Yarlagadda Bhaskara Rao

Interviewed by
Ravuri Prasad
11/10/2011
Jillellamudi

 

శ్రీ భాస్కరన్నయ్య (యార్లగడ్డ భాస్కరరావు)

 

వీరి వయస్సు 90 సం॥లు పైబడింది. స్వగ్రామం రేపల్లె తాలూకా సింగుపాలెం. తల్లిదండ్రులు శ్రీ యార్లగడ్డ వెంకటరత్నం, శ్రీమతి మాణిక్యమ్మ, భార్య – శ్రీమతి రాజ్యలక్ష్మి, సంతానం ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 4వ తరగతి వరకు చదువుకున్నారు. వృత్తి – వ్యవసాయం.

సేవాతత్పరత: జనక మహారాజు లాగా తాను సంసారంలో వున్నా, తనలో సంసారం లేకుండా 1960 నుండి ఇప్పటివరకు నిరంతరం అమ్మ సేవలో తమ జీవితాన్ని పునీతం చేసుకుంటున్న కర్మయోగి.

“నా చరిత్ర పండితుడైన పామరుడు వ్రాయడు, పామరుడైన పండితుడు వ్రాస్తాడు” అని ప్రకటించిన “అమ్మ” తన చరిత్రను వీరికి చెప్పి రాయించింది. అందుకే వీరు ‘పామరులయిన పండితులు, అమ్మ ఎంచుకొని తను దరి చేర్చుకొన్న అదృష్టవంతులు.

వీరు 12 ఏప్రియల్, 2018న తన 95వ ఏట జిల్లెళ్ళమూడి పవిత్రక్షేత్రంలో అమ్మలో ఐక్యమయినారు.

శ్రీ రావూరి ప్రసాద్ 11-10-2011వ తేదీన జిల్లెళ్ళమూడిలో శ్రీ యార్లగడ్డ భాస్కరరావుగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

జిల్లెళ్ళమూడికి రాక ముందు మీ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని తెలపండి.

నాకు బాల్యం నుంచీ కృష్ణుడంటే ఇష్టం. ఆ ఫోటో పెట్టుకుని ఒక పువ్వు పెట్టుకుని స్మరించుకునేవాణ్ణి. ఆ రోజులలో సత్యానందస్వామి అని ఒకరు మా ఊరు వచ్చేవారు. ఆయనది దాచేపల్లి దగ్గర కేసానిపల్లి. మా ఊళ్ళో వారి శిష్యులుండేవాళ్ళు. వారు వచ్చినపుడు నేను కూడా వెళ్ళి కూర్చునేవాణ్ణి. ఒకసారి వారు అమరావతిలో చాతుర్మాస్యదీక్ష చేస్తూ మమ్మల్ని రమ్మన్నారు. అక్కడ నాకు వారు పంచాక్షరీ మంత్రం ఉపదేశించారు. రోజూ అమరేశ్వరుని ఆలయం దగ్గర కృష్ణానదీ తీరాన తెల్లవారుఝామున జపం చేసుకుని, తెల్లవారిన తర్వాత స్వామిని దర్శించి సత్రంలోకి వచ్చేవాళ్ళం. ఆయన బోధలు వింటే – శివుడు గానీ, రాముడు గానీ, కృష్ణుడు గానీ రూపాలు వేరుగానీ ఉన్నది ఒక తేజస్సే. పరమాత్మ ఇన్ని రూపాలుగా వచ్చాడు. – అని అనిపించేది.

ఒకసారి వారి ఆశ్రమానికి వెళ్ళి కొన్నాళ్ళున్నాం. ఆయనలో నాకు శివుని దర్శనం అయింది. తిరిగి ఇంటికి రాబోయే ముందు ఆయన మమ్మల్ని సాగనంపడానికి వాకిట్లోకి వచ్చి చూస్తున్నారు. నేను వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ శివుడుగా ఆయన ప్రత్యక్షమైనారు. కాసేపు అట్లా చూసి వచ్చేశా.

మొదటిసారి అమ్మను దర్శించిన జ్ఞాపకాలు మాతో పంచుకోండి.

