్డు తీసుకుంటే తగ్గుతుంది” అని నచ్చచెప్పింది. సరే. అమ్మ చెప్పిందిగా. ‘అమ్మా! నీ చేత్తో ఇస్తేనే వేసుకుంటాను’ అన్నా. సరేనని అమ్మ నా నోట్లోవేసింది. భగవంతుడే ఇస్తున్నపుడు అది మాంసాహార మెట్లా అవుతుంది? అనే నా భావన. అలా కొన్నాళ్ళకి రోగం ఎక్కడికో కనిపించకుండా పోయింది. అలా అమ్మ నా రోగం బాగు చేసింది.

ఒకరోజు అర్థరాత్రి సమయం. నాకు బాగా తేడా వచ్చింది. నేను జిల్లెళ్ళమూడిలోనే వున్నాను. ఎవరితోనో అమ్మ కబురు చేసింది- “రాధను పంపించమని. రాత్రి 2 గంటలు అయింది. అమ్మ ఆరుబయట వెన్నెలలో మంచం మీద పడుకుని ఉంది – ఇపుడు ధ్యానమందిరం ఉన్న చోట. “రాధా! వచ్చావా! రా!” అని పిలిచింది. నా పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో గ్రహించిన అమ్మ తన తలగడమీద పడుకోబెట్టి జోకొట్టి వీపురాసి ఇంకా ఏం చేసిందో ఆ తర్వాత తెలియదు. నాకు హాయిగా నిద్రపట్టింది. తెల్లవారింది. లేచి చూశాను. “ఇంక నువ్వు నీ గదికి వెళ్ళవచ్చు” అన్నది. అదే అమ్మ ఇచ్చిన మందు. ఏ డాక్టరూ తెలియదు ఆ treatment, course. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను తిరిగి చూడలేదు, ఆ రోగం నశించింది.

ఒకసారి ‘అమ్మా! చచ్చిపోవాలని ఉంది’ అన్నాను. ‘ఏమిటి? పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యవా? నీదీ ఒక కష్టమే ? ఇంత కన్న కష్టాలున్నవాళ్ళు చాలమంది ఉన్నారమ్మా. నీకు ఆరోగ్యం బాగా లేదనేది ఒక కష్టమే కాదు” అని ధైర్యానిచ్చి అప్పటికీ, ఇప్పటికీ నా జీవితాన్ని వెన్నంటి అమ్మ నడిపిస్తోంటేనే నడుస్తున్నా!

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!