నాకు విశ్వాసం కలగటానికి ఒక అనుభవం ఉంది. 1963లో ఒకామె అమ్మకు పూజ చేస్తోంది. అమ్మ హాలులో దర్శనం ఇస్తోంది. లోపల ఖాళీ లేదు.. హాలు నిండా జనం. నేను ఎట్లాగో లోపలకు వెళ్ళి అమ్మకి ఎదురుగా గోడ ప్రక్కన చోటు చేసుకు కూర్చున్నా. అమ్మను తదేకంగా చూస్తున్నా. దేవతలు అనిమేషులు; రెప్పపాటులేకుండా పరమాత్మని చూస్తూంటారు. అలానే అమ్మ నుదుట ఉన్న కుంకుమ బొట్టుపై నా దృష్టి కేంద్రీకరించాను. క్రమంగా అమ్మరూపం వికసించటం ప్రారంభించింది. ఇంతితై అన్నట్టుగా చివరకు విశ్వంలో కలిసిపోయింది. నాకంటికి కనిపించనంత దూరం చూస్తున్నాను తర్వాత ఏం జరిగిందో తెలియదు. అలా వికసించి విశ్వవ్యాప్తమైన అమ్మరూపం సంకోచించి మరల పరిమితరూపంలోకి వచ్చింది. ఈ క్రమంలో నేను శూన్యంలోకి పోతున్నట్లు తెలిసింది..
ఆ తర్వాత తెలిసింది. నాడు అమ్మకు పూజ చేసుకున్న ఆమె దేవీ ఉపాసకురాలట. కాగా నాకు కలిగిన ఈ అనుభవం ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస నాలో బాగా పెరిగింది. నేను వెళ్ళి అమ్మ ఒడిలో తలపెట్టి అటు ఇటూ తిప్పుతున్నాను. అమ్మ నా తలమీద చెయ్యి పెట్టి “ఏమిటి, నాన్నా! మహదానందంగా ఉన్నావు?” అని అడిగింది. ‘అమ్మా! నాకు కలిగిన ఈ అనుభవానికి ఆధ్యాత్మిక నేపధ్యం ఉన్నదా?’ అన్నాను. “ఏముంది, నాన్నా పరిమితంగా ఉన్న అమ్మను నువ్వు అపరిమితంగా చూశావు. విశ్వరూప సందర్శనం అంటే అదే” అన్నది. “శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి ఆ భాగ్యాన్ని ప్రసాదించాడు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. మరి నువ్వు నాకు అలా అనుగ్రహించటానికి కారణం ఏమిటి?’ అన్నాను. “నేను నీకు ఇద్దామనుకున్నాను, ఇచ్చాను. అంతే. అకారణమే కారణం” అన్నది.
మరొక ఉదాహరణ. నేను సంస్థాగతమైన పనులమీద ఎక్కువగా హైదరాబాద్ వెడుతూండేవాడిని. ఎవరైనా జిల్లెళ్ళమూడి నుంచి వచ్చారంటే అమ్మ వచ్చినట్లుగా ఆదరించేవాళ్ళు ఆరోజుల్లో అంతగా ఆనందపడేవాళ్ళు. అక్కడినుంచి తిరిగి వస్తున్నప్పుడు నన్ను సాగనంపటానికి 15/20 మంది సోదరులు బస్టాండ్కు వచ్చారు. నేను బస్సు ఎక్కాను, బయలుదేరింది. ‘అన్నయ్యా! అమ్మకి మా నమస్కారాలు చెప్పు, మా నమస్కారాలు చెప్పు – అన్నారు అంతా. మర్నాడు నేను జిల్లెళ్ళమూడి వచ్చాను. ‘అమ్మా! నీకు వెంకటరత్నంగారు, వెంకటకృష్ణగారు, T.S. శాస్త్రిగారు, రాధ….. నమస్కారాలు చెప్పమన్నారు’ అన్నాను. పేరు పేరున అందరి నమస్కారాలు అమ్మకి విన్నవించాను. “నాన్నా! అవన్నీ ఎప్పుడో చేరినాయ్. నువ్వే ఆలశ్యంగా వచ్చావురా!” అన్నది అమ్మ. నాకు చాల ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.
