Brahmandam Vasundhara

Interviewed by
Ravuri Prasad
12/10/2011
Jillellamudi

 

శ్రీమతి బ్రహ్మాండం వసుంధర (వసుంధరక్కయ్య)

  అక్కయ్య 1-1-1944 న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా, చీరాల పట్టణం. తల్లిదండ్రులు శ్రీ కోన వెంకట సుబ్బారావు, శ్రీమతి వెంకాయమ్మ. విద్య – SSLC. తోడబుట్టిన వారు ఇద్దరు సోదరులు, ఒక సోదరి.

సేవాతత్పరత : తల్లి, తండ్రి, గురువు, దైవం, పతి, గతి సర్వం అమ్మ అని విశ్వసించి ‘అమ్మ’నే వివాహమాడారు. తన జీవిత సర్వస్వాన్ని అమ్మకి అర్పించి అమ్మ సేవలో తరిస్తున్న పుణ్యమూర్తి, ‘శ్రీవారిచరణసన్నిధి’ – 2 భాగాలు, ‘మహోపదేశం’ వంటి సాహిత్య ప్రసూనాలతో అమ్మ పదార్చన చేసిన భాగ్యశాలి.

శ్రీ రావూరి ప్రసాద్ 12-10-2011వ తేదీన జిల్లెళ్ళమూడిలో శ్రీమతి బ్రహ్మాండం వసుంధర గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

అమ్మను గూర్చి మొదట మీకు ఎలా తెలిసింది? మీ కుటుంబ నేపధ్యం ఏమిటి? తొలిసారి అమ్మ దర్శనం నాటి జ్ఞాపకాలు వివరించండి.

మా నాన్నగారు, జిల్లెళ్ళమూడి నాన్నగారు (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు) స్నేహితులు. కలసి నాటకాలు వేసేవాళ్ళు. చీరాలలో రంగన్న బాబుగారనే రామభక్తులుండేవారు. వారు ‘రాముడే అమ్మ -అమ్మే రాముడు’ అని చెప్పారు. అది విన్నాక అమ్మని ఒకసారి చూడాలనిపించింది. చీరాల డాక్టర్ పొట్లూరి సుబ్బారావుగారు, నోరి వెంకటేశ్వర్లు గారు, మా నాన్నగారు అంతా కలిసి ఒక వారం జిల్లెళ్ళమూడి వెడదామనుకున్నారు. ఆ సందర్భంలో అమ్మ ‘రావద్దు’ అని కబురు చేసింది. మానేశారు. ఆ రోజునే మా చెల్లెలు, 8 నెలల పాపకి సీరియస్ చేసి ఆ రాత్రికే చనిపోయింది. అందుకే అమ్మ రావద్దన్నది అని మేము అనుకున్నాం.

తర్వాత వారం వాళ్ళంతా వచ్చి అమ్మ దర్శనం చేసుకున్నారు. అలా రెండు మూడు శనివారాలు వచ్చారు. ఇప్పుడు హోమశాల ఉన్నచోట ఒక పాక ఉండేది. అందులో అమ్మ కుటుంబం ఉండేది. ఒకసారి మా నాన్నగార్కి తీవ్రంగా జబ్బు చేసింది. ప్రాణాపాయస్థితి ఏర్పడింది. అపుడు ‘అమ్మ’ ఎవరితోనో ప్రసాదం పంపింది. మా అమ్మకి కలలో కనిపించి “వాడేది అడిగితే అది పెట్టు. ఏం ఫరవాలేదు” అని హామీ నిచ్చింది. ఆ తర్వాత త్వరగా మా నాన్నగారు కోలుకున్నారు.

ఆ తర్వాత కొన్నాళ్ళకి మా నాన్నగారు అమ్మ దగ్గరకి వచ్చారు. “రాబోయే మాఘపౌర్ణమికి మంత్రోపదేశం జరుగుతుంది. అందరూ రండి” అన్నది అమ్మ. ఒకరోజు ముందుగానే మా నాన్నగారు మమ్మల్ని తీసుకుని అమ్మ వద్దకు వచ్చారు.

