P S R Anjaneya Prasad

Interviewed by
Ravuri Prasad
01/09/2012
Bapatla

 

శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్

 

వీరు సంతమాగులూరు మండలం, ఏల్చూరు గ్రామంలో 30-4-1939న జన్మించారు. జననీ జనకులు శ్రీ పోతరాజు పురుషోత్తమరావు, శ్రీమతి స్వరాజ్యలక్ష్మి, భార్య – శ్రీమతి వెంకట జయలక్ష్మీ శేషగిరిబాల. సంతానం ముగ్గురు కుమారులు. విద్య బి.ఎ., ఉద్యోగం ~ మాజేటి గురవయ్య హైస్కూల్, గుంటూరులో Senior Assistantగా పదవీ విరమణ చేశారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి సోదరులు వీరు.

సేవాతత్పరత : “అమ్మ”, నాన్నగారు, సుబ్బారావు అన్నయ్య, రవి అన్నయ్య, హైమక్కయ్య అందరూ వీరింటికి వచ్చారు. అమ్మ కుటుంబ సభ్యులలో ఒకరిగా ఆదరించబడ్డారు. గత 15 సంవత్సరాల నుండి సమర్థవంతంగా ‘విశ్వజనని’ మాసపత్రిక సంపాదకులుగా కృషి చేస్తున్నారు. అడుగడుగునా అమ్మకారుణ్యాన్ని అమోఘశక్తిని దర్శించి పరవశిస్తున్నారు. అమ్మను గురించి ‘విశ్వజననీ వీక్షణం’, ‘ఆనందనందనం’, ‘మాతృశ్రీ దర్పణం’, ‘గిరిబాల గీతాలు’ వంటి అనేక గ్రంథాలు రచించారు. అమ్మ స్వయంగా వీరిని ‘ఈస్థానకవి’ అని అభిమానించింది. వివిధ కోణాల్లో అమ్మపై ఎవరు రచనలు చేసినా అవి తక్షణం వెలుగు చూడాలని నిరంతరం తపించే అమ్మ ముద్దుబిడ్డ. SVJP కార్యక్రమాల్లో, అమ్మ తత్త్వ ప్రచార కార్యక్రమాల్లోనూ త్రికరణశుద్ధిగా తన వంతు సేవలనందిస్తారు. ప్రస్తుతం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంటుగా కూడా వ్యవహరిస్తున్నారు.

శ్రీ రావూరి ప్రసాద్ 01-9-2012వ తేదీన బాపట్లలో శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం. 

****************


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

తొలిసారిగా మీరు అమ్మను దర్శించిన అనుభవం వివరించండి.

1958 లో తంగిరాల కేశవశర్మగారు, నేను R.S.S.లో పనిచేసేవాళ్ళం. ఆయన అమ్మ యందు విశేషమైన భక్తి ప్రపత్తులు కలవాడు. సాయంకాలం ఆఫీసు పని అయ్యాక గుంటూరు నుంచి 50 కి.మీ. సైకిల్ మీద జిల్లెళ్ళమూడి వెళ్ళి ఉదయం మళ్లీ 50 కి.మీ.లు సైకిలు మీద ప్రయాణించి గుంటూరు చేరుకునేవాడు. ఆయన నాతో చెప్పిన మీదట మేమిద్దరం కలిసి ఒక పౌర్ణమినాడు బయలుదేరాం అమ్మ దర్శనానికి. దారిలో అమ్మ జన్మస్థలం మన్నవ వెళ్లాం. అప్పటికే కొంచెం చీకటి పడుతోంది. అమ్మ సోదరులు రాఘవరావు మామయ్యగారు పట్టుపట్టటం వలన ఆ రాత్రి వారింట్లో భోజనం చేసి విశ్రమించి, మర్నాటి ఉదయం బయలు దేరాం – జిల్లెళ్ళమూడికి. 7వ మైలు దాకా చేరాం. అక్కడికి అమ్మనామం శ్రావ్యంగా వినిపిస్తోంది. అప్పుడు అమ్మ ఉండేది చిన్నపాక, కేశవశర్మ నన్ను అమ్మ దగ్గర కూర్చోబెట్టాడు. నాడు అమ్మకి రక్తవిరోచనాలు, ఒంట్లో బాగాలేదు. కేశవశర్మ వెళ్ళి పేడ, మట్టి పెట్టి అమ్మ నివశిస్తున్న ఆ పాక తడికెలు అలకటం వంటి ఇంకేవో పనులు చేస్తున్నాడు. నేనలా అమ్మవద్ద 3 గంటలు కూర్చున్నాను. అమ్మ నన్ను ఏమీ పలకరించ లేదు. తర్వాత కేశవశర్మ వచ్చి నన్ను భోజనానికి తీసుకు వెళ్ళాడు. తిరిగి వచ్చి మళ్ళా అమ్మ వద్ద కూర్చున్నాను. అంతే. ఈసారీ అమ్మ ఏమీ మాట్లాడలేదు. ఆ సంగతే ఆయనకి చెప్పాను. అమ్మకి నన్ను పరిచయం చేస్తానన్నాడు కేశవ. ‘వద్దు – అమ్మ అనే భావంతో నేను వచ్చాను; బిడ్డ అని ఆమె నన్ను దగ్గరకి తీయాలి; అది ఆమె బాధ్యత. ఆమెకి అందరూ బిడ్డలేనన్నావు కదా!’ అన్నాను. 4 గంటల ప్రాంతంలో బయలుదేరి సైకిళ్ళపై తిరిగి గుంటూరు వచ్చాం. ఆనాడు నాకేమీ impression కలగ లేదు. అయినా కేశవశర్మ రోజూ అమ్మను గురించి చెపుతూనే ఉండేవాడు. అమ్మ మీద పద్యాలు వ్రాయాలని నాకు అనిపించింది. నాకు తెలియకుండా అమ్మ అనుగ్రహశక్తి నా మీద పనిచేయటం ప్రారంభమయింది.

ఆ తరువాత ఎప్పటికీ అమ్మ ఆదరణ లభించింది?

కృష్ణభిక్షువు, మిన్నికంటి గురునాధశర్మగారు, డాక్టర్ ప్రసాదరాయ కులపతి వంటి సాహిత్య దిగ్గజాలు ఆ రోజులలో తరచు అమ్మ దగ్గరకి వెళ్ళేవాళ్ళు. అది 1960 సంక్రాంతి. ‘కులవతి’గారు అమ్మ మీద 300 శ్లోకాలు, 700 పద్యాలతో ‘అంబికా’ అనే గ్రంధాన్నీ, మిన్నికంటి గురునాధశర్మగారు ‘అమ్మ’ అని అమ్మ చరిత్రనే కావ్యంగా వ్రాసినది; వాడరేవు సుబ్బారావుగారు ‘మాతృశ్రీ అనసూయాదేవి’ అనే కవితా సంకలనం… వీటిని తీసికొని వెళ్ళారు. వారితో నేనూ వెళ్ళాను జిల్లెళ్ళమూడికి. నాటి సభలో అమ్మ ఆ పుస్తకాల్ని ఆవిష్కరించింది. తర్వాత ‘కులవతి’గారు ఒక ప్రకటన చేశారు ‘ఎవరైనా అమ్మ మీద రచనలు. చేస్తే చదువవచ్చు’ అని. అప్పటికే నేను వ్రాసిన పద్యాలు, గేయాలు వెళ్ళి అక్కడ చదివి; వచ్చి ఎదురుగా కూర్చున్నాను. కులవతిగారితో అమ్మ “నాన్నా! ఆ పుస్తకంలో వాడి పద్యాలు ఎందుకు వేయలేదు?” అని అడిగింది stage మీదే. ‘వాడు వ్రాస్తాడని మాకు తెలియదమ్మా’ అన్నారాయన. “వాడిని పిలవండిరా” అంది అమ్మ. నేను వేదిక మీదికి వెళ్ళాను. దగ్గరకు రమ్మని పిలిచి, అందరు దిగ్దంతులు వేదిక మీద ఉండగా, తన మెడలో ఉన్న దండను తీసి నా మెడలో వేసింది. నమస్కారం చేసి కూర్చున్నా. “నాన్నా! వెళ్ళే లోపల నువ్వు మళ్ళీ ఒకసారి ఈ పద్యాలు చదివి వినిపించరా” అన్నది. అలాగే మళ్ళీవెళ్ళి చదివి వినిపించా. నా నొసట బొట్టు పెట్టింది. అప్పటికప్పుడే మరి రెండు పద్యాలు వ్రాశా. “వచ్చే ఆదివారం వస్తావా?” అన్నది. అంటే రమ్మని సూచన. అప్పటి నుంచి అమ్మ వద్దకు నా రాకపోకలు అవిచ్ఛిన్నంగా సాగుతున్నాయి.

