Marakani Lalithamba

Interviewed by
Ravuri Prasad
25/11/2011
Jillellamudi

 

శ్రీమతి మరకాని లలితాంబ

 

ఈమె 6-6-1926 తేదీన జన్మించారు. స్వస్థలం కృష్ణాజిల్లా, మచిలీపట్నం. తల్లిదండ్రులు శ్రీ కోటేశ్వరరావు, శ్రీమతి రుక్మిణమ్మ. భర్త శ్రీ మరకాని సత్యనారాయణ; సంతానం ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. విద్య-Matriculation.

సేవాతత్పరత: తనశక్తి, యుక్తి, ఊపిరి, జీవితం, జీవనం… సర్వం అమ్మేనని విశ్వసించి అమ్మ శ్రీ చరణ సన్నిధిలో స్థిరనివాసం ఏర్పరచుకొన్న ఆదర్శమూర్తి. ‘భర్తని ప్రేమించే భార్య చివరి క్షణం వరకు స్వయంగా భర్తకు సేవలనందించి ఏ లోటూ లేకుండా సాగనంపాలి’ అనే అమ్మభావానికి నిలువెత్తు ఉదాహరణగా అక్కయ్య నిలిచింది. కష్టసుఖాలు రెండు అమ్మ ఇచ్చిన దివ్య ప్రసాదాలుగా భావించి జీవనయానం చేస్తున్న ధన్యచరిత.

శ్రీ రావూరి ప్రసాద్ 25-11-2011వ తేదీన జిల్లెళ్ళమూడిలో శ్రీమతి మరకాని లలితాంబగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

ముందుగా మీ కుటుంబం గురించి, తర్వాత అమ్మను మొదట దర్శించిన సందర్భం గురించి తెలియజేయండి?

మాకు నలుగురు సంతానము – ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. మా వారు పోలీసు శాఖలో DSP గా పనిచేసి పదవీ విరమణ చేశారు. వారు రిటైర్డ్ కాకముందే మా పెద్దమ్మాయికి మానసిక వ్యాధి సోకింది. శంకరరావుగారనే Psychiatrist, Shocks కూడా ఇచ్చారు. గుంటూరులో మా ఇంటిప్రక్కనే ఉన్న గోవిందరాజులదత్తుగారు ‘జిల్లెళ్ళమూడిలో అమ్మ ఉన్నది. మేమంతా వెళ్ళి వస్తూంటాము. అమ్మ దర్శనం చేసుకుంటే ఇలాంటి వ్యాధులు నయమౌతాయి’ అని చెప్పి, 13-3-1971 తేదీన, మమ్మల్ని జీపులో జిల్లెళ్ళమూడికి తీసుకువచ్చారు. ఆ రోజు మావారు, నేను, మా పెద్దమ్మాయి, దత్తుగారు వచ్చాము. రాగానే అమ్మ దర్శనం ఇచ్చింది. మంచం మీద కూర్చున్నది. అమ్మను చూడగానే మావారు చాలా దుఃఖించారు. అపుడు అమ్మ వారిని తన ఒడిలోకి తీసికొని ఓదార్చింది. అమ్మ కూడా ఏడ్చింది. నేను వెనుక అలా చూస్తూ నిలబడిపోయాను. అమ్మదర్శనం అయిన తర్వాత నాకు అనిపించింది – ‘సందేహం లేదు. రామావతారం, కృష్ణావతారాలకు మించినది ఈ అమ్మ!’ అని.

లోగడ రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదివాను. ‘ఆ సమయంలో నేను లేను కదా’ అని విచారించేదాన్ని. కానీ అమ్మను చూడగానే ‘రామకృష్ణ పరమహంస ఆరాధించిన ఆ శక్తి దగ్గరకే వచ్చాను. ఆయన కంటే నేను ధన్యురాలను’ అనిపించింది.

