మొదటిసారి కృష్ణభిక్షువుగారు, పొత్తూరి వేంకటేశ్వరరావుగారు, మిన్నికంటి గురునాధశర్మ గారు, నేను ఇంకా మరికొంతమంది కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళాము. మాకంటే ముందు కృష్ణభిక్షువుగారు జిల్లెళ్ళమూడి వెళ్ళారు. వారు రమణాశ్రమంలో చాలాకాలం ఉన్నారు; కంచి పరమాచార్య దగ్గర కొంతకాలం ఉన్నారు, కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని దగ్గర కొంతకాలం ఉన్నారు. వాళ్ళందరి సేవ చేశారు. ప్రధానంగా రమణాశ్రమంలో ఎక్కువ కాలం ఉండటం రమణుల యొక్క చరిత్ర తెలుగులో వ్రాసిన మొదటి వ్యక్తి ఆయన.
గుంటూరులో ఉన్నవ లక్ష్మీనారాయణపంతులుగారు స్థాపించిన శారదానికేతన్ ఉండేది. దానికి ఆయన Executive Officer గా ఉద్యోగరీత్యా వచ్చారు. ముగ్గురు సిద్ధవ్యక్తులు రమణమహర్షి, కంచి పరమాచార్య, జిల్లెళ్ళమూడి అమ్మతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఆ రోజుల్లో రామాల్ ప్రభు ధ్యానసంపద్రాయం ఒకటి ఉంది. గుంటూరులో మోతడక సత్యనారాయణ గారనే ఒక Town Planning Officer ఉండేవారు. ఆ సంప్రదాయంలో ఆయన మాస్టర్గా ఉండేవారు. ఆయన దగ్గర శిష్యుడుగా చేరాడు ఈయన. దాంట్లో ధ్యానం చేస్తుండగా కృష్ణభిక్షువుకు Third Eye Open అయింది. ఏవైనా ఆధ్యాత్మిక విషయాలు, ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే కృష్ణభిక్షువుగారినే చూడమనే వారు గురువు గారు. వారు చూడమంటే ఈయనకు కనిపించేది. ఆ గురుశిష్యు సంబంధం అట్లా ఉండేది. తర్వాత వ్యక్తిగతంగా అభివృద్ధి చెందారు.
జిల్లెళ్ళమూడి అమ్మను గురించి విని, వీరిద్దరూ శిష్యులతో కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సత్యనారాయణగారు కృష్ణభిక్షువును ‘అమ్మ యొక్క జన్మ పరంపరను చూడవలసింది’ అని కోరారు. ఈయన చూశారు. ధ్యానంలో వారికి కనిపించినవి చెప్పారు. ఏదో దివ్యలోకాలలో హ్రీదేవి అని, అట్లా కొన్ని జన్మ పరంపరలు చెపుతూ వచ్చారు. ఆ తర్వాత కూడా దానిని గురించి అప్పుడప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నాం. తర్వాత అమ్మను కొందరు అడిగారు. ‘కృష్ణభిక్షువు చెప్పినది సత్యమేనా?’ అని. “ఆయన కనిపించినవి చెప్పాడు” అన్నది అమ్మ. కృష్ణభిక్షువుకు అమ్మను గురించి ప్రబలమైనటువంటి విశ్వాసం కలిగింది. ఆయన చూసినటువంటి ధ్యానం వలన ఆమెను అవతారమూర్తిగా, పరమేశ్వరిగా, అనేక జన్మపరంపరలు లోకకల్యాణం కోసం ఎత్తినటువంటి ఒక మహావ్యక్తిగా ఆయన భావించారు. ఆ రోజుల్లో అంతా కలిసి ధ్యానం చేస్తూండే వాళ్ళం.
మొదట అంతా కలసి జిల్లెళ్ళమూడి వెళ్ళాం. భోజనాలకు రెండు పంక్తులలో కూర్చున్నాము. ఇంతమంది ఉండగా నా వద్దకే అమ్మ వచ్చి, నాకు ఎదురుగా కూర్చొని, అన్నం కలిపి ముద్దలు పెట్టింది. ఆ సంఘటన వల్ల ఆమె ప్రేమ, వాత్సల్యం మనస్సుకి బాగా హత్తుకున్నది. అంతకు ముందు అంతా అక్కడ కూర్చున్నాము. అప్పటి ఒకటి రెండు సంఘటనలు ఉన్నాయి. మిన్నికంటి గురునాధ శర్మగారు గొప్ప పండితులు, శాస్త్రవేత్త. ఆయన వేదాంతానికి సంబంధించిన ఒక ప్రశ్న అమ్మను వేశారు. ఆమె చూస్తూ ఉన్నది. ఇంతలో ఎవరో పెద్ద లావాటి వేదాంత గ్రంథాన్ని తీసికొచ్చి అమ్మకు ఇచ్చారు. ‘అమ్మా! ఈ వేదాంత గ్రంథం అచ్చయింది. మీకు సమర్పిద్దామని తెచ్చాను’ అన్నారు. మాతో మాట్లాడుతున్నది, ఆ గ్రంథం తిరగేస్తున్నది. తిరగేస్తూ ఒక చోట ఆగి “నాన్నా! ఇది చదువు” అన్నది నన్ను. నేను ఆ పేజీ చదివాను. ఆయన ప్రశ్నకి సమాధానం దాంట్లో ఉంది. ఆ పుస్తకం అమ్మ అంతకు ముందు చూడలేదు. ఏ పేజీలో ఏముందో చూడలేదు – లౌకికంగా చెప్పేటట్టయితే, అప్పుడే పుస్తకం మా ఎదురుగానే వచ్చింది. ఈయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం అదే పేజీలో ఉండటం ఆశ్చర్యం. గురునాధశర్మగారు చాల దిగ్భ్రాంతి చెందారు ‘ఏమిటి ? ఇది ఎట్లా సాధ్యం’ అని. సాధ్యమా అసాధ్యమా అంటే అతీతమైన విషయాల్లో ఎవరూ చెప్పగలిగింది లేదు. జరిగింది. అంతే. అది ఒక మహిమాన్వితమైన విశేషంగా ఆ పూట అందరూ భావించాం.