అమ్మని దర్శించిన తొలిరోజుల్లో జిల్లెళ్ళమూడిలో అందరింటి వాతావరణం ఎలా ఉండేది?

నేను పనిచేస్తున్నది హిందూకాలేజీ హైస్కూల్ గుంటూరులో, నాకు లైబ్రేరియన్ పదోన్నతినిచ్చి, నాకు సహాయకునిగా అమ్మ పెద్ద కుమారుడు బ్రహ్మాండం సుబ్బారావుని నియమించారు. పున్నమినాటి రాత్రులలో అమ్మ నల్లమడ కాల్వలో స్నానం చేసేది. దానిని ‘ఓంకారనది’ అని పిలిచేది అమ్మ. అక్కడికి సుబ్బారావు, నేనూ కూడా వెళ్ళేవాళ్ళం. అమ్మ స్నానం చేసే విధానం కృష్ణుడు గోపికలతో స్నానం ఆచరించినట్లు ఉంటుంది. అసలు అమ్మ ఆకర్షణ సంగతి అలా ఉంచండి. జిల్లెళ్ళమూడి వాతావరణమే నన్ను ఆనంద ఆశ్చర్యాలలో ముంచెత్తి వేసింది. ఋష్యాశ్రమాల్లో పరస్పర విరుద్ధములైన జంతువులు సహజీవనం చేసేవి అని విన్నాం. అమ్మ సన్నిధిలో కుక్క దగ్గర పిల్లులు పాలు త్రాగటం నేను చూశాను. ‘అన్నయ్యా!’ ‘అక్కయ్యా!’ అనే పిలుపులు. ఏమా ఆప్యాయత! ప్రేమానుబంధం! అపూర్వం. భేదభావం గానీ వికారభావం గానీ కలుగదు. ఆ అద్భుత వాతావరణమే నన్ను తరచు అమ్మ దగ్గరకి లాక్కువెళ్ళేది. నాకంటే చాలా పెద్దవాళ్ళు – గోవిందరాజుల దత్తుగారు, చీరాల డాక్టర్ గారు, శ్రీ హర్షరావు గారు ఎందరో నన్ను తమ్మునిగా ఆత్మీయసోదరునిగా అభిమానించి నా రచనల్ని ప్రోత్సహించేవాళ్ళు. ఆ రోజుల్లో అక్కడ ఈనాటి వసతులు ఏవీ లేవు. అమ్మ సమక్షంలో ఆహ్లాదకరంగా, హాయిగా ఉండేది. లోకంలో దొరకని ప్రశాంతత, అనురాగం, ఆనందం అక్కడ దొరికేవి.

అమ్మ సన్నిధిలో మీరు పొందిన అనుభవాల్ని తెలుపండి.

ఆ రోజుల్లో బాపట్లలో దిగి ఆఖరి బస్సుపోయిందంటే నడచుకుంటూ జిల్లెళ్ళమూడి పోయేవాళ్ళం. ‘జయహోమాతా శ్రీ అనసూయా’ అనుకుంటూ పోవడమే. పాములు, తేళ్ళు, మండ్రగబ్బలు ఏవో ఉంటాయనే ఆలోచనే లేదు. ఒకసారి నేను మట్టిపూడి మీదుగా పొలాలగట్లపై నడచి ఒక్కడనే వచ్చాను రాత్రిపూట. మార్గంలో ఒక కాల్వ దాటవలసివచ్చింది. కాల్వ ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎక్కడ దిగాలో తెలియదు. దిగితే కొట్టుకుపోతాననిపించింది. ఎవరైనా కనిపిస్తే ఎక్కడ దిగితే వీలుగా ఉంటుందో తెలుస్తుంది అనుకుంటూ ఒక అర ఫర్లాంగు అటూ ఇటూ తిరిగాను. కొంతసేపటికి కాల్వకట్ట క్రింద గడ్డి కప్పుకుని ఒకతను పడుకుని ఉండటం చూశాను. పిలిచా. ఏమిటి ? అన్నాడు. జిల్లెళ్ళమూడి అమ్మను చూడటానికి వెడుతున్నాను కాల్వ ఎక్కడ దాటాలో చెప్పమన్నాను. వాడు లేవటానికి బద్ధకించాడు. కాఫీ డబ్బులిస్తానని బ్రతిమలాడాను. లేచి వచ్చి దారి చూపించాడు. డబ్బు తీసి ఇవ్వబోతే వద్దన్నాడు. అలా కాదని అతడి చేతిలో పెట్టి జిల్లెళ్ళమూడి వచ్చా. రాత్రి 12 దాటింది. తిన్నగా అమ్మదగ్గరకి వెళ్ళిపోయాను. “ఏమిటీ! ఇప్పుడొచ్చావేమిటి? నాన్నా” అన్నది అమ్మ. ‘ఆలశ్యమైందమ్మా ఇవాళ’ అన్నాను. “కాల్వదాటించిన వాడికి ఎంత ఇచ్చావు?” అని అడిగింది. మళ్ళీ వెంటనే “వాడికి కాఫీ డబ్బులు ఉంచుకో అని ఇచ్చావుగా!” అన్నది. నాకు ఆశ్చర్యం వేసింది. మనల్ని అమ్మ నిరంతరం వెన్నంటి ఉందా! అని ఆశ్చర్యం వేసింది. ఆమె మనకంటె అతీతమైనశక్తి. ఈమెను వదలకూడదు అనే నిశ్చితాభిప్రాయం అప్పుడు కలిగింది. స్వాములు, సన్యాసులు మనల్ని దగ్గరకే రానివ్వరు. వేళాపాళా లేకుండా అర్థరాత్రి అపరాత్రి అయినా ఈమె తన దగ్గరకు రానిస్తోంది.

ఒకసారి అమ్మ నన్ను “బాపట్ల వెళ్ళి బత్తాయికాయలు కొనుక్కురా” అని చెప్పింది. అమ్మ అన్నం తినదుకదా! ఎప్పుడైనా పళ్ళరసం తాగేది. బాపట్ల బయలుదేరా, బస్సులో సీట్లు లేవు. జనం బస్సు పైకెక్కి కూర్చున్నారు. సరే. నేను కూడా పైకెక్కి కూర్చున్నా. ప్రైవేట్ బస్సు. పళ్ళు తీసుకున్నాను. తిరిగి వస్తున్నా. ఆశ్చర్యంగా అమ్మ ‘రవి’తో పాటు మరెవరినో 7వ మైలుకు పంపింది.

“వాడు బత్తాయికాయలు తీసుకొని వస్తున్నాడు” అని; అదేదో మోయలేని భారం అయినట్లు. వాళ్ళు నాకు కనిపిస్తున్నారు. అది రాత్రి సమయం. ముగ్గురు నలుగురు దొంగలు 7వ మైలు వంతెన మీద ఉన్నారు. తన్ని ఏది ఉంటే దానిని తీసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నాకేం తెలియదు. రవి వాళ్ళు నా దగ్గరకి రావటం చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. ‘ఇలాంటివి జరుగుతున్నాయి ఇక్కడ, అందుకే అమ్మ మమ్మల్ని పంపించిందేమో!’ అన్నారు ‘రవి వాళ్ళు’ వాళ్ళని చూసి.

ఒక ఏడాది దసరా పూజలు అయిపోయాయి. నిర్మాల్యం తీసుకు వెళ్ళి ‘ఓంకారనది’లో కలిపి స్నానం చేసి తిరిగి వస్తున్నాం. తంగిరాల శాస్త్రిగారి భార్య తన మెడ చూసుకుని ‘నా తాళిబొట్టు పోయింది’ అని గాబరా పడింది. స్నానం చేస్తూండగా పోయిందట. అందరం వెనక్కి వెళ్ళి స్నానం చేసిన గుర్తులను బట్టి వెదుకుతున్నాం ఆ నీళ్ళల్లో. నాకు ఏదో కొమ్మలా తగిలింది; బయటికి తీసా. తాళిబొట్టు, బంగారపు గొలుసు. ఆమె ఆశ్చర్యపోయింది. తిరిగి వచ్చాక అమ్మకి ఈ సంగతి చెప్పారు; “వాడు ఆంజనేయుడు కదరా ! వాడికి దొరక్క ఏం చేస్తుంది?” అన్నది. అమ్మతో అలా గడపటం అదో తన్మయత్వం – ఆనందం.