మేము గుర్రపుబండిలో వచ్చాం. అమ్మ వాకిలి చిమ్ముతూ బండిచప్పుడు విని చీపురు అక్కడ పడేసి వచ్చి అమాంతం మా అమ్మను వాటేసుకుంది; అతః పూర్వం మా చెల్లెలు పోవటం, మా నాన్నగార్కి సీరియస్ అయిన నేపధ్యంలో. నన్నూ దగ్గరకు తీసుకోలేదే అనే తపన నాలో అప్పుడే కలిగింది. అమ్మే స్వయంగా కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇచ్చింది; చాప వేసి కూర్చోబెట్టింది. హైమ ఆ ప్రక్కగా వెళ్తూంటే “అమ్మా! సుబ్బారావు అన్నయ్య, పిల్లలు వచ్చారు రా అమ్మా!” అని కేకవేసింది. హైమను కూర్చోబెట్టి పరామర్శలు అన్నీ అయ్యాయి. అప్పట్లో ఆ ప్రక్కన నాన్నగారి పొగాకు బేరన్ ఉండేది. అమ్మ ఇంటిగూట్లో జాడీ, దానిపై పుట్ట ఉండేది. ఓ ప్రక్క కూరలు ఆరబోశారు. ఆ రోజు రాత్రి మా అందరికీ భోజనాలు అమ్మే వండి వడ్డించింది. అప్పట్లో అమ్మ ఇంట్లో వంట సహాయానికి ప్రభావతి అక్కయ్య ఉంది. ఆ తర్వాత అమ్మ అన్నం కలిపి “రాజూ, రారా” అంటూ తిరుగుతూ రాజుబావకి పెట్టింది. నాకూ పెట్టలేదే అనే భావం కలిగింది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత మెల్లగా అమ్మ వద్దకు వెళ్ళాను. ఆ శబ్దం విని “ఎవరూ! ఆ! సుబ్బారావు కూతురా!” అంది అమ్మ. మెల్లగా వెళ్ళి కూర్చున్నాను. “ఎందుకమ్మా, ఇప్పుడు వచ్చావు? వెళ్ళి పడుకో” అన్నది. ‘నీ దగ్గర కూర్చుందామని వచ్చాను’ అన్నాను. “వెళ్ళి పడుకో” అన్నది. కానీ కదలకుండా అలాగే కూర్చున్నాను. రాజుబావ, రవి అమ్మకి చెరియొక ప్రక్క ఉన్నారు. రాజు అమ్మకి విసురుతున్నాడు. నేను విసురుతానని కొంతసేపు విసిరాను. కాళ్ళు ఒత్తుతానంటే సరే నన్నది. అమ్మ పాదాలు మెరిసిపోతున్నాయి. ఒత్తుతూంటే మాణిక్యం మీద మసిబొగ్గులా అమ్మ పాదాలపై నా చేతులు ఉన్నాయి. “పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమ్మా” అంది అమ్మ. రెండు మూడుసార్లు అమ్మ అలా అన్న తర్వాత నేను లేచి వెళ్ళి పడుకున్నాను.

మేము వచ్చిన మూడవ రోజున అమ్మ ‘ఓంకార నది’ ఒడ్డున మంత్రోపదేశం చేసింది. నాడు సుమారు 600 మంది దాకా ఉన్నారు. అప్పుడు నాకు 14 సంవత్సరాలు. ‘నాకు కూడా చేస్తే బాగుండును’ అనుకున్నాను. అమ్మ నన్ను పిలిచి ఉపదేశం చేసింది. గురుధ్యానస్తోత్రం, మంత్రం ప్రతి వ్యక్తికీ చెప్పింది. అందుకు కనీసం 10 గంటల సమయం పడుతుంది. కానీ అమ్మ ఆ కార్యక్రమాన్ని 3 గంటల లోనే పూర్తి చేసింది. అమ్మ ఆనాడు కాలాన్ని నియంత్రించిందా అనిపించింది. తర్వాత ‘నాన్నగారు’ పంపిన బండిలో కాలవ నుండి తిరిగి వచ్చింది. ఆ సమయానికి అమ్మ ఇంటికి రెడ్డిపాలెం నుంచి ‘లక్ష్మీకాంతానందయోగి’ గారు వచ్చి ఉన్నారు.

మీరు అమ్మ సేవకై జిల్లెళ్ళమూడి స్థిరనివాసం చేసుకున్న వైనాన్ని తెల్పండి.

మా అమ్మకి తరచు తిరుపతికి పోతున్నట్లు కలరావటం, మా నాన్నగారు వచ్చి ‘ఇవాళ జిల్లెళ్ళమూడి వెడదాం’ అనటం జరిగేది. మా నాన్నగార్కి జబ్బు చేసినపుడు నేను S.S.L.C. చదువు ఆపేశాను. “అది పూర్తి చేసిరా” అని అమ్మ
చెప్పటంతో, అది కాగానే 1962 ఆగష్టు 9 నుంచి స్థిరంగా ఇక్కడే ఉంటున్నాను.

చీరాల వెంకట్రావుగారు, పోట్లూరి సుబ్బారావుగారు తదితరులంతా అమ్మని చీరాల తీసుకు వచ్చారు. కారంచేడు వాస్తవ్యురాలు సీతమ్మగారు అమ్మకు జీపు ఇచ్చారు. ఆ జీపుని అమ్మ స్వయంగా drive చేస్తూ సముద్రపు ఒడ్డున తిరుగుతూండేది. రెండు నెలల తర్వాత అమ్మ చీరాలలో ఇంటింటికి వెళ్ళి అందరికీ “నాన్నా! వెళ్ళొస్తాను” అని చెప్పింది. అందుకు ఎవరూ స్పందించలేదు. మా ఇంటికీ వచ్చింది. “నాన్నా! వెళ్ళొస్తాను. దీనిని నాతోపాటు తీసుకుపోతున్నాను. ఇక నుంచి దీని బాధ్యత నాది. నీకు అక్కరలేదు” అని నన్ను అమ్మ తనతో జిల్లెళ్ళమూడి తీసుకువచ్చింది. ఇక ఆ తర్వాత తిరిగి నేను మా ఇంటికి వెళ్ళలేదు. అప్పటికీ ఇప్పటికీ. నాకు ఏ రోగం వచ్చినా, బాధ వచ్చినా పూర్తి బాధ్యత అమ్మే తీసుకుంది. అప్పుడప్పుడు మా నాన్నగారు నాకు చీరెలు తెచ్చేవారు. “దానికి నువ్వేం తేవద్దు – దాని బాధ్యత నాది” అనేది అమ్మ.

అమ్మని మీరు వివాహం చేసుకున్న నేపధ్యం ఏమిటి? అనంతరం అమ్మ బంధుగణంతో మీరెలా మెసిలారు?