తర్వాత కూడా మరొకసారి మేము అందరం కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళాం. అలా వెళ్ళినపుడు వేదాంత సంబంధమైన కొన్ని ప్రశ్నలకి అమ్మ చాల simpleగా, అత్యంత క్లిష్టమైన ప్రశ్నలు అని మనం అనుకున్నటువంటి వాటికి ఆమె చాలా సులభంగా, సుబోధకంగా, సరళంగా చెప్పింది; పండు వలిచి పెట్టినట్టుగా ఉండేవి ఆ సమాధానాలు.
అప్పటికి నాకు వివాహం కాలేదు. నాటి సిద్ధేశ్వరీపీఠాధిపతులు శ్రీ త్రివిక్రమానందభారతీస్వామివారు ‘కులపతిగారు ఆశ్రమస్వీకారం చేయొచ్చు కదా! ఈ పీఠానికి రావచ్చు కదా’ అని అడిగారు. ఆ సంగతి పొత్తూరి వేంకటేశ్వరరావు గారు నాకు చెప్పారు. వారు చెప్పిన మీదట నేను ఆలోచించి సన్యాసం తీసుకుందామనే నిర్ణయానికి వచ్చాను. అన్ని ఏర్పాట్లు కూడా అనుకున్నాము. శాస్త్రం తల్లిదండ్రుల అనుజ్ఞ కావాలని చెపుతున్నది. కాబట్టి వాళ్ళని అడిగితే ‘పెద్దకొడుకువు. నువ్వువెడితే ఎట్లా?’ అని వారు అంగీకరించలేదు. ఒక వేళ నేనేదైనా తొందరపాటు చర్య తీసుకుంటానేమోనని వాళ్ళు జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను ప్రార్థించారు. అపుడు అమ్మ “మీరెందుకు దిగులు పడతారు? దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడేది జరగాలో అప్పుడు అది జరుగుతుంది” అని చెప్పింది. వారు నిశ్చింతగా ఉన్నారు. అప్పటికి అది వాయిదా పడింది. కుర్తాళం మౌనస్వామిపీఠానికి నేను భవిష్యత్లో వస్తాననే అవగాహన అమ్మకి ఉందేమోననే భావన ఇప్పుడు అనిపిస్తున్నది. జరగవలసిననాడు జరుగుతుంది, అనటంలో అనుబంధం ఏదో ఉంది; నిర్ణయం ఏదో ఉన్నదన్న సంగతి ఆమెకి తెలుసునని అనిపిస్తున్నది.
అమ్మ మీద ‘అంబికాసాహస్ర’, 1000 పద్యాలు, శ్లోకాలు వ్రాశాను. సాధన యొక్క ప్రారంభదశలో ఉన్నవాడిని. అంటే అప్పటికి నిరంతరం ధ్యాన మంత్ర జపదీక్షలు చేస్తూండేవాడిని. రోజూ 15 గంటలు, 16 గంటలు జపం చేయటం, ధ్యానం చేయటం అభ్యాసం చేస్తున్నపుడు – అల్పాహారంతోనో, నిరాహారంగానో చాలకాలం మండలదీక్షలు అవీ చేస్తూండేవాడిని. ఆ సమయాలలో ఈ మంత్రజపం వల్ల నిరంతరం ధ్యానం వల్ల ఏవేవో కొన్ని అనుభూతులు కలుగుతూండేవి. ఇలా చేస్తున్న మంత్రదేవత యొక్క కరుణకు సంబంధించిన దర్శనాలు కొన్ని జరుగుతూ ఉండేవి. ఆ పరంపరలో అప్పుడు కలిగినటువంటి ధ్యానానుభవ పరంపరలలో ఇట్లా అనిపించింది. అమ్మ కూడా అపుడు ధ్యానంలో స్వప్నంలో కనబడటం; స్వప్నంలో కనబడి ఆ రోజుల్లో నాకు ఒక మంత్రం కూడా ఉపదేశించింది. అది శాక్తేయమనిపించింది. సంప్రదాయ ప్రకారంగా వచ్చినదే. నేనెవరికీ చెప్పలేదు. వీటన్నింటిని బట్టి, నాకు కలిగిన అనుభవాలను బట్టి, తర్వాత అక్కడ జరుగుతున్న సంఘటనలను చూసిన మీదట ఒక ప్రబలమైన విశ్వాసం ఏర్పడటాన్ని బట్టి, పెద్దలు చెప్పిన దానిని బట్టి – మొత్తం మీద ఏమిటి అంటే ఆమె ఒక దివ్యశక్తి, అసామాన్యురాలు, మహనీయవ్యక్తి అనే విశ్వాసం కలిగి ఆ రోజుల్లో ‘అంబికాసాహస్రి’ వ్రాశాను.
0 Comments