I Hanuma Babu

Interviewed by
Ravuri Prasad
04/10/2011
Jillellamudi

 

శ్రీ ఐ. హనుమబాబు

  ‘హనుమాన్ బాబు’ (అమ్మ వీరిని యిలానే పిలిచేది) 20-09-1945న జన్మించారు. స్వగ్రామం గుంటూరుజిల్లా ఇటికంపాడు. తల్లిదండ్రులు శ్రీ వెంకటకృష్ణయ్య, శ్రీమతి సౌభాగ్యమ్మ, భార్య – శ్రీమతి స్వరాజ్యలక్ష్మి ఉరఫ్ కుసుమ. సంతానం ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. విద్య- M.A. (తెలుగు), ఉద్యోగం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడిలో ఉపన్యాసకులుగ పనిచేసి రిటైర్ అయినారు.

సేవాతత్పరత : అన్నపూర్ణాలయం, ధాన్యాభిషేకం – సప్తసప్తాహాల నిర్వహణ, అమ్మ తత్త్వప్రచారాలలో విశేష సేవలందించారు. జిల్లెళ్ళమూడి ‘కాశీ’ వలె ‘ముక్తిక్షేత్రం’ అని ఎలుగెత్తి చాటి అచ్చోటనే 11-06-2013న స్వర్గస్థులయినారు.

శ్రీ రావూరి ప్రసాద్ 04-10-2011న జిల్లెళ్ళమూడిలో ఐ.హనుమబాబు గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

ముందుగా మీ కుటుంబ పూర్వాపరాలు తెలియచెప్పండి.

జిల్లెళ్ళమూడికి తూర్పున గల ఇటికంపాడు మా స్వగ్రామం. మా అమ్మది అంగలకుదురు. మేము తెనాలిలో స్థిరపడ్డాం. మేము ఇద్దరం మగపిల్లలం – నేను, మా తమ్ముడు. నేను గుంటూరులో చదువుకుంటున్నపుడు ఒక సహ విద్యార్థి నాకు తొలిసారిగా అమ్మను గురించి చెప్పాడు.

1966లో నా వివాహమైంది. నా భార్య పేరు కుసుమ – మతుకుమిల్లి వారి ఆడపడుచు. నాకు ఇద్దరు కుమార్తెలు ఇందిర, హైమ; ఒక కుమారుడు కృష్ణశర్మ (బాబి)

అమ్మని తొలిసారిగా ఎప్పుడు దర్శించారు?

‘ఎవరీ ‘అమ్మ?’ – అని 1966 మే నెలలో నండూరు నుంచి జిల్లెళ్ళమూడి నడచి వచ్చా.

అంతకు ముందు నాకు ప్రాణభయం ఉండేది. ఆరుబయట ఉంటే ఏదన్నా వచ్చి మీద పడుతుందేమో, ఇంట్లో ఉంటే పై కప్పు పడిపోతుందేమో అని. తొలిసారి అమ్మను చూశాక ‘ఈ అమ్మే మా అమ్మ, జిల్లెళ్ళమూడి నా స్వగ్రామం’ అనే భావన కలిగింది. కారణం తెలియదు. బొట్టుపెట్టి అమ్మ “నాన్నా! భోజనం చేసిరా” అంది. జీవితంలో తొలిసారిగా తృప్తిగా భోజనం చేశా. ముతకబియ్యం అన్నం, చింతకాయపచ్చడి, నీళ్ళచారు, నీళ్ళమజ్జిగ – అయినా మామూలుగా నేను తినే అన్నానికి రెట్టింపుతిన్నా. అది స్థలమహాత్మ్యమో, అమ్మ మహత్యమో అంతుబట్టలా.

మీ తల్లి (భాగ్యమ్మ)గారు అన్నపూర్ణాలయంలో సేవలు చేయటం ఎలా మొదలయింది?

