Dr Pothuri Venkateswara Rao

Interviewed by
P S R Anjaneya Prasad
14/12/2011
Pothuru

 

డా|| పొత్తూరి వెంకటేశ్వర రావు

 

వీరు గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామంలో 8-2-1934 న జన్మించారు. వీరిని కన్న తల్లిదండ్రులు శ్రీ వెంకటసుబ్బయ్య, శ్రీమతి పన్నగేంద్రమ్మ. వీరి దత్తత తల్లిదండ్రులు శ్రీ గోపాలకృష్ణయ్య, శ్రీమతి సంపూర్ణమ్మ. వీరి సతీమణి శ్రీమతి సత్యవాణి. సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వృత్తి-జర్నలిజం. ఈనాడు, ఆంధప్రభ మొదలగు దినపత్రికలకు సంపాదకులుగాను, ఆం.ప్ర. ప్రెస్ అకాడమీ ఛైర్మన్గానూ ఎన్నో పదవులను నిర్వహించారు. ‘ఆధ్యాత్మిక పదకోశం’, ‘యతికులపతి’ మొదలగు అనేక గ్రంధాన్ని రచించారు.

సేవానిరతి: అమ్మకు అత్యంత సన్నిహితులుగా మెలిగారు. అమ్మతో గంటల తరబడి రోజుల తరబడి అనేక సంభాషణలు చేశారు. అమ్మ దివ్యశక్తిని, అనిర్వచనీయమైన ఆశీస్సుల్ని కళ్ళారా చూశారు, పొందారు. విలక్షణమైన, విశిష్టమైన అమ్మ తత్త్వానికి వారి గ్రంథం ‘అంతా ఆమె దయే’ దర్పణం.

శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షులుగా సంస్థకు మార్గదర్శనం చేశారు; గౌరవ సంపాదకులుగా ‘విశ్వజనని’ మాసపత్రికకు, సలహాదారుగా ‘Mother of All” త్రైమాసిక పత్రికకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, హోమియో వైద్యశాల వంటి సేవాసంస్థల తమ వంతు కృషిచేశారు. వారు సర్వదా అందరింటి సోదరీ సోదరులకు పెద్ద దిక్కు, దిక్సూచి.

సెల్ నెం: 9848140095

శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారు 14-12-2011న పొత్తూరు లో శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం. 

****************


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మీకు అమ్మను గురించి ఎట్లా తెలిసింది. తొలి దర్శన అనుభవాలు ఏమిటి? ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతులు అప్పటి డా॥ప్రసాదరాయకులపతిగారు. తొలిసారిగా అమ్మ దర్శనం చేయించారు. మేము బాల్య స్నేహితులం. వారు ఆశ్రమ స్వీకారం చేయకముందు చాలా తరచుగా కలుసుకునేవాళ్ళం. వారు 1958 ప్రాంతంలో మనం 'జిల్లెళ్ళమూడి అమ్మను చూద్దాం' అన్నారు. ఆ సమయంలో నా బిడ్డపోయిన దుఃఖంలో నా భార్య ఉంది. స్వతహాగా నేను నాస్తికుడ్ని. అయినప్పటికీ కులపతిగారు ఏం చెపితే అది శిరోధార్యంగా ఉండేది. వెళ్ళాం. మాతోపాటు రమణాశ్రమంలో రమణులకి అత్యంత సన్నిహితంగా ఉండి, కావ్యకంఠ గణపతిమునిని చూసిన కృష్ణభిక్షువుగారు, మహనీయుడు. వైయాకరణుడు మిన్నికంటి గురునాథశర్మగారు, పోతరాజు పురుషోత్తమరావు గారు, పియస్ఆర్ ఆంజనేయప్రసాద్ గారు, మా ప్రాణస్నేహితులు విద్యాసాగర్ శర్మ గారు వచ్చారు. బాపట్ల - పెదనందిపాడు మార్గంలో 7వ మైలు వద్ద మలుపు తిరిగిన తర్వాత రెండు ఒరవలుండేవి. 7వ మైలు అమ్మ వలననే ప్రసిద్ధి చెందినది. అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు గ్రామంలోకి వెళ్ళాలి. ఒరవల్లో నీళ్ళుంటే దిగి వెళ్ళాల్సొచ్చేది. నడుముదాక నీరు వచ్చినా దిగి నడిచిన సందర్భాలున్నాయి. అమ్మ దర్శనం కోసం వెళ్ళేవాళ్ళం. అప్పుడు అమ్మే స్వయంగా అన్నం పెట్టేది. ఆ దృశ్యాన్ని తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అప్పటి ఒక సంఘటన చెపుతాను. నాకు దేవుడంటే నమ్మకం లేదు. అద్భుతాలు (miracles) ని ఎప్పుడూ నేను నమ్మేవాడిని కాదు. అమ్మ తను ఉంటున్న ఇంట్లో రెండు వరుసలుగా మాకు భోజనాలు పెట్టింది. నాకెదురు పంక్తిలో ఎదురుగా కులపతిగారున్నారు. అమ్మ కులపతిగారి దగ్గరకు వచ్చి అన్నం కలిపి ముద్దవారి నోటికి అందించింది. