Sri Sri Sri Viswa Yogi Viswamji

Interviewed by
P S R Anjaneya Prasad
03/08/2013
Guntur

 

శ్రీ విశ్వయోగి విశ్వంజీ

  వీరు 05-03-1944వ తేదీన జన్మించారు. స్వస్థలం చమళ్ళమూడి. తల్లిదండ్రులు శ్రీ గుర్రప్పడియ ఆంజనేయులు, శ్రీమతి వరలక్ష్మమ్మ. విద్య B.A., B.Ed., పూర్వాశ్రమంలో ఉపాధ్యాయునిగ పనిచేశారు. ప్రవృత్తి :‘సనాతనధర్మం’, ‘సర్వమతసామరస్య పరిరక్షణ’, ‘విశ్వశాంతి సాధన’ వీరి ధ్యేయం. దేశ విదేశాల్లో వీరికి అనేకమంది అనుయాయులు కలరు. 1980 నుండి ‘విశ్వయోగి’ గా అందరికీ సుపరిచితులు. గుంటూరు సమీపంలో ‘విశ్వనగర్’ను స్థాపించి యజ్ఞయాగాదులను నిర్వహించుటయే కాక, సామాజిక సేవ కోసం హాస్పిటల్ నిర్మించి ఉచిత వైద్యసేవ లందించుచున్నారు. 1959లో అమ్మని ప్రథమంగా దర్శించారు. 1962లో అమ్మ చేతిమీదుగా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మ దివ్యతత్వాన్ని దేశవిదేశాల్లో పలుచోట్ల కీర్తిస్తున్నారు. సెల్ నెం: 9848144491

శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయ ప్రసాద్ గారు 03-08-2013వ తేదీన గుంటూరులో శ్రీ విశ్వయోగి విశ్వంజీగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మీరు తొలిసారి అమ్మను దర్శించిన అనుభూతి ఎలాంటిది ?

డా॥ ప్రసాదరాయ కులపతి సాహిత్యకార్యక్రమములను నడుపుతున్న మహత్తర వ్యక్తిగా లోకం చేత కీర్తించబడుతున్న తరుణం. కులపతి గారికి అమ్మ అంటే సకలం, సర్వస్వం. అమ్మే ఈ విశ్వానికీ, సృష్టికీ మూలమైన అమ్మ అని ఆయన భావన; భావనే కాదు యదార్థమైన సత్యం.

దివ్యమైన సంకల్ప బలంతో అమ్మ యొక్క శక్తి కులపతిగారి శరీరంలోకి చొప్పించబడి, ఆ శరీరాన్ని ఒక శక్తివంతమైన పీఠానికి అధిపతిగాకూడా చేసింది. కార్యాలోచన చాలా ఉంది. గోప్యంగా ఉంచుతారు. మనం అర్థం చేసుకోవాలే గానీ, మహనీయులు అన్నీ చెప్పరు; కులపతి గారు అమ్మ తయారుచేసిన అయస్కాంతము.

నాడు విద్యాసాగర శర్మగారు, కులపతిగారు ఇంకా సాహిత్యప్రియులు అమ్మ వద్దకు వెళుతున్నారు; నేనూ వెళ్ళాను. నేను తీవ్రాతి తీవ్రంగా సాధన చేస్తున్న సమయంలో ఒక దివ్యప్రేరణతో లాక్కు పోబడినట్లుగా జాగర్లమూడి వెళ్ళాను. అక్కడ High court justice చేసిన శ్రీ GVL నరసింహారావు గారితో సంభాషించి, జిల్లెళ్ళమూడి వెళ్ళాను.