ఒకసారి స్వామివారు చేబ్రోలు సత్రంలో చాతుర్మాస్య దీక్షలో ఉండి, అక్కడికి మమ్మల్ని రమ్మనమని కబురుచేశారు. మా ఊరు నుంచి కొంతమంది కలిసి వెళ్ళాం. మా ఊరి సత్యవతి అక్కయ్య, చంద్రమ్మ అక్కయ్య అక్కడ ఉన్నారు. వాళ్ళు నాకంటే ముందే జిల్లెళ్ళమూడిలో అమ్మను దర్శించారు. ‘ఇక్కడ నుంచి అమ్మ దగ్గరకి వెళ్లాం. చాలా మంచిది. మాకు బాగా తెలుసు” అన్నారు. వాళ్ళు. అక్కడ నించి మేము నలుగురం కలిసి అమ్మ దగ్గరకి వచ్చాం. జిల్లెళ్ళమూడిలో ఒకటి రెండు రోజులున్నాం. అమ్మకి పూజ చేసుకున్నాం. తిరిగి వచ్చేరోజున అమ్మకి పాదనమస్కారం చేసుకున్నాం. తిరుగు ప్రయాణంలో వాళ్ళ సంచులు కూడా ఒక పంచెలో మూట కట్టుకుని నెత్తిన పెట్టుకున్నా. పొలాలగట్లపై ‘పూళ్ళ’ మీదుగా నడిచిరావడం. వాళ్ళు చాలా వెనుక ఉంటే ఒక చెట్టు క్రింద ఆ మూట దింపుకుని నుంచున్నాను. మళ్ళీ మూట ఎత్తుకోబోయేటప్పుడు, మూటకట్టిన పంచెకి బాగా పసుపు ఉంది. ఏమిటీ పసుపు అయిందని నా తల తడుముకుంటే, తల మీద కూడా పసుపు. నేనేమీ పసుపు పూసుకోలేదు, వచ్చేటప్పుడు అమ్మ తలమీద చెయ్యి పెట్టి ఆశీర్వదించింది. అంతే. ఇది అమ్మ మహత్యం – అని అనుకున్నాను. ఆ తర్వాత మేమందరం అప్పుడప్పుడు అమ్మ దగ్గరకి వెళ్ళి వస్తూండేవాళ్ళం.

మొదట అమ్మను చూసినపుడు ‘ఆమెలో గొప్ప తేజస్సు ఉంది – ఆమె చాలా గొప్పది’ అనుకున్నాను. దైవం అని అప్పటికి అనిపించలేదు. ఇంటికి వచ్చాక తెల్లవారు ఝామున నిద్రలేవబోయే ముందు అప్రయత్నంగా అమ్మ. అక్కడ మేము పూజ చేసుకున్నపుడు ఎలా ఉందో అలా కనిపించింది. అది నిద్రకాదు, పూర్తి మెలకువ కాదు. నమస్కారం చేసుకున్నాను. వరుసగా మూడు రోజులు అట్లా నాకు ‘అమ్మ’ దర్శనం ఇచ్చింది. కలకాదు, ప్రత్యక్షం కాదు, ప్రత్యక్షం కాకపోవడం కాదు. అమ్మ స్పర్శ తెలుస్తోంది. అమ్మరూపం కనబడుతోంది. 3 రోజుల తర్వాత మళ్ళీ అమ్మ అట్లా కనిపించలేదు. కానీ అమ్మ మీదే ఎప్పుడూ నా ధ్యాస ఉండేది. అమ్మ దగ్గరకి మళ్ళీ ఎప్పుడు వెళామా? ఎప్పుడు చూద్దామా? అని తపన ఉండేది. రోమాంచము అయ్యేది. ఏ పనిచేస్తున్నా అమ్మే జ్ఞాపకం వచ్చేది. ఆ తర్వాత అప్పుడప్పుడు అమ్మ దగ్గరకి వచ్చివెళ్ళేవాడిని.

