B V Vasudeva Chary

Interviewed by
Ravuri Prasad
28/04/2012
Chilakaluripet

 

శ్రీ బి.వి.వాసుదేవాచారి

  శ్రీ బూరుగుపల్లి వెంకట వాసుదేవాచారి గారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో 13-04-1930న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీకృష్ణాచార్యులు, శ్రీమతి శేషమ్మ. భార్య శ్రీమతి సుమతి. సంతానం- ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. విద్య-M.A. (English). వృత్తి- ప్రిన్సిపాల్.

సేవాతత్పరత : అమ్మ మహత్తత్త్వాన్నీ, శక్తిమత్వాన్ని ఋజువు చేసే అనుభూతులు పొందిన భాగ్యశాలి. జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ Convent కు వ్యవస్థాపక పిన్సిపాల్గా పనిచేస్తూ, అమ్మ సంస్థలకు సంబంధించి ఎన్నో క్రియాశీలక సేవలను అందించారు. ప్రస్తుతం వయోభారం చేత రాలేక దూరాన ఉన్నా మానసికంగా నిరంతరధ్యాస, ధ్యానం వలన జిల్లెళ్ళమూడిలోనే అమ్మ శ్రీ చరణ సన్నిధిలోనే వుంటున్న మాతృసేవా తత్పరులు.

శ్రీ రావూరి ప్రసాద్ చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

ఒక మాట

శ్రీ బి.వి వాసుదేవాచారిగార్ని Interview చేసే నిమిత్తం 28-04-2012న చిలకలూరిపేట వారింట్లో కలిశాం. అప్పటికే వయోభారంతో అనారోగ్యంగా వున్నారాయన. అయినా అమ్మయందు వారికి గల భక్తి విశ్వాసాలతో తమ అనుభవాలు ఆ స్థితిలోనూ మాతో పంచుకొన్నారు. వినికిడి లోపం కారణంగా ప్రశ్నలు వేసి వారి అనుభవాలు సేకరించటం మాకు కుదరని పనే అయింది. ఏమేమి అడగదలిచామో, దాని అక్షరాకృతిని వారి ముందుంచాం. ఇప్పుడు వారి అనుభవాల స్పందనే ఈ వ్యాసంగా మీముందుంది.

మాది చిలకలూరిపేట. బెనారస్ విశ్వవిద్యాలయంలో M.A (English) చదివాను. చీరాల కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేశాను.

అమ్మ లక్ష్మీదేవి వర్చస్సుతో ప్రకాశిస్తుంది. క్రమేణ దైవం అని తెల్సింది; విశ్వాసం కలిగింది. మా కుటుంబ సభ్యులందరం అమ్మ పై విశ్వాసం కలిగిన వాళ్ళం. అమ్మ పిలుపు మేరకు జిల్లెళ్ళమూడిలో 1980-85 కాలంలో ‘మాతృశ్రీ విద్యాలయం’ ప్రిన్సిపాల్ గా పనిచేశా. అమ్మ చాలా తక్కువ వయస్సులోనే శరీరత్యాగం చేసింది. తను సంకల్పిస్తే కాని దేమీ లేదు.
అమ్మకి Lung absess వచ్చినప్పుడు దగ్గేది. దానికి మందులు లేవు. అమ్మ అలా దగ్గుతుంటే మనం చూసి తట్టుకోలేం. ఒకనాడు అమ్మ దగ్గిదగ్గి ముఖం ఎఱ్ఱగా కందగడ్డ అయింది. అంతలో ఎవరో పూజ చేసుకోవాలని వచ్చారు. “నాన్నా! తాటి కలకండ తీసుకురా” అన్నది నాతో తెచ్చా. దానిని బుగ్గన పెట్టుకుని అలాగే గంటలు పూజలో కూర్చున్నది. ఆమెకు రోగాలు ఎందుకు వస్తయ్యో నాకు తెలీదు. ఎవరివన్నా తీసుకుంటుందేమో! అమ్మకి పాపులు, పుణ్యులు అనీ తేడాలేదు. ఆకలే అర్హతగా అన్నపూర్ణాలయంలో అన్నం పెట్టమన్నది.

నేను ఎక్కడా చూడలేదు- ఈ ప్రేమతత్వం. అనురాగం, ఆత్మీయతగా జిల్లెళ్ళమూడిలో అందరింటిని తీర్చిదిద్దింది. ఆచరణాత్మకంగా చేసి చూపింది. ఈ నాటికీ అనుక్షణం అమ్మ నన్ను కాపాడుతూ ఉన్నది.