1963లో చీరాల వాస్తవ్యులు ఆచార్యులు గారు అమ్మ ఫోటో లాకెట్లు తెచ్చారు. అందరికీ లాకెట్లో తాడువేసి ఇచ్చింది అమ్మ. నాకు మటుకు మెడలో రెండు ముడులు వేసింది – వేయించుకో అంటూ. తలవంచుకుని కూర్చున్నా. “ఏమిటీ? నీ మనస్సులో ఇంకెవరన్నానా? నేనేనా?” అని అడిగింది. ‘అవునమ్మా! నువ్వు గాక ఇంకెవరు?’ అన్నాను. తర్వాత మూడవ ముడి కూడా వేసేసింది.

ఒకసారి అమ్మ ఇల్లు చిమ్ముతున్నాను. ఒక పూస దొరికింది. ‘ఇది కట్టమ్మా!’ అని అడిగాను. “అదెందుకు? బీరువాలోంచి మంగళసూత్రం తెచ్చుకో” అన్నది. సరేనని మంగళసూత్రం తీసికెళ్ళా. క్షణం ఆలోచించి “మే 5కి కడతాలే” అన్నది. రామకృష్ణ అన్నయ్య ‘మే 5కి అంటే తనూ నీ అంత కావాలనా!’ అని పరిహాసం చేశాడు. “ఆ! నా అంత! నా అంత పొట్టి ఎవ్వరూ కాలేరురా” అని చమత్కరించింది. ఆ తర్వాత డాక్టర్ పొట్లూరి సుబ్బారావు గారి ద్వారా మా నాన్నగార్కి “ఇక దానికి సంబంధాలు చూడవద్దు” అని కబురు చేసింది.

భద్రాద్రి రామశాస్త్రిగారు అమ్మ కోరిక మేరకు ఆవరణలోని పిల్లలకు సంస్కృతం నేర్పేవారు. అమ్మ కుమార్తె హైమ, మంగ, రమ, నేను, రమణ, సావిత్రి … మాకు సంస్కృతం నేర్పి పరీక్షకు కూర్చోబెట్టారు. మే 5న మా చేత సంస్కృతంలో భగవద్గీత నాటకం వేయించాలని తర్ఫీదు ఇచ్చారు. అమ్మ కూడా సరే అంది. నేను ధృతరాష్ట్రుడు, హైమ భూదేవి rehearsals అయిపోయినవి. అమ్మకు ముందుగా చూపించాలని అమ్మను కూర్చోబెట్టి నాటకాన్ని ప్రదర్శించాం. చూసి అమ్మ మెచ్చుకుంది. అయితే మే 5న ఆ నాటక ప్రదర్శన జరుగలేదు. ఆ సమయంలోనే అమ్మతో నా వివాహం జరిగింది. నాకు కళ్యాణం బొట్టు పెట్టింది; పెళ్ళికూతురిని చేసి – చీరె ఇచ్చింది. వేదికపై అమ్మ నా చేత ‘కిరీటం’ పెట్టించుకున్నది. ‘మంగళసూత్రం’ కట్టింది. తలంబ్రాలు నేను అమ్మ పాదాలపై పోశాను అమ్మ నా తలమీద పోసింది. ఆ రాత్రి వేదికపైన అందరి సమక్షంలో పెట్రోమాక్స్ లైట్ల కాంతిలో వైభవంగా నా కళ్యాణం జరిగింది.

తర్వాత హైందవ సంప్రదాయబద్ధంగా వారం రోజులు వేడుకలు – మేజు వాణి, బువ్వంబంతి అన్నీ జరిగాయి. గృహప్రవేశం ప్రస్తుత అలంకార హైమ మందిరంలో జరిగింది. ఆనాడు శ్రీ ఉమామహేశ్వర పండితులు అమ్మ దర్శనానికి వచ్చారు.

నా పెళ్ళికి ముందు మా నాన్నగారు నేను అమ్మకే అంకితం అని అమ్మ ఇష్టప్రకారం జరుపుకుంటుందని అభిప్రాయపడేవారు. మా అమ్మ మాత్రం ‘ఆడపిల్లకి వివాహం చెయ్యకుండా ఎక్కడో ఉంచామని నలుగురూ అనుకుంటారేమో!’ అని బాధపడేది. మా అమ్మకి ఒకసారి కలలో ‘అమ్మ’ విష్ణుమూర్తి వలె, నేను విష్ణుమూర్తి వద్ద పాదసేవ చేస్తున్నట్లు సాక్షాత్కారం అయింది. ఆ తర్వాత ఆమెకు మనశ్శాంతి కలిగింది. తదనంతర కాలంలో ‘అమ్మ’ చేతిలో తృప్తిగా కన్ను మూసింది. 1968లో మా అమ్మ, 1975 లో మా నాన్నగారు అమ్మ ప్రత్యక్ష సన్నిధిలో పరమపదించారు.

ఒకసారి కనకమ్మ బామ్మ నాతో ‘మీ అమ్మ ఎంతో ఈ అమ్మా అంతే. మీ నాన్న ఎంతో ఈ నాన్నా అంతే. ‘అమ్మ’ను కనిపెట్టుకుని నువ్వు ఇక్కడే ఉండు హాయిగా’ అంది. నా పదహారు రోజుల పండుగ నాడు బామ్మగారి సంవత్సరీకాలు వచ్చాయి. నాకు బామ్మ ఆశీస్సులు కూడా ఉన్నాయి. బామ్మ సంవత్సరీకాలకు బంధువులంతా వచ్చారు. వాళ్ళతో అమ్మ “సుబ్బారావు కూతురు. చూడరా ఎట్లా ఉందో. ఇక్కడే ఉండిపోతుందిట” అన్నది. ‘నాన్నగారు’ కూడా నేనంటే ప్రేమగా ఉండేవారు. ఆయన రాగానే కుర్చీవేసే దాన్ని కూర్చోవటానికి. ‘నువ్వు నాకు మర్యాద చేయటమేమిటి?’ అనేవారు. కావాల్సినవి అడిగి పెట్టించుకునేవారు ‘నాన్నగారు’.