మా గురువుగారు సత్యానందస్వామి వారు కూడా నా కంటే ముందే అమ్మ దగ్గరకి వచ్చేవారు. వారి ఆశ్రమానికీ అప్పుడప్పుడు వెళ్ళి వస్తూండేవాళ్ళం. ఎప్పుడెప్పుడు అమ్మను చూద్దామా అని అమ్మ దగ్గరకి రావటమే కానీ క్రమంగా వారి ఆశ్రమానికి వెళ్ళటం తగ్గించేశాం. ‘మీరు మహిమలు చూసి వెళుతున్నారు. అమ్మ దగ్గరకి. నా దగ్గరకి రావటం లేదు’ అని ఆయనకి కొంచెం బాధ కలిగింది. కానీ ఆయన కూడా అప్పుడప్పుడు అమ్మ వద్దకు వస్తూండేవారు.

ఆనాటి అమ్మ సన్నిధి - అక్కడి వాతావరణం ఎలా ఉండేది?

ఆ రోజుల్లో అమ్మ పూరింట్లో ఉండేది. అక్కడకి దగ్గరలోనే పెద్ద పాక ఉండేది. వచ్చినవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. పూజా సమయంలో అమ్మ అక్కడికి వచ్చి కూర్చునేది. చుట్టూ ఫోటోలుండేవి. పూజ జరిగినపుడు అమ్మ అనేకరకాల కళలతో కనిపించేది. పూజ అయిన తర్వాత అమ్మే అందరికీ అన్నం వండి పెట్టేది. శుక్రవారం స్త్రీలు ఎక్కువగా వచ్చి పూజ చేసుకునేవారు. ఆదివారం పురుషులు ఎక్కువగా చీరాల నుంచి వచ్చేవాళ్ళు.

అమ్మ దగ్గర కూర్చుంటే “ఎవరో అన్నయ్య వచ్చాడు, చూడు. ఎవరో అక్కయ్య వచ్చింది చూడు. వాళ్ళకేం కావాలో చూడు” అని అనేది. మొదటి నుంచీ అమ్మ అట్లా చెప్పటం ద్వారా, మాకూ అదే అలవాటు అయిపోయింది. అప్పట్లో అమ్మకి చెరువు నుంచి కావిడితో నీళ్ళు తేవటం, అమ్మ దగ్గర కూర్చోవటం, ఎవరన్నా పాడుతుంటే వినటం. కాలువకి పోయి స్నానం చేసివచ్చేవాళ్ళం.

అమ్మ జీవిత చరిత్రలోని 'రహి' అనే వ్యక్తిని మీరు చూచారా?

అమ్మ అప్పుడప్పుడు మాటల సందర్భంలో నాతో తన జీవిత సంఘటనల గురించి చెప్పేది. ఈ చరిత్ర వ్రాస్తే బాగుంటుందని నాకు అనిపించింది. తర్వాత ఒకసారి అమ్మకు పూజ జరుగుతుండగా ఒకాయన వచ్చి ఒక పుస్తకం తెచ్చి అక్కడ బల్లమీద పెట్టి కూర్చున్నాడు మాతో పాటే చాలాసేపు. పూజ అయిపోయిన తర్వాత అమ్మ తీర్థప్రసాదాలు ఇచ్చింది. తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చి అమ్మ దగ్గర కూర్చున్నాను. “ఇందాక పుస్తకం పెట్టి వెళ్ళాడే వాడే – రహి” అన్నది అమ్మ. ఆ పుస్తకం చూడమని అమ్మ నాకిచ్చింది. నేను కొంత చదివాను. దాంట్లో అమ్మ పడిన కష్టాలు, అవి పెట్టిన వాళ్ళ పేర్లూ అన్నీ వ్రాశాడు. కాస్త చదివి మళ్ళీ అమ్మకే ఇచ్చేశాను. కారణాంతరాల వలన ఆ పుస్తకం ఆ తర్వాత కనుమరుగైంది.

స్వయంగా ‘అమ్మే’ చెప్పగా అమ్మచరిత్రని మీరు రాసిన నేపధ్యం ఎలాంటిది?