అమ్మ నన్ను లోపలికి పిలిచి ఒళ్ళోపడుకోబెట్టుకుని ఆప్యాయంగా శిరస్సు దగ్గరనుంచి వెన్నుపూస అంతా నిమిరింది. అన్నం తెప్పించి కలిపి మూడు ముద్దలు చేసి ఆప్యాయంగా ఆత్మీయంగా వాటిని తినిపించింది. ఆ సంఘటన ఎప్పటికీ మరచిపోలేని మరపురానటువంటి అమృతమయమైన సంఘటన. ఆ ఘడియలు అమృత ఘడియలు. అమ్మ విశ్వానికి జననియైన సృష్టికర్త. సృష్టికర్త అని వేరే అనుకుంటున్నాం; కాదు. విశ్వజనని అమ్మ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను నా శరీరంలోకి ప్రవహింపచేసి, త్రిగ్రంధుల విచ్ఛేదనానికి బీజం వేసింది. Switch నొక్కింది అన్నమాట. హృదయంలో ఉన్న ఇచ్ఛాశక్తి, Brainలో ఉన్న జ్ఞానశక్తి, వెన్నుపూసలో ఉన్నక్రియాశక్తి- మూడు శక్తుల్నీ, మూడుగ్రంధుల్నీ- విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథి, రుద్ర గ్రంథి, హృదయంలో హృద్గ్రంథి, బ్రెయిన్లో చిత్ గ్రంథి వెన్నుపూసలో రుద్రగ్రంధి (ఆత్మగ్రంథి), మూడింటినీ విచ్ఛేదనం కావటానికి దోహదం చేసిన శుభముహూర్తం అది. దివ్యమైన ప్రేరణతో, నా శరీరంలోకి అమ్మ శరీరం నుండి వచ్చిన శక్తి ప్రవేశించింది. సంకల్ప బలంతో ఆశక్తి విశ్వకళ్యాణం కోసం విశ్వశాంతికోసం తాము ఎన్నుకున్నటువంటి శరీరాల ద్వారా వ్యక్తుల ద్వారా ఒక దీర్ఘమైన ప్రణాళికను ఏర్పరచుకొని తద్వారా తన కార్యక్రమాన్ని చేస్తుంది.

అమ్మ ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ’ – అని చెప్పినట్లు ఈ విశ్వానికి మూలమైన శ్రీశక్తి, మూలశక్తి; ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమ్మిశ్రితమైన శక్తి; ఆ యోగశక్తి విశ్వశక్తి అమ్మ. ఒక దివ్యప్రేరణతో సంకల్పంతో మానవరూపంలో వచ్చింది.

అమ్మ తత్త్వాన్ని గురించిన మీ అభిప్రాయం ఏమిటి?

చాలమంది అడుగుతుంటారు – అమ్మ యొక్క ప్రణాళిక ఏమిటి? ఆశయం ఏమిటి? లక్ష్యం ఏమిటి? సిద్ధాంతం ఏమిటి? -అదీ ఇదీ అని రాద్ధాంతం చేస్తుంటారు. కానీ అమ్మ సిద్ధాంతం ఒక్కటే. “నేను అమ్మను – మీరంతా బిడ్డలు”. అమ్మకి బిడ్డలకి మధ్య ఉన్న అనుబంధం ప్రేమామృతమైన ఒక దివ్యమైన వాత్సల్య పూరితమైన బంధమే కానీ వేరే కాదు. అమ్మ వేరే కాంక్షతో కోరికతో ఏదోకావాలని పిల్లలని ప్రేమించదు. పెద్దవాళ్ళైనా దుర్మార్గులైనా కూడా తన ప్రేమని అమ్మ సమానంగా పంచుతుంది. మంచివాళ్ళుగా కావాలని కోరుకుంటుందే కానీ ఎవ్వరినీ ద్వేషించదు, దూషించదు, నిందించదు, దూరం చేసుకోదు. ‘సర్వసమానం’ అనే దాన్ని ఈనాడు రాజకీయంగాగాని, సాంఘికంగా గాని, నాయకులు చెపుతున్నటువంటి దానిని చెప్పకుండానే ఆచరణలో పెట్టి చూపిస్తూ ఒక ఆదర్శప్రాయమైనటువంటి సందేశాన్ని సమాజానికి అందించిన దివ్యప్రేమమూర్తి అమ్మ. అమ్మని అర్థం చేసుకోవాలి.