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక తల్లి కన్నబిడ్డని తన కన్నబిడ్డగా చూస్తూ నోటికి అన్నం ముద్దలు అందివ్వటం అనూహ్యం. మేమా ఎదిగినవాళ్ళం - వ్యాయామం చేసినవాళ్ళం ఆరోజుల్లో. కానీ ఇక్కడొక స్త్రీమూర్తి తన బిడ్డగా, కొడుకుగా భావించి అన్నం తినిపిస్తోంది - ఎంత గొప్ప విషయం. అద్భుతాలు (miracles) ప్రక్కన పెట్టేదాం. ఇంకొక స్త్రీ కన్నబిడ్డని తన బిడ్డగా చూస్తూ నోట్లో అన్నం పెట్టడం మహాద్భుత దృశ్యంగా నాకు అనిపించింది. అప్పుడు నాకు కళ్ళవెంట నీళ్ళు తిరిగినాయి. కారుణ్యదృష్టి, కరుణతో కూడిన ఏ సన్నివేశాన్ని చూసినా కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. అమ్మ నావైపు చూడటం లేదు, కులపతిగారివైపు చూస్తోంది. నేను అమ్మ వెనుక ఉన్నాను. గిరుక్కున వెనక్కి తిరిగి "నాన్నా! పొగవల్ల కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయా?” అని అడిగింది. ఆమె ఎట్లా చూసిందో! 'ఓహో! నాకు తెలియని విషయాలు చాలా ఉంటాయి' అనిపించింది. నేను ఎంత నాస్తికుడనైనా సత్యాన్ని నమ్ముతా, తార్కికంగా చెబితే నమ్ముతా. కొప్పరపు వెంకటరత్నకవిగారు, గురునాథశర్మగారు, కృష్ణభిక్షువుగారు అందరూ పెద్దవాళ్ళే. వాళ్ళందరినీ అమ్మ బిడ్డలు గానే చూసింది. ఇది మన ఊహకి అందనటువంటి విషయం. ఇది తెలుసుకోదగిన విషయం అనే భావన కలిగింది. మొదటిసారి వచ్చినపుడు నేను ఇంకెవరినీ పట్టించుకోలేదు. రెండవసారి వచ్చినపుడు హైమ, రవి సుబ్బారావు - ఈ ముగ్గురిలోనూ హైమ పట్ల నాకు కొంత వాత్సల్యం కలిగింది. చిన్నపిల్ల - 'అన్నయ్యా ! అన్నయ్యా!' అని దగ్గరకు వచ్చేది. రవి మరీ చిన్నపిల్లవాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకునే వాడ్ని. ఇప్పుడు రవికి మనుమలూ, మనుమరాళ్ళూ పుట్టినా నా దృష్టిలో ఇంకా చిన్నపిల్లవాడిలా అనిపిస్తాడు. అప్పటి అనుబంధం అటువంటిది. ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఇచ్ఛ కలిగి గుంటూరు వచ్చి మారుటూరు పాండురంగారావుగారు, కులపతిగారు, నేనూ కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అట్లా మూడు నాలుగు సార్లు జరిగింది. అమ్మతో సాన్నిహిత్యం ఏర్పడ్డ క్రమాన్ని వివరించండి? తర్వాత ఒకసారి అమ్మ “నువ్వు హైదరాబాద్ నుంచి అలా వస్తున్నావు. ప్రతీసారీ వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఉండదు. నువ్వే ఎందుకు రాకూడదు, సరాసరి?” అన్నది. సరిగా ఈ మాటలే కాదు. అమ్మ చాలా అందంగా మాట్లాడుతుంది కదా! నాకు తట్టలేదు. 'అవునమ్మా రావచ్చు' అన్నాను. తర్వాత ఒంటరిగా వచ్చేవాడిని. అప్పటికింకా పూర్తి విశ్వాసం ఏర్పడలేదు. తెలుసుకోవాలనే తపన ఉండేది. 'ఏమిటి? నేను అమ్మను అంటుందీమె. ఏరకమైన Psychology? నిజం చెప్పాలంటే అనుక్షణం నేను అమ్మను గమనించాలని ప్రయత్నం చేశాను - అమ్మకు చెప్పే. ఇందులో రహస్యంగా చేసేదేమీ లేదు. అమ్మ తన మంచం దగ్గరే పడుకోమనేది నన్ను. ఒక చాప ఇచ్చి “పడుకోరా, ఇక్కడే” అంది. అక్కడే పడుకునేవాడిని. నాకు అక్కడ ఇంకొకచోట పడుకోవటం కానీ, ఇంకొక చోటికి వెళ్ళటం కానీ, ఒకళ్ళతో మాట్లాడటం కానీ ఇష్టం ఉండేది కాదు - ఒక్క క్షణం కూడా అమ్మ దగ్గర నుంచి ఇవతలకి రావటం ఇష్టం ఉండేది కాదు. అమ్మ స్నానం చెయ్యాలి కదా! నేను కూడా అవతలకి వెళ్ళాల్సి వస్తుంది కదా - అప్పుడప్పుడు - సిగరెట్లు అలవాటు మూలాన ఇట్లా గంటల తరబడి, పూటల తరబడి, రోజుల తరబడి అమ్మ దగ్గర కూర్చునే అదృష్టం నాకు కలిగింది. ఉద్యోగం గురించి లెక్కచేసేవాడిని కాదు. పోతే పోతుంది అనుకునే వాడ్ని. వాళ్ళేమో కబురు చేస్తూండేవారు; ఇంటికిపోయి అక్కడ అడుగుతూండే వాళ్ళు - ఎప్పుడు వస్తాడు ఈయన, ఎప్పుడు వస్తాడు - అని. జర్నలిజం కదా! అట్లా అమ్మని గమనించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఈ లోపల హైమ తోటి, రవితోటి అనుబంధం పెరిగింది - చాలామందిని రెడ్డి సుబ్బయ్య ఇంకా ఇతరులని అడిగేవాడ్ని 'ఏమిటి? మీరేం చూశారు? ఏమిటి