అమ్మని అమ్మగానా? దైవంగానా? మీరు ఎలా ఇష్టపడతారు?

అమ్మను దైవంగా తల్లిగా ఇష్టపడతాను. అమ్మమీద నాకు అపారమైన ప్రేమ ఉంది. అమ్మ ఏదైనా బాధపడుతుంటే నేను చూడలేను. అమ్మ నాకు దర్శనం ఇవ్వొద్దు, మాట్లాడవద్దు; విశ్రాంతిగా ఉంటే చాలు తత్త్వం. అందువలన పగలంతా అమ్మ దగ్గరకు వచ్చేదాన్ని కాదు. రాత్రి 10 గంటల నుంచి, తెల్లవారు ఝామున 4గంటల వరకు అమ్మ దగ్గర ఉండేదాన్ని. మేలుకొని ఉండి, అమ్మకి నడుం రాసేదాన్ని, కాళ్ళు ఒత్తేదాన్ని. అమ్మ నాకు ఆ అవకాశం కలిగించింది. అలా నా కోరిక తీర్చిందని అర్థమైంది తర్వాత.

అమ్మతో మీ అనుభవం ఎలా ఉండేది?

మా ఇద్దరు అమ్మాయిలు మనోవా పీడితులు. నాకు చాల అలసటగా, విసుగుగా ఉన్నపుడు అమ్మ దర్శనానికి వెళ్ళేదానిని. ఆ వెళ్ళటం నాకై నేను వెళ్లినట్లు ఉండేది. కాదు. నా భారాన్ని దించాలని అమ్మే. ‘అది వస్తే బాగుండును’ అనుకునేది. నాకోసమే ఎదురు చూస్తున్నట్లు అలా నిలుచుని ఉండేది. అమ్మ పాదాలు పట్టుకొని నమస్కారం చేసుకుని వచ్చేదాన్ని. అమ్మ వద్దకు వెళ్ళేటప్పుడు ఎంతో బరువుగా వెళ్ళేదాన్ని, వచ్చేటప్పుడు గాలిలో తేలిపోతూ వచ్చేదాన్ని. నన్ను అలా స్వాంతన పరిచేది అమ్మ.

అమ్మకీ వేదాంతానికీ సంబంధమే లేదనుకుంటాను. అమ్మకి వేదాంతం, ఈ పూజలు కంటే ప్రేమించటమే ఇష్టం. అమ్మ దృష్టిలో జాలి, మన దృష్టిలో ప్రేమ. అమ్మకి మన ఎడల జాలి, ప్రేమ అన్నీ ఉన్నాయంటాను.

అమ్మ సూక్తులలో “తృప్తే ముక్తి” అనేది నాకు బాగా నచ్చింది. పిల్లలు చదువుకునే వాళ్ళు. నేనూ చదివేదాన్ని పుస్తకాలు; చర్చించే దాన్ని. ‘ఏదైనా ఒకటి ‘లేదు’ అనుకునే కంటే ‘అక్కరలేదు’ అనుకుంటే పోతుంది” అని పిల్లలతో చెప్తుండేదాన్ని. మా పెద్దబ్బాయి దినకర్ చాలాసార్లు ‘దైవం చేతిలో ఏముంటుంది?

అంతా మన ప్రయత్నం లోనే ఉంటుంది’ అనేవాడు. అలాంటిది అమ్మ ‘అంతా దైవం చేతిలోనే ఉంటుంది’ అన్నట్టుగా అనుభవాల్ని ఇచ్చింది వాడికి. ‘మన ప్రయత్న లోపమే కానీ గట్టిగా చేస్తే ఏ పనికాదు?’ అనేది కొంచెం అహంకారమే అలా ఉండేవాడు. అమ్మ పూర్తిగా మార్చేసింది అతడ్ని కూడా.

సాధన గురించి అమ్మనెపుడైనా అడిగారా?