మరొకసారి హైదరాబాద్ నుంచి వస్తున్నాను. రాత్రి 12 గంటలైంది. విజయవాడ వెళ్ళే టాక్సీలో ముందు సీట్లో కూర్చున్నాను. హైదరాబాద్ పొలిమేర దాటిన తర్వాత మా టాక్సీకి యాక్సిడెంట్ అయింది. వడ్లబస్తాలు వేసుకుని మా ముందు 20/30 ఎడ్లబళ్ళు పోతున్నాయి. హారన్ వేశాడు డ్రైవర్. కానీ ఆ బండివాడు తప్పుకోలేదు. మా టాక్సీ ఆ బండిని ఢీకొట్టింది. హాహా కారాలు తాళ్ళు త్రెంపుకుని ఎడ్లుపరుగెత్తినయ్. బస్తాలు తెగి వడ్లు రోడ్డుమీద గుట్టలుగా పడ్డాయి. అది చూసి బండ్లవాళ్ళు అంతా ఆవేశంతో ‘వసికర్రలు’ (బండిపై వస్తువులు కదలకుండా అమర్చే కర్రలు) తీసికొని మమ్మల్ని కొట్టటానికి వచ్చారు. మా టాక్సీ నుగ్గునుగ్గు అయింది. అందులో తక్కినవాళ్ళు ఏమైనారో తెలీదు. యాక్సిడెంట్ అయిన సమయంలోనే కాళ్ళు నెప్పి అనిపించి ‘అమ్మా!’ అంటూ పైకెత్తాను. అమ్మ అలా రక్షించింది. లేకుంటే నా రెండు కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యేవి. కిటికీ అద్దాలు పగులగొట్టి నన్ను బయటికి లాగారు. బండి వాళ్ళంతా చుట్టుముట్టి నన్నుకొట్టబోయారు. ఈ లోగా రోడ్డుమీద అటూ ఇటూ కార్లు, లారీలు స్తంభించిపోయాయి. వాటి డ్రైవర్లంతా వచ్చారు. ‘టాక్సీ వాడి తప్పేమీలేదు. హారన్ కొడుతూనే ఉన్నాడు. బండివాడే తప్పుకోలేదు. వాడిదే తప్పు’ అన్నారంతా. దాంతో బండివాళ్ళు డ్రైవర్లు తన్నుకోవటం మొదలుపెట్టారు.
ఈ హడావిడిలో ఎవరో ఒక డ్రైవరు వచ్చి నన్ను జబ్బపట్టుకొని అమాంతం బరబర ఈడ్చుకుంటూ ముందున్న ఒక లారీలో ఎక్కించి అక్కడ నుంచి నన్ను తీసికెళ్ళమన్నాడు. ఆ డ్రైవర్ నన్ను సూర్యాపేట రోడ్డుప్రక్కన పోస్టాఫీసు దగ్గర బెంచీ మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. నా మోకాలుకి తలకీ దెబ్బలు తగిలాయి. ఒళ్ళంతా కారి ఎండిన నెత్తురు మరకల్ని తుడుచుకున్నాను. గాయాల్ని అలాగే అదిమిపట్టి మరొక లారీ ఎక్కి విజయవాడ వచ్చి క్రమేణా జిల్లెళ్ళమూడికి చేరుకున్నాను. ఏడవమైలు వద్ద దిగి అలాగే నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళు కడుగుకొని అమ్మ గది సమీపానికి చేరుకున్నాను. ఈ లోగా లోపలి గదిలో నుంచి రెండు చేతులూ చాచి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి అమ్మ “నాన్నా! నువ్వు బ్రతికి వచ్చావా?” అని నన్ను అమాంతం వాటేసుకుని తనగది లోపలికి తీసికెళ్ళింది. ప్రక్కనున్న వాళ్ళంతా అమ్మను ‘బ్రతికివచ్చావా అని అడిగావేమిటి?” అని అడిగారు. “వాడినే అడగండి” అన్నది అమ్మ. అపుడు నేను యాక్సిడెంటు వివరాలు చెప్పాను. ఎప్పుడైతే అమ్మ నాకు ఎదురు వచ్చి “నాన్నా! బ్రతికివచ్చావా?” అన్నదో వెంటనే నాకు అర్థమైంది ఎక్కడో హైదరాబాద్ దగ్గరలో జరిగే ప్రమాద సంఘటనని అమ్మ ఇక్కడ నుంచి చూసి, నాకు ప్రాణదానం చేసింది- అని. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. ఈ అమ్మ నిరంతరం నన్ను వెన్నంటే వుంది.
0 Comments