మీరు చేస్తున్న అమ్మ సాహిత్యసేవ ఎలా మొదలైంది?

1962లో అమ్మ జన్మదినోత్సవానికి మాతృశ్రీ పత్రిక (ప్రత్యేక సంచిక) వేద్దామనుకున్నారు. వ్యాసాలు బ్రహ్మాండం సుబ్బారావు చొరవతో నేను సంపాదించాను. 1963, 64, 65, 66 సంవత్సరాల్లో కూడా ఏడాదికి ఒక ప్రత్యేక సంచికను ప్రచురించారు. 1966 నుంచి కొండముది రామకృష్ణ సంపాదకునిగ ‘మాతృశ్రీ’ మాసపత్రిక అవిచ్ఛిన్నంగా వచ్చింది. అమ్మ ఆలయ ప్రవేశం చేశాక కూడా రామకృష్ణ సంపాదకునిగ కొంతకాలం సాగింది ఆ పత్రిక. ఆయనకు ఇబ్బంది కలిగినప్పుడు శ్రీ విఠాల రామచంద్రమూర్తి, ధర్మసూరి, కేశవశర్మ ప్రభృతులు, సంపాదకీయాలు వ్రాశారు. నేనూ దాదాపు మూడు సంవత్సరాలు సంపాదకీయాలు వ్రాశాను. తర్వాత అనివార్యకారణాలవల్ల మాతృశ్రీ పత్రిక ప్రచురణ ఆగిపోయింది. 1999లో హైదరాబాద్వారు త్రైమాసిక పత్రిక ‘Mother of All’ పేరుతో ప్రారంభించారు. దరిమలా ‘మాతృశ్రీ’ స్థానే ‘విశ్వజనని’ మాసపత్రిక వచ్చింది. గోపాలన్నయ్య Managing Editor గా నేను Editor గా దాదాపు 15 సంవత్సరాలుగా ఆ పత్రిక నిర్వహిస్తున్నాం. అలా అమ్మ చేయిస్తోంది. అమ్మ మనకి ఎంతో మేలు చేయ పూనుకుని ముందు మనచేత కించిత్ సేవచేయిస్తుంది. ఇదీ అమ్మ విధానం. ఇది నాకు అడుగడుగునా అనుభవం. భరద్వాజ, కుమారి, కొండముది రామకృష్ణ, గోపాలన్నయ్య .. అందరి గ్రంథాల ప్రచురణ కోసం తపన పడుతున్నాను. ఇలా సేవలందించటం కేవలం అమ్మ అనుగ్రహం.

నాన్నగారి ఆరాధనోత్సవాల్లో ధాన్యాభిషేకం - ఎప్పుడు ఎలా ప్రారంభమైంది?

1985లో అమ్మ ఆలయంలో చేరిన తర్వాత జిల్లెళ్ళమూడి సంస్థ ముఖ్యంగా నిరతాన్నదాన కార్యక్రమం నడవటానికి ఇబ్బందిగా ఉండేది. అతఃపూర్వం, వల్లూరు జగన్నాధరావుగారు Monthly/ Yearly Deposit Scheme; కొమరవోలు గోపాలరావుగారు శుక్రవారం పూజలు, Permanent Monthly Deposit scheme, Permanent Fixed Deposit Scheme వంటి Scheme లు పెట్టారు. ఆ రోజుల్లో సమకూరిన 6, 7 లక్షల రూపాయలు అప్పులు తీర్చటానికి కరిగిపోయాయి. ఒకరోజు గుంటూరు నుంచి నేను, వారణాసి ధర్మసూరి జిల్లెళ్ళమూడి వస్తున్నాము. నేనన్నాను ‘లోకంలో ప్రజలకు అన్నదానం అంటే ఇష్టం. అమ్మ “దానం కాదు, బిడ్డలకు పెట్టుకుంటున్నాను” అన్నది. అయినా లోకంలో జనం అంతా మానసికంగా అలా ఉంటారు. కనుక ‘ధాన్యాభిషేకం’ అని పెడదాం. ఇది ఎక్కడా లేదు అన్నాను. ‘సరే. బాగుంది నీ ఆలోచన’ అన్నాడు. ఆ రోజే ఆ కార్యక్రమాన్ని జిల్లెళ్ళమూడిలో ప్రారంభించాం. రవి, మధు, అందరూ ఇచ్చారు. అప్పటికప్పుడు 18 బస్తాలు పోగైనాయి. 1986 మాతృశ్రీ పత్రికలో వేశాం; 80 బస్తాల బియ్యం వచ్చాయి. అమ్మ ఆశీర్వచనం వల్ల ఆ scheme జయప్రదమైంది. గోవిందరాజులు దత్తుగారు అంటుండేవారు – ‘అమ్మకంటే నాన్నగారే గొప్ప’ అని. నాన్నగారి ఆరాధనోత్సవ సందర్భంగా ‘ధాన్యాభిషేకం’ రావటం అమ్మ ప్రణాళికలో భాగమే. అమ్మ జన్మదినోత్సవానికి ఖర్చే తప్ప ఆదాయం లేదు. రాబడి నాన్నగారి ఆరాధనోత్సవానికి. అమ్మ మనల్ని ఎట్లా నడిపిస్తున్నదో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ధాన్యాభిషేకం వలన ఇవాళ సంస్థ స్థిమితంగా బలంగా ఉన్నది. ప్రేరణ అమ్మదే ఆచరణా అమ్మదే.

మిమ్మల్ని ప్రభావితం చేసిన అమ్మ మహిమ లేమైనా చెప్పండి?

1968 ప్రాంతంలో యార్లగడ్డ రాఘవయ్యగారు జిల్లెళ్ళమూడిలో ఇల్లు కట్టుకున్నారు. నాడు వారి పాకలో గృహప్రవేశానికి అమ్మ వచ్చింది; వాళ్ళు అమ్మకి పూజ చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో నాకు Kidney Stones ఉండి కడుపులో నెప్పి వచ్చేది; భరించలేని బాధ, చనిపోతే బాగుండుననిపించేది. Baralgan వేసి నెట్టుకొస్తున్నా. సరిగ్గా అమ్మ వద్ద ఉన్న సమయంలో నాకు నెప్పి వచ్చింది. ‘రవి’ వెళ్ళి అమ్మతో ‘పి.యస్.ఆర్. కడుపునెప్పితో చాలా బాధపడు తున్నాడు’ అని చెప్పాడు. “వాడిని తీసుకురారా” అంది అమ్మ. బాధతోనే వెళ్ళి అమ్మ కుర్చీ ప్రక్కనే కూర్చున్నా. “ఏమిటిరా” అంది. ‘అమ్మా! కడుపులోనెప్పి. భరించలేకుండా ఉన్నాను’ అన్నాను. “ఏం లేదు లేరా” అంది. ‘ఏం లేదని నువ్వు చెబితే ఎట్లా? – బాధ అనుభవిస్తున్నది నేను అన్నాను. తర్వాత “ఏం లేదు లేరా” అని మళ్ళీ అంది. అలా అన్న తర్వాత కొంచెం ఉపశమనం కలిగింది. కాసేపటికి మూత్రవిసర్జన కోసం అని వెళ్ళా. రాయి మూత్రంలో పోయినట్లు sensation వచ్చింది. ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత హాయిగా ఉంది. అమ్మ శరీరంతో ఉన్నంతకాలం ఆ నెప్పి మళ్ళీ నాకు రాలేదు. తర్వాత గాల్ బ్లాడర్ అంతా రాళ్ళతో నిండిపోయింది. ఆ తర్వాత వాటిని వైద్యులు తీసివేశారు. అలా తీసివేసినా మళ్ళా రాళ్ళూ రావచ్చు; నెప్పీ రావచ్చు. నాకు రాలేదు. నాకు క్రమేణా జ్ఞానోదయం అయింది; అమ్మ కరుణతోటే అడుగుతీసి అడుగు వేయగలుగుతున్నాను అని. ఈనాడు 77 ఏళ్ళ వయస్సులో ఈమాత్రం తిరుగుతున్నానంటే అమ్మ సేవలో నేనున్నాను కనుకనే.