అమ్మ వాక్యాల పరమార్థం ఏమిటి?

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటే, “నాన్నా! అశుద్ధమూ పరబ్రహ్మ స్వరూపమే” అంది. అది ఎలాంటి స్థితో అర్థం చేసికోవాలి. ప్రతి పరమాణువులో కూడా ఉన్నది ఆ విశ్వమే. అణోరణీయాన్ మహతోమహీయాన్. అణువులో అణువుగా ఘనములో ఘనముగా ఉన్నది అంటే అనంతమైన విశ్వం మళ్ళీ ప్రతి పరమాణువులో కూడా ఉన్నదనే ఆమె సృష్టించి రచించి గ్రహించిన దానిని ఆమె ఆచరించమని చెప్పింది.

“కూతురుని కోడలిని ఒకేలా చూడటం అద్వైతం” అన్నది; ఎంతటి ఆచరణాత్మకమైనది. అద్వైతాన్ని కేవలం ఉపన్యాసాల ద్వారా చెపితేచాలదు. చిన్న ఉదాహరణలతో హృదయానికి హత్తుకొని, మనిషి అద్వైతాన్ని నిజజీవితంలో ఆచరిస్తూ దాని అనుభవాన్ని పొంది ఆ రసాన్ని ఆస్వాదన చేసే పద్ధతిలో చెప్పిందే. అదీ నిజమైన దైవత్వానికి ప్రేమకి చిహ్నం. అంతటి ప్రేమ కావాలి. హృదయం నిండా ప్రేమను నింపుకుని, పంచుకోమని చెప్పే అమ్మ యొక్క ఆ స్ఫూర్తిని ఆసందేశాన్ని ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకుని ఐక్యంతో, సమైక్యంతో ముందుకు సాగి ‘అమ్మ’ యొక్క లక్ష్యాన్ని, ధ్యేయాన్ని నెరవేర్చే పద్ధతిలో జిల్లెళ్ళమూడి ఒక అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన ఒక కమనీయ రమణీయ పుణ్యస్థలిగా మార్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని ఎన్నోసార్లు జిల్లెళ్ళమూడిలో కూడా చెప్పాను. వెళ్ళిన ప్రతి చోటా కూడా- అమెరికాలో కూడా మేమూ అమ్మగారి భక్తులమే, అమ్మ మాకు స్ఫూర్తి అని చెప్పా. మీరంతా కలిసి ప్రపంచవ్యాప్తంగా సమైక్యమై జిల్లెళ్ళమూడిని ఒక రమణీయమైన అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చమని కోరుకుంటున్నాను.

అమ్మ బోధలు అందరికీ ఆచరణ సాధ్యాలా?

అమ్మ చెప్పింది “నీ దృష్టి ఎట్లాంటిదో సృష్టి అలా కనిపిస్తుంది” అని. వారివారి స్థాయిని బట్టి అమ్మని అర్థం చేసుకుంటారు. ఉదాహరణగా చెప్పాలంటే Abdul Kalam వచ్చి ఉపన్యసిస్తుంటే ప్రాథమిక స్థాయి, లేక హైస్కూల్, కాలేజి, యూనివర్సిటీ కుర్రవాడో, Scientist వచ్చారనుకోండి. వాళ్ళు దానిని అర్థం చేసికోవటం వాళ్ళ మానసిక స్థాయిని బట్టి ఉంటుంది. ముందు వాళ్ళు అర్ధం చేసుకోలేకపోయారే అని బాధపడాల్సిన పనిలేదు. ఎలిమెంటరీ స్థాయిలో ఉన్నవాళ్ళని Scientist స్థాయికి తీసుకెళ్ళిననాడు తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తీ అర్థం చేసుకుంటాడు. అందుకనే Education is very important. we have to educate the people until and unless they can receive the reality. జ్ఞానమే చాల ముఖ్యమైనది. ఒక మహాత్ముడు గాని యోగిగాని అవతారమూర్తిగాని చెప్పేది వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళంతా ఆచరిస్తారా అంటే ప్రశ్నార్థకమే. వాళ్ళవాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఆచరిస్తారు. ఆచరించడంలేదే అని మనం బాధపడకుండా, వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, నమ్మకం, విశ్వాసం, గురితో ఆచరించేట్టుగా చేయాలి. చిన్నపిల్లవానికి మందు యొక్క పద్దతి తెలిసినా తెలియక పోయినా, దాని ప్రయోజనం తెలిసినా తెలియకపోయినా మనయందు గురి, విశ్వాసం, నమ్మకంతో మనం చెప్పినట్లు ఆ మందు తీసుకుంటే ఫలితం పొందుతాడు. ఇది కూడా అంతే. అందుకే ఒక ఆధ్యాత్మికవేత్తగానీ, ఒకయోగికానీ, ఒక సిద్ధపురుషుడు గానీ అందరినీ ఆకర్షించి ప్రేమతో దగ్గరకు తీసుకుని వాళ్ళు జ్ఞానవంతులైనా కాకపోయినా తాము చెప్పిన దానిని వాళ్ళు ఆచరించేట్టు చేసుకుంటారు.