విశేషం?' అని. సుబ్బయ్య నాతో అన్నాడు 'ఒకసారి తలుపు తెరిచేటప్పటికి అమ్మ చేతిలో పాము ఉన్నది' అని. హైమ చెప్పిన ఒక సందర్భం ఉంది- 'అన్నయ్యా! అమ్మ పచ్చడి రుబ్బుతోంది. అక్కడ ఇంకో రుబ్బురోలు ఉంది. నేను ఆడుకుంటూ వెళ్ళి 'అమ్మా! నాకు కూడా వాసన చేసిపెట్టవా?' అన్నాను. అమ్మ చేత్తో రుబ్బురోలు పత్రంను తాకి "ఫో-తీసుకెళ్ళు” అన్నది. అప్పటి నుంచి చాలా రోజులు ఆ రుబ్బుడు పత్రం సువాసన వచ్చేది' అని. మీరు స్వతహాగా నాస్తిక భావాలు కలవారు. వృత్తిరీత్యా జర్నలిస్టులు. ఇలాంటి మీకు అమ్మ యందు విశ్వాసం ఎలా కలిగింది? నా కన్నతల్లి దగ్గర కానీ, నన్ను పెంచిన తల్లి దగ్గర కానీ నేను అనుభవించనటువంటి ఆప్యాయత, ప్రేమ, వాత్సల్యం అమ్మ దగ్గర చూశాను. నా కన్నతల్లి ఎంతో ఈమె అంతే. అంతకన్న మిన్న కూడా. దగ్గరకు తీసింది. నన్ను, కొడుకుని ఎంత దగ్గరగా రానివ్వటానికి వీలుంటుందో అంత దగ్గరగా రానిచ్చింది. కనుక అమ్మతో నాకు అనుబంధం చాలా ఉంది; అప్పట్లో బహుశః చాల కొద్దిమందికి ఈ అదృష్టం అమ్మ కలిగించి ఉంటుందని నమ్ముతాను. అమ్మ ఇచ్చిన అదృష్టమే. నాలో ఏదో విశేషం ఉందని నేను అనుకోను. ఆమె కరుణ ఎవరిపై ఎప్పుడు ఎలా ప్రసరిస్తుందో తెలియదు. నామీద ఆ కరుణ ప్రసరించింది. నాలోని తపనేమిటంటే సత్యాన్ని తెలుసుకోవాలని. వృత్తి journalism లో కూడా అంతే నేను శోధించాలి. అట్లాంటి దృష్టి అమ్మ దగ్గర కూడా. ఎవరో చెప్పినంత మాత్రాన నేనేమీ అంగీకరించను, చెయ్యను. నేను కూడా verify చేసుకుంటాను. చాలా సేపు అమ్మతో మాట్లాడేవాడిని. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పింది అమ్మ. అవన్నీ సాధ్యమా? అనిపించింది. అమ్మ చెపుతున్న కొద్దీ మానసికంగా చాలా బాధ కలిగే విషయాలు కొన్ని విన్నాను. అట్లా బాధ ఎక్కువగా కలిగిన కొద్దీ నేను అమ్మకి మరింత దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నం చేశాను. ఎప్పుడైనా నాన్నగారు అమ్మతోటి మాట్లాడటానికి వస్తే - మర్యాద ఏమంటే- వారు భార్యభర్తలు, ఏకాంతంగా మాట్లాడుకుంటారు నేను వారి మధ్య నుంచి వెళ్ళాలి అని. అమ్మ మంచం మీద నా చెయ్యి ఎప్పుడూ ఉండేది. వీలైతే అమ్మని తాకేవాడిని - పాదాలో ఎక్కడో - ఆ ఆనందం కలిగేది. నాన్నగారు వచ్చినపుడు రెండు మూడుసార్లు నేను లేచి స్పర్శలో నాకు గొప్ప వెళ్ళాను; అమ్మ ఊరుకుంది. తర్వాత అమ్మ తన చేత్తోటి నా చెయ్యి నొక్కింది - వెళ్ళక్కరలేదని దాని భావం. చెయ్యి తీసేసేది కాదు; కనుక నేను ఎట్లా వెడతాను? ఉండిపోయేవాడిని. నాన్నగారు అవీ ఇవీ ఏవో మాట్లాడేవారు. నేను ఆయనతో ఏం మాట్లాడుతాను? ఆయన నాతో ఏమి మాట్లాడతారు? మా మధ్య తత్త్వచర్చకి తావు లేదు. నేను జర్నలిస్టుని కనుక ఆయన నన్ను రాజకీయాలు అడిగేవారు. ఆయనకి కాంగ్రెస్ అంటే అభిమానం. కోన ప్రభాకరరావుగారు ఆయన స్నేహితులు. నేను కావాలని కాంగ్రెసుని కొంచెం విమర్శించేవాడిని. ఆయన చాలా ఆవేశంతో మాట్లాడేవారు - సరదాకి అనుకోండి. అమ్మ దగ్గర మాత్రం కేవలం అలౌకిక విషయాలు మాట్లాడేవాడ్ని. లౌకికమైన అంశాలతోటి సంబంధం కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. శాస్త్రవిజ్ఞానం గురించి కూడా అమ్మ దగ్గర ప్రస్తావించాను. ఉదా: Big Bang Theory. నాకు Science అంటే ఆసక్తి- పెద్దగా విశ్వవిద్యాలయ స్థాయి చదువుకోలేదు కానీ పుస్తకాలు చదివాను; చిన్నప్పటి నుండీ అలవాటు. నేను ఈ విషయాలు మాట్లాడితే అమ్మ వినేది; కొన్ని విషయాల్లో స్పందించింది, కొన్ని విని ఊరుకుండేది. ఫలానా విషయం చెప్పి అమ్మ అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని. అంతే కానీ చర్చకాదది. అమ్మను కేవలం ఒక మాతృమూర్తిగానే కాక ఒక అలౌకికశక్తిగా ఎప్పుడైనా దర్శించారా? నాకున్న ఒక బలహీనత సిగరెట్ కాల్చటం. 