‘నాకు ఒక సాధన చెప్పమ్మా!’ అని ఒకసారి అమ్మను పదే పదే కోరాను. “ఏమీ అక్కరలేదమ్మా! శ్వాసను గమనిస్తే చాలు” అన్నది అమ్మ. వెంటనే దినకర్ ప్రక్కనే ఉండి ‘observing the breath’ అన్నాడు.

అమ్మ సన్నిధిన మీరు జరిపిన శుభకార్యాలేమైనా వున్నవా?

మేము వచ్చిన సంవత్సరమే అమ్మ మా పెద్దమ్మాయి, సత్యవతికి పెళ్ళి చేసింది. లోగడ ఆ అమ్మాయికి మతిస్దిరం లేకుండా ఉండేది. మేము అమ్మ వద్దకు వచ్చాక తగ్గింది. మామూలుగా ఉంది కొంతకాలం. అప్పుడు తనే అడిగింది ‘మేనమామను చేసుకుంటాను’ అని. అది దాని కోరిక. అమ్మ, “సరే. నాకూ ఇష్టమే” అంది. కనుకనే చేశాం. లేకుంటే మేనరికం చేయటం ఇష్టం లేదు మాకు.

అమ్మ దుఃఖించిన సందర్భములేమైనా చూశారా?

1985 మే నెలలో అమ్మ మా ఇంటికి వచ్చి 15 రోజులు ఉన్నది. రాగానే నన్ను తన ఒడిలోకి తీసికొని చాలా దుఃఖించింది. అమ్మకైతే తాను మనల్ని విడిచి కొద్ది రోజుల్లో వెళ్ళిపోతానని తెలుసు- కానీ మనకి తెలియదు. కదా! మా అమ్మాయి మతిస్థితిమితం లేనివాళ్ళని జాలితో ప్రేమతో దుఃఖిస్తోందని అనుకున్నాను అపుడు మనస్సులో నెలరోజులు తిరుగకుండానే అమ్మ శరీరత్యాగం చేసిన తర్వాత అర్థమైంది అలా అమ్మ ఎందుకు దుఃఖించిందో. అమ్మని ఓదార్చబోయాను. ‘ఎందుకమ్మా దుఃఖిస్తున్నావు? పిల్లల కేంటి! వాళ్ళకి హాయిగా జరుగుతోంది. మహారాజుకి కూడా అలా జరగదు. అంత బాగా జరుగుతోంది. వాళ్ళని గురించి నీకింత దుఃఖం ఎందుకు?’ అన్నాను. “అదికాదు- అదికాదు” అని మాత్రమే అన్నది అమ్మ.

అమ్మ కోపగించిన సందర్భం చూచారా?

ఒక రోజు రాత్రి గం. 10లకి అమ్మ విపరీతంగా దగ్గుతోంది. ‘ఏమిటమ్మా, ఇంతగా దగ్గుతున్నావు?’ అన్నాను. “ఆలోచన ఎక్కువై” అన్నది. ‘మరి ఎట్లా?’ అన్నాను. “తీసేసుకోవాలి” అన్నది. నేను అట్లాగే కూర్చున్నాను. ఇంతలో అమ్మ లోపలికి వెళ్ళింది. అక్కడి వ్యక్తి ఎవరో నాకు తెలియదు. వారిని ఏదో అడిగి, కేకలు వేసి వచ్చింది. “అడిగేశాను. ఇప్పుడు హాయిగా ఉంది” అని పడుకుంది. అమ్మ కోపం నిలబడదు. కోపం రావాలి కదా! అది బాధ్యత.

మీ సాధనా మార్గం ఏమిటి? హైమక్కని చూచారా?

నాకు అమ్మను చూడటం, అమ్మ నామం చేయటం అంటే ఇష్టం. ఏ సాధన అక్కరలేదు; అందరికీ అమ్మ ముక్తిని ఇస్తుంది. నేను హైమక్కయ్యను చూడలేదు. అదే నా బాధ.