అమ్మ వాక్యం “ఇష్టమైతే కష్టం లేదు”- ఎంత చక్కని మాటో చూడండి. “భరించగలిగితే బాధ లేదు”. “సహించగలిగితే హింస లేదు” – అన్నదానికంటే మించినది లేనే లేదసలు. ఇది కనుక మనం ఆచరణలో పెడితే- మన ఇష్టత పెంచుకుంటే ఎంత కష్టాన్నైనా భరించగలం. బాధలెన్ని ఉన్నా వాటిని మనం భరించగలిగితే బాధలేదు. అట్లాగే ఎంతగా హింసించాలని ప్రయత్నించినా మనం అన్నీ సహిస్తే హింసలేదు. ఓర్పు, సహనం ఎంతో ముఖ్యమని చెప్పింది అమ్మ.

అమ్మ ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత నిచ్చింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం తిన్న అన్నమే రక్తంలోకి వెళుతున్నది. ఆ రక్తమే, nervous system brain కి వెడుతోంది. ఎటువంటి ఆహారమో అటువంటి రక్తము; ఎటువంటి రక్తమో అటువంటి మనస్సు; ఎటువంటి మనస్సో అటువంటి ఆలోచనలు, ఎటువంటి ఆలోచనలో అటువంటి పనులు; ఎటువంటి పనులో అటువంటి ఫలితం మనం పొందుతామనే యదార్థమైన వైదిక సంప్రదాయ ఫలితంగా వేదసమ్మిశ్రితమైన ఒక సత్యాన్ని సమాజానికి అందించింది. అమ్మను అర్థం చేసుకోలేక మనం తికమకపడుతున్నాం; అర్థం చేసుకున్నవాళ్ళు బాగుపడతారు; లేనివాళ్ళు అయోమయంలోనే ఉంటారు.