మా బావగారు పోయారు, అక్కయ్య నా వద్దే ఉంటున్నది. తనకి Advanced cancer వచ్చింది. నా అశ్రద్ధ వలన అంతగా ముదిరిపోయింది. మా నాయన నాకు అప్పగించిన ఆమె బాధ్యత నేను నిర్వర్తించలేక పోయానని విపరీతంగా ఏడ్చాను. biopsys cancer అనే నిర్ధారణ అయింది. హైమాలయం వెనుక పూరింట్లో అమ్మ పాదాల పైబడి ఏడ్చాను. “అదేం కాదులే, నాన్నా!” అన్నది అమ్మ. మద్రాసు అడయార్లో పెద్ద ఆస్పత్రికి తీసికెళ్ళా. V.I.P.treatmentఇచ్చారు. ఒక స్థాయిలో డాక్టర్ ‘Secondaries వచ్చాయేమో’ అన్నారు. వణికిపోయాను. దుఃఖసముద్రంలో మునిగిపోయాం. మర్నాడు ‘టి.బి. వచ్చింది’ అన్నారు. ఆ మర్నాడు ‘టి.బీ లేదు; కాన్సరూ లేదు’ అన్నారు. ఆ తర్వాత మా అక్కయ్య హాయిగా 26 ఏళ్ళు బ్రతికింది. కొన్నాళ్ళు జిల్లెళ్ళమూడిలో అమ్మ సేవచేస్తూ అమ్మ నామం వ్రాసుకుంటూ ఉంది.

అలా నాకు అడుగడుగునా Miracles. నా రెండవ కుమారుడు రామకృష్ణకి చిన్నతనంలో ఒంటనిండా కురుపులు వచ్చాయి. డాక్టర్ నారపరాజు శ్రీధరరావు గారు నాకు సన్నిహితులు. ఇంటికి వచ్చి ఇంజక్షన్ చేసేవారు. అయినా తగ్గలేదు. ఈసంగతి నేను అమ్మకి చెప్పలేదు. అమ్మే నన్ను పిలిచి “ఏరా! తగ్గటం లేదా? రేపల్లెవాళ్ళు నాకు ఒక తైలం ఇచ్చారు. ఇది వాడు. అయిన తర్వాత తెప్పించుకో” అని ఆ సీసా ఇచ్చింది. తగ్గిపోయాయి వాడి కురుపులు, మరలా ఆ మందు తెప్పించలేదు. “ఏం? తెప్పించలేదు. ఎందుకని?” అమ్మ అడిగింది నన్ను. ‘అమ్మా! ఆ తైలం వలన తగ్గలేదు. నువ్వు ఇచ్చావు కాబట్టి తగ్గింది’ అన్నాను.

ఒకసారి మా పెద్ద అక్కయ్యకు జబ్బుచేసింది. పళ్ళు, కలకండ తీసుకుని అమ్మ వద్దకుపోయా, “నాన్నా! విద్యాలయానికి ఇవాళ పోయావా? పిల్లలకి ఏం పెడుతున్నారు?” అని అడిగింది. ‘పోలేదమ్మా. మా అక్కయ్యకు వంట్లో బాగాలేదు. ప్రసాదం కోసం వచ్చాను’ అన్నాను. ప్రసాదం ఇచ్చింది. దానితో ఆమెకు నయమైంది. అమ్మ మీద భారం వేస్తే తగ్గుతాయి. ఈ నాటికీ నమ్ముకునే ఉన్నాను. అమ్మ నన్ను కనిపెట్టుకుని ఉంది.

ఆరు సంవత్సరాలు ‘మాతృశ్రీ విద్యాలయం’ నడిపాం. 1985లో అమ్మ శరీరత్యాగం చేశాక అక్కడ ఉండలేక వచ్చేశాను. అంతేకానీ ఎవరితోనూ నాకు అక్కడ తగాదాలు లేవు. చిలకలూరి పేటకి వచ్చి కూడా స్కూల్ నడిపా. 1100 మంది విద్యార్థులతో బాగా నడిచింది.

లాభాల కోసం నడవలేదు. అక్కడ అమ్మ ఉచితంగా చదువు చెప్పిస్తోంది. ఇక్కడ వాడి రూపాయతో వాడికి నాణ్యమైన చదువు అందించాలనుకున్నాను. నన్ను ‘మాతృశ్రీ వాసుదేవాచారిగారు’ అని పిలిచేవారు ఇక్కడ.