మా నాన్న మొదట్లో అర్చకుడు. కొద్దిపాటి సంపాదన. కుటుంబ పోషణ నిమిత్తం మా అమ్మ వంటపనులకి వస్తూండేది. గుంటూరు శేషయ్యగారితో కలిసి జిల్లెళ్ళమూడి ఉత్సవాల్లో మా అమ్మ చాలాసార్లు వంట చేసింది. అన్న పూర్ణాలయంలో వంటమనిషి కావాలి అని ‘అమ్మ’ చెబితే శేషయ్యగారు మా అమ్మని పిలిచారు. 1966 లో మా నాన్న గతించారు. సంవత్సరీకాలు అయిన తర్వాత మా అమ్మ స్థిరంగా జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయంలో ఉండేందుకు వచ్చింది.

అమ్మ దగ్గర మీరు చేసిన సేవలు ఏమిటి?

చిన్నప్పటి నుంచీ ‘శ్రీరామ జయరామ జయజయరామ’ అనే నామాన్ని నిరంతరం చేస్తూండేవాడిని. నేను రెండవసారి జిల్లెళ్ళమూడి అడవులదీవి మధుగారి పెళ్ళికి మా అమ్మకి వంటలో సాయంగా వచ్చాను. జిల్లెళ్ళమూడిలో ఏ పనిచేసినా పవిత్రమే అనే భావన నాలో కలిగింది. ఆ తర్వాత ఇక్కడ మురుగు కాలువలు బాగుచేశాను, అంట్లు తోమాను, ఊక పారపోశాను, గుళ్ళో పూజకెళ్ళాను, కాలేజీలో పాఠాలు చెప్పాను.

నేను Z.P. హైస్కూల్లో పనిచేస్తున్నపుడు Service Register ప్రారంభించడానికి మా ప్రధానోపాధ్యాయులు అడిగారు ‘మీ స్వగ్రామం ఏది?’ అని. ‘జిల్లెళ్ళమూడి’ అని వ్రాయించా. అమ్మ మెట్టిన గ్రామాన్నే నా స్వగ్రామంగా ఎన్నుకున్నా ఇష్టంగా. ఖాళీగా ఉన్నపుడు సుద్దముక్కతో ‘అంతా’, ‘అంత’ అని వ్రాయటం, చెరపటం చేసేవాడిని. ఎందుకో తెలియదు. సెలవు ఇస్తే తరచు జిల్లెళ్ళమూడికి వచ్చేవాడిని. పూండ్ల, చందోలు గ్రామాల్లో పనిచేశా. 18 లక్షల చండీమంత్రం చేశా. తర్వాత నాకు రేటూరు బదిలీ అయింది. 1970లో జిల్లెళ్ళమూడిలో కాపురం పెట్టా.

మీరు మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీలో లెక్చరర్ ఎలా అయ్యారు?

1979లో ఒక సాయంకాలం వాత్సల్యాలయంలో అమ్మ సన్నిధిలో కూర్చున్నాను. “నువ్వు ఇక్కడి సంస్కృత కాలేజీలో పనికి వస్తావా?” అన్నది అమ్మ. ‘అమ్మా! నాకు భాషా ప్రవీణ Ist class కూడా లేదు’ అన్నాను. “సరే. చదువుకో నాన్నా! తీసుకుంటారు” అన్నది. రాత్రి గం.11-00లకు చదువు మొదలుపెట్టి సుప్రభాత వేళ వరకు చదివి, మళ్ళీ అన్నపూర్ణాలయంలో సేవ, స్కూలు. ఇలా M.A. పరీక్ష వ్రాశాను రెండుసార్లు. 50.5% వచ్చింది. చిత్రం ఏమంటే సుగుణ అనే అమ్మాయి ఇక్కడ కాలేజీలోనే చదువుకుంది. కష్టపడి Ist class తెచ్చుకుంది భాషాప్రవీణలో. ‘ఇక్కడ కాలేజీలో ఉన్నది ఒకటే post. అమ్మా! సుగుణకి ఉద్యోగం అవసరం. నేను ఉద్యోగం చేసుకుంటున్నవాణ్ణి కదా! ఏం చెయ్యమంటావు?’ అన్నాను – అమ్మతో. పకపకా నవ్వింది అమ్మ. ఆ నవ్వు నాకు అర్థం కాలేదు. ఇంతలో ఆ రోజే అక్కడ ఉద్యోగం చేస్తున్న ఒక లెక్చరర్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంటే రెండో postని అమ్మే సృష్టించి మా ఇద్దరికీ ఉద్యోగాలిప్పించింది అని నావిశ్వాసం.