అమ్మతో ఎప్పుడైనా ఆటలు ఆడేరా? అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మీ పాత్ర వివరించండి.

అమ్మతో నేను కారెమ్స్, చీట్ల పేక ఆడేవాణ్ణి. అంత స్వేచ్ఛ, చనువు. అమ్మ ఎట్లా ఆడినా గెలిచేది. రవి defence ఆడేవాడు. నేను serious గా ఆడేవాణ్ణి. “ఎందుకురా అంత seriousness?” అనేది అమ్మ. అన్నంరాజు రామకృష్ణారావు గారు (state player) బాగా ఆడేవాడు. అన్నంరాజు వారిది పెద్దకుటుంబం.

అడపా రామకృష్ణారావుగారు మహానుభావుడు, ఆయన అమ్మ ఫోటోలు సైడ్స్ వేస్తుంటే నేను వ్యాఖ్యానం చెప్పేవాడిని. వారంతా అమ్మ సేవలో తరించిన వారే. 1963 నుంచి జిల్లెళ్ళమూడిలో జరిగే సభలన్నిటినీ నేనే నిర్వహించేవాడిని. ‘మాతృశ్రీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ లీగ్’ అని పెట్టాం. అమ్మను సరస్వతీదేవిగా ‘సరస్వతీ సామ్రాజ్యం’ ‘రూపకాన్ని దిగ్విజయంగా నిర్వహించాం. జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు, కులపతిగారు, మార్టూరి పాండురంగారావు, వారణాశి కోటేశ్వరశర్మ, జమ్మలమడక మాధవరామశర్మ, కోగంటి సీతారామాచార్యులు, నేను పాల్గొన్నాం. చూచి అద్భుతం అన్నారంతా. క్రీడలు ఆడేవాళ్ళం. నాటకాలు వేసేవాళ్ళం.

అమ్మను మీరు దేవతగా చూశారా, మాతృమూర్తిగా చూశారా?

అమ్మ పూజాసమయాల్లోనే దేవత అనిపించేది; మామూలు సమయాల్లో మనల్ని ప్రేమించే అమ్మ, మనకష్టాల్నీ, బాధల్ని తాను అనుభవిస్తూ మనల్ని సంరక్షించే అమ్మ అనిపించేది. 1963, 68 మధ్యలో ఎన్నో యోగముద్రలు సహజంగా అసంకల్పితంగా వచ్చేవి పూజా సమయాల్లో అమ్మకి. నరసరావుపేట సోదరి డాక్టర్ కమల 9 బస్తాల కుంకుమతో అమ్మకి పూజ చెయ్యటం చూశా. ఒకసారి ముక్కోటి ఏకాదశినాడు అమ్మను శ్రీమన్నారాయణునిగా దర్శించాలని గుంటూరు నుంచి తెల్లవారుఝాముననే బయలుదేరి జిల్లెళ్ళమూడి వచ్చాను. స్నానం చేసి అమ్మ వద్దకు వెళ్ళాను. అప్పటికే అమ్మ దర్శనం ఇచ్చి లోపలికి వెళ్ళింది. నేను చాలా బాధపడ్డాను. ‘ఇదేమిటమ్మా ఇట్లా చేశావు, నేనెంత తపనపడి వచ్చాను?” అన్నాను. “ఇప్పుడేమైంది నాన్నా!, ఇప్పుడు చూస్తున్నావు కదా!” అన్నది. తర్వాత తర్వాత అర్థమైంది. అమ్మ పుట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. అప్పటికీ ఇప్పటికీ తేడా లేదు. అమ్మ అత్యంత ఆత్మీయురాలు, ఆప్తురాలు.

మీ కన్నతల్లికి అందరమ్మకి తేడా ఉందా?

మన అందరికి ఇంటి వద్ద తల్లులున్నారు. కానీ ఈ అమ్మ మన అమ్మ కంటె ఎక్కువ ప్రేమిస్తుంది. మనకి తెలియకుండా మనలను తరింప చేసే దేవత. మనకి ఏది అవసరమో అది చేసిపెడుతుంది; అది మన తల్లులు చేయగలిగింది కాదు. ఉదాహరణకి ఒక రోజున నేను కూర్చుని ఉంటే “అరేయ్. ఏదైనా పద్యాలు చదవరా” అంది. భాగవతంలోని పద్యాలు చదవటం మొదలు పెట్టా. పుస్తకాన్ని దూరంగా పెట్టుకుని చదువుతున్నా. “ఒరేయ్ ! నీ కళ్ళు చూపించుకో ఒకసారి” అంది. వెళ్ళి చూపించుకుంటే నాకు చత్వారం వచ్చిందని తెల్సింది. అది చెప్పటానికే నన్ను పద్యాలు చదవమన్నది. రాబోయే కష్టాన్ని గుర్తించి నివారించే అమ్మ ఈ అనసూయమ్మ.

నాకు మధుమేహవ్యాధి (Sugar) వచ్చింది. ‘Sugar’ వచ్చిందమ్మా!’ అన్నాను. “ఎందుకు దానిని గురించి భయపడతావు?” అన్నది. ‘Sugar వస్తే అయిపోయినట్టే కదా ! శరీరం దేనికీ పనికిరానిదాని క్రింద లెక్కకదమ్మా’ అన్నాను. “ఏమీ ఫర్వాలేదురా. మిగతా జబ్బు లెట్లా వచ్చినయ్యో ఇదీ అంతే, ఏమీ దానిని గురించి విచారించాల్సిన పనిలేదు. సక్రమంగా భోజనం చేస్తూ ఉండు. నిన్ను అదేమీ చెయ్యదు. ఇదుగో నన్ను చూడు. ఇక్కడ టన్నులు టన్నులు ఉన్నది. నీ ఆరోగ్యం గురించి చింతించాల్సిన పనిలేదు. హాయిగా ఉండు” అన్నది.

ఒకసారి నా భార్యకి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. వెళ్ళి ‘అమ్మా! నా భార్యకి ఆపరేషన్ చేయాలట. నీకు చెప్పటం ధర్మం కనుక చెపుతున్నా అన్నాను. ప్రక్కనే రామకృష్ణ ఉన్నాడు. “ఏమిటిరా! వాడు అట్లా మాట్లాడుతాడు?” అంది. ‘అవునమ్మా! పియస్ఆర్ నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాడు? కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వే చూడాలి కదా ! నీకు చెప్పటం ధర్మం కనుక చెపుతున్నానన్నాడు. తప్పేముంది అందులో ?’ అన్నాడు రామకృష్ణ. “అయితే నాకు చెప్పాలంటావు; చెప్పిపోతానంటావు” అన్నది అమ్మ. అవునన్నాను.

మీకేమైనా అమ్మ సాధనలు నిర్దేశించిందా?

సాధనాపరంగా ఇది ఇలా చెయ్యి అని నాకెప్పుడూ చెప్పలేదు అమ్మ. బ్రహ్మాండం సుబ్బారావుకి కూతురు (హైమ) పుట్టింది. ఆశీః పూర్వకంగా ఏవో పద్యాలు చదివాను. అమ్మ నాకు పట్టుబట్టలు పెట్టింది. ‘నేనేమీ జపాలు, తపాలు చేసుకునేవాడిని కాదు కదా! నాకెందుకు?’ అన్నాను. “ఏవి ఎప్పుడు రావాలో అవి వస్తాయి లేరా. దాని గురించి చింత ఎందుకు? తీసుకో” అన్నది.

మనకి ఎప్పుడు ఏమి అవసరమో మనకి తెలియదు; దాన్ని అమ్మ మనకి ఇస్తుంది. సంపాదకీయం వ్రాయటంలోనూ అంతే. వచ్చే నెల సంపాదకీయం గురించి ముందుగా ఆలోచించను. వ్రాసే ముందు అనుకుంటాను. దానికి సంబంధించిన matter ఎక్కడ ఉందో ప్రేరణ నిచ్చి అమ్మ తెలియచేయాల్సిందే. చాలామంది అంటారు ‘రామకృష్ణ సంపాదకీయాలు కంటె నీ సంపాదకీయాల్లో విషయం ఎక్కువగా ఉంటుంది. ఆయన ఏదో ఒక సందర్భాన్ని తీసుకుని పరమాద్భుతంగా చిత్రించగల నైపుణ్యం కలవాడు’ అని. ఇందులో నా ప్రతిభ లేదు. నేను 3 విధాలుగా అదృష్టవంతుణ్ణి. 1. ‘నువ్వు ఈస్థాన కవిరా’ అన్న అమ్మ ఆశీస్సులు 2. కులపతిగారి తమ్ముడిని కావటం 3. నా ముందు రామకృష్ణ రచనలు మార్గదర్శకంగా ఉండటం.