మీరు అమ్మని కోరిన కోర్కెలున్నాయా?

అమ్మను ఏదీ అడిగే అలవాటు లేదు. అది అమ్మ బాధ్యత కదా! అడగాలా? – అని భావించేదాన్ని. ఒకసారి తంగిరాల కేశవశర్మ తణుకులో మా ఇంటికి వచ్చాడు. ‘అమ్మకి ఏం చెప్పమంటావు?’ అని అడిగాడు. అప్పుడు మాత్రం ‘తేలికగా రోజులు దొర్లించమని చెప్పు’ అన్నాను.

అమ్మ భర్త (నాన్న) గారి గురించి మీ స్పందన తెలపండి?

నాన్నగారు (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు చాల ప్రేమగా ఉండేవారు. అతి సామాన్యంగా ఉండేవారు. ఆయన (సంస్థాపరంగా) ఏ విషయాలూ పట్టించుకునే వారు కాదు. ఆయన కరణీకం, పోస్టాఫీసు విధినిర్వహణ. అంతే-అంతవరకే.

అమ్మలో మీకు నచ్చనిదేమిటి?

నాలో అమ్మకి నచ్చని విషయాలు ఉండచ్చు. అది నా అహంకారం అనుకోవచ్చు; ఏమన్నా అనుకోవచ్చు. అమ్మలో నాకు నచ్చని దంటూ ఏమీ లేదు.

మీ పై అమ్మ ప్రభావం ఎంతవరకు ఉంది?

బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కన్నతల్లిగా అమ్మను విశ్వసిస్తున్నా. త్రిమూర్తులూ అమ్మ బిడ్డలే. ముందుగా వాళ్ళని సృష్టించి, వాళ్ళకి duty లు వేసింది. ఈ వయస్సులో అనేక బరువు బాధ్యతల్ని నిర్వహిస్తున్నాను అంటే – అందుకు అమ్మ ప్రభావం నా మీద పూర్తిగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. నా అవయవాలన్నిటిలోనూ అమ్మ శక్తే ప్రవహిస్తోందని నా నమ్మకం. లేకపోతే 86 ఏళ్ళ వయస్సులో నా చేతులుకాని, కాళ్ళు కాని ఇట్లా పనిచెయ్యవు. అమ్మ Energy Battery. అమ్మ శక్తే నాలో ప్రవహిస్తోంది. నాకు ఆయుష్షు కూడా అమ్మ పొడిగించినట్టే. ఎందుకంటే – ‘మా రెండవ అమ్మాయి నా కళ్ళ ముందు ‘పోవాలి’ – అని అమ్మను కోరాను. ఎందుకంటే దానికి మతిస్థిమితం లేదు, పెళ్ళికాలేదు. నా తర్వాత దాని బాధ్యత ఎవరికైనా విసుగుగా ఉంటుంది. ఇప్పుడు నాకు అనిపిస్తోంది అది పోయేవరకూ నాకు ఆయుష్షు ఇచ్చిందేమో! అని.

కాపాడితే దైవం అనుకోవడం అది మామూలు విషయం. నాకు ఏమీ చేయకుండానే, నా బాధలు నాకున్నా, నేను దైవం అంటున్నాను. నాకు కాకపోయినా అనేకులకు అనేకం అవుతున్నాయి. ఏది ఏమైనా దైవాన్ని నిందించను.

జన్మల గురించి అమ్మ ఏమి చెప్పిందని మీరు భావిస్తారు?

జన్మలున్నాయని అమ్మ నావద్ద ఒప్పుకున్నది. అమ్మ చేసిన జన్మల ప్రస్తావన గ్రంథాలలో వ్రాయకూడదు. ఎందుకంటే – అమ్మ చెప్పింది వ్యక్తి వ్యక్తికీ తేడా ఉంది. ‘అమ్మే అష్టభుజాలతో సింహవాహనంపై వచ్చి జన్మలు లేవు అన్నా నేను ఉన్నాయి అంటా’ అన్నాను అమ్మతో. అమ్మను దర్శించుకుని, అమ్మ కరుణను పొందినవారికి జన్మ ఉండదు అని నా ఉద్దేశం.