అమ్మ జీవితంలోని సంఘటనలు అవీ చాలా బాగున్నాయి. రాముడూ, కృష్ణుడూ రామాయణ భాగవతాలూ వచ్చాయి. అవన్నీ చూసి మనం ఆనందపడుతున్నాం. అమ్మ చరిత్ర వ్రాసి ఉంటే ముందు తరాల వాళ్ళకి ఉపయోగపడతాయి కదా! వ్రాస్తే బాగుండునని నాకనిపించింది. ఈ మాట నేను అమ్మతో అంటే “చాలా మంది అంటున్నారు నాన్నా! వ్రాస్తే బాగుంటుందని. కనక వ్రాద్దువులే” అన్నది అమ్మ. కొన్నాళ్ళ తర్వాత అమ్మే తన చరిత్ర చెప్పటం మొదలు పెట్టింది. నేను కొన్నాళ్ళు వ్రాసి మా ఇంటికి వెళ్ళి – మళ్ళీ అమ్మ. వద్దకు వచ్చి వ్రాసి వెడుతూండేవాడిని. ఇంటికెళ్ళాక నేను వ్యవసాయం చేసుకునే వాడిని. జనం కాస్త తక్కువగా వచ్చేటప్పుడు అమ్మ “భాస్కర్ వస్తే బాగుండును” అనుకునేదిట. ఆ సమయంలోనే నాకు అమ్మవద్దకు రావాలనిపించేది. నేను వచ్చేవాడిని. వచ్చాక ‘ఇంతకుముందే అమ్మ అనుకుంటోంది – నువ్వు వస్తే బాగుండును’ అని; నువ్వు వచ్చావు’ అనేవాళ్ళు ప్రక్కనున్న సోదరీ సోదరులు. అట్లా జరిగేది. అమ్మ స్వయంగా చెప్పేది; నేను వ్రాసేవాడిని. ఒకోసారి నేను రావటం ఆలశ్యం అయితే అక్కడ ఉండే కొంతమంది అక్కయ్యలు ‘మేము వ్రాస్తాములే అమ్మా, అతను ఎప్పుడొస్తాడో’ – అని పుస్తకం రాయటానికి తీసుకునే వారట. “నాలుగు మాటలు చెప్పిన తర్వాత నాకు చెప్పటానికి వచ్చేది కాదు. నాన్నా!” అన్నది అమ్మ నాతో. “ఒకళ్ళ చేతిమీదుగా జరగాలి. ఇంతమంది ఎందుకు?” అని కూడా అనిపించింది అని అమ్మ అన్నది.

అమ్మ దగ్గరకి వచ్చే తొలిరోజుల్లో ఒక అక్కయ్య అమ్మతో ‘అమ్మా! భాస్కర్ అన్నయ్యకి కూడా ఏదైనా మంత్రం ఇవ్వు’ అన్నదిట. “వాడికి మంత్రం ఎందుకులే. ‘అమ్మ’, ‘అమ్మ’ అనుకుంటాడులే” అని అన్నదట అమ్మ. తర్వాత ఆ అక్కయ్య ఆ చెబితే నే విన్నాను. ఆ తర్వాత ఎప్పుడూ ‘అమ్మ”అమ్మ’ అనుకుంటూ ఉండే వాడిని. ఆపై పంచాక్షరీ మంత్రం అన్నీ వదిలేశాను.

నేను అమ్మ దగ్గరకి వచ్చిన తర్వాత సింగుపాలెం నుంచి చాలామంది వచ్చి వెళ్ళేవారు. మేము సింగుపాలెంలో అంతా కలిసి ప్రతి శుక్రవారం అమ్మపూజ చేసుకునేవాళ్ళం; ప్రతీరోజూ నలుగురం కలిసి అమ్మ మాటలు చెప్పుకునేవాళ్ళం. అలా పూజ చేసేటప్పుడు, మాటలు చెప్పుకునేటప్పుడు సువాసనలు వచ్చేవి. అమ్మ! అమ్మ! అనుకునేవాళ్ళం! అలా కాసేపు ఉండేవి. అప్పుడు అమ్మ వచ్చింది. అనుకునేవాళ్ళం.