ఇంతగా మీరు అమ్మను ఆరాధిస్తున్నారు. కానీ ఇటీవల మీ పెద్దకుమారుడు అకాలమరణం చెందారు. వీటిని ఎలా సమన్వయిస్తారు?

మా పిల్లలందరికీ నామకరణం, అన్నప్రాశన అమ్మే చేసింది. మా రెండవ వాడికి ఉపనయనం చేసింది; మంత్రోపదేశం చేసింది. ఆ మంత్రంతో పాటు ఆ అనుగ్రహంతో వేరే మంత్రాలు లక్షలు లక్షలు చేశాడు. పెద్దవాడిని అమ్మ అడిగింది, “నువ్వు ఏం చేస్తుంటావురా?” అని. ‘అమ్మా ! గాయత్రీ జపం చేస్తుంటాను’ అన్నాడు; “వదలిపెట్టబోకు నాన్నా!” అన్నది. వాడు చనిపోయేదాకా చేస్తూనే ఉన్నాడు. అమ్మ ఎడల అందరికీ భక్తి, విశ్వాసాలు ఉన్నాయి. మా పెద్దబ్బాయి ప్రేమకుమార్ భార్గవ, చాలా వినయ సంపన్నుడు. తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ.

ఒకసారి దుర్గపిన్ని గారింట్లో వాడిని అమ్మను గురించి మాట్లాడమన్నారు. ముందుగా ఏమీ చెప్పలేదు. కేశవశర్మ ఆశ్చర్యపోయాడు. అద్భుతంగా మాట్లాడాడని, వచ్చి కౌగలించుకున్నాడు వాడిని. తన్మయత్వంతో మాట్లాడతాడు; ఏ పనిచేసినా అంతే. వాడికి జబ్బు చేసింది. ఆ సంగతి నాకు ముందు తెలుపలేదు. “కష్టసుఖాలు రెండూ నా అనుగ్రహమే” అని చెప్పింది అమ్మ. ఆ ఆలోచన నాకు నిరంతరం ఉంటూండేది. అమ్మ ఇంకో సుఖం ఇచ్చే ముందు ఈ కష్టాన్ని ప్రసాదించిందనుకుంటాను. వాడు ఆస్పత్రిలో చేరినపుడు అమ్మను నేను ఒకటి కోరుకున్నా ‘అమ్మా! వాడిని హాయిగా ఉంచదలచుకుంటే ఉంచు. నీకు తెలుసు ఏంచేయాలీ అనేది. పోయేటట్టుంటే కష్టపడకుండా పోయేటట్టు చెయ్యి’ అని. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారిని కూడా ఆస్పత్రికి తీసుకువెళ్ళాను. ‘ఏమిటి స్వామీ! నేను బయటపడతానా?’ అని అడిగాడు వాడు. ‘పడతానా అని ఆలోచించటం ఎందుకురా, పడాలీ బయట’ అన్నారు. తర్వాత ఈ సిద్ధులు అనే దానిమీద నాకు నమ్మకం పోయింది. వాడు చనిపోవటానికి రెండు నెలల ముందే రామదూత అనే స్వామికి చెప్పారు. ‘వాడికేం లేదు, నేను చూసుకుంటాను’ అన్నారు. ఏదైనా చేయగలిగితే చేయగలిగిన వారు సిద్ధేశ్వరానంద భారతీస్వామివారు. ఆయన ఏమీ చేయలేకపోయినాడు. ఇవన్నీ చూసిన తర్వాత నా కనిపించింది – అమ్మ చెప్పిన సిద్ధాంతం కరెక్టు. “నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. ఎవరూ ఏమీ చేయగలిగింది కాదు. ‘ఆ మంత్రం వేస్తాం, ఈ హోమం చేస్తాం’ అంటారు వీళ్ళు. వాడికి ఏమైనా జరిగే యోగం ఉంటే అమ్మ చెప్పినట్లు అది కూడా ఇందులో (నిర్ణయంలో) భాగమే. నాకు అమ్మ ఇచ్చిన బలం ఏమంటే కష్టం – సుఖం రెండూ అమ్మ ప్రసాదమే అన్నభావనే. ఏమంటే అట్లాంటి బిడ్డపోతే నిబ్బరంగా ఉండగల్గటం సామాన్యుల వలన కాదు; నా భార్య ఇప్పటికీ తేరుకోలేదు ఆ బాధ లోంచి.

నేను చాలా నిబ్బరంగా ఉంటాను అని అనుకుంటాను. అందరూ అమ్మ దగ్గరకు వచ్చి ఏడుస్తారెందుకు? హాయిగా అమ్మ వద్ద ఉండవచ్చునుగా ? ఎందుకు ఏడ్వటం ? అనుకునేవాడిని. ఒకరోజు అకారణంగా నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. వ్యక్తిలోని మంచిని చూస్తే ఎవరికైనా కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. నేను ఏడుస్తున్నానేమిటి ? అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది! అమ్మ సన్నిధిన మన ప్రమేయం ఏమీలేదు. ఏడవటంకాని, నవ్వటం కాని. – మనకన్నీ గుణపాఠాలు నేర్పుతూంటుంది అమ్మ.

మీరు హైమక్కయ్యని సశరీరంగా చూసిన నాటి, ఆలయప్రవేశం చేసిన అనంతరం మీ అనుభవాలు ఏమిటి?

అమ్మ కుమార్తె హైమ సుకుమారం సున్నితత్వం గల పిల్ల. జిల్లెళ్ళమూడి వస్తే ఒకటవ ఒరవ దాకా వచ్చి సాగనంపి పోయేది. ఎవరన్నా వెళ్ళిపోతున్నారంటే దుఃఖం, బెంగ. ‘మళ్ళీ ఆదివారం వస్తావుగా, అన్నయ్యా!’ అని సాగనంపేది. సన్నని మృదువైన మధురమైన కంఠం. నాదగ్గర కూర్చుంటే ఏవో పాటలు పాడించుకునేవాణ్ణి. కులపతిగారు వస్తే నా దగ్గర చేరేది. ‘అన్నయ్యని పద్యాలు చదవమని నువ్వు చెప్పవా!’ అని అడిగేది. ‘హైమ అడుగుతోంది, అన్నయ్యా!’ ‘అంబికాసాహస్రి’లో నాలుగు పద్యాలు చదువు’ అంటే ఆయన చదివేవాడు. హైమతో నాకు సాన్నిహిత్యం ఉంది. హైమ అనారోగ్యంతో పర్చూరులో ఉంటే చూడటానికి నేను వెళ్ళా. హైమ నాకు ఉత్తరం వ్రాసింది. ఆత్మీయతతో చూచేవాడిని. ఎక్కిరాల భరద్వాజ వచ్చిన తర్వాత సాయిబాబా భక్తి – ధ్యానాలు మొదలుపెట్టాక నాకు కనిపించేది కాదు.

హైమ ఆలయప్రవేశం చేసిన రోజున వచ్చాను. హైమ గుంటూరు హాస్పిటల్లోనే శరీరత్యాగం చేసినట్లు నాకు తెలియదు. నేను జిల్లెళ్ళమూడి వచ్చేటప్పటికి పైమని పాలతో అభిషేకం చేస్తున్నారు. హైమతో ఎంత సన్నిహితంగా ఉన్నా, ప్రాణం పోయిందిగా నేను దగ్గరకు ఎలా వెళ్ళేది అని దూరంగా ఉన్నాను. అమ్మ నన్ను చూసి “ఓరేయ్ నువ్వూ అభిషేకం చేసుకో” అంది. ఆశ్చర్యపోయాను. ఆ అదృష్టం కలిగించింది అమ్మ నాకు.