ఆ రోజుల్లో అమ్మ సన్నిధిలో అందరింటి కార్యకలాపాలు ఎలా ఉండేవి?

అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య అమ్మను దర్శించిన తర్వాత అమ్మ
పూజలకి పూలు తేవడం ప్రారంభమైనాయి. ఆయనే 1960లో ఇప్పుడున్న అలంకార హైమ ఇల్లు కట్టించారు. అంతకు ముందు అమ్మకు ప్రత్యేకంగా గది, మంచం అంటూ ఏమీ లేవు. ఆ అన్నయ్య వచ్చాక ఏర్పాటు చేశారు. అంతవరకు అమ్మ క్రింద పడుకునేది. అమ్మ చుట్టూ మేమంతా పడుకునేవాళ్ళం. ఆ రోజుల్లో అమ్మ మట్టిని ప్రసాదంగా ఇచ్చేది. అవి చాలాకాలం సువాసనలు వెదజల్లేవి. అమ్మ నిద్రపోతున్నట్లు మనకి అనిపించేది. కానీ కాలి మీద తాళం వేస్తూ పాటలు పాడుతుండేది. ఉన్నట్లుండి ఇంగ్లీషు, హిందీ ఇంకా ఏవేవో భాషల్లో మాట్లాడేది. అమ్మ మాటలు ఎవరికి అవసరమో వాళ్ళకే వినపడుతుంది. గాని రెండవ వ్యక్తికి వినపడదు. అమ్మ ఏది మాట్లాడినా అది నలుగురికీ వర్తించేటట్లు గానే ఉంటుంది.

పూజా సమయాల్లో శేషగిరిరావు అన్నయ్య పూలను చాలా అందంగా పేర్చేవారు. నాడు అనసూయేశ్వరాలయ నిర్మాణం జరుగుతోంది. అక్కడ ప్రతి అణువు అమ్మ చరణ స్పర్శతో పునీతమైనదే. అక్కడే అమ్మ పడుకునేది, స్నానం చేసేది. ఒకరోజు అక్కడ అమ్మ తెల్లచీరె కట్టుకుని స్నానం చేస్తానని కూర్చున్నది. చెరువు నుంచి నీళ్ళు తెచ్చి అందించేవాళ్ళు కొందరు, పోసేవాళ్ళు కొందరు. సజీవమైన పాలరాతి బొమ్మవలె ఉన్నది అమ్మ. అమ్మ అలాగే ఉండిపోతుందేమో అనిపించింది. అది చూసిన నాన్నగారి మందలింపుతో ఆ కార్యక్రమం ఆగిపోయింది.

అమ్మకు మొదట్లో గరికెతో దొండాకులతో పూజలు చేసేవారు. డాక్టర్ ఎక్కిరాల వేదవ్యాస్ రామకృష్ణ అన్నయ్యకు ప్రాణహాని ఉందని సూచించారు. అపుడు రామకృష్ణ అన్నయ్య అమ్మకు అభిషేకాలు చేసుకున్నాడు. తొలిరోజుల్లో రమణ, సావిత్రి, చంద్రమ్మక్కయ్య మేమంతా బెండాకులతో దండకట్టి అమ్మమెడలోవేశాం. ‘నూగు, వద్దు’ అన్నది కామేశ్వరమ్మమ్మ. “మీ కంటే కాదు – ఆదండ ఉండనీ. వాళ్ళని అడ్డుపెట్టొద్దు” అన్నది అమ్మ.

ఒకసారి అమ్మ పాకలో ఉండే రోజుల్లో ‘కాశీ’ నుంచి ఒక పండితుడు వచ్చాడు. అమ్మతో ఆసక్తికరమైన సంభాషణ చేశాడు. అది వృధా పోకూడదని కాగితాలు తీసికొని వ్రాశా. “అలా వ్రాయవద్దు” అన్నది అమ్మ. అయినా తడికె ఇవతల కూర్చొని వ్రాశాను. ఆ తర్వాత దానిని అమ్మ చూసింది. “వద్దన్నా బాగానే వ్రాశావు” అన్నది. ఆ తర్వాత వాటిని అలమారులో పెడితే చెదలు పట్టి పాడైపోయినాయి.

అమ్మ ప్రతి పలుకు ఒక ఉపదేశమే అనిపించిన సందర్భం ఏదైనా ఉన్నదా?

ఒకసారి అమ్మ దర్శనార్థం ఒక సోదరుడు వచ్చాడు. ‘అమ్మా! వారు దర్శనానికి వచ్చారు’ అన్నాను. “అన్నం తిన్నారేమో కనుక్కున్నావా?” అంది. ‘3 గంటలు దాటింది కదా! తినకుండా ఉంటారా! అని నేను అడగలేదు’ అన్నాను. తీరా వారి దగ్గరకి వెళ్ళి అడిగితే ‘తినలేదమ్మా’ అన్నారు. అపుడు అన్నపూర్ణాలయానికి తీసికెళ్ళి అన్నం పెట్టించాను. ఆ తర్వాత అమ్మ అన్నమాట తెలిసి ఆయన సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయి, వచ్చి అమ్మ పాదాల మీద పడ్డాడు. అదొక పాఠం నాకు. ఏ సమయంలో ఎవరు వచ్చినా వాళ్ళని భోజనం చేశారా అని పలకరించాలి. అది ఒక ఉపదేశం.