ఎంతో మంది ఉన్నా తన చరిత్ర వ్రాయటానికి అమ్మ నన్ను ఎంపిక చేసుకుంది. ఆ విషయమై నాకేమనిపించిందంటే – సృష్టి అంతా అమ్మదే. అందరూ అమ్మ బిడ్డలే. అయినా ‘వీడు ఎప్పుడూ అమ్మ! అమ్మ! అనుకుంటూ నన్ను వదిలిపెట్టడం లేదే’ అని దయతో ఏదో పని చెప్పి నాచే చేయించింది. అంతేకానీ నేనేదో గొప్పవాడినని అనుకోవటం లేదు.

అమ్మ జీవితచరిత్ర వ్రాయటానికి కొన్ని ఏళ్ళు పట్టింది. అప్పుడప్పుడు వచ్చి వ్రాసి వెడుతూండేవాడిని. ఇక్కడికే వచ్చి ఉంటే బాగుంటుందని అనుకున్నాను. నేను అమ్మచరిత్ర వ్రాస్తున్నట్టు ఆనాడు ఎవరికీ తెలియదు. మరి ఏ కారణంగా రావాలి? ఇక్కడ ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించుకున్నాను. ఇక్కడ వ్యవసాయం చేయటానికి వచ్చినట్టుగా వచ్చి వ్యవసాయం చేసేవాడిని; భవనాలు కట్టినపుడు ఆ పనులు చేస్తూండేవాడిని – ఇటు అమ్మ చెబితే చరిత్ర వాస్తూండేవాడిని – కేవలం వ్రాసేందుకే వచ్చినట్టు కాకుండా.

వ్యవసాయం చేయడం పనిమీద కుటుంబంతో వచ్చి ఇక్కడ ఉన్నాను. కొన్నాళ్ళ తర్వాత భార్య, పిల్లలు తిరిగి మా ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినా కూడా అమ్మచరిత్ర వ్రాయటం గురించి నేనిక్కడే ఉండిపోయాను. నన్ను వాళ్ళు రమ్మన్నా వెళ్ళలేదు. ఎప్పుడైనా అవసరమైతే తప్ప ఇంటికి వెళ్ళేవాడిని కాదు. చరిత్ర వ్రాయటం పూర్తి అయింది. వయోభారంతో వ్యవసాయం చేయటానికి నాకు ఓపిక తగ్గింది. ‘అమ్మా! ఇక నేను వెళతానమ్మా’ అని చెప్పాను. “ఒద్దు నాన్నా, ఇక్కడే ఉండు నువ్వు” అన్నది అమ్మ. అయినా నేను ఇక్కడ ఊరికే ఎందుకుండాలనే ఉద్దేశంతో మా ఇంటికి వెళ్ళాను. వెళ్ళినా ఎప్పుడూ అమ్మ మీదే ధ్యాస ఉండేది. తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటున్నాను.

కవి - అంధ సోదరులు శ్రీ యార్లగడ్డ రాఘవయ్యగారు అమ్మ దర్శనం చేయటం, మీరంతా 'అమ్మ'ని సింగుపాలెం తీసుకొని వెళ్ళిన వైనం ఎలాంటిది?

మొదట్లో నేను అమ్మ దగ్గరకి వచ్చి వెళ్ళిన తర్వాత యార్లగడ్డ రాఘవయ్య అన్నయ్యతో ‘అన్నయ్యా! నువ్వు కవిత్వం వ్రాస్తావు కదా! అమ్మ మీద ఏవైనా పద్యాలు కానీ పాటలు గానీ వ్రాయి’ అని అడిగాను. ‘ఒరేయ్! నేను అమ్మను చూసి, అనుభవం పొందితే ఏమైనా వ్రాయగలను కానీ లేకపోతే ఎట్లా వ్రాయగలను?’ అన్నారాయన. ఆ తర్వాత ఇద్దరం కలిసి అమ్మ దగ్గరకు వచ్చాం. ఆయనకీ అమ్మ దగ్గర చాలా అనుభూతులు కలిగినాయి. అమ్మ మీద చాలా పద్యాలు, కీర్తనలు వ్రాశారు. కొన్ని ఇవాళ లేవు. వారి రచనలు చాలా ప్రఖ్యాతి పొందాయి.