అన్నదానం కంటె మించిన దేదీ లేదు. మనకి ఆహారం ద్వారానే శక్తి రావాలి. శక్తి అంతటావ్యాపించి ఉంది. సైన్స్ ప్రకారం, వైద్యశాస్త్రరీత్యా కూడా ఆహారం నుంచే మనకి శక్తి వస్తోంది- Iron, calcium, potassium, proteins, fats అన్నీ ఆహారం నుంచే. మనం ఇతరులను శక్తివంతం చేయడం అంటే ఆహారాన్నివ్వటమే. జ్ఞానాన్ని అందించటమూ, ఆహారాన్నివ్వటమే. అన్నిటినీ మించింది శక్తిని ప్రసారం చేయటం. రామకృష్ణ పరమహంసవలె అమ్మవలె మనం శక్తిని ప్రసారం చేసే స్థాయికి వెళ్ళలేదు కనుక ఆహారాన్నిచ్చి శక్తివంతం చేయాలి. ఆహారం కొరత అన్ని అనర్థాలకూ మూలం. అందరికీ కడుపునిండా ఆహారం, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, పిల్లలకి విద్య, ఆరోగ్యం ఉంటే- అసలు అలజడే లేదు. అంతా బాగుంటారు. ఇది నేను చెపుతున్నాను, ప్రపంచమంతా చెపుతున్నది. ఐక్యరాజ్యసమితిలో కూడా నేను ఘోషించింది Five Essentials- ఆహారం, బట్ట, ఇల్లు, విద్య, ఆరోగ్యం. ఈనాడు శక్తివంతమైన దేశం అని చెప్పుకునే అమెరికాలో కూడా ఈ 5 లేనివాళ్ళు చాలమంది ఉన్నారు. దీనిని అమ్మ గ్రహించింది. వీటికోసం ఒక ప్రణాళిక నేర్పరచుకున్నది. సాంఘికసేవ – భగవంతునికి నువ్వు ఏంచెయ్యగలవు? సర్వం ఇచ్చే భగవంతునికి నువ్వు ఇవ్వవలసిన పని ఏమిటి? ఆయనకి ఇస్తున్నాననుకుని ఆయన సంతానమైన సమాజానికి ఇవ్వాలి. ఎవరికి ఏది అవసరమో అది ఇవ్వాలి.

మంచికీ, చెడుకీ ప్రేరణ భగవంతుడే అంటుంది 'అమ్మ'. మంచికి అంటే బాగానే ఉంది. చెడుకి ఎలా అన్వయించుకోవాలి?

“మనస్సే భగవంతుడు; ప్రతిపనికి ప్రేరణ వాడు ఇచ్చినదే- మంచికీ, చెడుకీ” అంటుంది అమ్మ. ఆ భావనాస్థాయి రావాలంటే ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఆలోచించాలి. అది యదార్థం, సత్యం. universal mind is there. విశ్వమనస్సు విశ్వమానసంలోనే అద్భుతమైన దివ్యజ్ఞానమంతా ఉంది. మన మనస్సుని విశ్వమనస్సు తోటి అనుసంధానం చేసుకోవటమే యోగం అంటే మనం ఎలాగైతే Radioని tune చేస్తే ఆ ప్రసార తరంగాల్ని లాగి మనకి అందిస్తుందో అదేవిధంగా. తద్వారా సమాజానికి మేలుకలుగుతుంది. ఆ ప్రతి ఒక్కటీ దైవసంకల్పమే అనేది ఆధ్యాత్మిక ఉన్నతస్థాయిలో అమ్మ చెప్పిన యదార్థం; సత్యం. వ్యావహారికంగా, భౌతికంగా, సాంఘికంగా వచ్చేటప్పటికి దానివల్ల సమాజానికి కీడు జరుగుతున్నపుడు, వెంబడే భగవంతుని నుంచి వచ్చినటువంటిదే శిక్షించేటటువంటి Police, న్యాయ వ్యవస్థలు.

‘అమ్మ’ అందరినీ తన బిడ్డలుగానే చూచింది. అమ్మ గర్భవాసాన జన్మించిన అమ్మ బిడ్డ ‘రవి’తో నాకు మంచి అనుబంధం ఉంది. అతనిలో అమ్మ రక్తం ప్రవహిస్తున్నది; ఆ ఆలోచనలు ప్రవహిస్తున్నాయి. ఆమె యొక్క రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి వీళ్ళు చాల అదృష్టవంతులు. కనుకనే ఆ సంస్కారం, ఆపద్ధతిలో ఆలోచనలు వస్తాయి.