'అమ్మా! ఇప్పుడే వస్తాను' అని గంటకో రెండు గంటలకో బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చుకుని మళ్ళీ వచ్చేవాడిని. మళ్ళీ నేను వచ్చేదాకా లోపల అమ్మ ఒక్కతే కూర్చుని ఉండేది. అప్పుడు China war వచ్చింది. War నిధికి అందరూ విరాళాలు ఇచ్చేవారు. నేనేమీ ఇవ్వలేదు. డబ్బులు లేవు. ఆస్తులేమీ లేవు. వచ్చిన జీతం సిగరెట్లకి సరిపోయే పరిస్థితి. ఏం ఇవ్వలేక పోతున్నాననే బాధ వచ్చి అమ్మతో చెప్పాను. 'సిగరెట్లు మానుకోవాల్సి వస్తుందమ్మా' అని. నాలుగైదు సార్లు ప్రయత్నం చేశాను, మానలేకపోయాను. అమ్మతో మాట్లాడుతున్నపుడు నేను సిగరెట్ కోసం బయటికి వెళ్ళటం అనేది తప్పు అనే జ్ఞానం అప్పుడు కలిగింది. సిగరెట్ కాల్చి నేను వాసనతో వచ్చినా అమ్మ ముక్కుకి గుడ్డ అడ్డం పెట్టుకునేది కాదు; సరిపెట్టుకున్నది. ఒకసారి ఎలాగైనా మానాలనుకున్నాను. ఆ సంఘటన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మువ్వల సత్యం కాఫీకొట్టు ఉంది. అక్కడ సిగరెట్లు అవీ పెట్టేవాడిని. అమ్మతో చెబితే మాట తప్పలేను, పూర్తిగా మానుకోవాల్సి ఉంది. అందుకని చెప్పలేదు. తిరుగు ప్రయాణమై 'అమ్మా! వస్తాను. సెలవు' అని చెప్పి బయటికి వచ్చాను. నాన్నగారు కనిపించి 'ఏమండీ వెడుతున్నారా? కాసేపు ఉండండి - వర్జ్యం' అన్నారు. నాకు వర్ణ్యాలు ఇట్లాంటి వాటి మీద నమ్మకాలు లేవు. అయినా నాన్నగారు చెప్పారు - గౌరవించాలి కదా! అదొక వంక పెట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాను అమ్మ దగ్గరికి - కాసేపు మాట్లాడుదామని. ఈ లోపల సత్యం కొట్టుకు వెళ్ళి ఉన్న ఒకే ఒక Gold Flake సిగరెట్ అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి తీసుకుంటానని చెప్పివచ్చా. అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అమ్మ దగ్గరకి వస్తే ఈసారి అమ్మ దురభ్యాసాల గురించి మాట్లాడటం మొదలు పెట్టింది - త్రాగుడు... ఇతర వ్యసనాల గురించి. 'నాకు కూడా ఈ సిగరెట్తో పెద్ద బాధ అయిందమ్మా. నీతో చెప్పి మానేద్దామనుకుంటున్నాను. మానేస్తానమ్మా' అన్నాను. తలఊపింది. ఏమంటుంది? మళ్ళీ సబ్జెక్ట్ మారిపోయింది. కొంచెం సేపు అయిన తర్వాత బయటికి వచ్చా. కాఫీ కొట్టుకు వెళ్ళా. ఇప్పుడా సిగరెట్ కాల్చాలా, వద్దా? అమ్మతోటేమో మానేశానని చెప్పా. కానీ 'సిగరెట్ ఇక్కడే పెట్టు. మళ్ళీ వచ్చి తీసుకుంటాను' అని సత్యానికి చెప్పి అమ్మవద్దకి వెళ్ళాను. కాబట్టి ఆ సిగరెట్కి అమ్మకి ఇచ్చిన మాట వర్తించదు - అది ఒక logic. మళ్ళీ నేను సిగరెట్ త్రాగటానికి, మరొకవైపు ఏ క్షణంలో అమ్మకి మాట ఇచ్చానో ఆ క్షణం నుంచే మానేసినట్టు కదా! ఎట్లా కాలుస్తాను - అని. ఈ మీమాంసలో ఏం చేయాలా అనుకొని వెళ్ళి కాఫీ త్రాగా. సిగరెట్ పెట్టి తీసుకు తెరిచాను - దాంట్లో సిగరెట్ లేదు! 'సత్యం ! దీంట్లో సిగరెట్ ఏదీ?' అన్నా. 'చూడలేదన్నయ్యా. ఎవరూ రాలేదే ఇక్కడికి, నీ సిగరెట్ ఎవరు కాలుస్తారు?' అని తనూ వచ్చి చూశాడు. లేదు దాంట్లో, ఓహో ! సమస్య పరిష్కారమైంది. నేను కాల్చడం మానేసినట్లే. అప్పటి నుంచి 1962 తర్వాత మళ్ళీ సిగిరెట్ కాల్చలేదు. 2002లో నాకు Bypass Surgery జరిగింది. అపుడు వైద్యులు పరీక్షించి, 'ఎప్పుడైనా మీరు సిగరెట్ కాలా?' అని అడిగారు. దాని ప్రభావం వలన ఊపిరితిత్తుల్లో గుండె మీద ఒక మచ్చ ఉండిపోయింది. 1954-62 మధ్య ఒక జీవితానికి సరిపడేటటువంటి సిగరెట్లు కాల్చానన్నమాట. ఎంత దూరం చూపుతో అమ్మ నా ఈ దురలవాటు. అమ్మకి ఎంతో సన్నిహితంగా మెలిగాను. ఎక్కువసార్లు అమ్మ దగ్గర కూర్చున్నాను; ఎక్కువసార్లు అమ్మతో మాట్లాడాను. ఆ అవకాశాలు అమ్మ. ఇచ్చినవే. అవి ఏ కొద్దిమందికో వచ్చినవి అనుకుంటాను. ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు - జన్మలంటూ ఉంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో అనిపిస్తుంది నాకు. సకల చరాచర జంతుజాలాన్నీ సమానంగా అమ్మే ప్రేమించింది. ప్రతిబిడ్డా తల్లికి ముద్దువస్తుంది. అందరినీ అన్నట్లే నన్నూ ముద్దుమాటలేవో అంది. పంది అంటే మనం అసహ్యించుకుంటాం. - "పంది ఎంత అందమైన జంతువో, దాని ముట్టె - దాని చూపు ఎంత అందమైనవి” అన్నది అమ్మ: ఏ జంతువైనా కుక్కలు, పిల్లులు అ మేము వ్యాయామం చేసిన వాళ్ళం కదా ! మీరెంత ? మీ బలం ఎంత? అని అమ్మ మాకు ఋజువు చేసిన రెండు సంఘటనలున్నాయి. ఒకసారి ఎవరో అమ్మకి పూజ చేసుకుంటున్నారు. వందలకొద్దీ మిడతలు వచ్చి పడుతున్నాయి. అమ్మ మీద కూడా వాలుతున్నాయి. వాళ్ళు చాలా శ్రద్ధగా పూజ చేసుకుంటూనే ఉన్నారు. మిడతలు వాళ్ళ మీద పడుతున్నాయి, క్రిందపడుతున్నాయి. అమ్మ మీద పడుతున్నై. అమ్మ మీద పడకూడదని ఒక విసనకర్ర తీసుకుని బాగా విసురుతున్నా. నిజానికి ఆ విసురు గాలికి ఒక మిడత కూడా రావటానికి వీలులేదు. కానీ వస్తూనే ఉన్నాయి. ఈ గాలి ఏమైపోతున్నదో తెలియదు; విసురుతున్న ఈ శక్తి ఏమైపోయిందో తెలియదు. వస్తూనే ఉన్నాయి. అమ్మ చూస్తోంది. నాకు పట్టుదల పెరిగింది - ఒక్క మిడత కూడా రాకుండా చేయాలని. అవి చిన్న కీటకాలు, వాటి ముందర మన బలం సరిపోవట్లేదా? ఇంకా గట్టిగా విసురుతున్నా. అవి తగ్గలేదు. నా చెయ్యి నొప్పిపుట్టింది, అలసట వచ్చింది. కానీ అవి మాత్రం వస్తూనే ఉన్నాయి. 'ఓడిపోయానమ్మా' అనుకున్నాను. ఒకసారి ఓడరేవు దగ్గరకి వెళ్ళాం. అమ్మ కార్లో ఎక్కి సముద్రతీరం వెంబడి ప్రయాణం చేస్తోంది. చాలా సేపు బాగానే ఉంది. ఉన్నట్టుండి ఇసుకలో అది కూరుకుపోయింది. మాకెట్లా ఉండేదంటే ఎత్తి అవతలపడేద్దాం కారుని; ఏముంది దాంట్లో ? బాగా కండలు తిరిగిన శరీరాలు కనుక ఎత్తడానికి ప్రయత్నించాము. ఒక్క అంగుళము కూడా కదలలేదు. “మీకు కుదరదు కానీ అక్కడ బెస్తవాళ్ళుంటారురా, వాళ్ళని పిలవండి” అన్నది అమ్మ. మేము చెయ్యలేనిది బెస్తవాళ్ళు చెయ్యటమేమిటి? - అని అనుకున్నా. కానీ అమ్మ చెప్పింది కదా! మనవాళ్ళు వెళ్ళి పిలుచుకువచ్చారు. వచ్చి అవలీలగా దాన్ని అవతలకి నెట్టేశారు. ఈ సంఘటన ద్వారా మనశక్తి శక్తి కాదు అని తెలుస్తోంది. మీమీద అమ్మ ప్రభావం ఉన్నదా? అమ్మ మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉంది. ఆచితూచి బంగారం కంటె ఎక్కువగా వేసిన పదాలు. మనం మాట్లాడే మాటల మీద కూడా అమ్మ ప్రభావం ఉంది. మనకి తెలియకుండా మనచేత మాట్లాడిస్తుంది అమ్మ.. ఒక వేసవి కాలం - వెన్నెలరాత్రి. ప్రస్తుతం హైమాలయం ఉన్న ప్రదేశం. అమ్మ మంచం మీద కూర్చుని ఉంది. చాలా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి గం. 10ల సమయం. ఎక్కడన్నా దూరంగా ఎవరన్నా మాట్లాడితే మాటలు వినవస్తాయి. పల్లెటూరు కదా! ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ, నేను సంతోషంగా ఏవో మాట్లాడుకుంటున్నాము. ఇంతలో సన్నటి గజ్జెల చప్పుడు వినిపించింది. అమ్మ నివాసం పూరింటి దగ్గర నుంచి మేము ఉన్న మంచం దగ్గరికి హైమ నడచి వస్తోంది. హైమ పట్టాలకున్న చిరుగజ్జెల చప్పుడు ఆ వినిపిస్తోంది. అమ్మ వంక నేను, నా వంక అమ్మ చూస్తూ మాట్లాడుకుంటున్నాము. ‘దేవత నడచి వస్తున్నట్లున్నదమ్మా!' అన్నాను. అమ్మ చూసింది. చిరునవ్వు నవ్వింది. హైమ మంచం దగ్గరకి రాగానే హైమతో అమ్మ "అన్నయ్య నిన్ను దేవత అంటున్నాడు" అన్నది. హైమని ‘ఏమ్మా ! ఏమైనా తిన్నావా?' అని అడిగేవాడ్ని. 