ఒకసారి హైమ జన్మదినోత్సవ సందర్భంగా లలితా కోటి నామపారాయణ జరుగుతోంది. హైమ దేవతగా కనిపించటం నా పట్ల జరుగలేదే అనుకుంటున్నాను. హైమాలయంలో ఉన్నాను. ఇంతలో చిత్రమైన ఆలోచన నా మదిలో మెదిలింది. తన మనవరాలికి ఇంత వైభవంగా ఉత్సవం జరుగుతుంటే వచ్చి చూడాలని ఎప్పుడూ కీ॥శే॥ సీతాపతితాతగారికి అనిపించదా! అనుకున్నాను. కొద్దిసేపట్లో నిజంగానే సీతాపతి తాతగారు వచ్చారు. సరాసరి ఆయన హైమాలయంలోకి వెళ్ళి హైమను దగ్గరకు తీసుకున్నాడు. ఆ నా మానసిక స్థితిలో ఆయన్ని నేను పలకరిద్దామని లేచి వెళ్ళబోతూండగా వెనుక నుంచి ఎటో వెళ్ళిపోయాడు. నాకు చాల ఆశ్చర్యం వేసింది. ఈ సంగతి అమ్మతో చెప్పాను. “ఇట్లాంటివి జరుగుతుంటాయి లేరా” అంది అమ్మ.

10 ఏళ్ళ క్రితం మాట. రాయపాటి సుబ్బారావు అని నాకు మిత్రుడు ఉన్నాడు. వారమ్మాయికి అప్పటికి 28 ఏళ్ళు వచ్చాయి; పెళ్ళికాలేదు. ‘మీరు జిల్లెళ్ళమూడి రండి. హైమాలయంలో ప్రదక్షిణలూ, మొక్కులూ చేసుకోండి. మీ కోరిక తీరుతుంది’ అని వారికి చెప్పాను. మా అమ్మాయిని మీ అమ్మాయిగా భావించాలన్నాడు. నేను హైమాలయానికి వచ్చి ‘హైమా! ఆ అమ్మాయి మనకి ఆప్తురాలు. వివాహం కావటం లేదు. నువ్వు కనికరించి చూడమ్మా!’ అని చెప్పా. అన్న నెలరోజుల లోపల ఆ అమ్మాయికి I.A.S officer సంబంధం వచ్చింది. చక్కగా వివాహం అయింది. ఆశ్చర్యం ఏమంటే 108 ప్రదక్షిణలో ఏదో మొక్కు చేద్దాములే అనుకున్నాను మనసులో ఆ అమ్మాయి పెళ్ళికోసం. విన్నపముతోనే కోరిక తీరింది. హైమ కల్పతరువే. కొందరు అడుగుతారు అమ్మ హైమకే ఎందుకు దేవాలయం కట్టించాలి అని. “నాన్నా! నువ్వు నాబిడ్డవి. నీకు దేవాలయం కట్టిస్తాను” అని అమ్మ అంటే ఎంతమంది సిద్ధంగా ఉంటారు? హైమ అడిగింది అమ్మను ‘నువ్వు తప్ప ఏమీ కనిపించకూడదు. నీ నామం తప్ప ఏమీ వినిపించకూడదు. అదే నా జీవిత ధ్యేయం’ అని. అందువల్లనే దేవత అయింది.

నాన్న గారు (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారితో) మీ అనుభూతులు తెలుపండి.

నాన్నగారు శరీరత్యాగం చేసినపుడు డా॥ S.V సుబ్బారావుగారు, గజేంద్రమ్మ, నేను అంతా అమ్మ గదిలోకి వెళ్ళి ‘నువ్వు మహాశక్తి సంపన్నురాలివి కదా! ఏంటమ్మా ఇట్లా చేశావు? నువ్వు ఉండగా ఆయన్ను పంపించటం ఏమిటి? నువ్వు ఏమైనా సరే ఆయన్ను బ్రతికించి తీరాలి’ అంటే, “ఓరేయ్! ‘నాన్నగారు లేచి నిలబడకపోతే నేను బతకలేనమ్మా- అని అనగలిగినవాడు’ ఎవడైనా ఉంటే ఇక్కడ ఉండండర్రా” అన్నది. అందుకు ఒక్కళ్ళం మాట్లాడలేదు. సర్వార్పణ భావం మనకెవరికీ లేదు. భక్తి అంటే వియోగం లేనిది; అంటే వదలిపెట్టలేని స్థితి. ఆ స్థితి ఉన్నవాడిని రమ్మనమంది అమ్మ. ఎవరం అంగీకరించలేదు. నిజంగా అమ్మ మనతోనే మనలోనే మనంగా ఉన్నదనే భావన నిరంతరం జాగృతమై ఉంటే అంతకంటే కావల్సిందేముంది?

మహాత్మురాలు అమ్మకి భర్త కావున ‘నాన్నగారు’ మనకి పూజనీయులు అయినారు – అని మొదట్లో భావించాను. నిరాడంబరుడు, సామాన్యుడు అనుకునేవాడిని. గోవిందరాజులు దత్తుగారు, ఇంకా వయస్సులో అమ్మకంటె పెద్దవాళ్ళూ చిన్నవాళ్ళూ వెళ్ళి అమ్మ ఒడిలో పడుకుంటున్నారు. చనువు ఉన్నవాళ్ళు అమ్మ మంచం మీద పడుకుంటున్నారు. ఏ పురుషుడైనా తన భార్య దగ్గరకి పూజలు, సంభాషణలు, ఏదైనా, అసలు, దగ్గరకు రానిస్తాడా? సోదరుడే అనుకో, అయినా సరే, నా భార్య దగ్గరకి రానిస్తానా? ఆయన ఎంతటి సహనమూర్తి? వారికి అమ్మ ఎంత సహనాన్ని ఇచ్చి ఉండాలి? ఆయన నేడు లోకానికి ఆరాధ్యుడైనాడు. 1956 నుంచి ఇంతమంది వస్తూంటే ఆయన ఎవరినీ కాదనలేదు; అందరినీ ఆదరించాడు. ఉన్నతంలో భోజనం, వసతి, సౌకర్యాలు కలిగించాడు. పిల్లలనేకాదు; భర్తని కూడా అమ్మ ఎన్నుకున్నది. అమ్మ ఆడిన నాటకంలో నాన్నగారు, బామ్మ, పిల్లలు పాత్రలన్నీ భాగాలే. ఆయన నిజంగా పూజనీయుడు- చేతులెత్తి నమస్కరించాలి. పతిని ఆధారంగా చేసుకుని పంచభూతాలను జయించిన పతివ్రత అమ్మ; తాను ఆడిన నాటకంలో ఇదంతా ఒక భాగం. ఒక విధంగా అమ్మ స్వార్థపరురాలు అనిపిస్తుంది. తాను ‘సహజ
సహనశ్రీ’ అని కీర్తించబడటానికి ఆమె ఆడిన నాటకంలో భాగాలు ఇవన్నీ.

అమ్మ ఫిలాసఫీ ఏమిటి? అమ్మ వాక్యాలు ఆచరణ సాధ్యాలా?

“అంతా అదే” అనేదే అమ్మతత్త్వం. తల్లిగా వచ్చింది కనుక మానవత్వం ప్రధానమైనది. ‘సరే మంత్రం’ అంటే “సర్వం ఒకటే” అని ఆలోచన చేయటమే. మనకి ఒకటి అనేకంగా కనిపిస్తుంది. అమ్మకి అనేకం ఒకటిగా అనిపిస్తుంది. కష్టం – సుఖం; మంచీ- చెడూ…. ఇవేమీ లేవు; “చేతలు చేతుల్లో లేవన్న”ది; “పురుష ప్రయత్నం లేదన్న”ది; వాడి (దేవుడి) “ప్రేరణ ఉన్నది” అన్నది.

అమ్మ సూక్తులు నిస్సందేహంగా అందరికీ ఆచరణ సాధ్యములే. అమ్మ ఆచరించే చెప్పింది; ఏవో దేవతలు ఆచరించేవి చెప్పలేదు.