మీ లక్ష్యం, ధ్యేయం ఏమి కావాలంటే – మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో విభిన్న మనస్తత్వాలు వికేంద్రీకరణమైన స్థితిలో, అలజడికి గురై ఎట్లా పడితే అట్లా సంచరిస్తున్నటువంటి మానవ సమాజాన్ని సంఘటితం చేసి సమైక్యం చేసి మానవత్వపు పరిమళాలు వెదజల్లేటట్లుగా ప్రయత్నం చేయాలి; ఇదే ‘అమ్మ’ లక్ష్యం. అందుకే ‘అమ్మ విశ్వజనని’. సంస్థకి ‘శ్రీ విశ్వజననీ పరిషత్’ అని పేరు పెట్టుకున్నారు. చాల చక్కటి విధానం – అది. ‘అందరిల్లు’ అని పేరు పెట్టింది అమ్మ. ఆమె చేసిన ప్రతి ఒక్క పనిని, పలికిన ప్రతి ఒక్క మాటని చేసిన ప్రతి ఒక్క చేతని అర్థం చేసుకుంటే, ఎన్నో అర్థాలు వస్తాయి. హృదయాన్ని అర్థం చేసికోవాలంటే హృదయమే కావాలి. Scientist మరొక scientist కే అర్థమవుతాడు. అలాగే ఒక కళాకారుడు మరొక కళాకారునికి, ఒక కవి మరొక కవికి అర్థం అవుతాడు. సామాన్యునికి కవి ఏమి అర్థమౌతాడు? మనస్సుని అర్థం చేసికోవాలన్నా ఒక మనస్సే కావాలి.

అమ్మకేదైనా ప్రణాళిక అంటూ ఉందా?

‘అమ్మ’కి ప్రణాళిక లేదని చాలమంది అనుకుంటారు. తప్పు. ఆమె ప్రణాళిక విశ్వప్రణాళిక. విశ్వ శ్రేయస్సే ఆమె యొక్క ధ్యేయం, లక్ష్యం. ఆమెకి కావాల్సింది ఏమీ లేదు.

భగవంతుడు మానవ రూపంలో ఎందుకు వస్తున్నాడని అమెరికాలో నన్ను ప్రశ్నించారు. మనిషిగా వస్తేనే సమాజానికి మేలు చేయగలుగుతాడు. ఒక ఉదాహరణ చెప్పాను. ఒకనికి Surgery అవసరం వచ్చింది. Appendicites తో బాధపడుతున్నాడు. Operation చేయాలి. మరి Surgical knowledge ఉంది. దానికి రూపం లేదు. Surgical knowledge operation చేయగలదా? No. ఎప్పుడు చేయగలదు? ఒక మనిషి యొక్క మనస్సులోకి వచ్చి, మనస్సును శక్తివంతం చేసి ఆతడిని ఒక surgeon గా చేస్తే, వారు Surgery చేస్తున్నారు; మనిషిని బ్రతికిస్తున్నాడు. దైవికశక్తి దైవశక్తిగానే ఉండటం కాదు. మనిషి లోకి ప్రవహింపచేసి ఆతని ఒక అవతారమూర్తిగా, యోగిగా, సిద్దపురుషునిగా మారిస్తే అతను సమాజానికి మేలు చేస్తున్నాడు. అందుకే భగవంతుని అవతారాలు వచ్చాయి – కృష్ణుడు, రాముడు, అమ్మ, బుద్ధుడు…… అవతారాలు వచ్చింది దీనికోసమే.

మనిషీ! నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి. ఈనాడు సమాజం పాడైపోతున్నదంటే కారణం- మనమే, భగవంతుడు కాదు. ఇన్ని సౌకర్యాలు పెరిగినయ్. మొత్తం ప్రపంచం ఒక చిన్న ఇల్లులాగ అయిపోయింది. అయినా మనిషికీ మనిషికీ దూరం పెరిగిపోయింది.

ఈ జగతికి మీరిచ్చే సందేశం ఏమిటి?

‘అమ్మ దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ అనుగ్రహం ఉంటే ఏ గ్రహం . మిమ్మల్ని పీడించదు. కావున అమ్మ అనుగ్రహానికి పాత్రులు కండి. అమ్మని హృదయంలో నింపుకోండి. అమ్మని ఆశ్రయించండి. అమ్మే సకలం, అమ్మే సర్వం – అనే సత్యాన్ని గుర్తించండి.

అమ్మ బిడ్డలందరికీ నా శుభాశీస్సులు, జయోస్తు, దిగ్విజయోస్తు.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!