జిల్లెళ్ళమూడి నానాటికీ అభివృద్ధి చెందుతోంది. ‘డ్రెస్ని బట్టి ఆడ్రస్ని ఐట్టి కాదు, ఆకలే అర్హత అన్నపూర్ణాలయంలో అన్నం తినటానికి’ అని అమ్మ శిక్షణ నిచ్చింది. నిర్దేశించింది. అలాగే నేటికీ ఆదరణగా పెడుతున్నారు. మాటలు కాదు. మాటలు చాలమంది చెప్పారు. అక్కడ ఆచరణ కనిపిస్తుంది. కాగా వందల ఏళ్ళ నుంచీ ఉన్న దేవాలయాలతో పోలిస్తే ఇది అలా కనిపించదు. ఇక్కడ దేనికీ రుసుములేదు; కొబ్బరికాయకి, పూజకి, అభిషేకానికి దేనికీ లేదు. ఇక్కడ అన్నీ ఉచితమే. ఎంతమంది వస్తారో ఏవేళ వస్తారో తెలియదు. కానీ ఇవాల్టికి కూడా ఒక Standard తో భోజనాలు పెడుతున్నారు. Dining tables, chairs వచ్చాయి. వంటశాల Modernize చేశారు. వసతి ఇంకా పెంచాలి. ఒకసారి నేను అమ్మతో ‘అమ్మా! అంతా బాగానే ఉంది – అభివృద్ధిలేదు’ అన్నాను.

“నాన్నా! నీ ఉద్దేశం అభివృద్ధి అంటే buildingsఅనా! కానీ నా ఉద్దేశంలో అభివృద్ధి అంటే ఇంకా వేలమంది భోజనం చేసి పోవటం – అది జరుగుతోంది” అన్నది అమ్మ.

1980 నుంచీ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో క్లాసెస్ తీసుకుని ఇంగ్లీష్ చెప్పేవాడిని. పరీక్షలకు పంపేవాడిని. మంచి ఫలితాలే వచ్చేవి. అక్కడ విశేషమేమంటే Quality Education, buildings కాదు. అంకిత భావంతో పనిచేసే సిబ్బంది మూలస్తంభాలు. ఒకప్పుడు కాలేజికి Building లేదు. వరండాలోనో, చెట్టుక్రిందో, మాస్టారు ఇంటి దగ్గర నులకమంచం మీద కూర్చుని పిల్లలను చుట్టూ చేర్చుకునో పాఠాలు చెప్పేవాళ్ళు. ఒక సమయం అంటూలేదు. Buildings do not make a great university or a great college ‘విద్యాధనం సర్వధన ప్రధానం’ – లక్ష్యంతో ఉచితంగా ఉన్నత విద్యను అందించటానికి అమ్మ ఓరియంటల్ కాలేజిని స్థాపించింది. అన్ని బాధ్యతలూ తీసుకుంది. దుస్తులు, ఉచిత భోజన వసతి సౌకర్యాలు.

అమ్మ చెప్పినందున 6 1/2 ఎకరాల పొలం కొన్నాను- జిల్లెళ్ళమూడిలో. డబ్బులేదు, ఎట్లాకొనమంటావంటే అప్పు చేసికొనమన్నది. Registration ఎట్లా చేయించమంటావంటే “నీ పేర చేయించు” అన్నది.

1985 ఫిబ్రవరిలో అమ్మ ఆవరణలోని అందరి ఇళ్ళకి వచ్చింది. గాయత్రీ భవన్లో ఉన్న మా ఇంటికీ వచ్చింది. “విద్యాలయానికి శంకుస్థాపన చేయమంటావా?” అన్నది. ‘కాలేజి పునాది స్థాయిలోనే ఉంది. బ్యాంకులు ఋణాలు ఇస్తాయి. కానీ తీర్చేదెలా? అంత లాభం మనకిరాదు’ అన్నాను. సిబ్బంది అంతా అమ్మ సన్నిధిలో ఉండాలి, సేవ చేసుకోవాలి, అని వచ్చి అంకితభావంతో పనిచేశారు. జీతంకోసం ఎవరూ రాలేదు. అమ్మ చెప్పిన మాటని తు.చ. తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నించాం. అమ్మ ఒక మాట అన్నది, “తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి పిల్లలు మీ దగ్గర ఎందుకుంటారు? అంతకంటే బాగా చూస్తే ఉంటారు, అంతకంటే బాగా పెడితే ఉంటారు” – అని. పిల్లలు రాత్రివేళ లేచి పెన్నో చాక్లెటో కావాలంటే ఇస్తాం. తల్లి కావాలంటే ! అయితే అమ్మ అనుగ్రహంతో మాకు ఆ పరిస్థితి రాలేదు. పిల్లలు బాగా తినేవాళ్ళు, ఆడుకునే వాళ్ళు, పుష్టిగా ఉండేవాళ్ళు. వాళ్ళని వారానికొకసారి అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళేవాళ్ళం. వాళ్ళ చేతుల్లో ఏమీ పెట్టకుండా పంపించేది కాదు అమ్మ.