'ఇప్పుడే తొట్టి స్నానం చేశానన్న' అనేది. లోపల అమ్మ దగ్గరకి పోయేది. కాసేపు అమ్మతో మాట్లాడేది. రవి హైమని అంటూండేవాడు 'చిన్మాత' అని. రవి ఎందుకు 'చిన్మాత' అన్నాడు. నేను 'దేవత' అని ఎందుకు అన్నాను? అన్నది హైమదేవతగా పూజలందుకున్న తర్వాత అర్థమైంది. ఇప్పుడు హైమ ఎక్కడ సమాధి అయిందో సరిగా అదే స్థలంలో 'దేవత నడచి వస్తున్నట్లున్నదమ్మా!' అన్నాను అప్పుడు. నేను దేవతలని చూశాను కనుకనా! మా ఇద్దరి నోటివెంట వచ్చిన ఆ మాటలు 'అమ్మ మా నోట పలికించిందా!' అనిపించింది. అమ్మని ఆధ్యాత్మిక రంగంలో సామ్యవాది అని కొందరంటారు. దానిని గురించి మీ అభిప్రాయం ఏమిటి? మార్క్సిజం గురించి చదివాను. సోషలిస్టు సిద్ధాంతాల పట్ల అభిమానం కలవాడ్ని. మనవైదిక విజ్ఞానంలో - ‘అయంపరః నిజోవేతి గణనా లఘుచేతసా || ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్ ||’ అనేది చాలా గొప్ప భావన. అమ్మ వద్దకు వచ్చేవారి కులం, అంతస్తుతో సంబంధం లేదు. మంత్రాయి అస్పృశ్యుడని లేదు, మనందరి లాగా బిడ్డే. అలాగే రెడ్డి సుబ్బయ్యనీ, అందరినీ అమ్మ దగ్గరకి తీసింది. అయితే ఇదీ మనం చెప్పుకోవాలి. సనాతన ఆచారాల పట్ల ప్రాచీన సంప్రదాయాల పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు 'అందరితో వచ్చి కూర్చోలేము. మేము విడిగా భోజనం చేస్తామమ్మా' అని అంటే “మంచిది, నాన్నా! మీకు వేరే పెడతారు” అన్నది. అమ్మకి అందరూ అన్నం తినటం ముఖ్యం. గదిలోపల కూర్చుని తింటే ఏం? గది బయట కూర్చుని తింటే ఏం? నేనే కాదు, నాలాంటి నాస్తిక భావాలు కలిగినటువంటి శ్రీ జొన్నలగడ్డ రామలింగయ్యగారు వస్తే "రండి!" అన్నది. నమ్మకం లేదు' అన్నాడు. “అక్కరలేదు, నాయనా! అన్నం తిని వెళ్ళు" అన్నది. ఆశ్చర్యకరంగా ఆయనకి ఇష్టమైన నూకల అన్నం వండించి పెట్టింది అమ్మ ఆరోజు. 'నాకు నూకల అన్నం ఇష్టమని ఆమె కెట్లా తెలుసు?” అనుకున్నాడు. అట్లా అందరినీ దగ్గరకి తీసింది. సమభావన. అందరితో కలిసి పంక్తి భోజనాలు చేసేటప్పుడు - కటిక నీళ్ళ మజ్జిగ. కానీ ఆ అన్నం చాలా రుచిగా ఉండేది. ఆ అన్నంలో మజ్జిగ వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని తింటే అద్భుతంగా ఉండేది. ఒక పంక్తిలో వందమంది కూర్చున్నపుడు ఒకరికి పెరుగువేసి, ఒకరికి మజ్జిగవేసి, ఒకరికి నీళ్ళ మజ్జిగ వేసి అలా కదా! అందరినీ సమంగా చూసేది అమ్మ చెయ పెద్దవాళ్ళు వచ్చినపుడు మంత్రులు వచ్చినా సరే వాళ్ళ డ్రైవర్ని కూడా పిలవమనేది; వాళ్ళ పనివాడ్ని పిలవమనేది - వాళ్ళని కూడా గౌరవంగా చూసేది. మంత్రిని ఎట్లా అన్నం తినమని చెప్పేదో వాళ్ళనీ అలాగే తినమనీ చెప్పేది. ఇంతకన్నా సమత్వం ఎక్కడ ఉంటుంది? జిల్లెళ్ళమూడి వచ్చిన మొదటి విదేశీయుడు ఒక Peace -Core-Volunteer. వాళ్ళందరినీ సమానంగానే చూసింది అమ్మ. వసుధైక కుటుంబం అంటే ఇంతకంటే ఇంకొకటి ఉంటుందా? బామ్మగారు, పాపత్తయ్య గారు, సీతాపతి తాతగారిని జిల్లెళ్ళమూడిలో చూశాను. అక్కడ భోజనాలు చెయ్యటం చూశాను. వాళ్ళంతా అమ్మ దగ్గరకి వచ్చేవాళ్ళు. మేమంతా అమ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే చూసి సంతోషించేవాళ్ళు. కానీ అంతకు ముందు పరిస్థితి అట్లాంటిది కాదు. వివరాల జోలికి మనం పోనక్కరలేదు. నాన్నగారు మా అందరితో చెప్పేవారు, record purpose కి చెపుతున్నాను, 'ఆమె నాకు భార్య. మీకు అమ్మ అంటున్నారు. నాకు భార్య. భార్యగా ఆమె నుంచి నేను కోరేవి ఉంటాయి. అవి నేను తీసుకుంటాను' అన్నారు; ఆమె చేత పరిచర్యలు చేయించుకున్నారు. అమ్మ కూడా ఆయనకేమి కావాలో అవన్నీ సమకూర్చేది- భర్తగా ఆశించినవన్నీ. అట్లా అని తన సంతానంగా చూసే మిగతావాళ్ళెవరికీ లోపం చేయలేదు. సీతాపతి తాతగారికీ చేసింది. వాళ్ళందరూ అమ్మ పట్ల ఆరాధన భావం అని అననుకానీ, ఒకప్పుడు వాళ్ళకుండేటటువంటి అభిప్రాయాలు తొలగిపోయి ఏదో అందరూ అమ్మని ఆరాధిస్తున్నారు, మంచిదే - అనే భావంలోకి వచ్చినట్లు అనిపించింది నాకు. కోన సుబ్బారావు గారి భార్య మా పినతండ్రి కుమార్తె వెంకాయమ్మగారు; వాళ్ళ పిల్లలు వసుంధర, సత్యం, వెంకటేశ్వరరావు, అమ్మాజీ. వీళ్ళంతా అమ్మ దగ్గరకి రావటం, అమ్మతో అనుబంధం కలగటం, నాకూ అనుబంధం కలగటం... ఇవన్నీ యాదృచ్ఛికం. అంతే. అమ్మ ఎప్పుడు ఎవరిని ఎలా పిలిపిస్తుందో తెలియదు. ఎవరిని ఎప్పుడు గమనిస్తుందో దగ్గరకి తీసుకుంటుందో అది మనకు తెలియదు. ఎందుకో ఎందువలననో కూడా ఆమెకే తెలుసు. ఉదాహరణకి నేను మాజేటి గురవయ్య పాఠశాలలో చదువుతున్న రోజుల్లో చడ్డీ వేసుకుని ఎక్కడికో వెళ్ళాను. అపుడు అమ్మంటే తెలియదు. ఆ ప్రాంతంలో చూసిందట మొదటిసారిగా అమ్మ నన్ను! జిల్లెళ్ళమూడిలో కాలేజి రావటానికి, ఆస్పత్రి రావటానికి నాకూ చిన్న పాత్ర ఉంది. నేను నిమిత్తమాత్రుడ్ని. సత్యం (డా.