మీరేదైనా మంత్రోపదేశం పొందారా?

1968లో కోటప్పకొండ మీద శివచండికాలయంలో పంచదశి మంత్రాన్ని ఉపదేశం పొందా. ఆ మంత్రాన్ని అఖండంగా చేస్తూ వచ్చా. అన్నపూర్ణాలయంలో సేవలు మొదలు పెట్టిన తర్వాత నాకు ఒక ఏడాది పాటు ఆ జపం చేసే అవకాశం లేకుండా పోయింది. “అమ్మా ! నా పరిస్థితి ఇలా ఉంది. ఏం చేయాలమ్మా?” అని అడిగాను. సాధారణంగా అమ్మని ప్రశ్నించను. అమ్మ ఏమీ మాట్లాడలేదు. తరచూ అమ్మను హాయిగా తనవితీరా చూస్తుండేవాడిని.

ఒకరోజు వెళ్ళి ‘M.A. పరీక్ష వ్రాయాలమ్మా. ఏం చెయ్యమంటావు?’ అన్నా. “నీ పరీక్షకి ఎన్ని సెంటర్లు, నాన్నా?” అన్నది. ‘రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, విశాఖపట్టణం – నాలుగు సెంటర్లు అమ్మా’ అన్నాను. నాలుగు వేళ్ళు చూపి ఒక వేలు పట్టుకోమంది. పట్టుకున్నా. అది ఏలూరు అయింది. పరీక్ష వ్రాసి జిల్లెళ్ళమూడి వచ్చా; “నాన్నా! లక్ష్మణయతీంద్రుల్ని చూశావా?” అని అడిగింది రాగానే. ‘లేదమ్మా’ అన్నా. ఆ తర్వాత సోదరులు టి.టి.అప్పారావుగారితో వారి దగ్గరకు వెళ్ళా. నా సమస్య చెప్పి ‘మంత్రత్యాగో దరిద్రతా’ అంటారు పెద్దలు – అని ప్రశ్నించాను వారిని. అందుకు యతీంద్రుల వారు ‘వంటచేయాలి, వంట చేయాలి – అనుకోవటం మంత్రమౌతుంది. వంట చేయడం, వడ్డన చేయడం అనుష్ఠానమౌతుంది. ‘రామరామ’ అనేది జపం; రామ తత్వాన్ని జీర్ణం చేసుకుని రామునిలా జీవించడం అనుష్ఠానం. మీరు మంత్రజపం చేయకపోయినా అనుష్ఠానం చేస్తున్నారు’ అన్నారు. నా సందేహానికి సమాధానం అమ్మ వారి ద్వారా ఇచ్చింది. అప్పటి నుంచీ మంత్రజపం చేయటం లేదన్న కించ పోయింది. జపం చేసుకోకపోయినా అన్నపూర్ణాలయం సేవలో ఉంటే అది జపం చేసినట్లే అన్న భావం బలపడ్డది.

అన్నపూర్ణాలయంలో ఏ సేవలు చేశారు?

నేను – మా అమ్మ, శేషయ్యగార్లతో కలిసి గుండిగెలు వార్చేవాడిని, కూరలు తిరగమోతవేసేవాడిని, అంట్లుతోమేవాడిని, ఊకపొయ్యి పని చేసేవాడిని, ఇల్లుకడిగి వడ్డన చేసే వాడిని, ఎంగిలి విస్తళ్ళు ఎత్తేవాడిని. అంతా గుడిలో పూజ అంత పవిత్రమైన భావంతో చేసేవాడిని.