అమ్మ శరీరత్యాగానంతరం మీకు కలిగిన అనుభూతులు వివరించండి.

అమ్మ శరీరత్యాగం చేసిన తర్వాత చాల దుఃఖపడ్డాను. నిరంతరం ఏడుస్తూనే ఉండేదాన్ని. అంటే అమ్మ లేదు అని కాదు. కలలో కనిపించేది – దర్శనం ఇచ్చేది. అమ్మ ఉన్నది కానీ మనం అమ్మని శరీరంతో చూడలేకపోతున్నామని నేను, డాక్టర్ కోన సత్యం భార్య రాజ్యం చాలా ఏడ్చాం; నామం చేస్తూ కూడా ఆ ఏడుపు ఆపుకోలేకపోయేవాళ్ళం కంటికి అమ్మ కనిపించటం లేదని.

నాకు నామం చేయడం అంటే చాలా ఇష్టం. అఖండంగా అమ్మనామం జరిగేట్టుగా అందరినీ ప్రోత్సహించేదాన్ని. రాత్రి గం.8-00ల నుండి 10.00ల వరకు రోజూ రెండు గంటలు నామం చేసేదాన్ని. అలా చేసిన మీదట నామం మనస్సులో ఎప్పుడూ మెదలుతూ ఉంటుంది. అజపం మానేశాను. అజపం ఎలా జరిగేదో నామం అట్లా జరుగుతోంది. అట్లా నామం జరుగుతూండటం వల్లనే నాకు ఈ ఓపిక, ప్రశాంతత ఏర్పడింది. నా ప్రతి అవయవంలోనూ అమ్మ యొక్క శక్తే. కళ్ళు కూడా చాల జబ్బుచేశాయి. ఒకానొక సమయంలో గ్లుకోమా అనుకున్నారు. తర్వాత అది కాదన్నారు. ఇంతవరకు cataract అనీ గానీ, operation అవసరం గానీ ఏమీ నాకు రాలేదు. అంతా అమ్మ శక్తే. ఇంతవరకు ఈ ఓపిక ఉండటం కూడా అమ్మ అనుగ్రహమే.

అమ్మ తత్త్వాన్ని అధ్యయనం చేసిన మీరు ఇచ్చే సూచనలేవైనా వున్నవా?

“అవసరమే విలువైనది” అని చెప్పింది అమ్మ. దానిని అందరూ ఆచరించాలి. ఏ వ్యక్తికి ఏది అవసరమో తెలుసుకొని దానిని తీర్చగలిగితే మంచిది. ఇతరుల అవసరాలు కనిపెట్టి మన చేతనైనంత వరకు చేయటం; వాళ్ళు అడిగిన మీదట కాదు. వాళ్ళ అవసరాలు కనిపెట్టి తీర్చాలి. అడగలేని వాళ్ళుంటారు. నేను కొద్దిగా వైద్యం చేస్తుంటాను. దానిని అమ్మ ప్రోత్సహించింది. నేను మందులు ఇవ్వటం మానేస్తే “చెయ్యమ్మా! ఫర్వాలేదు” అని ధైర్యం చెప్పేది. కాసు రాధాకృష్ణరెడ్డికి ఒకసారి చర్మవ్యాధి వచ్చింది. తనకి మందులు ఇచ్చి, పద్యం పెట్టి నేనే చూశాను చేశాను. తర్వాత అంతా నయం అయి హాయిగా ఉన్నాడు. కావున ఇతరుల అవసరాలు కనిపెట్టి మనం చేయాలి – అని నా ఉద్దేశం.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!