కె.యస్.యన్.మూర్తి) డాక్టర్ పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత అమ్మ చాలా అమాయకంగా “ఇక్కడే ఉద్యోగం చేయకూడదా, నాన్నా?" అంది. మేమంతా నవ్వే వాళ్ళం. ఈ కుగ్రామంలో hospital ఏమిటి? అని. అట్లాగే పన్నాల రాధాకృష్ణశర్మగారిని చాలా అమాయకంగా “ఇక్కడ పనిచేయకూడదా?” అంది తమాషాగా. 'జిల్లెళ్ళమూడిలో కాలేజి ఏమిటి? నేను ప్రిన్సిపాల్ ఏమిటి?' అనుకున్నారాయన. ఎవరూ నమ్మరు. కానీ అమ్మ చెప్పిన వాటిని చాలా seriousగా తీసుకుని మనం ప్రయత్నం చేయాలని చెప్పినటువంటి వాడు అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య గారు. ఆయన కాప్రేరణ కల్పించింది అమ్మ. ఆయన దగ్గర మేము స్వచ్ఛంద సేవకులం. నాకూ నా వృత్తిని బట్టి ఎవరో తెలిసి ఉంటారు. ఏదన్నా ఒక మాట చెప్పి ఉంటాను. ఆయన ప్రధానమైన ఉపకరణం. వారి పట్ల మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఆ రోజుల్లో సోదరుడు తంగిరాల కేశవశర్మ, టి.యస్. శాస్త్రిగారు, అన్నపర్తి కృష్ణశర్మ, నేను - మేము నలుగురం కలిసి అప్పటి మా ఆఫీసు (గాంధీభవన్) ప్రాంగణంలో ఉన్న lawn మీద కూర్చుని పైన చంద్రుని చూస్తూ 'ఈ క్షణంలో అమ్మ కూడా చంద్రుని చూస్తూ ఉందా? ఈ నేలమీదే కదా అమ్మ అక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉంటుంది?” అని ఊహించుకునే వాళ్ళం. ఆ రోజుల్లో అటువంటి అనుబంధాలు ఉండేవి. 1973లో అమ్మ హైదరాబాద్ పర్యటించింది. ఆనాటి మీ అనుభవాలు చెప్పండి. 1973 ప్రాంతంలో 'అమ్మ హైదరాబాద్ వస్తోంది. మనందరం కలిసి పని చేయాలి' అనుకున్నాం. శ్రీ టి. రాజగోపాలచారిగారు ప్రధానమైనవారు; ఇంకా ఎమ్. దినకర్, శిష్ట్లా శాంత మేము చాలా మంది ఉన్నాము. అమ్మ జరు కాలనీలో రాజగోపాలాచారి గారింట్లో ఉండేది. అంతవరకు ఉన్న ఒకప్పటి మా ఇల్లు చూపించి అమ్మ "ఇది వాడి ఇల్లురా. వాడు నిలుపుకోలేదు” అని అనేకసార్లు అనేకమందితో అంది. అమ్మ దయ లేకుంటే ఎలా ఉంటుంది? ఆ ఇల్లు కట్టేటప్పుడు పోతుందని ముందే సంకేతం ఇచ్చింది. అమ్మ కుంకుమ పొట్లం తీసుకుని శంకుస్థాపనకి వెళ్ళాం. తీరా శంకుస్థాపన సమయంలో చూస్తే కుంకుమ పొట్లం లేదు. ఎందుకు లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది. అప్పులున్నాయి. - ఎట్లా గోట్లా తీరిస్తే బాగుండునని అమ్మేశా.. ఇవాళ దాని ఖరీదు కనీసం నాలుగు కోట్లు ఉంటుంది. పర్యటనల్లో అమ్మతోపాటు వెళ్ళేవాళ్ళం. సేవా కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా ఎవరు చేసినా అమ్మ ఆనందించేది. గుడిసెల దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు కూడా అమ్మని ఎంతో ప్రేమగా చూశారు. అమ్మ వారి పట్ల అపారమైన కరుణ చూపించింది, కౌగలించుకుంది, ఆనందించింది. ఒక చోట గుడిసెల దగ్గర అమ్మ ప్రసాదం, పులిహోర పంచుతున్నా. గంగాళంలో కొంత మాత్రమే ఉంది. జనం వందల " మంది ఉన్నారు. అందుకని గుప్పెడో రెండు గుప్పెళ్ళో పెడుతున్నా. “ఎట్లా పెడుతున్నారు. నాన్నా?” అమ్మ నన్ను పిలిపించి అడిగింది. * ఇంత పెడుతున్నాము' అన్నాను. "బాగా హైదరాబాద్ పర్యటనలో అమ్మతో శ్రీపొత్తూరి పెట్టరా” అన్నది అమ్మ. 