నేను, రాఘవయ్య అన్నయ్య, సత్యవతి అక్కయ్య, చంద్రమ్మ అక్కయ్య ‘అమ్మను సింగుపాలెం తీసికెడితే అందరూ చూస్తారు కదా!’ అని అమ్మను ఆహ్వానించాం. “నాన్నగారిని అడగండి నాన్నా! ఆయన పంపిస్తే వస్తాను” అన్నది అమ్మ. తర్వాత ఆయన్ని అడగటం, ఆయన ‘సరే’ అనటం, 1962లో అమ్మను మా ఊరు తీసికెళ్ళటం జరిగింది. అమ్మ సింగుపాలెం వచ్చి రెండు రోజులుంది. మా ఊళ్ళో ప్రతి ఇంటికీ వచ్చి అందరినీ ఆశీర్వదించింది. అందరూ పూజలు చేసుకున్నారు. అందరికి అమ్మను దర్శించుకోవటానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి చాలామంది వచ్చారు. పందిళ్ళు వేసి, అందరికి అమ్మ దర్శనం భోజనాలు ఏర్పాట్లు చేశాం. అంత మంది జనం, భోజనాలు – ఏర్పాట్లకి ఖర్చు ఎలాగ? అని అడిగినప్పుడు అమ్మ రావాలే కానీ; అమ్మ వస్తే లోపం ఏముంటుంది? అమ్మ వచ్చి ఉండటానికి, ఏర్పాట్లు అన్నీ చేయగలమనీ రాఘవయ్య అన్నయ్య, నేను అమ్మను తీసుకెళ్ళాము.

అమ్మ చరిత్ర వ్రాసే క్రమంలో మీ అనుభవాలేమిటి?

రామాయణం, భాగవతం వింటున్నాము. ఈ దేవతల్లో ఎవరు గొప్ప? ఎవరు ఎక్కువ? అంటే అమ్మచరిత్ర, సంఘటనలు విన్న తర్వాత అమ్మే గొప్ప అవతారం అనిపించి వ్రాశాను. అమ్మ చరిత్ర వ్రాసేటప్పుడు అమ్మ చెపుతూంటే ఆయా పాత్రల కంఠస్వరాలు నాకు వినిపించేవి. ఎవరి గురించి చెపుతూంటే ఆ కంఠధ్వనులు వారివే అన్నట్టుగా ఉండేవి. మనుషులు కనబడలేదు, కంఠధ్వనుల వైవిధ్యం వినిపించేది.

అమ్మ తన శరీర త్యాగం గురించి ముందుగానే మీకేదైనా సూచనలు చేసిందా?

అమ్మ శరీరత్యాగం చేయటానికి 25 ఏళ్ళ ముందే నాతో “నేను ఆఖరికి వెళ్ళేటప్పుడు నాకోసం ‘విమానం’ వస్తుంది, నాన్నా!” అని చెప్పింది. 12.6.1985 తేదీన అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు. అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను.. అన్నపూర్ణాలయం షెడ్లో భోజనాలు చేస్తున్నాము. ఉన్నట్టుండి విమానం మోత వినిపించి, అది షెడ్ మీద వాలిందా అన్నంత పెద్ద శబ్దం నాకు వినిపించింది. అమ్మకి ఆరోగ్యం సరిగా లేదని అందరూ వెళ్ళి చూస్తున్నారు. నేనూ వెళ్ళి చూశా. తర్వాత నేను నామంచేసే సమయం వస్తే అఖండనామం వద్ద కూర్చున్నాము. ఇంతలో జేగంట బాగా పెద్దగా మ్రోగి ధ్వని వినిపించింది. వాత్సల్యాలయం నుంచి. అందరం గబగబా అక్కడికి చేరాము. చుట్టుప్రక్కల నుంచీ అందరూ వచ్చారు. కొంతసేపు తర్వాత ‘అమ్మ లేదు’ అన్నారు. ఒకప్పుడు అమ్మ చెప్పింది కదా- “నేను ఆఖరికి వెళ్ళేటప్పుడు నాకోసం ‘విమానం’ వస్తుంది” అని; ఇందాక విన్న మోత అదే అయి ఉంటుంది అని నేను అనుకున్నాను. 25 ఏళ్ళ క్రితం అమ్మ మాట అప్పుడు గుర్తొచ్చింది.