కర్తృత్వాన్ని ఎప్పుడూ అమ్మ తన మీద వేసుకోదు. ఎన్నో కష్టాలు, బాధలతో ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అవి తగ్గితే “తరుణం వచ్చింది, తగ్గింది; నాదేం లేదు” అంటుంది ‘అమ్మ’.

‘ప్రేమ-సమానత్వం’ అంటే – అందరికీ ఒకటే పెట్టటం కాదు, ఏది ఎవరికి ఎంతవరకు అవసరమో దానిని పెట్టటం. ఒక చెంచా అన్నమైతే పసివానికి సరిపోతుంది; పెద్దవాళ్ళైతే ఎక్కువ తింటారు. పరిమాణం, వస్తువు వేర్వేరు. ఎవరైనా వచ్చి ‘అమ్మ దగ్గర హాయిగా ఉంది; ఉంటాను’ అన్నపుడు “నిజమే. గులాబీ పువ్వులు కోసుకోవాలంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇక్కడ అనేక రకాలుంటాయి – కాళ్ళ జెఱులు, తేళ్ళు, పాములు, మండ్రగబ్బలు – అనేకం; వాటన్నింటితో మీరు ఇమడగలిగితే ఇక్కడ ఉండండి. నాకేమీ అభ్యంతరం లేదు. ఇక్కడ మెలగగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా మెలగగలరు” అని చెప్పింది. అమ్మ దగ్గరకు వస్తే ‘హమ్మయ్య, హాయిగా ఉంది’ అనిపించవచ్చు. అసలు ఆవరణలో అడుగుపెట్టగానే అమ్మ దగ్గరకొచ్చామనే అనుభూతిని పొందాలి.

మహిమాన్వితమైన అమ్మ ఆశీస్సులు మీపై ప్రసరించిన సందర్భాలు వివరించండి.

జిల్లెళ్ళమూడిలో ఒకసారి నాకు కలరా వచ్చింది. డాక్టర్ మద్దిబోయిన సాంబయ్య ఏదో ఆయుర్వేదం మందులు వేశాడు. అమ్మ వచ్చి నా ప్రక్కలో కూర్చునేది వెన్నురాస్తూ. రామకృష్ణ అన్నయ్య విసురుతూ, భద్రాద్రి తాతగారు కాళ్ళురాస్తూ ఉండేవాళ్ళు. సుబ్బారావు అన్నయ్య ‘అమ్మ నిన్ను పోనివ్వదు. మీ కల్యాణం అయి 3 నెలలే కదా!’ అని చమత్కరించాడు. హాస్పిటల్కు వెళ్ళకుండానే కేవలం అమ్మ అనుగ్రహం వల్లనే ఆ రోగం తగ్గింది.

ఒకసారి నాకు కాలు నెప్పి వచ్చింది. చీరాల డాక్టర్ శ్రీధర్రావు గారి వద్దకు పంపింది అమ్మ. 3 నెలలు ఉండి తిరిగి వచ్చాను. అయినా హాయిగా లేదు. నెల రోజులు నెల్లూరు డాక్టర్ సుబ్బారావు గారింట్లో ఉన్నాను; పెద్ద డాక్టర్కి చూపించమన్నారాయన. గుంటూరులో Bone Specialist డా. యతిరాజులు గారి దగ్గరకి పంపింది అమ్మ. ఆయన 15 రోజులు విశ్రాంతిగా ఉండమన్నారు. అమ్మ పినతల్లి హైమవతమ్మగారబ్బాయి అప్పారావుగారింట్లో అమ్మ ఉండమన్నది. మళ్ళీ డాక్టర్ వద్దకుపోతే, ఈసారి ఆరునెలలు bed rest తీసుకోమన్నారు. వల్లూరు పాండురంగారావు గారింట్లో 4 నెలలు bed rest; కాళ్ళు పట్టుకుపోయాయి. నన్ను చూడటానికి మరకాని సత్యనారాయణగారు, లలితాంబక్కయ్య వచ్చారు. పరిస్థితి బాగాలేదని తెలిసి న్యూరోసర్జన్ దగ్గరకి తీసుకెళ్ళారు. ‘వెంటనే operation చేయాలి’ అన్నారు. ‘operation చేసినా కాళ్ళు వస్తాయనే నమ్మకంలేదు; కానీ చేయించాలి’ – అన్నారు. ‘అమ్మ లేకుండా operation చేయించుకోను – వద్దు’ అన్నాను. ఆనాడు పర్యటనలో భాగంగా అమ్మ ‘మదనపల్లె’లో ఉంది. Tension feel అయి జిల్లెళ్ళమూడి కబురు చేశారు. గోపాలన్నయ్య, సుబ్బారావు అన్నయ్య వచ్చారు; నెల్లూరు డాక్టర్ సుబ్బారావుగారికి కబురు చేశారు.