'చాలామంది జనం ఉన్నారమ్మా. సరిపోవద్దా?' అన్నాను. “పెట్టరా” అంది అమ్మ. అమ్మ ఇట్లా చెప్పిందేమిటి అని పట్టుదలతో చేతిలోని పళ్ళెంతో అంతకు ముందు దానికంటే మూడు నాలుగు రెట్లు పెడుతున్నాను. తీసుకుంటున్నారు. జన అయిపోయారు. గంగాళంలో పులిహోర ఇంచుమించు అలాగే ఉంది. అంటే సినిమాల్లో చూపించినట్లు ఉబ్బటం అలా ఏమీ ఉండదు. పెడుతూనే ఉంటాం. దానిలో ఉంటూనే ఉంటుంది. ఎలా మిగిలి ఉన్నదీ తెలియదు. పోనీ సృష్టించబడుతోందా? అదీ కనిపించదు. అది చాలా ఆశ్చర్యకరం. నాటి అందరింటి సోదరీ సోదరుల అనుబంధాన్ని చెప్పండి. అమ్మ దగ్గరకి వెళ్ళివచ్చిన మనవాళ్ళు 'Battery charge చేసుకుని వస్తున్నాం' అనేవారు. 'మీరు అమ్మ దగ్గరకి వెళ్ళి వచ్చారు. అమ్మను తాకారు. ఏదీ shake hand ఇవ్వండి' అంటూ కరచాలనం చేస్తే మనకీ ఎంతో ఆనందంగా ఉండేది. ఉదాహరణ - ఒకసారి నాకు జ్వరం వచ్చి, తగ్గింది. మర్నాడు . ఉదయం తంగిరాల రాధ వచ్చాడు మాఇంటికి. జిల్లెళ్ళమూడి నుంచి సరాసరి అన్నం తీసుకువచ్చాడు. చద్ది అన్నం కదా! కారప్పొడి అన్నం. 'అమ్మ ఇమ్మంది. నీకు' అని ఇచ్చాడు. పథ్యం పెట్టటం అన్న మాట అది. జ్వరం వచ్చిందని ఆమె కెవరూ చెప్పలేదు. అమ్మ మీకు చెప్పిన లేక మీరు ఆచరిస్తున్న సాధనలు ఉన్నాయా? అమ్మ నాకు రెండు మూడు ఉత్తరాలు వ్రాసింది. ఒక ఉత్తరంలో "నాన్నా! వెంకన్నా, రా ! అమ్మ" అంతే. ఇంకో ఉత్తరంలో "అంఆ”. ఈ అక్షరాల ప్రభావం నా మీద ఉంది. 'పారమార్థిక పదకోశం' గ్రంథం వ్రాస్తున్నపుడు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారిని 'స్వామీ! 'అంత' అనే అక్షరాలు బీజాక్షరాలేనా?' అని అడిగాను. 'సందేహమేముంది? బీజాక్షరాలే' అన్నారాయన. అమ్మ ఆ బీజాక్షరాల్ని చాలా మందికి వ్రాసి ఇచ్చింది. 'అవి బీజాక్షరాలు, జపం చెయ్యండి' అని అమ్మ ఎప్పుడూ చెప్పలేదు. కానీ నా అనుభవంలో అవి అమ్మ ఉపదేశించిన బీజాక్షరాలు. అది ఉపదేశం. 'ఎవరైనా చేసుకుంటే మేలుకలుగుతుంది' అనే విశ్వాసం నాలో కలిగింది. దానిని నేను జపం చేస్తా. సాధనగా నేనేమీ చేయలేదు. అమ్మ దగ్గర కూర్చోవటం, అమ్మతో మాట్లాడటం, అమ్మను తలచుకోవటం - ఇవే నా సాధన. అమ్మ ఎప్పుడూ మనస్సులో ఉంటుంది. 'ఈ లోపల ఉండిపో' అని కోరుకుంటా. అంతకంటే కోరవలసిన పెద్ద కోరికేమీ లేదు. నాకు అనేక విషమ పరిస్థితుల్లో, నా మనస్సుకి ఏమీ తోచని సమయంలో అమ్మని జ్ఞాపకం చేసుకుంటే అమ్మ స్ఫురణకి రాగానే ఏదోరకంగా నాకు పరిష్కారం లభించేది. ఇటీవల జిల్లెళ్ళమూడిలో మనం నిర్వహించుకున్న తత్త్వ చింతన సదస్సుపై మీ అభిప్రాయమేమిటి? ఇటీవల 'తత్త్వచింతన సదస్సు'ని జిల్లెళ్ళమూడిలో నిర్వహించుకున్నాం. మన ఆలోచనలను కలబోసుకున్నాం, అనుభవాలు చెప్పుకున్నాం. అమ్మకి ఒక తత్త్వం ఉన్నది. అమ్మ మాటలు Aphorisms; సూత్రాలు - బ్రహ్మసూత్రాలు లాంటివి. పెద్ద పెద్ద విషయాల్ని రెండో మూడో పదాలలో చెపుతుంది. సంస్కృతంలో కంటే Latin వంటి ఇతర భాషల కంటే తెలుగులో ఇంకా ఎక్కువ సౌలభ్యం ఉందని చెప్పినట్లుగా అనేక వ్యాకాలున్నాయి. “ఇష్టం లేనిదే కష్టం”. "అంతా అదే” ఈ రెండు పదాల్లో మొత్తం సిద్ధాంతసారం ఉంది. అంతా అదే; అది కానిది ఇంకొకటి లేదు - అంతా ఒకటే అన్నపుడు అద్వైతము. ఇట్లాంటి సదస్సులు ఇంకా జరిగితే మంచిది అని నాకు అనిపిస్తుంది. సదస్సు చాలా మందిని ఒకచోట చేర్చింది. అందరం కలిసి ఆలోచనలు కలబోసుకున్నాం. నా మనస్సుకి చాలా తృప్తి కలిగించింది. నా వృత్తిలో నేను విజయం పొందాను కదా ! ఆ విజయానికి అమ్మయే కారణం. చెప్పకుండా అమ్మ ఇచ్చిన మంత్రం 'అఆ'. అది ఎప్పుడు చెయ్యాలో ప్రేరణ ఆమె కల్పిస్తుంది. మౌఖికంగా చెప్పదు. ఈ మంత్రాన్ని చాలామందికి ఇచ్చింది. పుస్తకాల మీద 'అంఆ' అని వ్రాసేది. అంటే అవి బీజాక్షరాలు. 'అంఆ' అనే బీజాక్షరాలు ఎవరికైనా వర్తిస్తుంది. మహామంత్రం అది. ఇది అవతారమూర్తి అమ్మ ఇచ్చిన మంత్రం; తరతరాలకు ఉపయోగపడుతుంది. మంచి జరుగుతుంది. ఆ మంత్రం చేసేటప్పుడు అమ్మని జ్ఞాపకం పెట్టుకోవచ్చు; హైమనీ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంతకంటే మనకు కావాల్సిందేముంది!

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!