అమ్మ మీకు ప్రసాదించిన దివ్యానుభూతులేమిటి?

అమ్మ పూరింట్లో ఉన్నపుడు నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను వచ్చి కూర్చున్నాను. కొంతసేపటికి అమ్మ వచ్చి నా ఒళ్ళో కూర్చున్నది. తర్వాత లేచి వెళ్ళి అమ్మ విడిగా కూర్చున్నది. ఆ తర్వాత నేను వెళ్ళి అమ్మ ఒళ్ళో కూర్చున్నాను. నాకు పరిస్థితి తెలిసీ తెలియనట్టుగానే ఉంది. గానీ ఎందుకు జరిగింది అని తెలియకుండా ఉంది. చాలా ఆనందదాయకమైన స్థితి అది.

అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత మేము వాత్సల్యాలయం ప్రక్కన వరండాలో పడుకునే వాళ్ళం. ఒకసారి వానజల్లు వస్తే లోపలికి వచ్చి ఉత్తరపు వైపు వాకిలి దగ్గరగా పడుకున్నాం. నిద్ర లేచే ముందు తెల్లవారకట్ల అమ్మ అక్కడ నిలబడి ఉన్నట్లు, నేను నమస్కారం చేసుకున్నట్లు జరిగింది. అమ్మ. స్పర్శ తెలుస్తోంది; ఎదురుగా అమ్మ కనిపిస్తోంది. ఆ రోజల్లా నేను ఏవో పనులు చేస్తూనే ఉన్నా. ఏం చేస్తున్నానో తెలియకుండా ఉంది. అమ్మ లేని లోటు నాకు లేనే లేదు. అమ్మ ప్రత్యక్షంగా అంతటా ఉన్నది అని నా నమ్మకం.

కొన్నాళ్ళ తర్వాత తూర్పు ప్రక్క వరండాలోనే అమ్మ వాత్సల్యాలయం ప్రక్కనే పడుకున్నాం. తెల్లవారగట్ల లోగడ అమ్మ శరీరంతో ఉన్నప్పుడు జరిగినట్లే అనుభవం – నా ఒళ్ళో అమ్మ కూర్చోవటం, అమ్మ ఒళ్లో నేను కూర్చోవటం – మళ్ళీ అట్లాగే అనుభూతమైంది.

నేను అమ్మ దగ్గరకి వచ్చి ఉన్న తర్వాత మా ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు అవీ జరుగుతున్నా ఏవో ముఖ్యమైన వాటికి వెళ్ళేవాడిని కాని మిగిలిన వాటికి వెళ్ళేవాడిని కాదనలు; ఇక్కడే ఉండేవాడిని.

కొంతకాలం హైమాలయంలో రంగారావు అన్నయ్యగారు, వారి భార్య సరోజినమ్మ గారు అర్చన చేసేవాళ్ళు. ఊళ్ళో నుంచి ఒక అమ్మాయి వచ్చి గుళ్ళో శుభ్రం చేస్తూండేది. ఆమె సరిగా చేయకపోతే ఆయన ‘ఇక్కడ ఇది ఉంది. అది అక్కడ అది ఉంది. శుభ్రం చెయ్యి’ అని చెప్పేవారు. ఆమె అవతల కెళ్ళి ఈయన్ని దూషణ చేస్తూండేది. అది విన్నాను రెండు మూడుసార్లు. ‘మంచి చెప్పినా శుభ్రం చెయ్యమన్నా కూడా ఈమె దూషిస్తోంది. ఇదిఏం పద్దతి?’ – అని నాకు బాధేసింది. ఆమె వంకచూశాను. ఎదురుగా ఆ అమ్మాయిలో సాక్షాత్తు అమ్మే కనిపించింది. తర్వాత ‘అమ్మే ఈ రూపంలో ఇట్లా ఉన్నది’ అనిపించింది. అందరిలోనూ ఉన్నది అమ్మే అని అనిపించింది.