ఆ రోజుల్లో ఆదరణ, అప్యాయతలు అట్లా ఉండేవి. ఒక వ్యక్తి జిల్లెళ్ళమూడి నుంచి వస్తే వారి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకునే రోజులవి. తెల్లవారేటప్పటికి నెల్లూరు నుంచి డాక్టర్ సుబ్బారావు గారు వచ్చారు. ‘అమ్మ దగ్గరకి పోదాం’ అన్నారు. సరేనన్నాను. నెల్లూరు వెళ్ళాం. బి.పి. చూశారు; చాల ఎక్కువగా ఉంది. కార్లో పడుకోబెట్టుకునే రాత్రికి మదనపల్లెలో అమ్మ బసచేసిన డాక్టర్ జానకీదేవి గారింటికి వెళ్ళాం. అమ్మగది ప్రక్కనున్న గదిలో నన్ను పడుకోబెట్టారు. ఆ సమయాన ఋషివాలీ, హార్సిలీహిల్స్ వెళ్ళటానికి అమ్మ సిద్ధమౌతోంది. అమ్మ నా వద్దకు వచ్చి “ఏంటి, లే!” అన్నది. ‘నేను లేవలేనమ్మా’ అన్నాను. అమ్మ నా చెయ్యి పట్టుకుని “లే” అంది; లేచాను. శరీరమంతా గిజగిజలాడుతోంది. తనతో పాటు తీసుకువెళ్ళాలని “బయటకు రా” అన్నది. ‘అమ్మో! నేను నడవలేనమ్మా!’ అన్నాను. ముందు నేను, తర్వాత అమ్మ, తర్వాత రామకృష్ణ అన్నయ్య నడుస్తున్నాం. నన్ను ఎవరినీ పట్టుకోవద్దన్నది. తన కార్లోనే ఎక్కించుకుంది. ఆ నడకకి నా ప్రమేయం లేదు. ఋషీవాలీ పాఠశాలకి వెళ్ళాం. అక్కడ అందరికీ అమ్మ దర్శనం ఇచ్చింది. తర్వాత మదనపల్లి కొండలు ఎక్కాలి. అప్పుడు అమ్మ “కాస్త పట్టుకోండి దాన్ని” అంది. పైకి వెళ్ళాం. అక్కడ రెండు మంచాలు ఉన్నాయి. నన్ను పడుకోమన్నది అమ్మ. తానూ కాసేపు పడుకుంది. స్నానానికి లేచి “వచ్చి నీళ్ళు పొయ్యి” అంది. మామూలుగా స్నానం చేయించా.

తర్వాత డాక్టర్ సుబ్బారావుగారితో “దానికి దిగులు తప్ప రోగం లేదు, నాన్నా!” అన్నది. తర్వాత తాను కడప వెళ్ళబోతోంది. నా సంగతేమిటి అని మనస్సులో అనుకున్నాను. అప్పుడు డాక్టర్ సుబ్బారావుగారితో “దాన్ని నేను తీసికెళ్తా, నాన్నా!” అన్నది. అందుకు వారు ‘అమ్మా! నువ్వు ఆపరేషన్ చేశావు. operation చేసిన రోగికి విశ్రాంతి అవసరం. నేను తీసికెళ్ళి మళ్ళీ నువ్వు జిల్లెళ్ళమూడి చేరాక నీకు అప్పచెబుతా. ఈ అవకాశం ఇవ్వు’ అన్నారు. సరేనన్నది అమ్మ.

హైమ, నేను 10 సంవత్సరాలు కలిసి మెలిసి ఉన్నాం. హైమ అమ్మ గర్భవాసాన జన్మించింది. అంతకంటె భాగ్యమేముంది? భగవంతుడు అవతరించినపుడు తన పరివారాన్ని తనతో తెచ్చుకుంటాడు. హైమ అలా వచ్చింది; అదే విశేషం. బామ్మ పోయినప్పుడు అస్తికలను ప్రస్తుతం నాగేశ్వరాలయం ఉన్న చోట రావి చెట్టు క్రింద భూమిలో పెట్టించింది. అమ్మకి అత్తగారు కావటంలోనూ ఏదో విశేషం, అర్థం, పరమార్థం ఉంది. అమ్మ సన్నిధిలో పిల్లి అరుపులోనూ ఓంకారం వినిపించేది. ఒక సందర్భంలో అమ్మ “వడ్లగింజలో బియ్యపు గింజలాగ నేను మీ దగ్గరకొచ్చి మీలో కలవకపోతే మిమ్మల్ని దగ్గరకు తీసుకోవడం కష్టం” అన్నది. అమ్మ దయతలచి తానే మన మధ్యకు వచ్చింది.

అమ్మ మందలింపు ఎపుడైనా చూచారా?

దుబారా, వృధా విషయమై ‘అమ్మ’ – ‘మామిడి తోరణాలు కడతారు; అవి ఎండిపోతే పురికొసతో సహా పారవేస్తారు. ఆ మండలను తీసివేసి పురికొసదాస్తే మళ్ళీ మండలు కట్టుకోవచ్చు గదా! చాపలు శ్రద్ధగా భద్రం చేస్తే వాడుకోవచ్చు; చెల్లా చెదరుగా పడవేస్తే కుక్కలు పడుకుంటున్నాయి వాటిమీద” ఇలాంటిది ‘అమ్మ’ మందలింపు.

అమ్మ తత్వాన్ని వివరించండి.

15-8-1958న అన్నపూర్ణాలయం ప్రారంభోత్సవం నాడు గుంటూరు నుంచి సో॥ దింటకుర్తి సుబ్బారావు గారు అమ్మకి బంగారు పట్టాలు చేయించి ఇచ్చారు. మన్నవ రామారావుగారు మొదటిసారి అమ్మకి బులాకీ చేయించారు. అమ్మకి ఇది కావాలి, ఇది వద్దు అనేది లేదు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఒకటే. ఎవరైనా ఏదైనా తెస్తే వాళ్ళ తృప్తికోసం కొంచెం నోట్లో వేసుకుంటుంది; చీరె కట్టుకున్నా అంతే నగలు పెట్టుకున్నా అంతే.