మనం ఎక్కడ కూర్చుని ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా, అమ్మ వింటుంది, చూస్తుంది- అనటానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఒకసారి నేను అమ్మకి చీరె తీసుకునివెళ్ళాను. లోపలి గదిలో అమ్మ స్నానం చేస్తోంది. నన్ను చూసి లోపలికి వెళ్ళి అమ్మకి చెప్పిన వాళ్ళెవరూ లేరు. అమ్మ లోపల నుంచి కబురు చేసింది. ఒక అక్కయ్యతో “వాడు చీరె తీసుకువచ్చాడు! తీసుకురా. నేను కట్టుకుంటా” అని. నూలు పోగయినా సరే – మన అభిమానం, గౌరవం- అదీ విలువ అమ్మకు. తనకు గొప్పవారనీ తక్కువవారనీ భేదం లేదు.

అందరం అమ్మ ఎడల విశ్వాసం పెంచుకోవాలి. పనులైతే అమ్మ, కాకపోతే ‘అమ్మకు దయ ఏదీ?’ అనకూడదు. ఎందుకంటే కాకపోవటం కూడా నా అనుగ్రహమే అని చెప్పింది. ఆ మాటలు మనం చదువుకోవటం, వినటం కాదు; ఆచరణలో పెట్టుకోవాలి. అప్పుడు హాయిగా ఉంటుంది.

నా జీవితంలో అమ్మ నన్ను అద్భుతరీతిలో రక్షించింది. డిసెంబరు 31వ తేదీ రాత్రి నూతన సంవత్సరం పండుగ దివ్యంగా జరిగేది. కేక్, రస్కులు, బిస్కెట్లు, టీ అన్నీ అమ్మే ఇచ్చేది. ఆ పండుగకు ఒకసారి నేను జిల్లెళ్ళమూడి వెడుతున్నాను. నాకుటుంబ సభ్యులతో బయలుదేరాను కారులో. అప్పట్లో సరైన బాట కూడా లేదు. సాయంత్రం 7వ మైలు దగ్గర టర్నింగ్ తిరిగే సమయంలో ఒక బజ్జె అడ్డం వచ్చింది. Steering fail అయింది. డ్రైవర్ తెలిసినవాడే. బ్రేక్ వేశాడు. ప్రక్కన పెద్ద కాల్వలో పడాల్సింది; మేము బ్రతికాం.

కాసేపట్లో శేషగిరిరావు అన్నయ్య వ్యాన్ లో వస్తున్నాడు; మాకు లిఫ్ట్ ఇచ్చాడు. అందరం అమ్మ వద్దకు వెళ్ళాం. “ఇద్దరూ కలిసే వచ్చారా, నాన్నా!” అని అడిగింది అమ్మ. ‘కాదమ్మా! నీ దయవలన బ్రతికాం. కారు స్టీరింగ్ ఫెయిల్ అయింది’ అన్నాను. “ఇక్కడ ఉంది కదా Steering” అన్నది అమ్మ నవ్వుతూ చాల ఆశ్చర్యం వేసింది నాకు.

ఒకనాడు ఒక దంపతులు వచ్చారు. ఆమె మతాంతరీకరణ చేసుకుంది; ఆమె ఆరోగ్యం బాగాలేదు. భర్త జిల్లెళ్ళమూడి పోదామన్నాడు. ‘నేనెట్లా వస్తాను, మతం పుచ్చుకున్నాను కదా!’ అన్నది ఆమె. ఎలాగో ఇద్దరూ వచ్చారు. ఆయనేమో అంతా అమ్మే నని అంటాడు. బీరువాలో ఉన్న క్రీస్తు బొమ్మ తీసుకురమ్మన్నది అమ్మ నాతో. తెచ్చా, ఆ బొమ్మను ఆమె కిచ్చింది. “నీకేది ఇష్టమైతే అదే చెయ్యి” అన్నది ఆమెతో.