కొమరవోలు సరోజిని అక్కయ్య నామం బాగా చేసేది. కానీ కొంచెం సేపే చేసి వెళ్తుండేది. ‘ఈమె బాగా నామం చేస్తుంది కదా! మరి కాసేపు చెయ్యొచ్చు. ఎందుకు కొద్దిసేపు చేసి వెళ్ళిపోతుంది?” – అని ఆమె మీద నాకు బాధేసింది. అప్పుడూ సరోజిని అక్కయ్య అమ్మగా కనిపించింది. ఇన్ని రూపాలుగా ఉన్నదీ అమ్మే. కనుక ఎవరినీ ఏమీ అనకూడదు. అంతటా అమ్మే ఉంది. ‘ముందు నువ్వు సరిగా నడుచుకుంటున్నావో లేదో నిన్ను నువ్వు విచారించుకో” అని నాకు అనిపించింది.

అమ్మ శరీరత్యాగం చేసి ఆలయ ప్రవేశం చేసింది. అపుడు అమ్మ నడయాడిన వాత్సల్యాలయంలోనే అమ్మ ఉన్నదని కొందరు, అమ్మ పార్థివ శరీరం ఆలయంలో ఉన్నది కనుక అనసూయేశ్వరాలయంలోనే అమ్మ ఉన్నదని కొందరు భావించసాగారు. ‘అమ్మ ఆలయ ప్రవేశం చేసింది ఇక్కడ కదా! ఇక్కడ లేకపోవడమేమిటి? అక్కడ ఉండటమేమిటి? అమ్మ ఇక్కడా ఉంటుంది, అక్కడ ఉంటుంది. అంతటా ఉంటుంది. ఇక్కడ ఎందుకులేదు?” – అని నా కనిపించింది. అమ్మనే ధ్యానిస్తూ ఆలయంలో కూర్చున్నాను. అప్పుడు గర్భగుడిలో అమ్మ పార్థివ శరీరం ఉంచిన చోట పువ్వుల్లోంచి ‘అమ్మ’ కదిలి పైకి వచ్చి కనిపించింది నాకు. అలా 10 ని.లు కనిపించింది. ‘అన్నిచోట్లా ఉన్న ‘అమ్మ’ ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నది. నాకు దర్శనం ఇచ్చింది కదా ! ఇక్కడా ఉన్నది’ అనుకున్నాను.

ఒకసారి అమ్మ నాతో అన్నది – నాన్నా! “ఏడవ మైలు దాకా ఇళ్ళు పడతాయి. ఇది మహాక్షేత్రం అవుతుంది” అని.

అమ్మను చూడాలనుకునే వారికి మీరిచ్చే సూచన లేక సందేశం ఏవైనా వుందా?

ప్రతి ఒక్కరూ కూడా ‘అమ్మా!’ ‘అమ్మా!’ – ‘తల్లీ!’ అనుకోవాలి.

అమ్మకి మీ ప్రార్థన ఏమిటి?

90 సంవత్సరములు దాటిన నేను కడవరకు అమ్మ ప్రసాదం తింటూ అమ్మ నామాన్ని చేస్తూ కడతేరాలని నా కోరిక. ‘అమ్మా! ఎన్ని కష్టాలు వచ్చినా, ఏది జరిగినా, నీ మీదే మనస్సు ఎప్పుడూ ఉండేటట్టు – నిన్నే ధ్యానం చేసుకునేటట్టు, నిన్ను తలచుకునేటట్టు చెయ్యి’ అని అమ్మనే ప్రార్థిస్తాను – అమ్మతోనే చెప్పుకుంటాను……

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!