అమ్మ దుఃఖించిన సందర్భాలున్నాయా?

నెల్లూరు డాక్టరు మోహనరావుగారి అబ్బాయి పోయినప్పుడు, వాళ్ళు ఎంతగానో మనస్సును గట్టి చేసుకుని వచ్చారు – మనం అమ్మ దగ్గర ఏడవకూడదు; మనం ఏడిస్తే అమ్మ బాధపడుతుంది -అని ఉగ్గపట్టుకుని ప్రశాంతంగా ఉన్నట్టు కూర్చున్నారు. కానీ వాళ్ళ కంటె ముందు అమ్మే దుఃఖించింది. మన అమ్మ దుఃఖిస్తోందనే తృప్తి వాళ్ళకి దుఃఖోపశమనం కలిగిస్తుంది.

అమ్మ సన్నిధిలో మీరెరిగిన మహిమాన్విత సంఘటనలు గురించి చెప్పండి.

1964-65 ప్రాంతం. అమ్మ సన్నిధిలో శేషగిరిరావు అన్నయ్య, రామకృష్ణ అన్నయ్య… కొందరున్నారు. అన్నం కలిపి అందరికీ పెట్టటమంటే అమ్మకి మహాసరదా. అన్నం తెమ్మన్నది నన్ను. తెచ్చా. కలపబోతూ “లోపలికిరండి, వర్షం వస్తుందేమో!” అన్నది. అసలు ఆ సూచనలేవీ లేవు. ‘అదేంటమ్మా! అలా వాతావరణమే లేదు కదా!’ అన్నారు. అమ్మ చేతులు చాచి “వానా, రావే!” అంది. వెంటనే బడబడా వర్షం వచ్చేసింది. అందరూ పరుగెత్తారు లోపలికి. అమ్మ మాత్రం ఒక ఆటలపోటీలో గెలిచిన వ్యక్తి సంతోషపడినట్లు పరమానందంతో పరుగెత్తి లోపలికి వచ్చింది.

ఒకసారి ఒక సోదరుడు ‘సమాజంలో దుష్కర్మలు, సత్కర్మలు అనేకం ఉన్నాయి కదా! ఈ దుష్కర్మల్ని లేకుండా చెయ్యొచ్చు కదా!’ అని అడిగారు అమ్మని. “అవి దుష్కర్మలు అని నాకు అనిపిస్తే కదా!” అన్నది అమ్మ.

మరొకసారి అమ్మ మందిరంలో మంచం మీద కూర్చున్నది. ఇప్పుడు హైమాలయ ముఖమండపం ఉన్న చోట ఆ మందిరం ఉండేది. దగ్గరలో బావి ఉంది. అమ్మ చటాలున లేచి బావి దగ్గరకు వెళ్ళి తానే నీళ్లు తోడుకుని స్నానం చేయనారంభించింది. బావిలో నీళ్ళు అయిపోతున్నాయి. చెరువునుంచి తెచ్చాం. 1 గంటసేపు స్నానం అయ్యాక వచ్చి చీరె మార్చుకున్నది. ఆనాడు దర్శనార్థం వచ్చిన వాళ్ళు 16 పెద్ద పెద్ద మామిడి పళ్ళు తెచ్చారు. అమ్మ వాటిని కోసి తెమ్మన్నది. తెచ్చా. బోర్లాపడుకుని మొత్తం ముక్కల్ని తినేసింది. ఒక్క ముక్క కూడా మిగల్చలేదు. ఆ సమయంలో అమ్మ చూపు, రూపు మనలో మనలోకంలో ఉండదు. సాధారణంగా ఒక్క ముక్క కూడా తినదు అమ్మ. ఎవరి కోసమో ఆహారాన్ని స్వీకరించి పంపిస్తుంది తప్ప తనకంటూ అవసరం లేదు.

ఒకరోజు అమ్మ ఆవకాయ అన్నం కలుపుకురమ్మన్నది. తెస్తే దానిని తింటోంది. ఆ సమయంలో సందులోంచి అమ్మ కుమారుడు ‘రవి’ వచ్చి తలుపుకొట్టాడు. అమ్మ గబగబ తినటం ముగించింది. తర్వాత తలుపు తీశాను. ఆవఘాటుకి అమ్మకి కళ్ళనీళ్ళు వస్తున్నాయి. ‘అమ్మ’ ముఖం కందగడ్డలా ఉంది. ‘అమ్మ’ ఈ లోకంలోకి వచ్చింది. అది చూసిన రవి ‘అమ్మకి ఆవకాయ అన్నం పెట్టటమేమిటి?’ అన్నాడు చిరాకుగా. “నేనడిగితేనే అది పెట్టింది” అన్నది అమ్మ.

అమ్మకే జీవితాన్ని అంకితం చేసిన మీరు 'అమ్మ' నిర్యాణానంతర పరిస్థితులను ఎలా అధిగమించారు?

అమ్మ నాకు తల్లిగా, తండ్రిగా, భర్తగా మా కుటుంబానికి పెద్దకొడుకుగా అల్లుడుగా ఎన్నో పాత్రలలో ఆప్కురాలైంది. అలాంటి అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత ఆ బాధని 6 నెలలు నేను తట్టుకోలేకపోయాను. తర్వాత గ్రంథాలయం నుంచి పుస్తకాలు తెప్పించుకున్నాను. ఎక్కిరాల కృష్ణమాచార్యులుగారు వ్రాసిన ‘శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత పాండవ ప్రస్థానము’ అనే పుస్తకం చదివాను.