సాయంకాలం నాచెయ్యి పుచ్చుకుని అమ్మ గంటలు గంటలు అటూ ఇటూ తిప్పేది. ఒకసారి మాట్లాడుతూ, “ఈ సంస్థలో డబ్బులు కాజేయటమంటూ ఏముంటుంది? నాన్నా! లేనప్పుడు తీసుకోవటం ఉన్నప్పుడు ఇవ్వటం” అన్నది. అంతటి విశాల హృదయాన్ని మనం ఎక్కడా చూడం.

ఒకసారి కాలేజిలో ఒక కుర్రవాని క్రమశిక్షణారాహిత్యం తారస్థాయికి చేరింది. వాడు ఉంటే ఇతర పిల్లలు కూడా చెడిపోతారని ప్రిన్సిపాల్గారు, మేము అంతా టి.సి. ఇచ్చి పంపేద్దాం అనుకున్నాం. విన్న అమ్మ కళ్ళవెంట బొటబొటా నీరు కార్చింది. అది చూసి ఆ ఆలోచన విరమించుకున్నాం. మన పిల్లవాడే అల్లరి చేస్తే బయటికి పంపిస్తున్నామా? లేదు. అదే సమస్య ఇక్కడ కూడా. పరిపాలన దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరికైనా అమ్మ ప్రభావం ఉంటే బాగా పనిచేస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి; వాడిని శిక్షించలేము మార్చలేము.

రంజాన్, క్రిస్టమస్, జనవరి 1వ తేదీ అన్ని పండుగలూ జరిపేది ‘అమ్మ’. అమ్మ లాంటి మహితాత్ములు కనపడరు. నా సుకృతం వలన అమ్మకి అంత సన్నిహితంగా ఉన్నాను. ఆ అనురాగం, రక్షణ ఎల్లకాలం కల్పిస్తుందని విశ్వసిస్తున్నాను.

అమ్మతో ప్రయాణం చేసే అదృష్టం నాకు కలిగింది. అమ్మ మద్రాసులో ఉండగా నేను వెళ్ళి కలిశాను. అక్కడి నుంచి రమణమహర్షి ఆశ్రమం, చలంగారిని చూడటానికి వెళ్ళాం.

నాన్న (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు) గారిని చూసి చాల నేర్చుకోవాలి. Simple living and high thinking.

నేను కొన్నాళ్ళు Plastic industry నడిపాను. దాంట్లో బాగా నష్టం వచ్చింది. ఆ విషయాలన్నీ అమ్మకి చెపుతూ ‘అమ్మా! నిన్ను విసుగిస్తున్నానేమో!’ అన్నాను. “విసుగు – కోపం ఉంటే నేనెందుకు, నాన్నా!” అన్నది.

అమ్మ సాహిత్యం అప్పట్లో కొద్దిగా ఉండేది. వెళ్ళిన వాళ్ళకి అమ్మే ఇచ్చేసేది పుస్తకాలు. అమ్మటం ఇష్టం లేదు అమ్మకు. ఇప్పుడు సాహిత్యం విపరీతంగా పెరిగింది. ఏవిధంగానూ అమ్మ ఋణం తీర్చుకోలేను. ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు మనస్తాపం ఉంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి;

1. 40 కి.మీ.ల దూరంలో జిల్లెళ్ళమూడి ఉంది. అంత దగ్గరగా ఉన్నా, వెళ్ళి అమ్మ దర్శనం చేసుకోలేకపోతున్నాను.

2. అమ్మ అమృత హస్తాలతో ప్రారంభించబడిన సంస్థలు అన్నపూర్ణాలయం, M.O.C; M.M.C; ఆదరణాలయం, ఆలయాలు …. అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి. విద్యాలయానికి అమ్మ శంకుస్థాపన చేసి ఉంటే, అది ఆగకుండా ఉండేది. అంతా అమ్మ సంకల్పం అనటానికి వీలులేదు. మనం చేసే తప్పిదాలు కూడా ఉన్నాయి.

అమ్మ వెళ్ళిపోయింది అని నాకు అనిపించదు. ‘మనస్సెక్కడో మనం అక్కడ’ అనేది నానుడి. నామనస్సు ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉంటుంది. అమ్మను ఎప్పుడో 30 ఏళ్ళ క్రిందట కాదు – ఇప్పుడే చూసినట్లు ఉంటుంది. అది అమ్మ నాకు ఇచ్చిన వరం – అదృష్టం.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!