ఒకసారి విశ్వహిందూపరిషత్ వారు వచ్చి అమ్మను గుంటూరు ఆహ్వానించారు. గుంటూరులో అమ్మ ప్రజలకు దర్శనం ఇవ్వాలని; నేనూ ఉన్నాను అక్కడ. నాన్నగారిని అడగమంది. ‘ఆమె అనారోగ్యంతో ఉంది, ఎక్కడ వస్తుంది?’ అన్నారు. నేను అమ్మను అభ్యర్థించాను “సరేలేరా, చూద్దాంలే” అన్నది. నాన్నగారితో చెప్పమన్నది. నాన్నగారి వద్ద చనువు ఉంది కదా అని వెళ్ళాను. ‘ససేమిరావద్దు’ అన్నాడాయన. ఆయన కాళ్ళు పట్టుకుని ‘అమ్మ వస్తానంటే మాత్రం మీరు, కాదు కూడదు అనబోకండి’ అన్నాను. ‘వస్తానంటే నాకేంటి, తీసికెళ్ళు’ అన్నారు. ఈ విషయం అమ్మతో చెప్పాను. ఇంతలో నాన్నగారే వచ్చారు. ‘ఏంటి! నువ్వేదో గుంటూరు వెడతానన్నావుట కదా?” అన్నారు. “నేనెందుకంటానండి? మీకు చెప్పమన్నాను. మీరు ఒప్పుకుంటే సరే అంటాను.”అన్నది. నాకు తల దిమ్మెర పోయింది. అంతకుముందు “సరే, వస్తాను లేరా” అని నాకు చెప్పి, తర్వాత “నేనెందుకు అంటాను?” అంటోంది. ప్రక్కన రామకృష్ణ ఉన్నాడు; నా పరిస్థితి గమనించాడు. ‘అట్లా కాదులే, అమ్మా! అట్లా కాదులే, నాన్నగారూ! P.S.Rకి ఏం తెలుసు? పది మంది అడుగుతున్నారు. పోదాం లెండి’, అన్నాడు. అలా అమ్మ అబద్దమాడుతుంది. పర్యవసానంలో అందరికీ మంచే జరుగుతుంది; ఎవరికీ అపకారం ఉండదు. అమ్మతో కార్లో కూర్చొని భట్టిప్రోలు, రేపల్లె, పులివర్రు, ప్రయాణం చేశా. కృష్ణాజిల్లా పరిషత్ అధ్యక్షుడు పిన్నమనేని కోటేశ్వరరావుగారి ఊరికి వెళ్ళా.

మీ జీవితంపై అమ్మ ప్రభావం ఎంతవరకు ఉంది ?

అమ్మ పరిచయ ప్రభావం లేకుంటే- నేను సాదాసీదా మధ్య తరగతి కుటుంబీకునిగా ఉండేవాడిని. నాకు ఏ పరిణతీ ఉండేది కాదు. ఒకసారి శ్రీమతి పన్నాల కాత్యాయని అక్కయ్య ‘ఇన్నేళ్ళ నుంచి అమ్మవద్దకు వస్తున్నావు. నీకేం అబ్బింది జిల్లెళ్ళమూడిలో?’ అని అడిగింది. ‘నాకేమి అబ్బిందో నాకు తెలియదు. కాని జిల్లెళ్ళమూడి వచ్చిన వాడికీ బయటి వాడికీ తేడా ఎక్కడ తెలుస్తుందంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినపుడు తెలుస్తుంది. మనకి తెలియకుండా మనలో చాల మంచి మార్పులు వస్తయ్’ అన్నాను. ఈ మాట వెళ్ళి ఆమె ‘అమ్మ’తో చెప్పింది. తర్వాత అమ్మ “హాత్ మిలావ్” అని అన్నది నాతో.

ఒకసారి సోదరసోదరీమణులు చాలమంది కలిసి కారు, వాన్ వేసుకుని జిల్లెళ్ళమూడి నుంచి బాపట్ల సినిమాకు వెడుతున్నారు. దారిలో ఎదురైన నన్ను చూసి వారితో రమ్మని పిలిచేరు. ‘సినిమాకైతే గుంటూరులో సినిమా హాళ్ళు లేకనా! నేను అమ్మను చూడటానికి వెడుతున్నాను’ అన్నాను. నేను నేరుగా అమ్మ దగ్గరకు పోయాను. “ఏరా! వాళ్ళంతా సినిమాకు పోతున్నారు. నువ్వు పోలేదేం?” అని అడిగింది అమ్మ. ‘నేను నిన్ను చూద్దామని వచ్చానమ్మా’ అన్నాను. ఆ మార్పు మనలో సహజంగా వస్తుంది. ‘అమ్మ మనలో ఉన్నది, మనల్ని నడిపిస్తున్నది, మన వెంట ఉన్నది; ప్రభావితం చేస్తున్నది’ – అనేది ప్రతినిముషం జాగృతం అవుతూ ఉంటుంది – కష్టం వచ్చినా, నష్టం వచ్చినా.

నేను అమ్మకి గొప్ప భక్తుణ్ణి అని అనుకోవటం లేదు. నేనేదో రచయితని, జ్ఞానిని, గొప్పకవినీ అనీ అనుకోను. నా గురించి నా సోదరులు కులపతి గారు రెండు సన్నివేశాల్లో చెప్పారు.

1. అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత ఒకసారి కులపతిగారు అమ్మను ఆవాహన చేశారు. ఆయన సిద్ధేశ్వరీ పీఠాధిపతులు. అమ్మ వచ్చింది. మేడమీద మా మనవరాలు, సంవత్సరములోపు పిల్ల ఉంది. అది మెట్లు దిగి క్రిందకి వచ్చింది. దానికి కదిలే పరిస్థితే లేదు. ఈయన ధ్యానంలో చూశారు. ‘నువ్వు వచ్చావేమిటమ్మా ఇక్కడికి!’ అని అడిగారు. ‘నేను క్రితం జన్మలో అమ్మ భక్తురాలను. అమ్మ వచ్చిందని నాకు తెలిసింది. అందుకోసం వచ్చాను’ అన్నది ఆ పసిపిల్ల. తను అమ్మ భక్తుల ఇంట్లో పుట్టింది. అంటే నేనేదో భక్తుణ్ణి అయినట్లు. అది విన్న నేను – ఓహో! అమ్మ భక్తుల్లో నేనూ ఒకణ్ణి కాబోలు అనుకున్నాను.

2. నేను పదవీ విరమణ చేసినపుడు కులపతిగారు రెండు పద్యాలు చెప్పారు.

వ్రాతల్ వ్రాసెడి బ్రహ్మ ఎందుకిటులన్ భావించినో గాని ఈ
నాతమ్ముండలనాటి అర్కపురి ఆనందాంగనాడింభుడై
మాతృశ్రీ పదపద్మబంభరముగా మాధుర్యమున్ గ్రోలుచున్నా
తో చెప్పడుగాని వాని కదియే నాకమ్ము లోకంబునన్.

ఈ లోకంలో వాడికి జిల్లెళ్ళమూడే స్వర్గం. పోతన గారు శ్రీకృష్ణ పరమాత్మను ‘ఆనందాంగనా డింభకుడు’ అన్నారు. అమ్మ తన ఆశీస్సుల్ని వారి ద్వారా నాపై ప్రసరించింది.

మాతృశ్రీ అనసూయ వాక్కులన్ సంభావించి తన్మూర్తిలో
జ్యోతిర్మండల కాంతిపూర రమణీయోంకార ఘంటార్భటుల్
శ్రీ తత్త్వంబులు దేవతామహిమలన్ జిల్లెళ్ళమూడిన్ కనెన్
నా తమ్ముండని కాదు కాని అతడంతర్లీను డా భూమికన్.

కులపతిగారు ఇచ్చిన ఈ ‘Certificate’ చాలు నాకు; రచయితగా గానీ, భక్తునిగా గాని.

 

అమ్మ కుటుంబ సభ్యులతో మీ అనుబంధాన్ని వివరించండి.