చిన్నప్పటి నుంచి మమ్మల్ని పోషించేందుకు మా అమ్మ పడ్డ కష్టం నేను చాలా సార్లు చూశా. అది నా మనస్సు మీద చాలా ముద్రపడిపోయింది. కనుక ఇక్కడ ఉన్నంతకాలం నేనూ నా భార్య ఆమె సేవచేయాలి అంటే ఆమె చేసే పనిలో సహకరించాలి, ఆమె పడే శ్రమను తగ్గించాలి. అది మా ప్రధానోద్దేశ్యం. “అమ్మ” ఒకసారి అన్నది. “హనుమాన్ బాబుకి నా కన్న, వాళ్ళ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం” అని. నాకెవరూ పనిచెప్పేవారు కాదు. నేనే హాయిగా చేతనైంది చేసుకుపోయేవాడిని.

అమ్మ సన్నిధిన జరిగిన మీ ఇంటి శుభకార్యాలు ఏమిటి?

మా పెద్దమ్మాయి పెళ్ళి అమ్మ చేసింది. అప్పటికే నేను కాలేజీలో లెక్చరర్గా చేరాను. నా postకి Grant-in-aid లేకుండా post order మాత్రం వచ్చింది. అంటే జీతం లేదు, పని ఉంది. అట్లా సుమారు 20 నెలలు పనిచేశా. ఆ సమయంలో ‘అమ్మ’ నన్ను పిలిచి “ఒరేయ్ ! పిల్లలంతా పెద్దవాళ్ళవుతున్నారు. ‘ఇందిరకి’ పెళ్ళిచేస్తే బాగుంటుంది” అన్నది. ‘నా దగ్గరేముందమ్మా చేసేందుకు! నీకు తెలియని దేమున్నది?” అన్నా. “సంబంధాలేమైనా ఉన్నాయా?” అన్నది. ‘మా బావమరిది ఉన్నాడమ్మా’ అన్నాను. వాడిని పిలవమన్నది. వాడు ఇంటర్ లో అప్పుడే చేరాడు. వాళ్ళకీ నాకూ ఆ ఉద్దేశాలు లేవసలు. అపుడు ‘అమ్మే’ స్వయంగా బాధ్యత తీసుకుని వైభవంగా మా అమ్మాయి పెళ్ళి చేసింది.

నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లే 'అందరింటి' ఆర్థిక స్థితిగతులు ఆనాడు ఎలా వుండేవి ?

అమ్మ ఉత్సవాల్లో, పండుగల్లో నావంతు సేవచేసేవాడిని. తెల్లవారితే ఉత్సవం, stores లో సరుకు ఉండేది కాదు. కానీ తెల్లవారగానే సమస్తం వచ్చేది. ఆశ్చర్యం. ఇదెట్లా సాధ్యం ? డబ్బు కనిపించేది కాదు. చాలా పెద్ద ఉత్సవం. మేము సమాయత్తమౌతున్నాం. ఆ సంగతి అమ్మకి నివేదన చేసేవాళ్ళం. సరుకంతా వచ్చి ముంగిట్లో పడేది ఆశ్చర్యంగా. వైభవంగా జరిగేది ఉత్సవం. పైసా లేకపోయినా సరే ఇక్కడ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి. అందులో విశేషం మాతృశ్రీ స్వర్ణోత్సవాల సందర్భంగా లక్షమందికి ఒకే పంక్తిలో భోజనం. అమ్మలో ఒక ఆధ్యాత్మిక సంపద ఉంది; అమ్మ ఒక దివ్యశక్తి; అమ్మ తప్ప ఇంకొకటి లేదు – అనేది సంపూర్ణంగా నా మనస్సులో గూడుకట్టుకుంది.