ఆ ఏడాది హైమాలయంలో దసరా పూజలు అయి నిర్మాల్యాన్ని ఓంకారనదిలో నిమజ్జనం చేసే సమయంలో నేను అమ్మ పాదుకలు నెత్తిన పెట్టుకుని శరీరత్యాగం చేద్దామని నిశ్చయించుకుని ఓంకారనది నీళ్ళలోతుల్లోకి పోతున్నాను. నా సోదరుడు సత్యం భార్య ‘రాజ్యా’నికి అనుమానం వచ్చి సత్యాన్ని తీసుకుని నాదగ్గరకు వచ్చింది. వాళ్ళని విదిలించేశాను. ‘వసుంధర పిరికిది . ఏం చేసుకోదు’ అని రామకృష్ణ అన్నయ్య ఒడ్డున కూర్చున్నాడు. గోపాలన్నయ్య, రెడ్డి సుధ నన్ను బలవంతంగా తీసుకువచ్చి ఒడ్డు మీద పడేశారు. ‘నేను ఉండలేకపోతున్నాను; నన్ను పోనివ్వండి’ అన్నాను. నాకేదో పూనిందనుకున్నారు ఊళ్ళోవాళ్ళు; కానీ నేను స్పృహలోనే ఉన్నాను.

క్రమేణా ‘అమ్మ లేనిది నేను లేను’ అనే భావంలోంచి ‘అమ్మ నాతో ఉన్నది’ అనే భావం దృఢపడింది. నేడు ఆ ఆవేదన లేదు. ఆ తర్వాత అనేక అనుభవాలు. ఇప్పుడు ‘నేను ఒంటరిదాన్ని – అమ్మ లేదు’ అనేది లేదు.

నేను వ్రాసిన డైరీలు డాక్టర్ శ్రీపాదగోపాలకృష్ణమూర్తిగారు తదితరులు తీసుకున్నారు. అవి మళ్ళీ నాకు చేరలేదు. ఒకరోజు అందరింటి stores లో పనుండి వెళ్ళాను. నా దస్తూరితో కొన్ని కాగితాలున్న పెట్టె కనిపించింది అక్కడ. అవన్నీ నేను వ్రాసిన డైరీలే. అన్నీ లేవు. తుక్కుతుక్కుగా పడి ఉన్నాయి. కొండముది హనుమంతరావు అన్నయ్య ఈ కాగితాలు తీసికెళ్ళి డిటిపి చేయించారు. అలా నా ‘శ్రీవారిచరణ సన్నిధి’, అమ్మ చెప్పగా వ్రాసిన ‘మహోపదేశం’ గ్రంథాలు వచ్చాయి.

‘అమ్మ సకల జీవకోటికి అమ్మ' అనే దానికి మీ అనుభవం ఏమైనా ఉన్నదా?

ఒకసారి గుమ్మం మీద కాకులు వచ్చి ‘కావ్కావ్’ అని అరుస్తున్నాయి. అమ్మ వాటిని చూస్తూ “చూశావా! మీలాగే అవీ జరుగబోయే స్వర్ణోత్సవాల గురించి meeting పెట్టుకున్నాయి” అన్నది.

ఆ రోజుల్లో కరెంటు లేదు. పందిళ్ళలో అమ్మ దర్శనానికి పెట్రోమాక్సు లైట్లు పెట్టారు. ఆ కాంతికి పురుగులు వచ్చి అమ్మ మీద పడుతూండేవి. వాటిని తోలబోతే “అవీ సేవ చేసుకోవటానికి వచ్చాయి” అనేది అమ్మ. కొన్ని రాలిపోయేవి; కొన్ని ప్రదక్షిణలు చేసినట్లు చుట్టూ తిరిగేవి. ఒకటి మాత్రం అమ్మ వక్షస్థలం మీద నిలబడి పోయింది చాలసేపు. దానిని తీయబోతే “వద్దు. తీయవద్దు. అది నన్ను ముద్దుపెట్టుకుంటోంది” అన్నది.

అంతిమంగా నాన్నగారి (అమ్మ పతిదేవులు)లో “అమ్మ” ఎడల వచ్చిన మార్పులేమైనా గమనించారా ?

నాన్నగారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనందరిలాగే అమ్మకి చెప్పి బొట్టు పెట్టించుకుని వెళ్ళటం చూచాను. తోటలో ఒక అందమైన పువ్వుకోసుకుని తన మనుమరాలు స్వీటీ నెత్తుకుని వచ్చి ఆ పువ్వును అమ్మ పాదాల మీద పెట్టటం చూశాను. అదిచూసి నాకు చాల ఆశ్చర్యం వేసింది.

ఈ జగతికి అమ్మ ఇచ్చిన సందేశము ఏమిటి?

“నీ కిచ్చింది తృప్తిగా తిని, నలుగురికి ఆదరణగా పెట్టుకో. అంతా వాడే చేస్తున్నాడని నమ్ము” అనేది అమ్మ సందేశం. అంతావాడే చేస్తున్నాడు అనుకోవడంలో సుఖం ఉంది; కర్తృత్వరాహిత్యం ఉంది. హాయిగా ఉంటుంది. మనస్సుకి ఓదార్పు ఉంటుంది. నేను చేస్తున్నాననుకోవటంలో దుఃఖముంటుంది. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, పతి, గతి సర్వస్వం…. ‘అన్నీ అమ్మే’.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!