1960 లో గుంటూరులో అమ్మ పెద్దకొడుకు సుబ్బారావుకి Operation జరిగింది. మధ్యాహ్నం, సాయంత్రం ఆస్పత్రికి వెళ్ళి క్యారేజి ఇచ్చి దగ్గర కూర్చొని మాట్లాడుతూండేవాడిని. తనకీ నాకూ మంచి అనుబంధం ఉంది. తను ఏ ఊరు వెళ్ళినా వెంట నన్ను తీసుకువెళ్ళేవాడు. తన పెళ్ళిముందర నన్ను తెనాలి తీసుకువెళ్ళి తనికి కాబోయే భార్య శేషుని చూపించాడు; ‘ఈ అమ్మాయినే నాకు ఇద్దామనుకుంటున్నారు’ అని. సుబ్బారావు ఉపనయనానికి నేను జిల్లెళ్ళమూడిలో ఉన్నాను- కవీశ్వరుడు శ్రీ కొప్పరపు సీతారామప్రసాద్ మా మేనమామ. వారిని తీసుకురమ్మన్నది అమ్మ. అప్పుడాయన అప్పికట్లలో ఉంటే వెళ్ళి తీసుకువచ్చా. తన పెద్దకోడలు శేషుని ఎక్కడికన్నా పంపాల్సివస్తే “ఓరేయ్, ఆంజనేయులు! నువ్వు దానితో వెళ్ళి విజయవాడలో దించిరా” అని పెళ్ళి అయిన తరువాత కూడా నన్ను పంపించేది అమ్మ. పెళ్ళి అయిన తర్వాత తన భార్య శేషుతో సుబ్బారావు చెప్పాడు ‘ఆంజనేయులుగారు మన కుటుంబంలో వ్యక్తి’ అని.

రవి చదువుకోసం గుంటూరు రావడంతో మాకు సాన్నిహిత్యం పెరిగింది.
రవికి పెళ్ళి సంబంధాలు వచ్చాయి. ‘ మా బంధువుల పిల్లను చేసుకోవాలి’ అని అడవులదీవి ‘మధు’ తీసుకువచ్చాడు కొందరిని. మా మిత్రబృందం ‘వైదేహి’ని Select చేశాం. ఆశ్చర్యంగా చివరికి అదే ఖాయం అయింది.

హైమ దేవాలయంలో చేరినపుడు 1968లో రవి వ్యాకులంగా ఉంటే అమ్మ రవితో నన్ను యాత్రలకు పంపింది. నేను ఆ యాత్రంతా జేబులో రూపాయలేకుండా ప్రయాణం చేశాను. అమ్మ నన్ను “ఒరేయ్! నువ్వు రవి వెంట వెళ్ళరా” అన్నది; ‘అమ్మా! నేను ఇంటికి వెళ్ళి గుడ్డలు తెచ్చుకుని తెల్లవారేటప్పటికి వచ్చేస్తాను’ అన్నాను.

“నీకు గుడ్డలే కదా, నేనిస్తాను. డబ్బులే కదా, నేనిస్తాను” అన్నది అమ్మ. ఏర్పేడు, రమణాశ్రమం, అరవిందాశ్రమం అన్నీ తిరిగొచ్చాము. మాతో గోపాలన్నయ్యా వచ్చాడు. మేనకూరి సుందరరామిరెడ్డిగారు వెంట ఉండి మాకు అన్నీ చూపించారు. అలా ఈనాటికి అమ్మ కుటుంబసభ్యునిగా సన్నిహితత్వం ఉంది. సుబ్బారావుకి తీవ్ర అనారోగ్యం చేసినపుడు, రవి నన్ను తీసుకువెళ్ళి ‘గుర్తుపట్టావా?’ అంటే ‘అదేమిటి! PSR అన్నయ్యను గుర్తుపట్టకపోవడమేమిటి?” అన్నాడు సుబ్బారావు.

నాన్నగారు, అమ్మ, సుబ్బారావు, రవి, హైమ అందరూ మా ఇంటికి వచ్చారు. అది నిజంగా నా అదృష్టం.

మీరు చాలాకాలంగా సమర్థవంతంగా ‘విశ్వజనని' మాసపత్రిక సంపాదకుని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంకా అనేక గ్రంథాలు వ్రాశారు. ఇట్టి సేవలందిస్తున్న మీ ప్రతిభకు కారణమేంటి?

నేనేం పండితుణ్ణి కాదు, శ్రద్ధగా ఓ గురువు దగ్గర చదువుకోలేదు. కులపతిగారు దయతో నాచే ఏవో రూపకాలలో వేయించారు; ఆయా కవుల గ్రంథాలు చదివి పద్యాలు ఆ సమయంలో చదివేవాడిని. నేను ఇవాళ సంపాదకీయాలు వ్రాస్తున్నానంటే అది నా ప్రతిభ కాదు. సో॥ రాచర్ల లక్ష్మీనారాయణ జ్ఞాపకం చేశాడు ఒకసారి. అదేమంటే ఒకనాడు అమ్మకి మహానివేదన చేశారు. ఆ తర్వాత తాంబూలం ఇచ్చారు. అమ్మ తాంబూలం వేసుకున్నది. కొంచెం నమిలి ఉమ్మివేయటానికి పళ్ళెం తీసుకురమ్మన్నది. నేను ఎదురుగా ఉన్నాను. లక్ష్మీనారాయణ ప్రక్కగా ఉన్నాడు. ఆ ప్రక్కగా ఉన్న తమలపాకు దోసిట్లో పట్టుకుని ‘అమ్మా! ఇందులో ఉమ్మివేయి’ అన్నాను. వేసింది. ఆ తమలపాకు మడిచి నేను తిన్నా. ఎందుకు నేను తింటున్నాననే ఊహ నాకున్నది. వీరబ్రహ్మేంద్రస్వామి వారి దగ్గర సిద్దయ్య ఉండేవాడు. ఆయన కక్కితే నాకాడు; అతడు జ్ఞాని అయినాడు. ఇది అమ్మ నిష్ఠీవనం. ‘దీనిని తింటే నేను అదృష్ట వంతుడినే కదా!’ అని. దాని ప్రభావం వలననే ఇప్పటికీ నేను అమ్మసేవ, అమ్మను గూర్చిన సాహిత్యసేవ చేసుకుంటున్నాననేది నా ప్రగాఢ విశ్వాసం.

అందరింటి సభ్యులకు మీరిచ్చే సూచనలు సలహాలు ఏమిటి?

జిల్లెళ్ళమూడి అనేకాదు, ఏ ఆధ్యాత్మిక క్షేత్రంలోనైనా నువ్వు నమ్మిన దేవ కంటే వేరే ఏమీ లేదు.

ఎవడో దుర్మార్గం చేస్తున్నాడు; కష్టపెడుతున్నాడు, ఇదంతా నాశనం చేస్తున్నాడు- అనే ఆలోచనలన్నీ తీసి కట్టగట్టి బయటపెట్టాలి. నువ్వు చెయ్యగలిగింది ఏదైతే ఉందో అది చెయ్యాలి. నువ్వేదైనా బాధ్యత తీసికొని కార్యకర్తగా ఉంటే వాళ్ళతో చర్చించాలి. తప్పులేదు. కానీ ఏది జరిగినా నువ్వు నమ్మిన దేవతే చేస్తున్నది; అదే Finalగా జరిగినది. ‘అబ్బే! ఇట్లా జరగదు, అమ్మ ఇట్లా అంగీకరించదు, ఇది కాదు. అమ్మ అనుకున్నదే జరుగుతుంది. ‘నేను ఘనుణ్ణి’ వాడు ఘనుడు- ఇట్లా చేశాం’ అనేవి వ్యర్థమైన పలుకులు. జరిగినదానిని అమ్మ జరిపించింది అనుకోవాలి; ఇది అమ్మ నిర్ణయం లోని భాగం అనుకోవాలి. అంత మాత్రంచేత నీకు కోపం వచ్చి పనిచేయడం మానుకోవడం పొరపాటు. నీకు చేతనైన సేవ చేసుకుంటూ ఉండటమే. నువ్వు తరించడానికి అంతకంటే వేరే మార్గం లేదు. భగవంతుడు నిన్ను నడిపిస్తున్నాడు; నీలో ఉండి నడిపిస్తున్నాడు; నీవుగా నడిపిస్తున్నాడు. ఆ ఆలోచన తోటి నీకు చేతనైన, ఈ శరీరం సహకరించిన, నీకు ప్రేరణ ఇచ్చిన, అమ్మ చెప్పినట్టుగా చెయ్యటమే; ఎవరైనా చేయవలసిందదే. దీనికోసం వేదాంతం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చదువుకోనక్కరలేదు. అమ్మ సర్వవ్యాప్తమైన చైతన్యశక్తి. ఏదైనా అమ్మ అనుకున్నట్టే జరుగుతుంది. మార్జాల కిశోర న్యాయరీతిగా అమ్మ మనల్ని పట్టుకుంది; నడిపిస్తోంది – అనే ఆలోచనతో మనకి చేతనైనది చెయ్యటం తప్ప తరించటానికి ఇంకోమార్గంలేదు, ఇంకో శరణ్యం లేదు.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!