అమ్మ కరుణ ప్రసరించిన సందర్భాలేమైనా చెప్పండి.

అమ్మను గురించి ప్రచారం చెయ్యాలనుకున్నా. సామాన్యులకి అమ్మ చరిత్ర Flexi banners మీద వ్రాయించా. ‘భజన పద్మావతి’గారు పాటలు పాడేది. నేను వివరిస్తూండేవాడిని. 25 గ్రామాలలో ప్రచారం చెయ్యాలనుకున్నా. Prostate గ్రంధి వాచి మూత్రం బిగదీసింది. ఒకనాడు ఎవరో వచ్చి హోమియోమందు వేశారు. aggrevation వచ్చింది. చిత్రహింస ననుభవించా. గుంటూరు హాస్పిటల్కి వెళ్ళా; వాళ్ళ వల్ల కాలేదు. హైదరాబాద్లో ఆపరేషన్ చేశారు. ఇపుడు హాయిగా ఉన్నా. నాకు ఆపరేషన్ చేసి ఒడ్డున వేసినాకు పునర్జన్మ నిచ్చింది ‘అమ్మ’. అది ‘అమ్మ’ అనుగ్రహం అని నా సంపూర్ణ విశ్వాసం.

అమ్మ ఆగ్రహాన్ని చవిచూసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?

శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు ఈ నాటి SVJP అధ్యక్షులు, ‘అమ్మ’ భక్తులు. ‘గాయత్రీ యాగం’ జరిగే సమయంలో నేను అన్నపూర్ణాలయం ఇన్ఛార్జిని. మేమిద్దరం బాపట్లలో కల్సుకుని కారులో జిల్లెళ్ళమూడి వచ్చాం.

‘అన్నయ్యా! ఇవాళ శనివారం. మామూలుగా ఇంట్లో భోజనం చెయ్యను. జిల్లెళ్ళమూడిలో భోజనం పెడతారా?’ అన్నారు. అదే సమయాన జేమ్స్ (JAMES) అన్నపూర్ణాలయం భోజనశాల (షెడ్డు) లో ‘అమ్మ’ సినిమాని ప్రదర్శిస్తున్నాడు. ‘ఇంకా ఎంత సేపుపడుతుందీ?’ అన్నాను సో॥జేమ్సుతో. ‘ఒక గంట’ అన్నారాయన. నేను రామబ్రహ్మం గార్కి గంట తర్వాత భోజనం పెడతాము’ అని చెప్పా. ఆయన ఎక్కడికో వెళ్ళి, విశ్రాంతిగా నిద్రలోకి జారుకున్నారు. నేనూ అనుకోకుండా నిద్ర పోయా. సుమారు రాత్రి గం. 10.30ల ప్రాంతంలో అమ్మ నుంచి కబురు వచ్చింది నాకు. ‘అమ్మ’ ఎంత అమృతమూర్తి అంతటి అగ్నిశిఖ. ఆమెకు కోపం లేదు, రాదు. మనలో మార్పు తెచ్చేందుకే నిప్పులు కురిపిస్తుంది. మొట్టమొదటిసారిగా నాపై నిప్పులు కురిపించింది. ఆమె ఒక్క ఉదుటన లేచి “ఏరా! నీకెందుకు అన్నపూర్ణాలయం బాధ్యత పెట్టాను? నాకు బాధేసింది. నిద్రపోతున్నావా? వాడికి ఆకలైంది. నువ్వేం చేశావు?” అని చాలా పెద్దస్థాయిలో గర్జించింది. నేనూ, రామబ్రహ్మం గారూ ఎవరూ చెప్పకపోయినా అమ్మకి ఆ విషయం తెలిసింది. ‘ఇట్లా జరిగిందమ్మా’ అని చెప్పలేకపోయాను. మనస్సు స్తంభించిపోయింది. నోటమాటరావటం లేదు. “ఇకపో” అని విదిలించిన తర్వాత క్రిందకు వచ్చా. నేను ఇన్ఛార్జిగా ఉండి పొరపాటు చేశాను. గంటకొట్టకపోతే వేరే ఏర్పాటు చేయొచ్చుకదా – అని బాధపడ్డాను. ఇది అమ్మ నా కిచ్చిన ఉపదేశం అని అభిప్రాయపడ్డా.

మీరు అనుష్టించే సాంప్రదాయ మంత్రానికీ, అమ్మ నామానికీ వ్యత్యాసం వుందా?

నిత్యం చండీజపం, రాజరాజేశ్వరీ జపం, లలిత అమ్మవారి నిత్యజప దీక్ష వనదుర్గా పారాయణ చేసుకుంటాను. నేను అనార్యోంతో ఒక అస్పత్రికి వెళ్ళాను కదా! అక్కడ scanning చేసేందుకు నన్ను రెండు గంటలు ఒంటరిగా గదిలో పడుకోబెట్టారు. ఇంజక్షన్ చేసి వెళ్ళారు. అప్రయత్నంగా “జయహో మాతా” నామం అఖండంగా సాగింది మనస్సులో. ఇంతలో మత్తు వచ్చి నిద్రపట్టింది. ఆ మత్తులోంచి మెలకువ వచ్చే సమయానికి నేను చేసే మూలమంత్రం జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ కళ్ళు మూస్తే మళ్ళీ ‘జయహోమాతా’ వచ్చింది. ఆ తర్వాత రెండూ ఒకటే అని అర్థమయింది స్పష్టంగా.

ఎంతమంది ఏ సమయాన వచ్చినా ఇన్ని సంవత్సరాలుగా అన్నపూర్ణా లయంలో అన్నవితరణ నిరంతరాయంగా జరుగుతూనే వుంది. ఇదెలా సాధ్యం అంటారు?

శ్రీ భట్టిప్రోలు చలపతిరావుగారి కుమార్తె వివాహం జిల్లెళ్ళమూడిలో చేశారు. అర్ధరాత్రి సమయం మగపెళ్ళివారు నలభై మంది భోజనానికి వచ్చారు. జిల్లెళ్ళమూడిలో అలా రాత్రిపూట రావటం సహజమే. పదార్థాలన్నీ వడ్డన చేశాము. మజ్జిగలోకి వచ్చారు. ఆ సమయంలో పావుకిలో బియ్యం పరిమాణం అన్నం మాత్రమే పళ్ళెంలో ఉన్నది. ఎట్లా ? నాకు ఏమీ తోచక నడుముకు గుడ్డకట్టి, ఉన్న అన్నాన్ని రెండు భాగాలు చేసి అమ్మ ఫోటోకు చూపించి ‘అమ్మా! నేను అశక్తుడ్ని, అన్నం తీసికొని వెళుతున్నాను. ఏం చేస్తావో!’ అని చెప్పి అమ్మకు నమస్కారం పెట్టుకుని గడపదాటి వడ్డన చేశా. ఆ సగం మాత్రమే ఖర్చయింది. మిగిలిన సగం అలాగే ఉంది. ఆశ్చర్యం ఏమంటే – గడపదాటిన తర్వాత ‘నేను హనుమబాబుని’ అనే స్పృహ నాకు లేదు. యాంత్రికంగా పోయివచ్చా. పళ్ళెంలోపలికి తెచ్చిన తర్వాత ‘నేను హనుమబాబుని’ అనే స్పృహ వచ్చింది.

1985లో అమ్మ మహాసమాధి పొందింది. అమ్మను గురించి విచికిత్స చేసుకున్నా. అమ్మ – ‘ఒక మహాజ్ఞాని’ – ‘ఒక అవధూత’ – ‘ఒక యోగశక్తి’ ‘ఒక అవతార మూర్తి’ – ఈ నాలుగు రూపాల సమ్మేళనమే ‘అమ్మ’ అనిపించింది.

0 Comments
error: Content is protected !!